అమ్మా నిన్ను తలచి…..

అమ్మా నిన్ను తలచి…..

అమ్మను తలుచుకోవటానికి నాకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరములేదు. ప్రతి రోజూ ఏదో క్షణంలో ఏదో ఒక విషయములో గుర్తుచేసుకుంటునే వుంటాను.

అమ్మ వస్తుందంటే ముందు మెట్టెలు కలిసిన మెత్తని అడుగుల సవ్వడి,  మెల్లని గలగలలు గాజులు సవ్వడి, నా హృదయంలో చిరుగంటలలా వినిపిస్తూనే వుంటాయి.

అమ్మ గుంటూరు నేత చీరలు ఎక్కువగా కట్టుకునేది. మెత్తని ఆమె చీర కొంగు ఎన్ని సార్లు నాకు చలి తగలకూడదని కప్పిందో.

బోంచేశాక అమ్మ కొంగుతో మూతి తుడిచేది. నాకు తమ్ముడికే కాదు, మా పిల్లలని ప్రేమతో దయతో దగ్గరకు తీసుకున్న ఆ కరుణ నా కణకణములలో మెదిలి అమ్మను గుర్తుచేస్తుంది.

అమ్మ మెత్తని చీర అన్నా, అ కొంగన్నా మాకూ, పిల్లలకు అతి మోజు. ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకు వేళ్ళాడుతామని అమ్మమ్మ తెగ చిరాకు పడేది. అమ్మ మాత్రం ప్రేమగా దగ్గరకు తీసుకునేది. విసుగు ఆమెకు తెలియని మాట.

అంత ఒపిక అనన్యమైన కారుణ్యం కేవలము అమ్మకు మాత్రమే తెలుసు. అలాంటి ఇంకో మనిషిని నా జీవితములో నేనెరుగను.

గుంటూరు నుంచి తెప్పించే ఒక విధమైన ఎరుపు కుంకుమతో నుదిటిన సూర్యబింబములా అమ్మ బొట్టు దిద్దుకునేది. ప్రతి ఉదయము అమ్మ కుంకుమ దిద్దిన ముఖముతోనే మాకు సుప్రభాతాలు. ముందు ముద్దుగా లేవకపోతే అదిలించి లేపేదు అమ్మ.

ప్రేమతో కూడిన మౌనము అమ్మ!

నిష్కళంక నిరుపమానమైన ప్రేమ  ఆమెది.

పరుషంగా ఎవ్వరిని మాట్లడకపోవటం, పువ్వును మించిన మెత్తని స్వభావము అమ్మది.

చాలా తక్కువగా మాట్లాడటము, ఎప్పుడు ఎదో ఒక పని చేస్తూ వుండటము అమ్మకు మాత్రమే వచ్చు.

మధ్యహానము అంతా నడుము వాలిస్తే,  అమ్మ మాత్రము ఎదో చదువుతూనో, కుడుతూనో, అల్లుతూనో గడిపేది.

అమ్మకు తెలియని విద్య లేదు, విషయము వుండదేమో. ఆమె సకళ కళామ తల్లి.  నాన్నాగారు కూడా ఎదైనా సందేహమొస్తే అమ్మనే అడిగేవారు.

బుట్టులు అల్లటము, కుట్లు, కోషియా అల్లిక, స్వెట్టర్ అల్లటము, మిషను మీద బట్టలు కుట్టటము ఒకటేమిటి అమ్మకు సర్వం వచ్చు.  మా బట్టలన్నీ అమ్మే కుట్టేది. మా స్వెట్టర్లనీ అమ్మ అల్లినవే.

ఇంట్లో కర్టెన్లు, వాటి మీద డిజన్లు కుట్టటము, గాజులతో, మాడిపోయిన లైటుబల్బలతో బొమ్ములు చెయ్యటము, ఇవ్వనీ అమ్మకు కొట్టిన పిండి. సంక్రాంతికి మేము పెట్టె బొమ్మలకొలువులో చాలా మటుకు అమ్మ తయారుచేసిన బొమ్మలే. ముగ్గులు కూడా అమ్మ వేసినట్టు ఎవ్వరూ వెయ్యలేకపొయేవారు. ఇరుగు పొరుగు ఎవ్వరు శ్రద్ద చూపినా అమ్మ ఓపికగా అందరికి నేర్పించేది ఇవ్వనీ.

మాకు అట్లాంటాలో వాడుకునెందుకు ఒక క్రొషియా టేబులు కవరు, ఒక త్రో అమ్మ తయారుచేసి ఇచ్చింది 15 సంవత్సరాల క్రితం మా గృహప్రవేశ సందర్బంలో.

అమ్మ చాలా మధురముగా త్యాగరాజ కీర్తనలు పాడేది. నాకు సంగీతములో కూడా అమ్మే మొదటి గురువు. ఇంట్లో బయట జరిగే ఎలాంటి కార్యక్రమాల లోనైనా అమ్మ పాట లేకుండా వుండేవి కావు. ఎన్ని మంగళహారతులు వచ్చేవో అమ్మకు.

అమ్మ మంచి హింది, ఇంగీషు మాట్లాడేది. ఆమె చిన్నప్పుడు గుంటూరు మిషనరీ స్కూల్ లో చదివి  ఒపెను యూనివర్సిటీ లో డిగ్రీ చదివింది. పెళ్ళయ్యి తెలంగాణలో నాన్నగారు పని చేసె వూరు వచ్చినప్పుడు అమ్మ హిందీ పరిక్షలు రాసి వాటినీ పూర్తి చేసింది.

అమ్మ పుస్తకాలు తెగ చదివేది. మాకు కూడా పుస్తకాలు చదివే అలవాటు చేసింది. నాన్నగారు కూడా బుక్స్ చాలా తెప్పించేవారు.

బందువులలో, మిత్రులలో అమ్మకు చాలా మంచి పేరు. ఆదరముగా వుండేది అందరితోనూ.ఇల్లు ఒక సంస్థానము అని అమ్మమ్మ కొప్పడేది కాని, అమ్మ నాన్నగారి దానధర్మాలలో నిజమైన అర్ధభాగం. ఏ సమయములో వచ్చినా పండితులను  ఆచారము ప్రకారముగా అని అమర్చి పెట్టేది, మడిగా బోజనముతో సహ.

ఒకవైపు నాన్నగారి అగ్నిహోత్రావ ధానులులా ఉగ్రంగా వుండేవారు. మరోవైవు నానమ్మ మడి చాదస్తముతో గుంజిళ్ళు తీయించేది. పిల్లలము కోతులా అల్లరితో ఇల్లు కిష్కింద వనం కాకుండా నందనవనంగా వుండేదంటే అది అమ్మ మహిమే.

అమ్మమ్మ, నానమ్మ కూడా మమ్ములను అనెవారు అమ్మ తెలివితేటలు, నిదానము మాకెవ్వరికీ లేవని.

నిజము, మేము ఏ తలా ఒకటో,రెండు విద్యలు తీసుకున్నాము కాని అమ్మ లా అన్ని విద్యలు, శాంత గంభీరమైన మధుర వ్యక్తిత్త్వం మా కెవ్వరికి లేదు. రాలేదు.

ప్రియమైన కమ్మని చిరునవ్వుల ఆ ముఖం కళ్ళముందు నుంచి కనుమరుగవదు అసలు.

అమ్మా, నాన్నగారు ఇద్దరూ హడావిడిగా ఈశ్వరును దగ్గరకు వెళ్ళపోయాక నాకు కలిగి ఈ నిరాశ వర్ణించటానికి నాకు బాష సరిపోదు. ఎప్పుడు అమ్మ గురించి మాట్లాడవలసి వచ్చినా నా కళ్ళు  చెమ్మగిల్లుతాయి.

ఈ ఆదివారపు ఈ మాతృదినోత్సవ ప్రత్యేక సమయాన, మరింత ప్రత్యేకంగా  మా అమ్మాయి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయములో జయకేతమెగుర వేసిన ప్రతిష్టాత్మక ఫుల్ బ్రైటు ఫెలోషిప్ తో పాటు ఉత్తీర్ణురాలవుతున్న ఈ సందర్భంగా, అమ్మా! నాకు తెలుసు ఇది నీవు నాన్నాగారితో కలసి ఇచ్చిన దీవనేనని.

మా మనస్సంతా మీరే వున్నారు.నాకే కాదు మా అందరి హృదయ కమలాలలో మీరు నిండి వున్నారు.

మీరు చేసిన దానధర్మాలు, సత్సాంప్రదాయాలు, మీ దీవెనలు మాకు సదా మార్గం చూపుతాయి.

Amma Nanna Miss u terribly .

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment