బాలా త్రిపుర సుందరి

Day1

  1. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవీ:

మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ అవతారంగా సేవించాలి.
ఈశ్వరుడి భార్య అయిన గౌరిదేవే త్రిపురసుందరి.

మానవుల ‘మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం’ బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.
అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. విద్యను, జ్ఞానాన్ని ఇచ్చి రక్షించే బాల పరమ కరుణామయి. ఈ తల్లిని ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరిదేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరిదేవి, అయ్య వారు త్రిపురాంతకుడైన ఈశుడు.
ఆది దంపతులుతత్వము కుడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి. ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.

అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మ స్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపమన్న జ్ఞానం కలుగుతుంది. జ్ఞానముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుందీ తల్లి.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలోని లలితా సహస్రంలో కనిపిస్తుంది.
భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. (వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం).బండడిచే పంపబడుతారు. వారితో యుద్ధనికి ఉబలాట పడుతుంది బాల. హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది.
ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైనవారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట. ఆ విషయం మనకు లలితా నామమైన ‘భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా’ తో తెలుస్తుంది.

ఈ బాలాదేవి నే ఉపాసన చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. ఈ బాలాదేవి వయస్సు 9 సంవత్సరాలు. అందుకే బాలా మంత్రం లో కూడా 9 బీజాక్షరాలు ఉంటాయి.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది, హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.

శ్రీ బాలాత్రిపురసుందరీ గాయత్రీ శ్లోకం:- బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి
తన్నోబాలా ప్రచోదయాత్.

బాలా ధ్యానశ్లోకం

అరుణ కిరణ జాలై రంచితాశవకాశా
విధృత జపపటీకా పుస్తకభీతి హస్తా।
ఇతరకరవరాఢ్యా ఫుల్లకల్హార సంస్థా
నివసతు హృది బాల నిత్య కల్యాణ శీలా॥

పూజా ఫలితం:- అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాదాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.

ఈ రోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహం పొందితే సంవత్సరం చేసే పూజలన్నీ ఫలిస్తాయని నమ్ముతారు. ఈ రోజు ప్రసాదం అమ్మవారికి పులిహోర నివేదిస్తారు.

అమ్మవారిని ఈ స్తోత్రంతో పూజించవచ్చు

  1. కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
    నితంబజితభూధరాం సురనితంబినీసేవితాం
    నవాంబురుహలోచనాం అభిననాంబుదశ్యామాలాం
    త్రిలోకజనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే
  2. కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
    మహార్షమణిహారిణీం ముఖసముల్లసద్వారిణీం
    దయావిభవకారిణీం విశదలోచనీంచారిణీ
    త్రిలోకజనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయ
  3. కదంబవనశాలయా కుఛబరోల్లసన్మాలయా
    కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
    మదారుణకపోలయా మధురగీతవాచాలయా
    కయాపిఘనలీలయా కవచితావయంలీలయా
  4. కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
    షడంబురుహవాసినీం సతతసిద్దసౌదామినీం
    విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
    త్రిలోకజనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయ
  5. కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
    కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
    మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
    మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే
  6. స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
    గ్రుహీతమధుపాత్రికాం మధువిఘూర్ణనేత్రాంచలం
    ఘనస్థనభారోనతాం గలితచూలికాంశ్యామలాం
    త్రిలోకజనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే
  7. సకుంకుమవిలేపనాంఅళి కచుంబికస్తూరికాం
    సమందహసితేక్షణాం సషరచాపపాశాంకుశాం
    అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
    జపాకుసుమభాసురాం జపవిధౌస్మరామ్మ్యాంబికాం
  8. పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
    పితామహపతివ్రతాం పటుపటీరచర్చారతాం
    ముకుందరమణీం మణిలసద్లంక్రియాకారిణీం
    భజామిభువానాంబికాం సురవధూటికాచేటికాం
    ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచిత త్రిపుర సుందరీ స్తోత్రం సంపూర్ణం!!
    నవదుర్గలలో మొదటిరోజు శైలపుత్రి.
    సామూహిక శక్తి సూచించే “శైలపుత్రి”గా అమ్మవారు దర్శనమిస్తారు. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె. ప్రకృతి, స్వచ్ఛతకు ప్రతీక.
    ఈమె పూర్వము సతిగా జన్మించి యోగాగ్నిలో దగ్ధమై తిరిగి హిమవంతుని ఇంట
    పుడుతుంది. అందు వల్ల శైలపుత్రీ అన్న నామము స్వీకరించినది. వృషభవాహనము కల ఈ తల్లి త్రిశూలము కమలము ధరించి వుంటుంది. తలపై. చంద్రవంక వుండి భక్తులను బ్రోచే తల్లిగా పూజింపడుతున్నది.
    ఉపవాసము ఈ నవరాత్రులలో ముఖ్యమైన విషయము. ఈ ఉపవాసము కూడా మూడు రకములు. పగలు ఉపవాసముండి రాత్రి తినటము. పగలు తిని రాత్రి తినకపోవటము. పదిరోజులూ పండ్లు తిని వుండటము.
    నవరాత్రులు చేసే వారికి గ్రహబాధలుండవు.
    “వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం।
    వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం॥”

సర్వం శ్రీమాత పాదార్పణం
సంధ్యా యల్లాప్రగడ —

Leave a comment