రామాయణం- అంతరార్థం- సీతామాత – కుండలినీ శక్తి.
“నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ,
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై।
నమోఽస్తు రుంద్రేంద్రయమానిలేభ్యో।
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥”
శ్రీరామునికి, హనుమకు సర్వస్యశరణాగతి చేసిన నేల భారతావని. రామాయణం, హనుమంతుల వారు అణుమణువునా అగుపడుతారీ అవనిలో.
రామాయణం పవిత్రమైన గ్రంథం. మన ఐతిహాసము. శ్రీ రామచంద్రుడు భారతీయ ఆత్మ. ఆ రామస్వామి పేరు భారతదేశపు అణువణునా, కణకణమునా నిలచి ఉంది.
వాల్మీకి మహాముని రామాయణాన్ని కావ్యంగానో, చరిత్రగానో రాయలేదు. గొప్ప అంతరార్థాన్ని నిక్షిప్తం చేసి ముని మనకు అందించాడు.
రామాయణాన్ని కావ్యంగానో, కథగానో, చరిత్రగానో కాక, ఒక జీవిత సత్యంలా గ్రహించి చదివితే ప్రతి చోట సత్యం అగుపడుతుంది.
రామాయణం ప్రతి మానవుని జీవితమే అన్న విషయము అవగతమవుతుంది.
“రామ” అంటే ఆత్మ. “ఆయనము” అంటే ప్రయాణము. రాముని ప్రయాణము కాదు ప్రతి మానవుని జీవన యానము ఈ మహాగ్రంథం. జ్ఞానము వైపుకు నడక, తనను తాను తెలుసుకునే ప్రయాణము రామాయణము.
“రమయతే ఇతి రామః, రమంతే యోగినః అస్మిన్నితి రామః, యోగినామంతఃరమత ఇతి రామః” అని వివిధ వ్యుత్పత్తులు శ్రీరాముని గ్రాయత్రీ మంత్రంగా, పరబ్రహ్మగా చెబుతున్నాయి.
శ్రీ రాముడు ప్రతి వారిలోని ఆత్మశక్తికి రూపాంతరము. రామ సోదరులు మానవ శక్తులకు మారుపేర్లు.
భరతుడు దేహశక్తికి, లక్ష్మణుడు సంకల్ప శక్తికి, శత్రుఘ్నుడు క్రియాశక్తికి గుర్తులు.
ప్రతి మానవుని ఉన్న పది ఇంద్రియాలే దశరథుడు. ఐదు జ్ఞానేంద్రియాలు(చూచుట, వినుట, రుచి, వాసన, స్పర్శ), ఐదు కర్మేంద్రియాలు(వాక్కు, కాళ్ళు, చేతులు, చర్మం, గుదము)
అతనికి ముగ్గురు భార్యలు- కౌశల్య, సుమిత్ర, కైక. సత్వ రజో తమో గుణాలకు మారుపేరు.
ఇంద్రియాలు తమో గుణ ప్రభావానికి లోనైన మానవుని జీవితం కూలిపోతుంది. అతని నిర్ణయాలలో న్యాయం ఉండదు. శరీరానికి అధిక పాధాన్యతనిస్తారు. తమోగుణం వల్లనే శరీరం పై మమకారం పెరుగుతుంది. తమ స్వరూప జ్ఞానము మరుగున పడటము జరుగుతుంది. అందుకే కైక మాట కోసం రాముడు అడువులకెళ్ళటము. భరతుడు పట్టాభిషేకం.
రాముడు అడవులకు వెళ్ళటమన్నది ఆత్మను మరచి మానవులు జీవించటము.
సీతామాత కుండలినీ శక్తికి ప్రతి రూపము. రామలక్ష్మణ, సీతామాత ముగ్గురూ ప్రయాగ దాక వెళ్ళి గంగను అక్కడ దాటుతారు. ప్రయాగ మూడు నదుల సంగమం. ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల కలయికకు సంకేతము ప్రయాగ. నిషాదరాజు ‘సంకల్పానికి’ గుర్తు. సంకల్పం చేత బ్రహ్మవిద్యను పొందటానికి తామస నదిని దాటి సాధనకు వెళ్ళే మానవుని గుర్తు ఈ ప్రయాణం. ముని భరద్వాజుడు ప్రణవానికి సంకేతం. ఆయన సలహా బట్టి వాల్మీకిని కలిసి, చిత్రకూటంలో నెలవుంటారు వీరు ముగ్గురూ కొంతకాలము. తదనంతరం సత్య స్వరూపమైన అత్రి ముని కొరకు బయలుదేరి పంచవటిలో నివాసముంటారు. పంచవటి పంచేంద్రియాలకు గుర్తు. అక్కడే వారిని శూర్పణక చూస్తుంది. కోరికకు గుర్తు శూర్పణక.
***
రామాయణములో ముఖ్యమైన కథ సీతా మాతే.
రావణుడు మానవునిలోని అహానికి సంకేతం.
ఆ కుండలినీ శక్తిని రావణుడన్న ‘అహం’ – ‘ఆత్మ’ అయిన రాముని నుంచి తస్కరిస్తుంది. తన ఆత్మను గ్రహించటానికి “అహం” అడ్డు వస్తుంది మానవులకు. నేనే అన్నీ చేశాను. నాకన్నా బలవంతులు లేరు… నేనే అన్న భావమే అహం.
రావణుని కుమారుడు మేఘనాథుడు. మేఘాలు ఆలోచనలకు సంకేతాలు/గుర్తులు. (మబ్బుల్లా ఆలోచనలు చెదరమొదరుగా, మబుల్లా ఆలోచనలు తేలిపోయాయి ఇత్యాది ప్రయేగాలు వినే ఉంటారు)
హనుమంతుడు వాయునందనడు. ప్రాణవాయువే హనుమ. “రామాయణ మహామాలా-రత్నం వందే అనిలాత్మజం” రామాయణమన్న మణిమాలకు హనుమ రత్నం వంటివాడు.
హనుమ అన్న ప్రాణావాయును నియంత్రీకరణ చేయు ప్రాణాయానము వల్ల జీవునికి బుద్ది కుదురుతుంది.
‘సుగ్రీవుడు’ అంటే సు మంచి, గ్రీవ అంటే గొంతు. హనుమ అంటే ప్రాణవాయువు సుగ్రీవుని ద్వారా అంటే గొంతు ద్వారా యానము. అంటే ప్రయాణం చేసి కుండలీ శక్తి అయిన సీతామాతను ఆత్మ అయిన రామచంద్రప్రభువుతో కలపటము సుందరకాండ.
(సుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చింది?, సుందరకాండ గూడార్థాలు మొదలైనవి మునుపు ప్రస్తావన చేసుకున్నాము. తిరిగి ఆ వ్యాసాలు చూడాలనుకుంటే క్రింద యున్న లింకులో చూడవచ్చు.)
***
రామాయాణము మానవులందరి కథ. ముని దయతో అందించిన జీవన చిత్రం.
రాముడు పురుషుడు, సీతామాత ప్రకృతి. రాముడు ఆత్మ, సీతామాత కుండలినీ.
ఈ విషయం రామాయణంలో నిగూఢంగా చెప్పాడు వాల్మీకముని.
తత్త్వం, బ్రహ్మవిద్య రహస్యమైనది కాబట్టి కొంత గూఢంగా ఉంచితే తప్ప సాధకులకు చేరదు. పాల కడలిలో మంధరపర్వతంలో ఉంచి చిలికితే తప్ప అమృతం రాలేదు. అలాగే సాధకులు తపిస్తే తప్ప బ్రహ్మం గురించి తెలుసుకోలేరు. రామాయములో ఉన్న పరబ్రహ్మను తెలుసుకోలేరు.
సీతమాత – కుండలినీ శక్తి:
కుండలినీ శక్తికి శాస్త్రం చెప్పిన లక్షణాలు కార్శ్యము, ఆధారమునకు నివాసము, సర్పాకారము, విలాసము.
మనకు అవి సుందరకాండలో కనపడుతాయి.
“సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా
ఇష్టాం సర్వస్య జగతఃపూర్ణ చంద్రప్రభా మివ॥
భుమౌసుతను మాసినాం నియతామివ తాపసీం
నిశ్శ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవధూమివ॥”(15 వ సర్గ 30,31శ్లో)
పద్మరేకుల కన్నులతో రతీదేవి వలె ఉన్న ఈమె వెన్నెల వలె ఆహ్లాదాన్ని ఇస్తున్నది. “భూమిపై స్థిరంగా” యున్నది. “ఆడ సర్పం” వలె ఉన్నదట సీత.
“భూమౌ ఆసీనాం” – సీత భూమి మీద కూర్చొని యున్నదని పదే పదే చెప్పాడు వాల్మీకి. భూమి అన్న మాటను ముని కొంత నిగూఢంగా చెబుతాడు.
ఫృథ్వీతత్త్వం మూలాధారం. భూచక్రమైన మూలాధారంలోనే కుండలినీ నివాసం. భగవతి కుండలినీ శక్తిగా అక్కడ కొలువై ఉంటుంది. ముని ఇదే సూచనగా పదే పదే “భూమి మీద సీత” ఉన్నదన్ని చెబుతూ సూచించాడు.
తాపసీం:
వాల్మీకి అనేకసార్లు సీతను “తాపసి” అని సంభోదిస్తాడు.
“అల్పాహారం తపోధనాం – శోకధ్యాన పరాయణాం పరిమ్లానాంతపస్వినీం – దీనాం నిరానందాం తపస్వినీం” ఇలా తపస్వినీ అని పదే పదే చెప్పటం పునరుక్తిదోషం రాదా?
ఎదైనా విషయం చెప్పదలిచినప్పుడు పదే పదే చెప్పటం అసకృత్ ప్రయోగం. ఒకసారి మనము ఆ విషయం పట్టించుకోకపోయినా తరువాత గ్రహించగలమని ముని ఇలా పదే పదే మనకు చెబుతున్నాడు. సీతమాత మహారాణి. ఆమె ఎలా తపస్విని అయిందన్న సందేహం కలుగుతుంది చదువుతున్నవారికి.
దుర్గాస్తవములో “తామగ్ని వర్ణాం “తపసా” జ్వలంతీం” అన్న అమ్మవారిని గూర్చి వర్ణన. అదే మునికి స్ఫరించియుండవచ్చు. సీతామాత తపస్విని అని అందుకే చెప్పి ఉండవచ్చు ఇక్కడ.
అంటే సీతామాత శక్తి స్వరూపిణి అన్న శ్లేష మనకు తెలుస్తుంది. ఆ శక్తిస్వరూపిణి మానవులలో కుండలినీ శక్తిగా ఉంటుంది.
కుండలినీ మూలాధారంలో చుట్టలు చుట్టుకు ఉంటుందిట. అలా ఉన్నప్పుడు సర్పంలా తోస్తుంది. అందుకే పామును కుండలినీ శక్తికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది.
వాల్మీకి సీత గురించి చెబుతూ ఈ పాములా ఉన్నదన్న వర్ణన పదే పదే చెబుతాడు.
సీత “వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్ర వధూమివ” (19- 9) ఆడపాము వలె చుట్టచుట్టుకు ఉన్నదని.
“అచ్ఛాద్యోదర మూరభ్యాం బాహుభ్యాంచ పయోధరౌ।
ఉపవిష్టా విశాలాక్షీ రుదంతీ వరవర్ణినీ॥” (19 సర్గ, 3 శ్లో)
సీతాస్వాద్వి తొడలను ఉదరమును బాహువులను వక్షఃస్థలమును ముడుకొని కప్పుకొని కూర్చొని ఏడ్చుచున్నదట. శరీరం చుట్టు చుట్టుకున్నదనే కదా దీని భావం.
సీతను తల వంచుకు చుట్టలు చుట్టుకున్న పన్నగంతో పోల్చటం మనకు ఆమె కుండలినీ అని చెప్పటానికే.
సౌందర్యలహరిలో శంకరులు శక్తి గురించి చెబుతూ
“అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్ట వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి” కుండలిని తీరు గురించి చెబుతారు.
ఇదే మనకు సుందరకాండలో ముని ఆవిష్కరించాడు. ఆమె పడుకున్న పన్నగం కాబట్టి హనుమ ఆమెను చూసి సీతామాత యని తలచాడు.
కుండలినినీ స్వాఆత్మతో కలిపే ప్రాణవాయువు హనుమ అని మునుపే అనుకున్నాము కదా. అదే పని ఆయన చేశాడు.
***
సీతా మాత కుండలినీ శక్తి అని శ్రీ గుంటూరు శేషేంద్రశర్మగారు తన “షోడషి”లో చెబుతారు. శర్మగారు ఆ సిద్ధాంతాని వివిధకోణాలలో ఆలోచించి, ఆ విషయం ఆనాటి కామకోఠి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖర యతివరేణ్యులతో చెప్పారట. ఈ విషయము విన్న తరువాత పెరియవా పెద్దగా ఆశ్చర్యపడలేదని, అవును అని కాని, కాదు అని కాని అనక మిన్నకున్నారని శర్మగారు తన మిత్రులతో వాపోయారు. అది ఆయనకే మొదటి తట్టిదనటంలో నిజం లేదని శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామ్ వంటి మునులకు తెలిసి ఉండవచ్చన్న విషయం మనకు తెలుస్తుంది.
ఈ విషయమై విశ్వనాథ సత్యనారాయణ కూడా “శర్మగారు గొప్ప సాధకులు. కాబట్టి వారు దర్శించగలిగారని” చెబుతారు. అంటే ఆ విషయము మునులకు తెలుసు. సాధకులకు తెలుసు.
శ్రీరాముడు సీతామాతల సంబంధము శివపార్వతుల బంధము, ఆత్మ- కుండలినీ బంధము… అన్నీ మన జీవితాలకు చెందినవే.
అవి ఎప్పటి విషయమో, లేదా కథో కాదు. నేటికీ మానవులందరికీ సంబంధించిన విషయం. అందుకే రామాయణము నిత్యనూతనం. రామకథ మానవజాతి ఉన్నంత వరకూ ఉంటుంది. రామనామము ఉన్నంత వరకూ హనుమ ఉంటాడీ ఈ భూమి మీద.
సుందరకాండ పారాయణము ఈ చైత్ర నవరాత్రులలో చెయ్యటము సర్వసాధారణము.
ఇలా హనుమును తిరిగి తిరిగి తలుచుకోవటం పరమానందభరితం.
ఎల్లరకూ హనుమద్కృప కలగాలని స్వామికి నివేదిస్తూ శ్రీ శోభకృత్‌నామ చైత్ర నవరాత్రుల శుభాకాంక్షలు.
(Ref:
1.సుందరకాండ (వాల్మీకి రామాయణాంతర్గత- శ్లోకాలు తాత్పర్యము)
2.శ్రీ రామాయణ రహస్య దర్శిని – మల్లాది చంద్రశేఖరశాస్త్రి
3.షోడశి – గుంటూరు శేషేంద్రశర్మ)
సభక్తితో
సంధ్యా యల్లాప్రగడ
సుందరకాండకు ఆ పేరెందుకు వచ్చింది?
https://oohalaoosulu.blog/…/%e0%b0%b8%e0%b1%81%e0%b0%82…/
సుందరకాండ అంతరార్థం
https://oohalaoosulu.blog/…/%e0%b0%b8%e0%b1%81%e0%b0%82…/

