1.
భక్తులను రక్షింప భవాని
కదిలె కదలీ వనమునుంచి,
దానవులను దుంచె దుర్గమ్మ
చింతలుబాయగ చింతామణి గృహమునుంచి-
2.
వెడలె వారాహి తోడుగ
సుధలు పంచి సాదకుల జీవన
సాపల్య మందించ వెడలి వచ్చె నంబ
సుధాసాగర మధ్య నుంచి,
నట్టి
శ్రీచక్ర రధ వాసిని శరణనెదను!!
3.
తల్లి పాదములాశ్రయించుటనొకటే
మొక్షమార్గము!
అంబ కరుణార్ధ దృష్టి చేత
కరుగు జన్మ జన్మల కర్మలు!
అమ్మ కొనగోటి కాంతి చాలు
కోటి సూర్యులనెలిగించునట్టి తల్లిని శరణంటిని నేడు!
కాపాడు జనని భగమాలిని!!
4.మంజుల దాయిని మదన మనోహరి
మణిమయ ధారిణి అతి మృదుభాషిణి
మంగళదాయిని మదురక్షార ఘని
మందారమాలలు సమర్పింతును మాతా! జనని మహేశ్వరి!!
5.
లలిత లతాంగి, పంచ బ్రహ్మలలోని చిచ్ఛక్తి,
అండ పిండ బ్రహ్మాండములాడును నీ కనుసైగతో-
వేదములు సైతము పూర్తిగ స్తుతించలేవు నీ కీర్తి,
సృష్టి, స్థితి లయ తిరోదాననుగ్రహములు నీ ఆజ్ఞతో కదులు పంచబ్రహ్మలు-
దహరాకాశములోని జ్యోతివి,
బాలారుణ రేఖల కాంతితో వెలుగు
వేదమాతవు నీవు కదమ్మా! జననీ వేదాణి!
6.
చైతన్య ప్రకాశిని భగవతి,
‘మాత్ర’ కాలమున చతుర్దశ భువనాలను, ప్రళయాలను, సృష్టిని సృష్టించగల మహా కామేశ్వరి,
నిరుపేక్షక నిరతిశయానంద రూపము కదమ్మా,
రమణీయ కారుణ్య కటాక్ష జననీ కామాక్షీ!
7.
అంతరక్షమను పద్మముమే నీ ఆసనము కదమ్మా!!
మూలాధారాది సహస్రర పద్మములను
వికసింపచేసి యందు వసించెడి జనని నారాయణి,
సహస్రార పద్మమగును నీ గమ్యస్థానము పద్మాసనీ!!
8.
మహాకవులైన నీ కరణను పూర్తిగా వర్ణించలేరు కదమ్మా భైరవి!
నతి దీనురాలను నేనెంతనమ్మా
నీ నామమది పలికి, నీ గీతము గానము చేయ్య?
పలికిన నా పలుకులకు నీవు కదా పూనిక
పలికెదను నీ నామము సదా సంరక్షించి శివారాజ్ఞీ, నీశ్వరీ!!
సంధ్యా యల్లాప్రగడ