సౌందర్యలహరి 5 శ్లోకం

సౌందర్యలహరి -5 శ్లోకము


హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।
స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥

అర్థం:

అమ్మా! నిన్ను నమస్కరించి పూజించిన వారికి నీవు సౌభాగ్యప్రదురాలివి. 

నిన్ను కొలచి విష్ణువు స్త్రీ రూపము పొంది జగత్తును మోహములో ముంచాడు. 

కాముని చంపిన శివుడిని సైతం మోహింపచేశాడు. నీ కృప వలన భస్మమైపోయిన, మన్మథుడు తిరిగి ప్రాణాలు పొంది రతీ దేవికి మాత్రమే కనపడే వరము పొంది ఋషులను మోహింపచేస్తున్నాడు. 

తేగీ॥

మాత నీ జపము సలిపి మాధవుడయె
మోహినిగ, నీ అనుగ్రహమున అతనుడు 
బ్రతికె, నిత్య సువాసినై రతియు వరలె
కొలిచెదను సంధ్యను శరణు కోరి మదిన।। 
అతనుడు(మన్నథుడు)

వివరణ:

ఈ శ్లోకములో ఈశ్వరి అనుగ్రహం ఉంటే ఏ పనైనా తేలికగా జరుగుతుందన్న తెలుస్తోంది. 

మానసోల్లాసము అన్న గ్రంథంలో అమ్మవారి ఉపాసకుల గురించి-

“విష్ణుఃశివః సురజ్యేష్ఠో మనుశ్చంద్రో ధనాధిపః

లోపాముద్రా తథాగస్త్యః స్కందః కుసుమసాయకః

సురాధీశో రోహిణీయో దత్తాత్రేయో మహామునిః

దుర్వాసా ఇతి విఖ్యాతా ఏతే ముఖ్య ఉపాసకాః॥” అని చెప్పబడింది. 

విష్ణువు, శివుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుభేరుడు, లోపాముద్రా, అగస్యుడు, కుమారస్వామి, మన్మథుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు వీరందరూ ప్రఖ్యాత శ్రీవిద్యా ఉపాసకులు. 

వీరికి ఒక్కక్కరు ఒక్కో మంత్రరాజ్యంలో అమ్మవారిని ఆరాధించి సేవించారు. 

వారిలో మన్మథుడు ఆరాధించిన విద్య కాది విద్య. అది మనకు చాలా ప్రసిద్ధి. 

విష్ణువు ఆరాధించినది విష్ణువిద్య. ఆయన అమ్మవారి అనుగ్రహం పొంది, అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి రూపును పొందాడు. (మంత్రాది దేవతగా ఉపాసకుడు మారటమే సిద్ధి)ఆయన ఆ అమ్మవారి రూపు ధరించిన జగత్తును మోహింపచేశాడు. 

పూర్వం దేవతలు, దానవులు అమృతం కావాలని పాల సముద్రంలో 

మందరగిరిని కవ్వంగా నిలిపి, ఆదిశేషువును త్రాడుగా మలచి మధించారు. ఆనాడు

జన్మించిన అమృతము దేవదానవులకు పంచటానికి విష్ణుమూర్తి అమ్మవారిని ధ్యానించి జగన్మోహినిగా మారి వచ్చి

అమృతము పంచాడు. శివుడు ఆ రూపు చూపమంటే విష్ణువు నవ్వి తప్పించుకున్నాడు. 

ఒకనాడు శివునికి కైలాస పర్వత సానువులలో అందమైన యువతిని చూసి మోహించాడు. ఆ యువతి విష్ణువుగా మారటం చూసి ఆశ్చర్యపడ్డాడు. మన్మథుని కాల్చిన విరాగికి సైతం మోహం కలగచెయ్యగలిగాడంటే అది అమ్మవారిని ధ్యానించి అమ్మవారిలా మారబట్టే విష్ణువు అలా శివుడ్ని మోహింపచెయ్యగలిగాడు. 

శివుడు విరాగిగా తపస్సులో ఉంటే అమ్మవారి హిమగిరిసుతగా వచ్చి సేవలు చేస్తోంది. శివుడు తపస్సు చెదరలేదు. దానికి తరుణోపాయంగా మన్మథుడు బాణం వేసాడు. కానీ, శివుని మూడవకంటి నిప్పుకు కాలిపోయాడు. రతీదేవి అమ్మవారిని ధ్యానిస్తూ దుఃఖపడింది. శరీరం లేకుండా జీవించమని అమ్మవారు కామునికి వరమిచ్చింది. రతీదేవికి మాత్రమే మన్మథుడు కనపడతాడు. అలా మన్మథుడు కనపడక వేసే బాణాలకు ఋషులు సైతం తల్లడిల్లుతున్నారంటే అది కాముడు అమ్మవారి గురించి చేసిన తపస్సు. శ్రీవిద్యా సంపన్నులు కావటం చేతనే విష్ణువు కానీ, మన్మథుడు కాని ఈ ఘనకార్యాలు చెయ్యగలిగారని జగద్గురువులు ఈ శ్లోకము ద్వారా చెబుతున్నారు. 

మంత్రమర్మం

అమ్మవారి బీజక్షరమైన “ఈం” ను జపించిన “హరి” అమ్మవారైపోయాడని, అది “హ్రీం” అని సమన్వయ పరుచుకోవాలి. 

ఈ శ్లోకం పారణ చేస్తే ప్రజలలో పనులు త్వరగా జరుగుతాయని, వశీకరణ శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతారు. 

 ఈ శ్లోకము చదివిన తరువాత మరింత శ్రద్ధగా  జగదంబ పాదాలను ధ్యానించాలి. 

సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ

 సంధ్యా యల్లాప్రగడ

Leave a comment