సౌందర్యలహరి శ్లోకం10

శ్రీ మాత్రే నమః

సౌందర్యలహరి- శ్లోకము 10

సుధాధారై సారైఃచరణయుగళాంతర్విగళితైః

ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః

అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయమ్

స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి॥

అర్థము:

అమ్మా భగవతీ!

నీ పాదాల నుంచే జాలువారు అమృతంతో శరీరములోని 72వేల నాడులూ తడుపుతున్నావు. అమృతకాంతులు గల చంద్రుని వీడి, నీ స్వస్థలమైన ఆధారచక్రమైన మూలాధారాన్ని చేరి సర్పాకృతిలో తామరతూడలో ఉండే సన్నని రంధ్రలా ఉంటే సుషుమ్నా మార్గం కొనక్రింద కుండలినీ శక్తిగా నిద్రిస్తున్నావు. 

తేగీ

పాదముల జారు పీయూషపాతమందు

సర్వ నాడుల్ తడిసి ప్రకాశమయి వెలుగు।

కుండలినిగ మూలాధార కుహర మెరగు

కొలిచెదను సంధ్యను శరణు గోరి మదిన॥

వివరణ:

మునుపు శ్లోకములో కుండలిని లేచి సహస్రారం చేరే పద్ధతి చెప్పిన జగద్గురువులు ఇందు కుండలిని తన స్వస్థానం చేరటం గురించి చెబుతున్నారు. 

సహస్రారం చంద్రమండల స్థానము. శ్రీవిద్యలో కూడా ఈ విషయమై ఎంతో విపులంగా చెబుతారు. శరీరం అగ్నిసూర్యషోమాత్మకం. అంటే అగ్నితత్త్వం, సూర్యతత్త్వం, చంద్రతత్త్వం. ఆజ్ఞా నుంచి అంటే భృకుటి నుంచి పైకి చంద్రలోకము. అందుకే శివునకి చంద్రుడు శిరస్సున కనపడటంలో భావార్థమిదే. 

ఈ శ్లోకం లో చెప్పిన విషయానికొస్తే అమ్మవారు సహస్రారం చేరినప్పుడు అమ్మవారి పాదాల నుంచి అమృతం స్రవించి ఆ అమృతంలో సమస్త నాడీ మండలం తడుస్తుంది. 

సాధకులు ప్రాణాయామంలో రేచక కుంభకములతో సాధన చేస్తాడు. ఆ సమయంలో పద్మాసనంలో ఉండి ఖేచరీ ముద్రలో ఉంటారు. ఖేచరి ముద్రలో ఉండగా సహస్రారం చేరిన కుండలి సుధావృష్టి కురిపిస్తుంది. అది సాధకులు గొంతు తడుపుతుంది. దీని మూలంగా వారి ఆయుష్యు పెరుగుతుంది. ఆనందం అనుభవమవుతుంది. ఆ రుచిలో మునిగియుంటాడిక సాధకుడు. 

కుండలినీ తిరిగి తన స్వస్థలానికి చేరి ముడుచుకుంటుంది. 

మూడున్న చుట్లుకు కారణం మానవ జన్మకు పూర్వపు జన్మల సంస్కారాలవి. మునుపు ఖనిజ కక్ష్య, వృక్ష్య కక్ష్య, జంతు కక్ష్య దాటి మానవు జన్మ తీసుకుంటాడు జీవుడు. అర చుట్టూ సాధన ద్వారా సాధించి జీవితం పరిపూర్ణం చేసుకోవటం మానవుల కర్తవ్యం. 

మానవ జన్మ కర్తవ్యం మనకు శంకరులు ఈ శ్లోకము ద్వారా గుర్తు చేస్తున్నారు. 

ఈ దివ్యజ్ఞానము మనకు పంచిన జగద్గురువులకు మనమేమిచ్చి ఋణం తీర్చుకోగలము ఒక్క నమస్కారము తప్ప. 

సర్వం శ్రీమాత పాదాలకు సమర్పిస్తూ

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment