నీమ్‌ కరోలీ బాబా

యోగులు- భూమిపై పరమాత్మ స్వరూపములు: నీమ్‌ కరోల్‌ బాబా:

తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు.

భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు.

************************

స్టీవ్ జాబ్స్, ‘ఆపిల్’ సంస్థ రూపును మార్చి ప్రపంచంలో అత్యధిక ప్రజల చేతులలోకి స్మార్ట్ ఫోను తెచ్చిన మేధావి. ఆధునీకరణ ఆ స్మార్ట్ ఫోన్ తోనే రూపు దిద్దుకుందన్నది సత్యం. అలాంటి స్టీవ్ జాబ్ తన లాపుటాపు లో ఒకే ఒక్క మహానుభావుని చిత్రపటం దాచుకున్నారు.

ఫేస్బుక్ ప్రారంభించిన మార్క్ జుకెర్బర్గ్, తన మెంటార్ అయిన స్టీవ్ జాబ్స్ సలహా మీద దర్శించిన ఒక్కె ఒక్క ఆశ్రమము నైనిటాల్‌ వద్ద వున్న చిన్న ఖాచ్చి ఘాట్‌.

జూలియా రాబోట్స్, హాలివుడ్‌ నాయిక ఒక చిత్రపటం చూసి భక్తితో పరవశించింది. ఇవే కాకా ఎందరో అమెరికన్ ప్రొఫెస్సర్సు, పెద్దలు భక్తులుగా మారిన వైనమది!

ఎందరో ధనవంతులు, ఎందరో పేరున్న ప్రఖ్యాతి చెందిన వారు ఆ ఆశ్రమం ముందు చేతులు చాచి, చేతులు కట్టుకు నిలబడ్డారు.

డబ్బు ఇవ్వలేనిదేదో వారికి కావాలి.

ఆ ఆశ్రమంలో ఉన్న బాబా కేవలం ఒక పంచ, భుజాలపై ఒక కంబళితో జీవించే మహా యోగి మహారాజ్! వారే “నీమ్‌ కరోలి బాబా” అన్న పేరుతో ప్రఖ్యాతి చెందిన మహా యోగి మహారాజ్.

ఉత్తరప్రదేశ్ లోని అక్బరుపూర్ లో 1900వ సంవత్సరం దుర్గా ప్రసాద శర్మ అన్న ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి జన్మ నామం లక్ష్మీ నారాయణ శర్మ. చిన్ననాటి నుంచి శాంత స్వభావము.

ఏమి పట్టించుకొనక సదా ధ్యానం లో మునిగి వుండేవారు. అలా ధ్యానంలో వుండే ఆ 17 సంవత్సరాల బాలునికి తండ్రి పెళ్లి చేశారు. లక్ష్మణ్ బాబా ఆ మిషతో కుటుంబం వదిలి వెళ్ళిపోతారు. ఎక్కడో ఉంటూ, ధ్యానంలో తపస్సు లో ఉంటూ ఉత్తర భారతం అంతా తిరుగుతారు లక్ష్మణ్ బాబా. గుజరాత్ లోని భవాన్యలో ఆయన తపస్సు సిద్ధిస్తుంది. అణిమాది సిద్దులు లభిస్తాయి.

వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో పిలవబడుతూ భవాన్య లో ‘తలయ్యా బాబా’గా పేరు పొందారు లక్ష్మణ్ బాబా. తండ్రికి కొడుకు ఆచూకీ తెలిసి పరుగున వచ్చి ఇంటికి కొనిపోతాడు. బాబా మాత్రం ఆ ఊరిలో ఇంటికి దూరంగా ఉంటూ, ధనమంతా పేదల సాధువుల సంతర్పణకు వాడుతారు.

‘నీమ్‌ కరోలి’ అన్న గ్రామము చేరిన బాబాను ప్రజలు ముందు ‘(మహిమల) చమత్కార బాబా” గా పిలుచేవారు. బయటి గ్రామాలవారు ఆయనను ‘నీమ్‌ కరోలి బాబా’ గా పిలిచారు. అదే స్థిరపడిపోయ్యింది.

ఆయన మహిమ బయటకు ప్రస్ఫుటంగా తెలిసిన సంఘటన ఒకటి చరిత్రలో నిలబడిపోయింది.

ఇంటి నుంచి వెళ్ళిపోతూ రైలు ఎక్కిన లక్ష్మణ్‌ బాబాను రైల్ లోనుంచి దింపుతాడు టికెట్ కలెక్టర్, టికెట్టు లేదని. బాబా రైలు దిగి పట్టాల ప్రక్కనే కూర్చుంటాడు నిర్భావముగా. తరువాత రైలు ఎంత ప్రయత్నించినా కదలదు.

చివరకు బుద్ధి వచ్చి మళ్ళీ బాబాను రైల్లో ఎక్కించుకుని బయలుచేరుతారు టిక్కెటు కలెక్టరు. ఆ మహిమతో బాబా పేరు మారుమ్రోగి పోతుంది.

బాబా చిన్నతనం నుంచే శాంత స్వరూపులు. అఖండమైన ప్రేమను అందరికి పంచటమే ఆయన ధ్యేయం!

ఆయన పూర్ణ హనుమంతుని అవతారం. బాబా అనంతమైన మహిమలకు ఆలవాలం.

సాధువులలో రత్నం వంటివారు. దీనులను అక్కున చేర్చుకున్న రక్షకులు.

అన్నార్తులకు ఆహారం ఇవ్వటము మన నియమంగా వుండాలని బోధించేవారు.

ఆహారం, అన్నసంతర్పణలు బాబాకు ఎంతో ప్రియమైనవి. భోజనం – ఆహారమూ ఆకలి కొన్న వారికి చెందినదని ఎప్పుడు బోధించేవారు.

ఆయనకు అన్నపూర్ణ సిద్ధి ఉండేది. అన్నసంతర్పణ చేసేటప్పుడు ఆశ్రమంలో కావలిసినంత ఆహారం లేకపోయినా, అందరికి సరిపోయేది.

‘లేదు’ అన్న మాట వచ్చేది కాదు.

నేటికీ ఆశ్రమంలో ప్రతి జూన్ 15 న అన్నసంతర్పణలు జరుగుతాయి. భక్తులు లక్షలలో వచ్చి ప్రసాదం తీసుకువెడతారు.

బాబా బోధించినది సరళమైన భక్తి మార్గం. భక్తి ప్రేమ మార్గం. అవ్యాజమైన, అనంతమైన ప్రేమను బోధించారు. సర్వులు ఒక్కటే, హెచ్చు తగ్గులు లేవని సదా భక్తులకు చెప్పేవారు.

బాబా అవ్యాజమైన ప్రేమ భక్తి కి అమెరికాకు చెందిన హిప్పీ కల్చర్ గా పేరు తెచ్చుకున్న వారిని ఎందరినో ఆధ్యాత్మిక సాధకులుగా మార్చింది. బాబాకు భక్తులుగా మార్చింది.

వారంతా తమ పేర్లను మార్చుకొని, బాబాకి సేవ చేశారు.

మొదటిసారి ఒక హిప్పీ భక్తుడు బాబా ను దర్శించ్చినప్పుడు బాబా ఆ భక్తుని “తెచ్చివ్వు, యోగా గుళికలు” అన్నారు.

ఆ వచ్చిన భక్తుడు తన వద్ద ఉన్న మాదక ద్రవ్య మాత్రలను బాబాకు ఇస్తాడు. బాబా అన్నింటిని మింగేసి తనకు మత్తు కలగటం లేదని ఫిర్యాదు చేస్తాడు. అసలు మత్తు దేవుని నామములో వుందని ఊటంకిస్తాడు.

ఆ చర్యతో ఆయన బాబాకు భక్తునిగా మారి, బాబా మీద ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. రామదాసుగా పేరు మార్చుకున్న ఆయన పుస్తకాలు ఎన్నో బాబా గురించి, బాబా బోధనల గురించి నేడు మనకు బజారులో లభ్యమవుతున్నాయి.

మరో హవార్డ్ ప్రొఫసరుగారు బాబాను దర్శించడానికి వస్తాడు. ముందు రోజు వారంతా ఆరుబయట పడుకొని నక్షత్రాలను చూస్తూ, బాబా ను ఎలా పరీక్ష చెయ్యాలా అని యోచిస్తారు.

మరు రోజు వెళ్లి బాబాను కలిసి నప్పుడు, బాబా ఆ ప్రొఫెసరు ముందు రోజు తన తల్లిని తల్చుకు బాధ పడిన విషయం చెబితే, హావర్డ్ ప్రొఫెసర్ కి మతిపోతుంది. బాబా శక్తి అవగతమౌతుంది.

మరో డాక్టర్ వచ్చి నప్పుడు భక్తులందరు బాబా పాదాలు తాకడానికి పడే ఆత్రుత చూసి మనసులో అసహ్యించుకుంటాడు. తరువాత ఆయనకి బాబా ఇచ్చిన అనుభవంతో మారి, పాదాలు తాక ప్రయత్నం చేస్తాడు.. బాబా తన పాదాలు వెనకకి తీసుకుంటాడు. ఆ భక్తుడు క్షమించమని ప్రాధేయపడుతాడు. ఆయనే కృష్ణ దాసుగా బాబా భక్తులలో ఒకరిగా పేరు పొందారు.

మరొక భక్తుడు బాబా ను దర్శించటాని కి వెళ్ళినప్పుడు, బాబా ఆ భక్తునుకి జరిగిన, జరగబోయే విషయాలను దృష్టిలో పెట్టుకు మాట్లాడుతున్నారని గ్రహించాడు. అలా అర్థం చేసుకున్న తర్వాత బాబా చెప్పినవి పాటించి జీవితం పండించుకున్నాడు.

బాబా సమాధి మందిరం లో ఉన్న అర్చకులు తమ అనుభవం ఇలా చెబుతారు “బాబా, తన తాతగారు మంచి మిత్రులు. ఒక రోజు తాతగారికి గుండె నొప్పితో విలవిల లాడుతూ, తమ తుదిక్షణం వచ్చిందని గ్రహించి బాబా ను ప్రార్దిస్తున్నాడు. బాబా పరుగున ఆయన ప్రక్కన చేరి, నీవు 90 సంవత్సరాలు ఉంటావు.. ఈ నొప్పి నిన్ను ఏమి చెయ్యదు. అని అభయం ఇచ్చాడు. ఆనాటి నుంచి తాతగారు బ్రతికి నిక్షేపముగా 90 సంవత్సరాలు జీవించారు”.

భక్తులకు సరళమైన భక్తిని బోధించిన బాబా, ఎంతో దూరాన ఉన్న భక్తులకు కూడా ఆపన్నసమయాలలో కనిపించి రక్షిస్తూ ఉండేవారు. వారు తరువాత ఆశ్రమానికి వచ్చి దర్శించుకు వెళ్లే వారు.

ఇలాంటి ఎన్నో తార్కాణాలు బాబా భక్తులకు అనుభవాలే!

బాబాకు తమ బాధ నివేదించగానే కొందరికి స్వస్థత కలిగేది. కొందరికి ఏమి చెప్పక ముందే స్వస్థత కలిగేది. కొందరికి కొన్ని రోజుల తర్వాత స్వస్థత కలిగేది. అలా అందరికి సమాధానము లభించేది. ఆయన బోధలు పరమ సరళం. ఆయన చూపిన భక్తి మార్గమూ సరళము. బాబా ఎవ్వరికి ఏ మంత్రం బోధించలేదు. అందరికి తగినంతగా, కుదిరినంతగా సహాయము చేసి, ఆదుకోమని మాత్రమే బోధించారు.

భగవంతుని ప్రేమించమని, ఆ ప్రేమను చుట్టూ వున్న మానవులకూ పంచమని, అందరినీ సమానముగా చూడమనీ బోధించారు.

ఎన్నో హనుమంతుని దేవాలయాలు కట్టించారు. ఉత్తరాకాండులోని ఖైచ వద్ద ఉన్న ఆశ్రమంలో చాలా కాలం ఉండిపోయారు.

1973లో ఆగ్రా వెళ్లి తిరిగి వస్తూ మథుర స్టేషన్ లో స్పృహ కోల్పోయారు. బృందావనం లోని ఎమర్జెన్సీ కి తీసుకుపోతారు కూడా వున్న భక్తులు. అక్కడ ఆయన డయాబైటికు కోమా లోకి వెళ్ళి పోయారు. మెలుకువ వచ్చిన తరువాత గంగాజలం కావాలంటే, లేవని మాములు నీరు అందిస్తారు. తమకు పెట్టిన ఆక్సీజన్ తీసివేసి, “జయ జగదీశా హరే!” అని జపిస్తూ నిశ్శబ్దం లోకి జారుకున్నారు. అది సెప్టెంబర్ 11, 1973 వ సంవత్సరం.

బాబా సమాధి మందిరం బృదావనం లో ఉంది. ఆయన ముఖ్య ఆశ్రమం ఖచ్చి (నైనిటాల్)లో ఉంది.

సమాధి తర్వాత కూడా ఆయన ఎందరినో భక్తులను ఆకర్షిస్తూనే ఉన్నారు. స్టీవ్ జాబ్ నుంచి, మార్క్ వరకు…

ఎందరో భక్తులు నీమ్‌ కరోలి బాబా ను సేవించి, ఆయన చూపిన మార్గంలో సమాజంలో తమ సేవలందిస్తూ ముక్తి పొందుతున్నారు.

అమెరికాలో ఆయన భక్తులు న్యూ మెక్సికో లో ఆశ్రమం కట్టించుకున్నారు. ‘సేవ’ అన్న ఒక ఆర్గనైజషన్ ద్వారా బాబా బోధనలను పంచుతూ, సేవలను అందిస్తున్నారు.

కొన్ని బాబా బోధనలు:

-నీవు చేసినది లేదు, నేను చేసినది లేదు. అంతా చేసేది ఆ భగవంతుడే!

– సత్యవ్రతం పాటించండి. సరళమైన సత్య భాషణతో మనసులను శుద్ధి పరుచుకోవచ్చును. సత్య వచనమే నిజమైన తపస్సు.

– మీ పని చెయ్యండి. పనే భగవంతుడు. పని చెయ్యటమే భగవంతునికి సేవ చేయటం.

-బయటి ప్రపంచాన్ని వదలండి. ఇంద్రియాలను నిగ్రహించుకోండి. అంతర్ముఖులు కండి.

– ప్రపంచం ఒక ప్రదర్శనశాల. పట్టించుకోకండి. మనం బజారు లో వెడుతూ ఉంటాము. ఎన్నో వస్తువులు అమ్మకానికి ఉంటాయి. మనం వేటిని కొనము. చూస్తూ వెడతాం. అలానే ఈ ప్రపంచాన్ని పట్టించుకోకండి.

-ఏ రూపమైనా పరమాత్మను కొలవండి.

-సేవించండి, అందరిని ప్రేమించండి, అందరిని సమానంగా ఆదరించండి. ప్రేమే పరమాత్మ!

ఽఽఽఽఽస్వస్తిఽఽఽఽఽఽ

🙏🏽🙏🏽🙏🏽

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment