కార్తీకం మాకెంతో ముఖ్యమైనది. తెలుగువారికీ అందునా శివారాధకులకు, దామోధర భక్తులకు కూడా అనుకోండి. కాని మా చిన్నతనంలో ఇన్ని వివరాలు తెలీవు కదా. అయినా ఈ కార్తీకం వచ్చిందంటే హడావిడే. సోమవారాలు ఉపవాసాలు. అభిషేకాలు, శ్రీశైలం వెళ్ళటం, కృష్ణలో మునకలు, దీపాలు వెలిగించి కృష్ణలో వదలటం, గుడిలో వెలిగించే దీపాలు , నాన్నా అమ్మా శివకల్యాణములో కూర్చోవటాలు…ఒకటేమిటి… నెలంతా హడావిడే.
మా నాయనగారంత కాకపోయినా మేము కుదిరినంతలో దీపాలు వెలిగించటము, నదీస్నానాలు దీపదానాలు ఇత్యాదివి చేస్తూ వచ్చాము.
ఒక కార్తీకం వారణాశిలో గడిపితే, ఒక కార్తీకం భగీరథీ చెంత ఉత్తరకాశిలో… ఓక కార్తీకం వేద్రాద్రి వెడితే ఒకమారు శ్రీశైలం.. ఇలా చాలా ఏళ్ళుగా భారతావనిలో ఉంటుంనందున్న కార్తీకమాస వత్రం సాగింది.
ఈసారి అట్లాంటాలో ఉండిపోయాము. ఎటూలేదు. ఈశ్వరార్చన చేస్తూ ఇదే కైలాసమనుకుంటూ గడుపుతున్నాము. కాని మనస్సులో బుగులుంది కదా. అది ఆ పరమశివునికి తెలీదా?
మా ఉర్లో కొందరు పూజ్యులు ఈ నెలంతా రుద్రం చదువుతారు. వారిని కోరితే వారు రెండవ సోమవారం వచ్చి మహన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం చేయించారు.
పది మంది బ్రాహ్మలు రుద్రాంశతో వస్తే హృదయం నిండిపోయింది. అరటాకులో ఫలహారం వడ్డించి, మావారు అవుపోశన వేసుకున్నారు. వారు తృప్తిగా ఫలహారం స్వీకరించాక వారికి ఫలము తాంబూలాలు ఇచ్చుకున్నాము.
మేమిద్దరం చాలా తృప్తి అనుభవించాము.
ఈశ్వరుడే మమ్ములను ఇలా అనుగ్రహించి నా కార్తీకమాస నోమును నడిపించాడు. ప్రతియేడు హైద్రాబాదులో మా తమ్ముళ్ళకు కార్తీకమాస భోజనాలకు పిలిచేదాన్ని.
ఈసారి ఆ లోటు లేకుండా వీరికి ఇచ్చుకున్నాము.
నమ్మిన దేవుడు చేయి వదలడు. సర్వం నీవన్న ఈ భావనే అన్నీ సమకూర్చగలదు.
జగదంబ అనుగ్రహం, అయ్యను పూజించుకున్నాము.