గిరిజగారితో గుసగుసలు

గుసగుసలు ఘుమఘుమలు, గలగలలూ,-పదనిసలు,సరిగమలు -రుసరుసలు, కోరకొరలు

మనకు తెలియకుండానే కొందరు చాలా ఆత్మీయులవుతారు. దానికి కారణము ముఖ్యంగా వారిలోని అవ్యాజమైన ప్రేమ, తోటి వారిపై వారికి వున్న నిర్మలమైన కరుణ. అందరిని తమ పిల్లలుగా ఆదరించే హృదయము. ఇవ్వన్నీ పుష్కలంగా వున్న గిరిజగారు నాకే కాదు తను పరిచయస్తులందరికి చాలా ప్రియమైనవారు, ఇష్టులు. ఆమె సియాటిల్‌ ట్రిప్పులో అట్లాంటా రమ్మని నే కోరిన కోరికను మన్నించి నాతో వారం రోజులు గడిపి వెళ్ళారు.

ఆవిడ ఎక్కడుంటే అక్కడ సందడి. ఆమె చెణుకులకు నవ్వని వారుండరు. సందర్భోచితముగా ప్రాస కలిపి, హస్యం పండించి అందరిని తెగ నవ్విస్తారు. ఆమె వున్నన్ని రోజులు బిరబిరా మంటూ వేగం వెళ్ళిపోయాయి.

తను రాగానే కొండల్‌ ను అడిగి, ఫణి వున్నారని అందరికి కలపి, (అంటే గోదారివాళ్ళు కదా వారంతా) వరసగా వంటలలో ఆవ పెట్టడం మొదలెట్టారు.

కందాబచ్చలి ఆవ, సొరకాయ పెరుగుపచ్చడి ఆవ, దోసావకాయ ఆవ ఇలా ఆ లిస్టు చేంతాడే. ఆమెను వదిలితే నాకూ, మా అట్లాంటాకు కూడా ఆవ పెట్టేసేవారు.

“ఈ ఆవ ఏంటీ?” అన్న పాపానికి

‘ఆవ – దాని పుట్టుపూర్వోత్తరాలు”, ‘గోదారి జిల్లాలు వాటి పాముఖ్యత’ ఇత్యాదివి నా చేత డిక్టేషన్‌ రాయించారండి.

అయ్‌ అవునండి.

మరి మా గిరిజగారంటే మాటలా?

ఆవ గాటులా ఘటుగా ఆవ పెట్టి, అమ్మలా మంచినీళ్ళణదిస్తారు.

నాతో పచారి సామానుకు షాపుకు వచ్చి గులాబుజాము పొట్లం కావాలని తెచ్చి అందమైన జామూన్‌లు చేసి మా అందరి నోరు తిపీచేశారు.

ఇంక శ్రీవారు, ఫణి దానికి జతగా ఐస్‌క్రీమ్‌ తెచ్చి జాములు వెచ్చబెట్టి వాటి మీద ఈ హిమషీతలము వడ్డించి మాకు తినిపించారు.

అంతేనా? అంటే…అలవోకగా మైసుర్‌పాకు లాంటి స్వీటు, దోసావకాయ, అల్లం పచ్చడి చేయ్యటమే కాదు, నాకు నేర్పించారు కూడా.

ఫణి గారి వీణా కచేరికి నాతోడుగా వుండి విడియోలన్నీ తనే తీశారు.కచేరికి ముందురోజు ఆయనతో మాటల సందర్భములో గిరిజగారు తనకు మరుగేలరా ఇష్టం అని చెప్పారు. మరురోజు కచేరిలో ఫణి గారు ‘మరుగేలరా’ నే తన శాస్త్రీయ సంగీత విభాగములో వాయించి గిరిజగారి హృదయాన్ని ఆనందములో నింపారు. మరు రోజు ఉదయము ఆమె తనకు ఆ పాటతో వున్న అనుబంధం గురించి, అది ఆమె, తన భర్తగారితో కలసి పాడుకునేవారని చెప్పి తన హృదయము పంచుకున్నారు.

అలా ఉదయము కాఫీ కాపీ రాగములో మొదలయిన మా మాటలకు అంతులేకుండా వుందేది. ఎన్ని మాటలు చెప్పుకున్నా ఇంకా చాలా మిగిలిపోయాయి అనిపించింది.

ఫణి, కొండల్‌ కలసి నా మీద వేసే జోకులకు ఆవ పెట్టిన ఘనత గిరిజగారిదే. చిన్ననాటి స్నేహితులలాగా, కలవిడిగా, పనులలో అన్నిటా తానై, ‘మీరు రెస్టండి’ అన్నా వినకుండా అన్నిటా సాయం వచ్చి నాకు అమ్మను ఎంతగా గుర్తుకు తెచ్చారో అసలు.

వారిని ఎయిర్‌పోర్టులో దింపి బయటకు వచ్చాక నాకు శూన్యంగా, వంటరిగా అనిపించింది. నా కారులో కూర్చొని కడుపారా నా దుఖం తీర్చుకున్నాను.

గలగలమంటూ మాట్లాడుతా, అందరిలో కలిసిపోయి, ఎదో పని అందుకుంటూ, మధ్యమధ్యలో ఫ్. బీలో అడ్మిన్ బాధ్యతలు నెరవేరుస్తూ, ఘుమఘుమల వంటలు రుచి చూపుతూ, గుసగుసగా నాకు కబుర్లు చెబుతూ, గలగలా తిరిగే గిరిజగారు సియాటిల్‌ తిరిగివెళ్ళారు. తన బ్యాగులో మా మనసులను కూడా తీసుకొని.

ఫణి గారి సరిగమలు నాతో పాటూ సమానముగా ఆస్వాదించారు. నా కొరకొరలకు అందరితో కలసి ఉడికించకుండా నా వైపు వూగారు కాసేపు. నాకు రుసరుస పొంగిన ఉక్రోషముతో

‘నేనూ చేరాను మార్గదర్శిలో’ అనేలా నేనూ ‘ఆవ’ పెట్టి పులిహోర చేసి ఈ గోదారి బ్యాచ్‌ ను క్లీనుబోల్డ్ చేశానోచ్‌.

గిరిజగారు! బావుంది మీరు రావటము. బాలేదు, అంత తొందరగా వెనకకువెళ్ళిపోవటము.జలజాక్షిని వదిలి వచ్చారనా వారం కే వెళ్ళిపోయారు. ఇంతకీ మళ్ళీ ఎప్పుడొస్తారు????

ఎదురుచూస్తూ వుంటాను మరి.

సంధ్య

అట్లాంటా

Leave a comment