sandwich –
చిన్నప్పుడు మడి గురించి చాలా విప్లవం జరిపినా నా ధర్మపోరాటము లో నేను ప్రతిసారి “ఘోరంగా” ఓడిపోయేదాన్ని మా నాయనమ్మ చేతిలో. నా ఉదేశ్యం ‘మడి’ అన్నది శుభ్రం కోసం మొదలుపెట్టి ఉంటారు.
ఆ రోజులలో పాడి – పంట, గొడ్లు – గోడా, సర్వం అక్కడే ఉండేది కదా! గచ్చు నెలలు కూడా ఉండేవి కావు కదండీ. మట్టితో అలికిన వంటగదులు, చేతులతో సమస్తం తాకటం ఉండేదేమో, అందుకే అన్నం ముట్టుకున్నా, వండినవి తాకినా నీటితో కడుకోవాలి అని, ‘అంటూ -సొంటు’ అన్న మాట వచ్చి ఉంటుంది. అది రూపాంతరం చెంది,చెందీ, చివరకు నేలమీద ఒక చెంచా నీరు చల్లి, అన్నం గరిట, పప్పు దిన్న తాకిన ప్రతిసారి ఆ నీటి చుక్క మీద చేయి వెయ్యటం లాంటివి ఆచారంగా మారాయి.
నాకసలు అర్థం కావు ఇలాంటివి. శుభ్రం పాటించటము సరే కానీ చాదస్తంతో వద్దు అంటే నాకు బాగా వడ్డించేవారు. “అంటూ – సొంటూ” లేకుండా తయారయ్యానని, విప్లవం తెస్తున్నానని, నన్ను నానమ్మ తెగ కోప్పడేది ఈ విషయాలకు.
అమ్మ మడి కొంత బెటర్. దావళి అనే ఒక రకం వస్త్రం దొరికేది. అందులో చీరలు ఉండేవి. అమ్మ అవి కట్టుకునేది. అవి కొంత flexible మడి అన్నమాట! పిల్లలు పొరపాటున తగిలిన మైలపడరు వారు. అందుచేత తడిబట్టల మడి కన్నా బెటర్ గానే ఉండేది మాకంతా.
అమ్మ చీర ను కాశీ పోసి కట్టుకోవటం అన్న విధానంగా కట్టుకునేది మడికి. మాకు ఇంట్లో చాలా హోమాలు, అభిషేకాలు, గట్రా జరిగేవి. వాటికి ఈ విధంగా చీరకట్టుకోవటం చాలా తప్పని సరి పద్దతి. తద్దినాలకు మాత్రమే తడి చీర మడి. అంటే సీరియస్ మడి అన్నమాట!. మేము గభాలున వెళ్లి తాకటము అదీనూ చెయ్యకూడదు. దూరంగా ఉండాలి.
కాశీ పోసి కట్టుకోవటంలో చీర కూడా పంచె లాగానే ఉంటుంది. దానికి 6 గజల చీర కావాలి. అందుకు ప్రత్యేకంగా గుంటూరు నుంచి తెచ్చేవారు. మాములు చీరలు సరిపోవని. మన తమిళులు కూడా ఆ 6 గజాల చీరలు కడతారు.వారు కట్టె చీర విధానమును మడిసై అని పేరు. వాళ్లది కొంచం చుట్టుకునట్లుగా ఉంటుంది. మన తెలుగు వారు కట్టుకునేది మాత్రం చక్కగా కుచ్చెళ్ళు అవీ వచ్చి చూడటానికి కూడా బానే ఉంటుంది.
అమ్మ చాలా చక్కగా కట్టుకునేది కాశీపోసి చీర. కానీ అమ్మ ఉండగా నేను ఎప్పుడు నేర్చుకోలేదు అలా కట్టుకోవటం. అసలు పెళ్లి అయి వచ్చేశాక, నాకు ఆ “మడి, అంటూ -సొంటూ” అన్నిటికి దూరంగా వచ్చేశాను. కొన్ని రోజులు అసలు వాటి సంగతే మర్చిపోయాను. కానీ నేను పెరిగిన వాతావరణంలో పూజ పునస్కారం నిండి ఉండేది కాబట్టి, అవి లేకుండా ఉండటంతో కొంత కాలానికి నేను వాటిని మిస్ అవుతూ వచ్చాను. నిత్య పూజ చేసుకున్నా, ఒక వ్రతం, హోమము, లేకుండా గడపటం. శ్రీవారు నాస్తికులు కారు కానీ పాపం వాళ్ళ ఇంట్లో అలవాటు లేదు కాబట్టి తనకు తెలియదు. అత్తగారు కూడా ‘మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి.. పూజలు గాట్రా చేస్తూ ఉంటె ఎలాగూ’ అని సమర్దించుకుంటారు కొడుకును.
నేను పూజలు పునస్కారాల ను పరిచయము చెయ్యటానికి చాల సంవత్సరాలే పట్టింది. మా ఇంట్లో మా పెళ్ళైన 10 సంవత్సరాలకు మొదటి అభిషేకం చేసుకున్నాము.
ఇంతకీ 10 సంవత్సరాలకి నేర్చుకోవాల్సి వచ్చింది నాకు కాశిపోసి చీర కట్టుకోవటమనేది. నాకు అసలు తెలియదు ఎలానో. ఒక ఫ్రెండ్ వచ్చి ఎదో కట్టింది కానీ నా తలకాయలే ఉండింది. కుదరక అప్పటికి వదిలేశాను. ఇండియా వెళ్ళినప్పుడు పిన్ని చూపించింది ఎలా కట్టుకోవాలో.
శ్రీ కుర్తాళం స్వామివారు భిక్షకు రావటం, అభిషేకాలు ప్రతి ఏడాది ఒక హోమం చేసుకోవటం, శ్రీవారు నిత్యం గాయత్రీ ఆరాధనా ఇత్యాదివితో మాఇంట మేము సత్సంగతులు చేసుకున్నా నాకు ‘ఆ’ చాదస్తం లేదు.
మడి అంటే మరి చాదస్తంగా జనాలని కూర్చోనీయ్యకుండా, నిల్చోనీయ్యకుండా సాధించటం కాదు. ఇల్లు, వళ్ళు శుభ్రంగా పెట్టుకోవటం.
అసలు అతి శుభ్రం కి ఒకే పేరుంది అంది అదే OCD (Obsessive-Compulsive Disorder (OCD) అంటారు. అంటే క్లీన్ చేసిన చోటే మళ్ళీ, మళ్ళీ చేయటం, ఎంత క్లీన్ గా ఉన్నా ఇంకా ఎదో చేయాలనీ ఆత్రం. ‘మహానుభావుడు’ అని శర్వానందు సినిమాలో చూపిస్తారుగా అలా.
మా నాన్నమ్మ కున్న చాద్దస్తం అదే నని నా నమ్మకం. మనందరిలో కొంత ఉంటుంది. అది ఇళ్ళు వాక్కిలి క్లీన్ గా ఉంచటం వరకు సరి.
నాకున్న ocd మహ అయితే ఒక 10% వుంటుందేమో. ఎంత ఆఫీసు పనిలో ఉన్నా కూడా ఇల్లు, వంటగది, ప్రతిరోజూ తడిబట్టతో మాప్ చేసుకోవటము, ఇత్యాదివి పూర్తిచేసుకొని కానీ, ఆ రోజు కు పని ముగించక పోవటం.
అంటే నాన్నమ్మ పోలిక తలా కొంత మాకు వచ్చిందేమో.
మా పిల్లకైతే మాత్రం పూర్తిగా OCD. “తాత బొచ్చె తరతరాలు” అని సామెత. ఏమిచేస్తాము ఎదో ఒక పోలిక రావాలిగా మరి.
ఇదన్నమాట నానమ్మ మా అమ్మాయిలో దూరి నన్ను ఇప్పటికి సతాయిస్తూ ఉండటం ఇంకో రూపంలో… పూర్వపు మడి, చాదస్తం నేటి OCD రూపంలో. మోడరన్ చాదస్తానికి రూపం ఇలాగ వచ్చి చేరింది.
ఫొటోలో నానమ్మ నవ్వేస్తోంది “నాతో విప్లవం చేసావుగా ఇప్పుడు నీ కూతురు నెత్తినెక్కి సాధిస్తోంది ఏమిచేస్తునావు”? అని .. సినిమాలలో చూపిస్తారుగా చూడండి నిర్మలమ్మ (సుందరాకాండలో) నానమ్మలాగా సాధిస్తూ నవ్వుతు ఉంటుంది. అలాగా అన్నమాట… ఏంటి చెయ్యటం .. ఏడుస్తూనూ భరిస్తాం.. నాన్నమ్మ అయితే వాదిస్తాము మారుతుందేమో నని ఆశతో….కాని పిల్లనైతే ఏమి చేస్తాం చెప్పండి… మన పిల్లలు మన మాట వినరుకాబట్టి. “నాన్నమ్మా ఇలా కూడా తీర్చుకుంటున్నావు నా మీద కసి” అని అనుకొని బయటకు మాత్రం హిహిహి అని వెర్రి నవ్వు నవ్వెయ్యటం…….
ఇక్కడ అమెరికాలో పిల్లలతో తంటా ఒకటి కాదు. వాళ్ళకు చిన్నప్పట్నించి స్కూళ్ళలో భోదిస్తూ ఉంటారు.” మీరు మీ మనసు మాట వినండి. మీ అమ్మా నాన్న చెప్పిన మాట అయినా సరే వినకండి” అని. ఆ ఉద్భోదనలు నెత్తికెక్కించుకొని వీళ్ళు మన నెత్తి మీదికి ఎక్కుతారు. మనం ఏమీ అనలేము. మనం పెచ్చబడినప్పుడు మన మాట ఎవ్వరూ పెద్దలు పట్టించుకునేవారు కాదు. అసలు పెద్దల ముందు నొకెత్తితే గా?
చిన్నప్పుడు మన పెద్దల చేతులలో, ప్రస్తుతము పిల్లల చేతులలో కీలుబొమ్మలము కదండి.
మనది స్యాండువిచ్చ్ తరము !!
Sandhya Yellapragada