సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భగీరథీ ప్రక్కన కార్తీకమాసము గడుపుకునే అవకాశం జగదంబ ప్రసాదించింది.
మూడు వారాల కాలం ఆ తల్లిని సేవించుకున్నా రెండు వారాలు మాత్రం గొప్ప పరీక్షా కాలమే.
మొదటి వారం కేవలం టీ త్రాగి బ్రతికాను. రెండన వారం శివానంద ఆశ్రమానికి వెళ్ళాను.
కేరళ సన్యాసిని ఆ మఠానికి సర్వద్యక్షతగా ఉండేది. ఆమె చాలా అహంకారి కూడా. సన్యాసిని అని, ఆశ్రమం చూస్తున్నదని గౌరవంగా ఉంటే అత్తగారి కన్నా ఎక్కువ ఆరళ్ళు పెట్టింది.
ఆశ్రమ గేటు నది వైపుకు ఒకటి ఉండేది. ఈమెకు తిక్కరేగిన రోజు తాళం వేసి తీసేది కాదు. మేము ఉన్నది గంగమ్మ కోసం. “వెళ్ళాల్సిందే” అంటే బయట నుంచి వెళ్ళమనేది. బయట గేటు నుంచి రోడ్డు ఎక్కి అరమైలు దూరంలో రేవులో దిగాలి.
గంగ మీద భక్తితో అలాగే చేసేదాన్ని.
గంగలో మునిగి గదికొచ్చి బట్టలు మార్చుకుందామంటే “తడిబట్టలతో ఆశ్రమంలో అడుగుపెట్టవద్దు” అని హుకుం చేసింది.
బట్టలు తడి ఆరే వరకూ ఉండి లోపలికెళ్ళి మార్చుకునేదాన్ని.
ముందు నాలుగు రోజులు చాలా చికాకు కలిగింది. ఏదో గంగ ప్రక్కన జపం చేసుకోవచ్చని ఆశపడితే ఈ అత్తగారేంట్రా బాబు’ అని. మావారు ఇంటి కొచ్చెయ్యమన్నారు. ఒక రోజంతా ఆలోచించాను. ‘కాస్త తగ్గి ఉందాం. ఆ పిచ్చిది వాగితే వాగని. అంబికను ఈ పుణ్యభూమిలో సేవించుకోవాలి’ అని గట్టిగా సంకల్పించుకొని మరుసటి రోజు ఆమెతో మట్లాడాటానికి వెళ్ళా.
“నా మూలంగా మీకెందుకో కష్టమైయింది. నా తప్పు తెలియదు. క్షమించండి. నేను మరింత జాగ్రత్తగా ఉంటా…” అన్నాను.
“అలా దారికి రా…” అంది. కాని నా తప్పేంటో తెలీలేదు.
‘సరే సంధి చేసుకున్నాగా ఊరుకుంటుందిలే’ అనుకున్నా అది రెండో రోజుకు తప్పని తెలిసింది.
ఉదయం భజన జరుగుతోంది.
కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పినది చెబుతూ మహాదేవుని సన్నిధి అనుభవిస్తూ అలౌకిక స్థితిలో ఉంటే టక్కని భజన ఆపింది.
అందరం ఆశ్చర్యపోయాము. కళ్ళు తెరిస్తే నా వైపే ఊరుముతూ “పాటలు రావు. కనీసం కోరస్ గా నన్నా పాడలేవా? ఆ స్వరం ఏంటి? ఆ బాణీ ఏంటీ? ఛీ! మూడ్ పోయింది భజన చెప్పాలంటే నీ మూలంగా…” అని అరిచింది. అందరి ముందూ అరచినందుకు కష్టమనిపించలేదు కాని, సంగీతం పాటలు పాడటము నేర్చుకొని కీర్తనలను వీణమీద వాయించే ఒక ప్రాణిని ఏమీ రావని అరవటం ఎందుకో తెలీలేదు. కాని కళ్ళెంట నీరుకారింది. ‘అంబే ఇలా దీవిస్తున్నావా?’ అని అంబికకు నమస్కారం చేసుకున్నా ఆనాటి నుంచి నన్ను నేను మరచి భజన పాడలేదు. అదో పనిలా జరిగింది.
ఒకసారి తెల్ల కుర్తా వేసుకోలేదని అరచింది. మరోసారి స్తోత్రాలు నీకే వచ్చా అని అరుపు. ఒకటేంటి… ప్రతిదీ ఆవిడకు నచ్చేది కాదు. ఒక రోజు కార్తీక పౌర్ణమి మరునాడు చంద్రుని చూస్తూ జపం చేసుకుంటుంటే “రాత్రి బయటకు రాకూడదు…లోపలే ఉండు…” అన్నది.
ఇలా ఎంతగానో రెండు వారాలలో నా కర్మలను కడిగిందా తల్లి.
ఒక సోమవారం “శివాభిషేకం చేసుకుంటా పూజరిని పిలుచుకుంటా” అని రిక్వస్ట్ చేస్తే ఏ కళనుందో పూజారి గారి ఫోను నంబరిచ్చింది.
ఆ రోజు కాస్లులయ్యాక సాయంత్రం భగీరథి ఒడ్డున ఆ పూజారిగారి సహాయంతో రుద్రాభిషేకం చేసుకున్నాము. నేనూ, నా తరగతిలో మిగిలిన వారము.
ఈ చిత్రాలు ఆనాటివే.
ఈయన అక్కడి శివాలయపూజారి. “దక్షిణ వంద” చాలు అన్నాడు.
“అదేంటి? వందేంటి తీసుకో స్వామి!” అని రెండు వేలు చేతులో పెడితే ఆయన సంతోషపడ్డాడు. అక్కడ రుద్రాభిషేకం చేసుకోగలిగినందుకు నేను సంతోషపడ్డా.
వచ్చేటప్పుడు అక్కడి పనివారికీ కొంత తృణమిచ్చి, ఈమెకూ క్యాష్ ఇచ్చి నమస్కారం చేసి వచ్చేశా.
బయటకొచ్చాక నా సహధ్యాయులన్నారు “నీవంటే మాతాజీకి భయం సంధ్యా! నీకు చాలా తెలుసు. ఆమెకు నీకు తెలిసినంత కూడా తెలీదు. అందుకే నీ మీద ఎప్పుడూ ఆ అక్కస్సు చూపించింది…” అని. నేను నా అజ్ఞానం ఎప్పుడు ప్రదర్శించానో గుర్తులేదు. బహుశా మొదట్లో ఏవో ప్రశ్నలు సందేహాలు అడిగి ఉంటా. తరువాత అసలు ఆమె చెప్పేది వినేదాన్ని కాదు. నేనే చదువుకునేదాన్ని. పూజ్యగురువుల ప్రవచనాలు చాలు మన అహంకారమూడగొట్టటానికి. కాని భాగీరథీ ప్రక్కన ఉండే అవకాశం వస్తే ఎలా కాదనగలము? ఆ సన్యాసిని భాగం తీస్తేతే అదో దివ్యమైన సమయమే. మనస్సు నిండిపోతుంది ఆ ప్రదేశం, ఆ సాధన గుర్తుచేసుకుంటే.
ఈ కార్తీక సోమవారం ఈ విషయం గుర్తుకు వచ్చింది ఈ ఫోటోలు చూస్తే. లేకపోతే మర్చిపోయాను ఆమెనూ ఆవిడ పిచ్చిని పూర్తిగా అప్పుడే.
గుర్తు పెట్టుకోవలయినది జగదంబ దివ్య అనుగ్రహమే కదా.