మేము వచ్చిన కొత్తలో ఇంటిని ఫర్నిష్ చేసుకోవటము మొదలు పెట్టాక మొట్టమొదటి సారి ఒక వింతయిన అనుభవం కలిగింది. నన్ను శ్రీవారు షాప్ దగ్గరకు వచ్చేయమని చెప్పి ఆఫీస్ కు వెళ్ళిపోయారు. షాప్ కు నేను డైరెక్ట్ గా వెళ్ళాను. షాప్ కి వెళ్ళాక నచ్చిన ఫర్నిచర్ చూసి ఇంటికి కావలసిన అలమారా, బీరువాలు, బల్లలు బుక్ చేశాము. డెలివరీ కి కూడా పే చేసాము. ఇంటికి వచ్చేస్తాయి ఇంక సర్దుకోవటానికి ఎక్కడ ఏమి పెట్టుకోవాలి అని ఓ…. ఉహాగానాలు చేస్తూనే ఉన్నాను ఒక రోజంతా. మరురోజు పెద్ద పెద్ద బాక్స్ లు వచ్చేయి. విప్పితే అన్ని పార్టు పార్టుగా ఉన్నాయి. ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. ఏమిటి ఇది అని అడిగితే తను ఇలానే ఉంటాయి ఇక్కడ, ఫినిష్డు ఫర్నిచరు ఎవ్వరూ అమ్మరు, వెతికితే మళ్ళీ హాండీమన్ అని ఉంటారు అని వివరించారు. నాకు చాలా నిరాశగా అనిపించింది. ఇవ్వన్నీ ఎవరు బిగిస్తారు అని. తాను ఇలాంటివి చాల ఇష్టంగా చేస్తారు. సో కుదిరినప్పుడల్లా కొంత కొంతగా వారం రోజులకు ఇంటిని ఒక తీరు గా తీసుకొచ్చాము. అప్పుడు ఇండియా లో అయితే ఎంచక్కా షావు వాళ్ళే వచ్చి అన్ని సర్ది వెళ్తారు అని ఒక వందసార్లు అనుకున్నా ను. అప్పుడు మొదలైన మా సర్దుకోవటాలు ఇప్పటివరకు సాగుతూనే ఉన్నాయి.ఎప్పుడూ ఎదో ఒకటి బాగుందని, బాలేదని మార్చటం, తెచ్చుకోవటం, రిటర్న్ ఇవ్వటం సరిపోతుంది.
ఇక్కడ ఎక్కడ చూసినా అంతులేనన్ని చెట్లు, కావలసిన కలప. అన్ని చెక్కవే. ఆఖరున ఇల్లు కూడా చెక్కే.
ఇంటిని కట్టడము వగైరా మరోసారి మాట్లాడుకుందాములెండి.
ఇప్పుడు ఫర్నిచర్, అలమారాలు, బిగించుకోవటం, సర్దుకోవటం, హోమ్ డిపో గురించి మాత్రమే మాట్లాడుకుందాము. ఇక్కడికి మాకు నచ్చిన
షాపులలో హోమ్ డిపో ఒకటి.
అక్కడ సన్న మేకు నుంచి, పూర్తీ స్థాయి ఇంటికి కట్టే సామాను వరకు అన్ని ఒక కప్పు క్రిందనే దొరుకుతాయి. ఇంటికి వాడే కలప, చెక్కా, ఫ్లోరింగ్ కి వెరైటీస్, రూఫ్, తలుపులు, వంటింటి మోడల్స్, లైట్స్, ఫానులు, ఇలాంటి మెటీరియల్స్ నుంచి ఇంట్లో వాడే వస్తువులు, వాషింగ్ మెషిన్ నుంచి వాటిలో వాడుకునే సమస్తం, ఇంటికి కావలసిన వైరింగ్ కావలసిన సామాను , ఇంటికి వేసుకునే రంగులు ఇత్యాదివి, ఇంకా ఇంటి గార్డెన్ కోసం మన్ను, మొక్కలు, విత్తనాలు, ఇవ్వే కాక అవ్వన్నీ బిగించుకునేందుకు
మనకు అవగాహన లేకపోతే, ఆ షాప్ వారే మనకు వివరించి మనంతట మనం చేసుకునేలాగా మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ (do it your self-DIY ) చాలా అలవాటుగా చేసుకుంటారు అంతా. నాకు చాల వింతగా ఉండేది; కానీ కొంత ఇంటీరియర్ మీద ఇష్టంతో నేనూ నేర్చుకున్నాను. మంచి ఇంటీరియర్ డిజైన్స్ రకరకాలుగా ఇంటిని మార్చి అప్పటికి ఎన్ని రకాలుగా చెయ్యచో అన్ని రకాలుగా అలంకరణ చెయ్యటానికి మెటీరియలు అంతా ఒకటే చోట వుండటము, మనకు వాళ్ళే రకరకాలుగా ఐడియాలు ఇవ్వటమునూ.
ఈ షాపింగ్ ఎక్సపీరియన్సులలో ప్రపంచములోఅంతటికీ అమెరికా బాగా పేరున్న దేశం కదా! ఎలాంటిది కావాలన్నా మీకు దొరకదు అని లేదు. అసలు ముందు ఇక్కడ మార్కెట్ లోకి ప్రవేశపెట్టిన తర్వాతనే ఇంకో చోటకి వెళ్తుందేమో అనిపిస్తుంది. కొనాలనుకునే వారికి ఆముదం బాగా వదిలించే దేశం కూడా ఇదే.
సరే ఇంటిని అమర్చుకోవటానికి వస్తే ఇంటికి రంగు వేసుకోవటం దగ్గరనుంచి, సామాన్లు కొని కార్ లో వేసుకొని, తెచ్చుకొని, విప్పి, బిగించుకొని అమర్చుకునే దాకా- ఇక్కడివారు తమ పని తామే చేసుకుంటారు.
అసలు ఇల్లు కట్టిన తరువాత, గోడలలో మనకు ఉన్నట్లు అలమరాలు ఉండవు. వాటిని వాళ్ళు తర్వాత బిగించుకోవాలి. నేను అలా చాలా ఇబ్బంది పడ్డాను ముందు. అలమారాలు లేవు, వాకింగ్ క్లోసెట్ అని పడకగది కి అనుబంధంగా ఉన్న చిన్న మరో గదిలో రెండు ఇనప అటకలాంటిది ఒకటి, అసలు ఎలా సర్దుకోవాలో తెలియియలేదంటి నమ్మండి. అప్పటికి హాంగర్లు తెచ్చుకొని కానిచ్చినా, అలాకాదని ఇంకోలా అమర్చుకోవాలి అని, ఇక్కడి హోమ్ అండ్ గార్డెన్ ఛానెల్ లో చూసి తెలుసుకున్నాను. అప్పట్నుంచి మా శ్రీవారికి ఒక సుత్తి, మేకుల డబ్బా నాకు చీపురు చేటా చేతులో, దేవుళ్ళకు ఆయుధాలు వున్నట్లుగా స్థిరపడిపోయాయి. నిజానికి ఇక్కడికి వచ్చాకా నాకు మన పని మనం చేసుకోవటంలో ఉన్న ఆనందం అనుభవమైంది. అంతవరకు నేను ఎప్పుడు ఎవరో ఒకరిమీద ఆధారపడి పరాన్నజీవిలా ఉండిపోయాను. ఇక్కడ ఈ అన్ని పనులు మనం చేసుకోవాలి, సహాయం తెచుకోవాలంటే చాలా కష్టం అని తెలుసుకున్న తర్వాత మనం బలవంతంగా మన బద్దకం వదిలించుకొని, కొంత సెల్ఫ్ సఫిషియన్ట్ గా మారుతాము. ఓం ప్రథమములో చాలా కష్టంగా అనిపించి మాటి మాటికీ ఇండియా కి వెళ్లిపోవాలనిపించేది. తర్వాత ఈ పద్ధతికి అలవాటు పడిపోయాననుకోండి. దీనితో బద్ధకం వదలటమే కాదు, ఇండియా వెళ్లినప్పుడల్లా, అసలు పనిచేసేవారిని మెచ్చుకునే సంస్కారము చాలా అలవడుతుంది. ఇప్పుడు ఇండియా వెళితే నేను అసలు ఎవ్వరి హెల్ప్ తీసుకోను. నా వరకు నా పనులన్నీ చేసుకుంటాను. మనం ఎప్పుడైతే ఒకరి మీద ఆధారపడమో అప్పుడు సగం స్ట్రెస్/ వత్తిడి తగ్గిపోతుంది.
ఇండియా లో జనాభా ఎక్కువ కాబట్టి ఒకరికి హెల్ప్ అవుతుందని వారికి పని కల్పించినట్లవుతుందని కానీ, లేకపోతే అసలు ఒక హెల్పర్ అవసరమే ఉండదు మాకు.
చెప్పాలంటే – ఇక్కడికి వచ్చాక ఎవ్వరైనా, తమ పని తాము చేసుకునే అలవాటు చేసుకుంటారు. విద్యార్థులుగా వచ్చిన వారు దగ్గర్నుంచి వివిధ వీసా లలో వచ్చిన వారు, సెలబ్రేటీలతో సహా అందరు ఇలాంటి సిస్టం కి అలవాటూ పడిపోతారు.
క్రిందటి ఏడు హైద్రాబాదులో ఫ్లాటులో కొంత రిపేరు వస్తే ఆ పనికి కార్పెంటర్ మూడుచెరువుల నీరు త్రాగించాడు మమ్మల్ని. అప్పుడు అనిపించింది ఇక్కడ (అమెరికాలో) ఇలాంటి గొడవ వుండదుగా అని.
ఒక విధంగా బద్ధకం తగ్గించే అమెరికా- విధానం మంచిదేనని. దానికి తోడు యంత్రాలు నానా విధాలైనవి అన్ని ఒక కప్పు క్రింద హోమ్ డిపో లాంటి షాపులలో లబిస్తుంటే, యంత్రాల సాయం కొంత, మన శ్రమ కొంత, జీవితాలను పండించుకోవటం మహామహులకు కూడా అలవోకగా అలవాటు అవుతుంది అనేది నిస్సందేహం.




