Buttato tippalu

ప్రయాణములో పదనిసలు -6
బుట్టోపాఖ్యానము

నేను వారణాసీ నుంచి వంట్లో బాగుండక స్టమక్ ఫ్లూ తో హైద్రాబాదు వచ్చిన మరురోజు, మా బావగారు అన్నారు బుట్టగురించి. ‘తినగలవా, బుట్ట తెస్తానుఅని. నేనుమాములు ఫుడ్డే తినలేక ఇబ్బందిగా వుంది ఇక బుట్టతట్టా ఒక్కటే తక్కువ నాకుఅని, అయినా బుట్టంటేనూ?’ అని ప్రశ్నించాను. 
అక్కయ్య చెప్పిందిసుబ్బయ్యగారి బుట్టఅని. 
అదే మొదలు నేను బుట్ట పుడ్డువిడ్డూరాలు వినటము. 
బుట్ట నిండా అన్నముట, తిన్నంత తినొచ్చుట, పంచుకోగలిగినంత పంచుకోవచ్చు అని. తినటానికి వల్లకానన్ని పద్ధార్థాలట. పప్పులు పులుసులు కూరలూ ఒకటేమిటి మన మాయబజారులో ఎస్‌వి రంగారావు పాత్రే మనది అని. 
ఆహ! ఓహో! అంటూ చప్పరిస్తూ తింటూ వుంటే ఎంత తిన్నామో తేలీదని, ఇంతా చేస్తే బుట్ట ఖర్చు చాలా తక్కువనీ చెప్పింది. 
తిన్నాక బుట్టను పడేయ్యకుండా వులిపాయలు పోసుకోవచ్చని వూరించింది కూడాను. 
అలా బుట్ట మా చిన్నగా ప్రవేశించి
మాటలలో భాగమైయ్యింది. 
నేను ప్రతి వారినిబుట్ట తిన్నారా?’ అని అడగటమూ, 
వాళ్ళు చప్పరించెయ్యటమూ 
సస్పెన్సు పెరుగుతూనే వుంది. 
మాటల మధ్యనే విన్న కబుర్లన్నీ శ్రీ వారి చెవినేషాను గమ్మునుండక. 

ఇక మాఆయనకు బుట్ట పిచ్చి పట్టింది. 
తను వచ్చే రోజుకు తనకు ఎట్టి పరిస్థితులలోబుట్ట భోజనము కావాలని మోరాయించారు. 
మేమున్న చోటకు బుట్ట డెలివరీ చెయ్యరురా బాబు అంటే వెళ్ళి తెమ్మని హుకుం వేశారు. 
కూకట్‌ పల్లి వెళ్ళి తెచ్చుకోవటము కన్నా కాకినాడ వెళ్ళి భోం చెయ్యటము బెటరు.
కానితా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళమనిషి మాఇంటాయన. చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం ఏడ్చినట్లు ఈయన బుట్ట కోసం గోల. 

నేను వస్తాను బుట్ట తింటానుఅని స్లోగను తయారుచేసుకొని హైద్రాబాదు వచ్చే వారం రోజుల ముందు నుంచి నా చెవులు చిల్లులు పడి నెత్తురు కారేలా వినిపించాడు ఫోనులో. 
బుట్టేమో గానీ రకంగా నా బుర్ర పూర్తిగా తిన్నాడు. 

సరేవిధి బలీయము! అని అనుకొని, ఆయన వచ్చే రోజు బుట్ట కుకట్‌పల్లి కెళ్ళి తేవాలని నిర్ణయించుకున్నా!

చెప్పానుగా, తార్నాకా నుంచి కుకట్‌పల్లి వెళ్ళటము కన్నా కాకినాడ వెళ్ళి సుబ్బయ్యహోటలులో భోజనము ఈజీ.   

అక్కడ మీరు టైం లో వెళ్ళినా నలుభై నిముషాలు కదలకుండా ట్రాఫిక్‌ లోజాంలా అవటము , అరగంట పనికి నాలుగు గంటలూ గుట్టుకు మని మాయమవటమూ తప్పదు. 
వెరసి అణా బుట్టకు ఆరు రూపాయులు క్షవరము, ఆరు గంటలు వృద్ధా. 
ఎలా చూసినా గిట్టుబాటు కాని బేరమే ఇది. చెబితే వినే రకము కాదు మా తలతిక్క మేళము. అందునా ఊరి నుంచి వస్తున్నందున తెగ ఉబలాటపడుతున్నాడు అయ్యవారు!!
బుట్ట! బుట్టా!’ అంటూ . 

అయినా ఇలాంటి గొంతెమ్మ కోరికలు తీర్చు కష్టాలు నాలాంటి సాదు జనులకు తప్పవు అనాధిగా అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. 

చేసేదేముంది….ట్రాఫికు వున్నాఅయినను పోయిరావలెయు 
కుకట్‌పల్లి కీఅని రాని కాంభోజి రాగములో పాడుకుంటూ పయనమైనాను! 

అందుకని ఒక ఫ్రెండును ఎయిర్‌పోర్టుకు పంపి, నేను బయలుచేరా తేవటానికి సుబ్బయ్య గారి బుట్టను।
బహుశా హనుమంతుడు సంజీవనీ పర్వతము తేలికగా తెచ్చి వుంటాడు. అది రాత్రి పూటగా ట్రాఫికు వుండి వుండదు. మేము కొట్టుకుంటూ రెండున్న గంటలు వెళ్ళి, అక్కడ పార్సిల్‌ తీసుకొని, మరో మూడు గంటలు ఈదుకొని మా స్వగ్రామము తార్నాకా కు నాలుగు గంటలకు చేరాము.

పరదేశము నుంచి పరుగున బుట్ట కోసమొచ్చు పతిదేవుడు లెక్కన కొంప చేరవలె. కానీ మనమొకటి తలిస్తే, హైద్రాబాదు ట్రాఫిక్, అరెబియా ఎయిర్‌లైన్స్ మరోటి తలుస్తారు. 
సారువారు ఎక్కిన విమానము వచ్చినది. సారువారు వచ్చారు. లగేజ్ రానని మొరాయించి ఎక్కడో స్టైకు చేసి విమానము దిగేసింది. 
తొందర పడి ఒక కోయిలలా ముందే జంపు. 
ఇక ఈయన చెయ్యగలిగినది, 
కాగితాలు పూరించి, ఎయిర్‌లైన్ వారికి సమర్పించటము. 
నేను ట్రాఫిక్‌లో, మా ఫ్రెండు ఎయిర్‌పోర్టు పార్కింగులో 
ఎరకపోయి వచ్చాను, ఇరుక్కుపోయానుఅని మూడు గంటలు పాడుకున్నాము. 
మూడు గంటలకు శ్రీవారు చేతులూపుకుంటూ బయటకు వస్తే మిత్రులు చూసి తెల్లబోయి
ఎంటి సంగతీ?’ అంటే 
ఈయనగాయబ్‌ నా లగేజ్అని కారునధిరోహించారుట. 

అంతటితో అవలేదండి మన బుట్ట కథ….
కారు ఎయిర్‌పోర్టు దాటగానే పెద్ద చప్పుడు చేసిఢాంరోడు మీద ఆగిపోవటమూ, ఫ్రెండు వాడు కారును షెడ్డుకు పంపుడూ, ఊబరు పిల్చి మా వారిని ఇంటికి పంపుడూ జరిగాయి. 
మధ్యాహనం పన్నెండుకు వచ్చి ఆయనా,  పదకొండుకు వెళ్ళి నేనూ ….  అలా కష్టాలను ఈదుతూ తనూ, ట్రఫికులో ఈదుతూ నేనూఒకే సారి ఇల్లు చేరాము సాయంత్రం నాలుగుకు. 

అయినా స్పిరిటు తగ్గని శ్రీవారు
లగేజ్ పోయి బుట్ట వచ్చే టాం! టాం! టాం!’ అని చతురాలతో విసిగించారు. 

అప్పటికి అప్పడము మెత్తబడి, అన్నము పలుకుబడి, పప్పు చల్లబడి మేము నీరసపడి  సాగిపోతున్న పద్దార్థాని తిన్నాము. 
ఇది తిండా ..నా బొందాతిన్నోడు గోవిందా…’ అని పాడుకోవాలి. 
ఆహారాన్ని అంతా ఆహా! ఓహో! అంటారు….మనమూ అందాముఅని ప్రయత్నించి, వల్లకాక  వదిలేశాము.

మా వైజాగు వరకూ రోడు ట్రిప్పులో, కాకినాడ బంధువుల ఇంటికి వెళ్ళి నప్పుడు పుణ్యక్షేత్రములా.. సుబ్బయ్యగారి హోటేలు దర్శించి, అన్నిటి కన్నా గడ్డ పెరుగు బహు పసందని మెచ్చి ఆనందించాము. 
అలావండుకున్నంత సుఖం లేదూఉపోషమంత హాయి లేదూఅని పాడుకున్నాము.  
అలా బుట్టోపాఖ్యానము జరిగినది ప్రయాణములో. 

Leave a comment