అష్టావక్రగీత #8
జనక మహారాజు మిథిలా నగర రాజు. ఆయన జ్ఞాని కూడా. అష్టావక్రుని జ్ఞాన, ముక్తి, వైరాగ్యం గురించి అడిగినప్పుడు అష్టావక్రుడు మహారాజుకు సమాధానంగా “బంధాలను వదిలెయ్యమని, విషయలంపటాలను విషంలా వదిలెయ్యమని చెబుతాడు. ఇంద్రియాలు కోరికల వెంట పరుగులు పెడతాయి. ఒక కోరిక తరువాత మరో కోరిక కలుగుతూనే ఉంటుంది. అవే విషయ లంపటాలు. వాటిని విషంలా చూడాలి. రజ్జు సర్ప బ్రాంతిలా చుట్టూ ఉన్న ప్రపంచము నిజమని అనిపిస్తుంది. కాని బ్రాంతి వీడి లోన ఉన్న ఆత్మను చూడమన్నాడు ముని. మోక్షమంటే సమస్తాన్నీ సాక్షీభూతంగా చూస్తూ ఉండటము.
శరీరం బంధమని, లోపలి ఉన్న ఆత్మనే సర్వమని చెప్పాడు. పరమాత్మ సర్వత్రా నిండి యున్నాడు. ప్రపంచము ఉన్నది పరమాత్మలోనే యన్నది సత్యం. దేహం మీద పాశాన్ని జ్ఞానమన్న ఖడ్గంతో ఖండించు. నీవు స్వయం ప్రకాశకునివి. నీలో విశ్వం నిండి ఉంది. నీవు చైతన్యానివి యన్న ఎరుకతో చూడ…“ అంటూ బోధచేశాడు అష్టావక్రుడు.
ఆయన చెబుతున్నది విన్న జనకునికి సత్యం అర్థమయింది.
జనకుడు ఇలా చెబుతున్నాడు-
“అహో! నిరంజనశ్శాంతః బోధోహం ప్రకృతేః పరః
ఏతావంతమహం కాలం మోహేనైవ విడంబితః॥”
నిష్కళంకం నిత్యశుద్ధం అయిన ఆత్మను నేనే. నేను సర్వ ప్రకృతికి అతీతంగా ఉన్నాను. ఇంత కాలం అజ్ఞానంతో భ్రమతో జీవించాను.
గురువు వలన నాకు గొప్ప అనుభవం కలిగింది. ఇంత కాలము ఎంత అజ్ఞానంలో ఉన్నాను నేను.
క్రిమికీటకాలు పుడుతూ చస్తూ ఉంటాయి. కర్మలను అనుభవిస్తూ ఉంటాయి.
కాని పుణ్యకర్మలు చెయ్యగలగటం మానవులకు మాత్రమే సాధ్యం. ఎన్నో జన్మలు ఎత్తి, ఇప్పటికి ఈ జ్ఞానానికి వచ్చాను. ఇన్ని రోజులు శరీరము ఇంద్రియాలు నేనే అని భ్రమలో ఉన్నాను.ఆ భావనకు సిగ్గు పడుతున్నా. చిదానందమైన చైతన్యాని నేనే. ఇంత కాలము అజ్ఞానంలో ఉన్మాదిగా జీవించాను.
“యథా ప్రకాశయామ్యేకః దేహమేనం తథాజగత్।
అతో మమ జగత్సర్వమధవా నచ కించన॥”
శరీరాన్ని చైతన్యవంతం చేస్తూ జగత్తును చూస్తున్నాను. నాలో ఏమీలేదు. జగత్తంతా నేనే.
“సశరీర మహో! విశ్వం పరిత్యజ్య మయాంధునా।
కుతశ్చిత్కౌశలదేవ పరమాత్మా విలోక్యతే॥”
శరీరాన్ని, శరీరం చూసే దృశ్యాలను వదిలి పెట్టు. గురు కృప వలన పరమాత్మను చూడగలుగుతున్నాను. స్థాల సూక్ష్మ కారణ శరీరాలన్నీ నశించి కేవల పరబ్రహ్మాన్ని చూడగలుగుతున్నాడు జనకుడు.
గురూపదేశం వలన, శాస్త్ర అభ్యాసం వల్ల ఉత్కృష్టమైన, ఆనందమైన ఆత్మను అనుభవించగలుగుతున్నాడు. మిథ్య అయినది శరీర త్రయం( సూక్ష్మ స్థూల కారణ శరీరాలు)పరిశీలిస్తే కేవలం ఆత్మ మాత్రమే సత్యమని తెలుస్తుంది. గురువుయొక్క కృప వల్ల మాత్రమే ఇది తెలుస్తుంది.
పరబ్రహ్మను చూపించే గురువు లభ్యమయ్యాడని ఆనందం వ్యక్తపరుస్తున్నాడు జనకుడు.
“యథా న తో యతో భిన్నా స్తరంగాఃఫేనబుద్భుదాః
ఆత్మ తో నా తథా భిన్నం విశ్వమాత్మవినిర్గతం॥”
సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో భాగమే.
***
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥
స్వస్తి
(మిగిలినది రేపు)