ఒక భక్తుడు ఒక సారి భగవాను వద్దకు వచ్చి తనని ఎవరో దూషిస్తున్నారని చెప్పాడు. భగవాన్ వినట్లుగా ఊరుకున్నారు.
ఆ భక్తుడు ఆగలేక “భగవాన్ అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదు. ఏంచెయ్యాలా?” అన్నాడు.
భగవాన్ నవ్వుతూ “ నీవు గూడా వారితో కలసి తిట్టుకో. సరిపోతుంది” అన్నారు.
అందరూ నవ్వారు.
“సరిపోయింది. నన్ను నేను తిట్టుకోవాలా?” అన్నాడా భక్తుడు.
“అవునయ్యా! నీ శరీరాన్ని కదా వారు దూషించేది. కోపతాపాల నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువెవ్వరు? దీన్ని మనమే దూషించాలి. మనమట్లా చెయ్యక ఏమరి ఉంటే, మరెవరో ఆ పని చేస్తుంటే మనల్ను ప్రభోదిస్తున్నారనుకోవాలి. అప్పుడు తెలివి తెచ్చుకొని మనం కూడా దీన్ని నిందించాలి. అంతేగాని ఎదురు తిడితే ఏం లాభం? అలా దూషించే వారే మిత్రులుగా భావించాలి. వారి మధ్య ఉంటే మేలు. పొగిడే వారి మధ్య ఉంటే ఏమరిపోతాము” అన్నారు.
ఆ భక్తుడు ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు.
మనము ఈ శరీరాన్ని శాశ్వతమని, అన్నీ ఈ శరీరానికి ఆపాదిస్తు జీవిస్తున్నాము. మనము ఈ శరీరమనే ఉపాధి కాదని, ఈ శరీరము పరమపథం చేరటానికి కేవలం మన వాహనమని గుర్తించి మెసలుకోవాలి. అటు వుంటిది సాధించితే కోపం, తాపం సుఖం దుఖం ఇటు వంటివి ఏమీ చెయ్యవు.
జగదంబా మాఈ ఉపాధి నీ పనిముట్టుగా సదా ఎరుకలో ఉండే ఎరుక కూడా నీవే మాకు అనుగ్రహించాలని అమ్మను ప్రార్థిద్దాము.
జయహో మాతా!