కూచి గారితో కాసేపు

కూచి గారితో కలయిక-

నిన్న ఒక అద్భుతమైన విచిత్రం జరిగింది.
అదేమంటే….
కళ్యాణి కాశీభట్ల ఒక కవిత రాశారు, అది విచిత్రం కాదు…. 
దానికి ఒక అందమైన బొమ్మను కూడా కలిపి భావుకలో పోస్ట్ చేశారు…. అదీ విచిత్రం కాదు….
నాకు నచ్చి బొమ్మ గురించి వివరాలు అడగాలని పిక్ని దాచానుఅది విచిత్రం కాదు
మీరు విసుగు పడకండి మరి ….
అసలు విచిత్రమేమంటే ……
చిత్రం గీచిన అద్భుతమైన చిత్రకారుణ్ణి, నేను నిన్న అంటే బొమ్మ బాగుంది అని దాచిన 12 గంటలలో కలవటం….యాదృఛ్చికం …….అది మాత్రం అద్భుతమైన విచిత్రం కదా!

ఆ అందమైన కుంచె … కాదుకాదు … కుంచెతో అందాలను అద్భుతంగా రూపొందించే పరమాద్భుతం పేరు కూచి….

కూచి సరస్వతుల సాయిశంకర శర్మ గారు.

ఆయన కుంచె నుంచి జల జల మంటూ జారి పడే చిత్రాలను ఏరుకొని, చూసుకొనే మనం మరో లోకం లో మునిగి పొతే ……
మన మీద కూడా ఒక కార్టూన్ వేసి హాయిగా నవ్వించే సరదా సరదా మనిషి ఆయన.
అంత పెద్ద సెలిబ్రిటి అయినా, మనతో చాలా సామాన్యలులా ప్రవర్తించే మాన్యులు కూచి.
పేరు లో కూచి గా ఉన్నా ఆంధ్రదేశంలో కూచి అంతటి వారు లేరన్నది నిజం.

వడ్డాది పాపయ్య గారి కుంచెకు బాపు గారి వద్ద రంగులద్దుకొని కూచిగా నేడు రంగుల అద్భుతం సృష్టి చేస్తున్నారు మన కూచి.

ఉదయపు సుప్రభాత సేవ నుంచి, రాత్రి పవళింపు సేవ వరకు తిరుపతి దేవుని ఆ కుంచె…. లో…తో చూపించి, తిరుపతి వారి భక్తి ఛానల్లో భక్తులను మురిపించే కూచి వీరు,
కలియుగ స్వామి కైమోడ్పులీ కుంచ….
వాగ్దేవి చేతిలో కచ్ఛపి ఆ కుంచె…
వేదాల నాదానికి రూపునిచ్చినది ఆ కుంచె వారిది
మనుచరిత్ర లోని రసరమ్య భావాలకు ఆకృతి మలచినది ఆ కుంచె,
మేఘాల సందేశమునకు రూపమైన ఘనము ఆ కుంచె,
గణపతి సచ్చితానందులు అడిగి మరీ గీయించిన చిత్రం ఆ కుంచె,
త్యాగరాజ కీర్తనల ధ్యానమే ఆ కుంచె,
చల్లని రామచంద్రుని రూపముగా మారినది ఆ కుంచె,
అద్దపు బుగ్గలలో అందం సవరించుకునే అమ్మ సీతమ్మ ఆ కుంచె…
నీలాల కృషుని కన్నుల కరుణ ఆ కుంచె,
చిట్టిబాబు వీణనాదాల కు.. కు.. కోయిల రూపమైనదా కుంచె,
గూడుపడవ గూటిలో దాగిన పెళ్లికూతురు ఆ కుంచె
సంక్రాంతి నాటి బియ్యపు పరవాన్నపు ప్రసాదం ఆ కుంచె…
జగదాంబ ప్రసాదించిన పరిచయం ఆ కుంచె…
అలాంటి కూచి కుంచె ను కలవటం అద్భుతాలలో పరమాద్భుతం…
నాకు ఇది కేవలం అమ్మ కృపతో కలిగిన పరిచయం …
ఆ కలిగిన సంతోషం మీతో పంచటం నా ధర్మం…
కూచి గారి రంగుల ప్రపంచం, కుంచె గురించే చెప్పటానికి నాకున్న భాష చాలదు….
వెల కట్టలేని కూచి గారి కుంచెకు
తోచిన ఈ నాలుగు అక్షర పుష్పాలు సమర్పయామి …అనటం తప్ప….

No automatic alt text available.
No automatic alt text available.
No automatic alt text available.
No automatic alt text available.
No automatic alt text available.

Leave a comment