శ్రీ రాముని అడుగుజాడలలో:
రాముడు భారతీయ ఆత్మ. రామ నామము మహా మంత్రం. రామ నామము ఉన్నంత వరకూ ఈ భూమి మీద ఉంటానన్నాడు హనుమంతుల వారు. రామ మంత్రం జరిగే చోట నేటికీ మనకాయన తప్పక కనపడుతాడు.
మహరచయితల నుంచి కొద్దో గొప్పో రచనలు చేసే వారి వరకూ, రామకథను రాయనివారు కద్దు. అందుకే మనకు రామాయణాలు కోకొల్లలు.
తెలుగులోనే వందకు పైగా రామాయణాలు ఉన్నాయి. కారణము బహుశా రామకథ మధురమైనది కాబట్టి, రాముడు దేవుడుగా కాక మర్యాదపురుషుడిలా జీవితాన్ని చూపాడు కాబట్టి కావచ్చు.
రామకథ మధురమైనదో లేక మన మీద కరుణలో రామునిగా జన్మించి జీవించటము చూపించాడో
చెప్పటము కష్టం.
రామాయణం లో రాముడు మానవుడిలా ప్రవర్తిస్తాడు. మానవుడు ఎలా నడుచుకోవాలో చూపాడు.
ఆయన నడతను, నడకను పూజించని వారు కద్దు. అలాంటి రాముడు నడిచిన దారిలో (భౌతికమైన) నడవాలని ఇద్దరు మిత్రులు తలచారు.
వారు అయ్యోధ నుంచి లంక వరకూ ప్రయాణించారు.
వారి అనుభవాలను, కలసిన మనుష్యులను గురించి ఒక గ్రంథం రచించారు. అక్కడి ప్రజల రాముని గురించి చెప్పే జానపదగాథలూ గ్రంధస్తం చేశారు.
అది నాకు చదవతగినదనిపించింది.
చేతులోకి తీసుకుంటే పూర్తి చేసే వరకూ ఆగక చదివించిందా పుస్తకం.
రాముడు నడచిన ఆయా ప్రదేశాలలో మనమూ నడుస్తాము ఇది చదువుతూ ఉంటే.
రామలక్ష్మణలు, సీతామాత తో కలసి బయలుదేరినప్పుడు వారితో అయ్యోధలో ప్రజలూ బయలుదేరారు.
రాముడు ఆ రాత్రి ప్రజలు నిద్రించిన తరువాత నెమ్మదిగా సుమంతునితో కలసి రథంలో ప్రయాగ వైపు వెళ్ళిపోతాడు.
ప్రయాగ వద్ద అశ్వర్థ వృక్షం క్రింద రాముడు ఆ రాత్రి పడుకున్నాడుట. అక్కడ ఉన్న కోటలో ఆ చెట్టు ఇప్పటికీ నిలబడి ఉందట. ఆకు రాలితే ఎవరో ఒకరు తీసి దాచుకుంటారని, ఆ చెట్టు మిలట్రీ వారి ఆధీనంలో ఉందని తెలిసింది.
గంగను దాటటానికి వారికి నిషాదరాజు సహాయం చేశాడు. వేల సేన్యంతో ఉన్న నిషాదరాజు రాముని ప్రేమతో తనే పడవ నడుపుతూ గంగను దాటించాడు.
భరధ్వాజ ముని ఆశ్రమం సందర్శించారు త్రిపుటి. వారు ముని వాల్మికి సలహా పై చిత్రకూటంలో పదకొండు సంవత్సరాల పదకొండు నెలలా, పదకొండు రోజులున్నారట.
అత్రి ఆశ్రమానికి వెళ్ళటానికి అక్కడి నుండి దండకార్యణంలోకి కదిలారు.
నేడు చిత్రకూటము గొప్ప రామక్షేత్రం.
అక్కడ ఆగక 24/365 రోజులు “రామచరితమానస” పారాయణం సాగుతుందిట.
తులసీదాసుకు రామదర్శనం కలిగింది కూడా చిత్రకూటమిలోనే.
తులసీదాసు హనుమాన్‌చాలీసా రచించిన రామభక్తుడు. ఆయన వారణాసిలో “రామచరిత మానస“ సంస్కృతంలో రచించటము మొదలుపెట్టినప్పుడు విశ్వనాథుడు కలలో వచ్చి “అవధిలో(భాష) రచించు” అని చెప్పాడు.
తులసీదాసు అవధిలో రచిస్తే ఎవ్వరూ లెక్కచెయ్యరని సంస్కృతంలోనే కొనసాగించే ప్రయత్నం చేశాడుట. ఆయన వ్రాసినవన్నీ మరునాటికి మాయమవుతూ వచ్చాయి. రచన ముందుకు సాగకపోయే సరికే విశ్వనాథుని ఆజ్ఞగా అవధిలో రచించి ప్రజలలో పంచాడు తులసీదాసు.
ఆ గ్రంథం గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా చిత్రకూటమిలో పారాయణ చెయ్యబడుతోంది.
రామాయణ గ్రంథపు ఒర్జినల్ పేజీలు కొన్ని అక్కడ ఉన్నాయని, తాము వాటిని దర్శించామని రచయితలు చెప్పారు.
మనుము తప్పక చూడవలసిన క్షేత్రాలలో చిత్రకూటము ఒకటి. అది మధ్యప్రదేశ్ కు ఉత్తరప్రదేశ్ కు మధ్యన ఉన్నదట. చిత్రకూటములో గుప్తగోదావరి కూడా ఉందని తెలిసింది.
పంచవటికి వెళ్ళేదారిలో సీతారామ లక్ష్మణలు, లోనార్ లేక్ ప్రక్కగా వెడతారు. ఆ సరస్సు క్రేటరు లేక్(crater lake). మహారాష్ట్రలో ఉన్న బుల్దానా జిల్లాలో ఉంది. ఉల్కాపాతంలో ఏర్పడిన సరస్సు ఇది. లక్షల సంవత్సరాల క్రితం ఇది ఏర్పడిందట. దీని ప్రక్కగా నడిచి వెళ్ళారు సీతారామ లక్ష్మణులు. అక్కడ రాముని గుడి ఒకటి ఉంది గుర్తుగా.
“రవేరి” అన్న గ్రామములో సీతామాతకు ఆహారం ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదని, అక్కడ గింజ పండదని అలసిన సీతామాత శాపమిచ్చిందట. అందుకే అక్కడ పంటలు పండవుట.
అక్కడ సీతామాతకు ఒక దేవాలయం ఉంది.
రాముడు నడచిన దారిలో ప్రస్తుతం ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.
పంచవటి నాసిక్ దగ్గర ఉందని నాకు ఈ పుస్తకం చదివిన తరువాతే తెలిసింది.
పంచవటి వద్ద గోదావరి తీరంలో రాముని పేరున ఉన్న కుండం పవిత్రమైనది.
అక్కడే సీతాపహరణ జరిగింది.
“లక్ష్మణ గీత” వాల్మీకి రామాయణంలో లేదు. రామచరితమానస లో ఉందట. రచయితలే చెబుతారు ఇవ్వన్నీ. వారు వాల్మీకి రామాయణం, రామచరితమానస, కంబరామాయణము, ఏకనాథ రామాయణం చదివినా వాల్మీకిదే
ప్రమాణంగా తీసుకున్నారు.
కర్ణాటక సరిహద్దులలో సహ్యద్రి వద్ద రాముడు శబరిని కలుస్తాడు. శబరి “ఎంగిలి పళ్ళు” పెట్టదు. ఆమె భక్తితో పళ్ళు పెడుతుంది. మన సినిమావాళ్ళు పెట్టించారు.
వారిని కిష్కింధ వైపుకు వెళ్ళమని చెబుతుంది. ఆమె ఒక ట్రైబల్ రాణి. వివాహం వద్దని రాముని గురించి తపస్సు చేస్తూ ఉంటుంది. మొదట ఆమె తపస్సు చేసిన చోటు ప్రస్తుత హంపిలో ఉన్న గుహలలో ఉన్నది. అక్కడే పంపా సరోవరం ఎంతో శుభ్రంగా ఉన్నది. ఇది భూమి మొదలైనదాదిగా ఉన్న ఐదు పవిత్ర సరోవరాలలో ఒకటి. అక్కడే సుగ్రీవుడు ఉన్న పర్వతం, రాముడు ఆ వానా కాలం గడిపిన గుహలు ఉన్నాయట. అక్కడ వాలిని దహించిన ఎముకల గుట్ట అన్న దిబ్బ ఉందని, రాళ్ళు సగం కాలిన ఎముకలలా ఉన్నాయట. ఆ దిబ్బను ఎవ్వరూ తలవరని రచయితలు చెబుతారు. కబంధబహువు గురించి కూడా వెతికినా వారికి వివరాలు దొరకలేదు. హంపిలో “యంత్రహనుమంతులవారి“ దేవాలయములో హనుమ ముఖం సరిగ్గా లేదని వ్యాసరాయుల వారు చెక్కితే తెల్లవారు మళ్ళీ బుజూరగా తయారయిందట. హనుమ కలలో కనపడి చెక్కవద్దని చెప్పారట. IITలో చదివి తిరిగి వచ్చి తమ కులవృత్తిగా దేవాలయ పూజారిగా ఉన్న వారిని చూసి రచయితలు ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు చెప్పారు.
వానర సైన్యం సముద్రం దాకా వెళ్ళాక ఆ జలరాశిని ఎలా దాటాలా అన్న ఆలోచనా, ఆందోళనా కలిగి రాముడు మూడు రోజులు తపస్సు చేశాడని, దర్భల మీదనే పడుకున్నాడని అక్కడ “దర్భాశయన రాముని” దేవాలయం ఉందని తెలిసింది.
నవగ్రహాలను రాముడు సముద్ర ఒడ్డున నెలకొల్పి పూజించాటడట.
రామేశ్వరంలో సైకత లింగం పూజించాడు. సముద్రుడు వచ్చి నీలుని సహాయంతో వారధి నిర్మించమని చెప్పాడు.
నీలుని సహాయంతో వేసిన రామసేతు 1870 వరకూ నీటి మీద తేలుతూ అటు ఇటు ప్రయాణానికి వీలుగా ఉండేదిట.
కాని సముద్ర మట్టం పెరిగి నీటిపాలయ్యింది.
శ్రీలంక నేటి కన్నా ఎంతో పెద్దదిగా ఉండేదిట. అదీ సముద్రంలో మునిగిపోయిందిట.
శ్రీలంకలో రామాయణ ట్యూరింగు అని వారం రోజుల రామాయణం సంబంధించిన ప్రదేశాల పర్యాటన ఎంతో ప్రసిద్ధి. సీతామాతను ఉంచిన అశోకవాటికా, యుద్ధం జరిగినచోటా, అగ్ని ప్రవేశం జరిగిన చోటు, దేవాలయాలు ఉన్నాయి.
సంజీవని కోసం హనుమ పర్వతం తెచ్చి లంకలో ఒక ముక్క వదిలేశాడట. అది మనం దక్షిణ లంకలో చూడవచ్చు. అక్కడ చుట్టూ ఉన్న ప్రదేశానికి భిన్నమైన చెట్లు, ఎతైన ఒక పర్వతం కనపడుతుందిట.
హిమాలయాలలో ద్రోణగిరిలో ఈ ముక్క ను తీసినట్లు కనపడుతుందిట. ఆ పర్వతం తనలో ఒక ముక్క హనుమ తీసుకున్నప్పుడు రక్తం కార్చిందని ఆ గుర్తులు కనపడుతాయని చెబుతారు. అక్కడ అంటే ఆ పర్వత ప్రాంతంలో హనుమను పూజించరు.
రాముడు సీతతో కలసి పుష్పకవిమానములో వెడుతూ, సీతామాత కోరికపై కిష్కింద వద్ద ఆగి వానర రాణిని తమతో తీసుకువెళ్ళారు. వారు భరద్వాజ ఆశ్రమం వద్ద ఆగి మునికి వందనాలు సమర్పించి అ
వెళ్ళారు.
శ్రీలంకలో రావణుడిని గొప్పగా గౌరవిస్తారు. ఎంతో చదువుకున్నా గొప్పవీరుడైనా అహంకారం వీడక నాశనమయ్యాడని తలుస్తారుట. శ్రీలంకలో సొరంగమార్గం ఉందట. కాని అది పూర్తిగా వెలికితీయలేదని రచయితలు చెప్పారు.
మన దేశంలో రామాయణం యాత్రగా ఈ మధ్య ప్రభుత్వం ఎదో ప్రయత్నం చేస్తున్నదని విన్నాను. నాకు వివరాలు తెలియవు. ఈ పుస్తకం వల్ల రామాయణం, శబరి, హంపి ప్రత్యేకత ఇత్యాదివి తెలిసాయి. కొంత జాగ్రఫీ తెలిసింది.
రామాయణం పట్టుకొని యాత్ర చెయ్యవచ్చంటే, ఆ ప్రదేశాలున్నాయంటే
మునులు ద్రష్టలని నమ్మటానికి సందేపడనక్కర్లేదు. మనకున్న కొందరు ఎంత సందేహప్రాణులు కదా అని అనిపించింది. వాల్మీకిని నే చదవలేదు. సుందరకాండ మాత్రమే చదివాను. అదీ పారాయణ చేస్తాను. నవలలా చదలేదు. వాల్మీకిని పూర్తిగా చదవాలనిపించింది ఈ పుస్తకం చదివిన తరువాత.
ఇది విక్రంత్ పాండే, నీలేష్ కులకర్ణి కలిసి వ్రాసినది. ఇంగ్లీషులో ఉంది. తెలుగులో ఉందనుకోను.
చాలా నచ్చి ఇలా పంచుకోవాలనిపించింది.
శ్రీరామ నవమి కల్లా చక్కటి రామ పుస్తకం చదివానని ఆనందం కలిగింది.
#mustread