శ్రీమాత్రే నమః
సౌందర్యలహరి – 13 శ్లోకం
“నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసుజడం
తవాపోజ్గాలోకే పతిత మనుధావన్తి శతశః
గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హఠాత్త్రుట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః॥”
అర్థం అమ్మా! జగజ్జనని!
ముదుసలి, ఎగుడుదిగుడు కన్నులు ఉన్నవాడు, మూఢుడైనా, నీ కొనగంటి చూపు పడ్డవెంటనే వాని వెండ అప్సరసలు, అందమైన స్త్రీలు తన శరీరాల మీద స్పృహ కోల్పోయినట్లుగా, వంటి మీద వస్త్రాలు జారుతున్నా వాని వెంట పడతారు. నీ అనుగ్రహం ఎంతటివానినైనా భాగ్యవంతుడిని చేస్తుంది.
తేగీ.
జడుడు ముసలి వికారియు, చలన శూన్యు
డతని కోరి వెంటపడు యువతులు, కొలవ।
ముక్తి కాంతను మదిన, విముక్తి చేయు
కొలచెదను సంధ్యను శరణగోరి మదిన॥
వివరణ:
ఈ శ్లోకం అర్థం చూడగానే కొంత విచిత్రంగా కనపడుతుంది. ముదుసలి వాడు, కురూపి, జడుడు అయినవాని వెంట యవ్వనులు, సుందరమైన స్త్రీలు పడతారట.. వారి కురుల ముడులు విడిపోతున్నా, వస్త్రాలు ముడులు జారిపోతున్నా వారు ఇవ్వన్నీ పట్టక వాని వెంట పడతారట. ఇది చూడగానే ఏమిటీ శ్లోకమని అనిపిస్తుంది. కానీ మనమొకటి గుర్తుంచుకోవాలి, ఇది మనకు జగద్గురువులు శంకరాచార్యులవారిచ్చిన శ్లోకం. తొమ్మిడేళ్ళకు సన్యసించిన మహాగురువులు ఏడేళ్ళ వయస్సులో కనకధారనిచ్చిన మహానుభావులు శృంగారాత్మకమైన విషయాలు చెబుతారా? అలా అనిపించి అసలు విషయం అర్హులకు అందాలని అంతర్లీనంగా చెప్పారా చూడాలి.
భాగవతములో గోపికల స్థితి ఏమిటి? కృష్ణ వేణుగానానికి వారు ఏ స్థితిలో వెళ్ళారో మనం గుర్తుతెచ్చుకోవచ్చు. అంటే పరమేశ్వరి మీద లేదా ఈశ్వరుడి మీద దృష్టి ఉంచిన భక్తులకు బహిర్ స్ఫృహ ఉండదు. భక్తిలో తద్యాత్మకతలో ఉంటారు.
అలాగే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైన వారు సాధించలేని లేదు. మనకు తెలియిన చరిత్రలో మూక కవి, పుట్టి మూగవానిగా ఉండి అమ్మ అనుగ్రహంతో మూకపంచదశిని అందించాడు.
మరి కూరూపి రూపవంతులు కాలేదా ఏమీ?!
సరే, కూపవంతులైన యవ్వనవంతులైన స్త్రీలు వాని వెంట పడుతున్నారన్నారు కానీ, అతనికి మనస్సులో ఎవరో వెంట పడాలని లేదు.
సన్యసించి వారికి ఎవ్వరి మీద ఎటు వంటి కాంక్షా ఉండదు. వారికీ కేవలం పరమేశ్వరి మీద మాత్రమే దృష్టి ఉంటుంది. అటు వంటి యోగుల వెంట ముక్తికాంత పడుతుంది.
అంతర్గత మాలిన్యముంటే అది ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతుంది.
హృదయం నిర్మలత్వ, స్వచ్ఛతలకూ నిలయం. మాములు మానవులకు హృదయం అహంకార మమకారాలతో కప్పబడి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ అహంకార మమకారాలు తొలిగి ప్రేమామృత కలశం కనపడుతుంది.
అమ్మవారి అనుగ్రహం కలిగినవెంటనే, మోక్షానంద రహస్యం తెలియని జడుడు కూడా ముక్తి కాంత వెంటపడుతుంది. ఇలా కర్మ క్షయమైన భక్తుడు మోక్షం పొందుతాడు.