వంట – తంటా

“ఏమండోయి!!
 నాకూ వంటలు, పిండి వంటలూ గట్రా వచ్చండోయి. 
ఎదో అప్పడప్పుడూ ఒకటి అరా అలా అలా చెడొచ్చు కాక. 
కొద్దిగా బద్దకముతో రెండు రోజులకోకసారి వండొచ్చు గాక. అయినంత మాత్రాన వంట రాదని తీర్పు చెప్పటమేనా? 
ఎదో పండుగంటే భోజనానికి ఎవ్వరూ లేరని ఆకులు అలములు అదే సలాడు తో కానివ్వవొచ్చు కాక, 
కూర బదులు ఊరగాయ, లేకుంటే చట్నీ పొడో రెండు రొట్టలు వేడి చేసి ఈ భర్తరత్నానికి వడ్డించొచ్చు గాక, 
ఆవ పెట్టమంటే ఆమడ దూరము లగ్గెత్తవచ్చు గాక,

ఎప్పుడూ అన్నమేనా అని పిల్లది గొడవచేస్తే పిజ్జా తెప్పించి చేతులు దులుపుకోవచ్చు గాక అంత మాత్రాన నాకు వంటరాదంటే ఎలాగండి బాబు వప్పుకునేది. నిన్న గాక మొన్నే కదా యాబయ్యి మందికి వండి వార్చింది. నిరుడు హోమమని వంద మందికి ముక్కల పచ్చడి, పులిహోర పరవాన్నము, గారెలు బూరెలు చేసి నడుములు విరగ్గొట్టుకున్నది””…  
ఇదంతా ఏకపాత్రాభినయంలా వుంది కదండి.
 కాదండి.
 మా ఇంటికి వచ్చిన చుట్టాల దగ్గర నా వంటలు విశేషాలు సరిగ్గా లేనివి చెప్పి శ్రీవారు జాలి అప్పు తెచ్చుకునే ప్రయత్నంలో వుంటే నేను నా గోడు ఇలా విప్పి చెప్పాను బాబు!!
నిజమండి బాబు!
నిన్నగాక మొన్న నవరాత్రులలో 
సప్తమి నాడు అమ్మవారికి బ్లాక్‌హెడ్‌వైటు బీన్స్ తో అదే అలచందలంటారుగా… వాటితో గారేలు చేశాను. పప్పు నానపెట్టి, రుబ్బి, అందులో దండిగా పచ్చి మిరప, అల్లము, కొత్తిమీరతో పాటు కొద్దిగా జీలకర్ర వేసి గారెలు చేసి అమ్మవారి కి నివేదించి శ్రీవారికి వడ్డించాను. దాచుక దాచుకు తిన్నాడు ఆయన ….రోజంతా ….
అష్టమి నాడు పొంగలి చేస్తే, ముక్కల పులుసు చేయ్యమని అడిగి మరీ చెయ్యించుకొని శుభ్బరంగా భోంచేశారు. 
నవమి నాడేమో కొబ్బరన్నము ….టమోటో పెరుగుపచ్చడి చేసి పెడితే ఆఫీసుకు బాక్సులో కూడా అదే పట్టుకుపోయారు.  మళ్ళీ నంచు కోవటానికి బజ్జీలు కూడాను

దశమి నాడు నేతి సజ్జప్పాలు చేశాను.
మైదా తడిపి పెట్టుకొని పక్కన పెట్టి, ఉప్మా నూకతో (సీరా అంటాము మేము) కేసరి చేసి పెట్టుకోవాలి, (అందులో డ్రై ప్రూట్స్ వెయ్యకూడదు). ఈ సిరాను చిన్న వుండలు చేసి మైదాను చపాతి వుండలలా చేసి, సిరా అందులో పెట్టి వుండలుగా చేసి, ఆ వుండను చపాతిలా వత్తుకున్నా. దాన్ని పెనముపై నేతితో వేయ్యించి సజ్జప్పాలు చేసి అమ్మవారి నివేదించాను. పులిహోర వుండనే వుంది. పరమాన్నము పచ్చి కొబ్బరి శనగపప్పుతో.
అమ్మవారికి నైవేద్యాలు…. శ్రీవారికి నివేదనలు… ఆయన పలహారము… నేను ప్రసాదములా తిన్నాము. 
ఇన్ని చేసినా కొంచం కూడా  ధ్యాంకుఫుల్ గా అదే కృతజ్ఞతగా వుండకుండా ఈ రాజమండ్రీ బండి కనపడగానే నేను మాడుస్తున్న చెందానా ఒకటే ఫితురులు నా మీద. 
చూశారు మరి!!
“రాదే చెలి! నమ్మరాదే చెలి!! మగవారి మాట నమ్మరాదే చెలి!!!:
 
 

Leave a comment