బరువు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకానొక సమస్య… అది ఫలానా బరువు అని చెప్పలేము …
అంటే, శరీర బరువు ఒబేసిటీ, మనసులో బరువు స్ట్రెస్, దేశాల మధ్య బరువు యుద్ధాలు, రాజకీయనాయకులకు బరువు వారి సుపుత్రులు, లేదా బంధువులు… ఇలా ఇలా…
అసలు బరువు … అంటే ఏంటి? అనవసరమైన లేదా ఎక్స్ ట్రా …లేదా ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండటము కదా, అందునా అది మనకు పనికి రానిదై ఉంటుంది.
మరి పనికి రానిదాన్ని మొయ్యటమెందుకు? వదిలెయ్యాలి కానీ…
మనకు మనం మొయ్యలేని దాని కన్నా ఎక్కువ బరువులు మోస్తే ఏ నడుమో పట్టటం, మనం మూల పడటం ఖాయం కదా!! అది శరీరానికైతేను.
అతి బరువు మనసుకైనా ఎఫెక్ట్ ఇస్తుందనటంలో సందేహం లేదు.
శరీరం మీద బరువు కనపడుతుంది, మనసులోదైతే మొఖాన కనపడుతుంది.
అది ఎలాగంటారా….. ముఖం మనసుకు అద్దం కదా మరి.
మీరే చూడండి! కొందరి మొఖాలు గంటు పెట్టుకొని, ఏదో పోయినట్లు, ఎవరో వీరి ఆస్తిని కొట్టేసినట్లుగా ఉంటారు… వీరు మనసులో బరువు మోస్తున్న బాపతు.
సాధారణంగా శరీర బరువు మొయ్యటమే కష్టం ఇంక మనసులో బరువు మోయ్యాలి అంటే అంతే సంగతులు.
ఏవైనా తేడాలు పాడాలు వస్తే హాయిగా మనసు విప్పి మాట్లాడుకోవటం కన్నా ఉత్తమమైన పని ఉండదు.
దానిమూలంగా పోతే పోయేది ఈ తేడాలే కానీ మరోటి కాదుగా .
అందుకే దేశాల మధ్యనైనా ఈ డైలాగ్స్ అన్నవి ఉన్నాయి.
మంచి మాటకు మించిన ఔషధం లేదు… ఎక్కువైతే వికటిస్తుంది, తక్కువైతే రోగం తగ్గదు.
అందుకే హాయిగా మాట్లాడుకోవటం, మనసులోది కక్కుకోవటం ఉత్తమం. ఇందు మూలంగా మనసులో స్ట్రెస్, మొఖం గంటుగా తయారవటం తప్పుతుంది.
ఈ మనసులో తేడాలు, మాటలు కనీసం మిత్రులకైనా చేప్పేయ్యాలి.
ఇక్కడ అంటే ఇండియా లో మనకు మంచి మిత్రులు, కుటుంబం ఉంటుంది, కానీ అమెరికాలో అలా కాదుగా …
అందుకే కౌన్సిలర్లు అన్న మాట ఎక్కువగా వినవస్తోంది.
అది ఈ మధ్య ఇక్కడ కూడా ఎక్కువైందిట… ఇక్కడి మిత్రులు చెబుతున్నారు.
మనసులో ఈ బరువు ఒక్కోసారి అలా ఉండి పోయి నానా రకాల జబ్బులుగా కూడా మారుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏ మాట అయినా ఎక్కువ కాలంగా నానుతూ వుంటే, వస్తువులా చెల్లకుండా పోతుంది…
ఉదాహరణకి ‘ఎల్లి’ని ‘మల్లి ‘ తిట్టింది. మల్లి మనసులో ఆ విషయము పెట్టుకు కుమిలితే పోయేది మల్లి ఆరోగ్యమే. ఎప్పుడు ఆ విషయమే పట్టుకు తిరిగితే కొంతకాలమయినాక మల్లి స్నేహితులే వినరు ఆ మాటను.
మంచి మాట విషయం వేరే అనుకోండి….
మనకు సుభాషితాలే గుర్తుపెట్టుకోవటమే కష్టం…ఇంకా ఈ పిచ్చి సంగతులు, పక్కవారి మీద అనవసర కజ్జాలు అవసరమా జీవితానికి?
ఏదో చిన్న చిన్న మాటలు అటు ఇటుగా మిత్రుల మధ్య నడవటం సాధారణమే!
ఎవ్వరు ఎవ్వరిని కావాలని కష్టపెట్టరు…. అల్లా పెట్టేవారు మిత్రులే కారు… వారు వేరే టైపన్నమాట….ముళ్ళపూడి వారి భాషలో!!
కొంతమంది మహానుభావులు చిన్నపాటి చేగోడీలు షేర్ చేసుకోలేదని, బలపం దాచుకున్నామని, ఎక్సామ్ లో పేపర్ చూపించలేదని… కూడా గంటు మొఖంతో తిరుగుతారు…
ఆ ముదురు మొఖం చూడగానే మనం అనుకోవాలి…. అది మనసులో బరువు మోస్తున్న మొఖంరా బాబు అని… అలాంటి వారిని చూడగానే
“నవ్వినా ఏడ్చినా ఒకలాగే ఉంటుంది…
మనం మంచి చెప్పినా వ్యతిరేకం అనిపిస్తుంది” అన్న పాట గుర్తుకు తెచ్చుకోవాలి.
మానవజీవితం అతి సున్నితమైనది, అతి కురుచైనది…. మనకున్న సమయం కూడా చాల కొద్దినే.. అలాంటి సమయంలో ఇలాంటి అనవసర విషయాల పైన శ్రద్ద ఉంచి, మన జీవితాలలో వెలుగు మనమే ఆపుకోవటం అజ్ఞానానికి గుర్తు.
ఉన్నన్ని రోజులు సంతోషం పంచుతూ… స్నేహని అందిస్తూ.. మనసు మొఖం మెరిసేలా హాయిగా ఉండటం వలన జీవితానికి మంచి మార్గం కనపడుతుందని నేటి పరిశోధనల నుంచి, పరిసరాలనుంచి మనం నేర్చుకోవలసిన పాఠం.
