సౌందర్యలహరి 9 శ్లోకము

శ్రీమాత్రే నమః

సౌందర్యలహరి 9 శ్లోకము

“మహీం మూలాధార్ కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశ ముపరి
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్త్వాకులపథం
సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే॥”

అమ్మా! భగవతీ! నీవు మూలాధారంలో ఉన్న భూతత్త్వాని, అనాహతచక్రంలో వాయుతత్త్వాని, విశుద్ధచక్రంలో ఆకాశతత్త్వాని, ఆజ్ఞాచక్రంలో మనస్తత్త్వాని, సుషుమ్నా మార్గం ద్వారా ఛేదించి సహస్రారంలో ఉన్న నీ భర్త సదాశివుని చేరి విహరిస్తున్నావు.

తేగీ॥

మాత నీవు మూలాధార మందునున్న

కుండలినివి ముడులు విడగొట్టి వడిగ।

పరుగిడి కలుతు పతియగు పరమశివుని

కొలచెదను సంధ్యను శరణుకోరి మదిన॥

జనని నీ స్పర్శపొందిన చ క్రములారు

వెలుగుతీగగ పద్మము విరయులోన।

జీవుడగును శ్రీచక్రముగ  జిలుగులిడగ

కొలచెదను సంధ్యను శరణుకోరి మదిన॥

వివరణ:

ముందు రెండు శ్లోకాలలో అమ్మవారి రూపు, చిరునామా చెప్పిన తరువాత జగద్గురువులు ఈ శ్లోకములో శ్రీవిద్యా విశేషములను అమ్మ వారి సూక్ష్మతర రూపమైన కుండలిని శక్తినీ, గమనాన్ని మనకు చెబుతున్నారు. భగవతి

యోగసాధనా క్రమములో ఏ విధముగా చలించి, సాధకులను తరింపచేస్తుందో సంక్షిప్తంగా బీజప్రాయంగా ఈ శ్లోకము చెబుతుంది. ఈ శ్లోకం దివ్యమైనది. సౌందర్యలహరిలో మిగిలిన శ్లోకాలన్నీ ఒక ఎత్తు, ఈ శ్లోకమొక్కటి ఒక ఎత్తుగా చెబుతారు. ఇందు కుండలినీ శక్తిగా భగవతి గమనము, చక్రాల గురించి, వాటి తత్త్వాల గురించి చెప్పబడింది. సర్వయోగరహస్యము ఈ శ్లోకములో నిబిడీకృతమైనాయి. 

వెన్నెముక జీవులలో రెండు రకాలుంటారు. 

అడ్డంగా వెన్నెముక ఉన్న జీవులను తిర్యక్ జీవులంటారు. నిట్టనిలువు వెన్నెముక గల జీవి మానవుడు. నిలువు వెన్నెముక ఉన్న జీవి సాధనతో కుండలినీ శక్తిని జాగృతి చేసి మొక్షం పొందగలరు. మిగిలిన ఏ జీవికీ ఈ కుండలినీ జాగృతి చేసుకునే శక్తిలేదు. కాబట్టి మానవజన్మ అంత విశేషమైనది. 

నాడులు 72వేలు. నాడులు నరాలు కావు. ఈ నాడులలో మూడు నాడులు ముఖ్యమైనవి. 

ఇడా,పింగళ, సుషుమ్నానాడులు.  

“దక్షిణే పింగళానాడీ, ఇడా చ వామ నిశ్వాసా” అన్నారు. కుడివైపు పింగళా, వెడమవైపు ఇడా. నడిమి సుష్మున్నానాడి. 

ఇడా నాడి చంద్రనాడి. పింగళ సూర్యనాడి. సూర్య చంద్రులు ఉచ్ఛ్వాసనిశ్వాసలలో తిరుగుతుంటారు. సూర్యచంద్రులు ఇలా తిరుగుతూ చంద్రుడు అమృతాన్ని ప్రసరిస్తాడు. సూర్యుడు హరిస్తాడు. 

వీళ్ళు ఇద్దరూ ఆధారచక్రం అంటే మూలాధారములో కలుస్తారు. సూర్యచంద్రులు మూలాధారంలో కలిసినప్పుడు అది అమవాస్య. వీరిరువురూ తిరిగి ఊర్థ్వంగా ప్రయాణించి ఆజ్ఞా చక్రంలో

కలుస్తారు. అది వారణాసీ అంటారు. ఇది పవిత్రమైనది. అందుకే ధ్యానము చేసేటప్పుడు ఆజ్ఞా మీద దృష్టి నిలుపమని చెబుతారు గురువులు. 

చంద్రకిరణాల అమృతం త్రాగి కుండలినీ నిద్రలో ఉంటుంది. సాధకుడు ప్రాణాయామం ద్వారా శ్వాసను బంధించి నెమ్మదిగా వదులుతూ ఉండటములో ఈ అమృతప్రసారం ఆగుతుంది. అలా ఆగినప్పుడు  కుండలినీ జాగృతి చెందుతుంది. యోగం ద్వారా కుండలినీశక్తిని సాధకుడు నిద్రలేపుతాడు. 

ఈ కుండలినీ శక్తి నిద్రలో ఉన్నంత కాలము మానవుడు శరీరం శాశ్వతమనీ, కుటుంబం, ధనము నిజమన్న మాయలో కప్పడి ఉంటాడు. కుండలిని నిద్రలేచి ఊర్థ్వ దిశ ప్రయాణం మొదలైన వెంటనే ఈ మాయ తొలగిపోతుంది. 

మానవశరీరములో షట్‌ చక్రాలున్నాయి. ఇవి సూక్ష్మమైనవి. ఏ విధములైన స్కాన్స్ కు కనపడవు. 

అవి 

“మూలాధారం గుదస్థానం। స్వాధిష్ఠానం తు మేహనం

నాభిస్తు మణిపూరాఖ్యం। హృదయం చాబ్జు మనాహతం॥

తాలూమూలం విశుద్ధాఖ్యం। ఆజ్ఞాంచ నిటలాంబుజం॥

తస్మాదూర్ధ్వమధోముఖం। వికసితం పద్మం సహస్రచ్ఛదం

నిత్యానందమయీ సదాశివపురీ। శక్తే నమశ్శాశ్వతం॥”

మూలాధారము- ఆధారచక్రము- భూతాత్మకమైనది. ఫృథ్వీతత్త్వం. దీనికి గణపతి అధిష్ఠానము. మానవులకు స్థిరత్వం నిచ్చే ఈ చక్రము సాధకులను నిలబెడుతుంది స్థిరంగా సాధనలో. 

(ప్రతి చక్రానికీ రేకులు, అందు గల బీజాక్షరము ఇక్కడ ఇవ్వటంలేదు.)

స్వాధిష్ఠానము- అగ్ని తత్త్వం-  శరీరంలోని శీతోష్ణాగ్నులను నియంత్రణ చేస్తుంది. 

మణిపూరం- నాభీచక్రం- జల తత్త్వం

అనాహతం- హృదయచక్రం- వాయుతత్త్వం- 

విశుద్ధి చక్రం – ఆకాశతత్త్వం 

ఆజ్ఞా చక్రం- మనస్తత్త్వాత్మకం. 

ఆపైన సహస్రారం ఉంటుంది. 

కుండలినీ షట్‌చక్ర భేదనము చేస్తూ మూడు ముడులైన బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులను భేదిస్తూ సాగుతుంది. 

గౌదపాదులవారు తమ సుభగోదయస్తుతిలో 

“కుమారీయన్మంద్రం ధ్వనతిచ తతో యోషిదపరా

కులం త్వక్త్వా రౌతి స్ఫుటతిచ మహాకాలభుజగీ

తతః పాతివ్రత్యం భజతి దహరాకాశకమలే

సుఖాసీనా యోషా భవసి భవ సీత్కార రసికా॥” అని చెబుతారు. 

ఇందులో కుండలినీ ప్రయాణము, అందులో ఉన్న మూడు స్థితులు చెప్పారు. 

శంకరభగవద్పాదులవారు మన ఈ సౌందర్యలహరి శ్లోకములో 

సాధకుడికి సాధనలో జరిగే మార్పుల గురించి వివరించారు. 

ప్రాణాయామ సమన్వయం ద్వారా రాజయోగాది క్రియల వలన కుండలిని మేల్కొని ధర్మామీటరులో పాదరసంలా, విద్యులతలా సర్రున పైకి ప్రాకుతుందిట. అలా ఆరోణము చేస్తుంది. లలితా సహస్రం దీనినే “బిసతంతుతనీయసీ” అని చెప్పింది. ఈ మహాశక్తి, మహా ఆసక్తిగా  సహస్రారంలో ఒంటిగ ఉన్న పరమశివుని చేరి సుఖిస్తుంది.

ఆ గదిలో అంటే సహస్రారంలో శివుడు గదిలో నిండియున్నాడు. అమ్మవారి వెళ్ళి కలిసింది. ఆయన పూర్తిగా నిండి ఉంటే ఈమె వెళ్ళి ఎలా కలిసిందట అంటే చీకటి ఉన్న గదిలో వెలుతురు ప్రవేశించింది. ఇక చీకటి ఉందడు కదా. వెలుతురు నిండి పోతుంది. అలా అమ్మవారు వెళ్ళి కలిశాక ఇక ఇద్దరు లేకు, ఉన్నది ఒక్కటే తత్త్వం. 

 ఇది జీవబ్రహ్మల ఐఖ్యము. శివశక్తుల సమాగమనం. సాధకుల సాధన గమ్యస్థితి. 

సాధకునికి సర్వతోముఖతేజస్సు కలుగుతుంది. వాక్సుద్ధి కలుగుతుంది. భూతభవిష్యవర్తమానాలు తెలుస్తాయి. సంకల్పసిద్ధి కలుగుతుంది. బ్రహ్మమే ఈ జీవుడవుతాడు. 

కాళిదాసు తన లఘుస్తవంలో కుండలినీ శక్తిని పరదేవతగా, భగనతీ, శక్తి, శాంభవి, హ్రీంకారి, త్రిపుర, చిద్రూప, త్రినయన అని చెబుతాడు. 

ఇట్టి మహాశక్తిని మనలో ఆవిష్కరింపచేయు సంకల్పించి మనకు ఈ శ్లోకం ప్రసాదించిన జగద్గురువులక సహస్రనమస్కారాలు చేసుకోవాలి. ఈ శ్లోకము నిత్యమూ పారాయణము చేసుకోవలసిన శ్లోకము. ధ్యానించవలసిన శ్లోకాలలో ఒకటి. 

ఈ దివ్యజ్ఞానము ప్రసాదించి గురువులకు వందనములు సమర్పిస్తూ-

సర్వం శ్రీమాత పాదార్పణమస్తు

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment