తెలుగు భాషలో పద్యం ఒక విశిష్టమైన విశేషమైన ప్రక్రియ. పద్యం తో భాషకు ఎన్నైనా సొగసులద్దవచ్చు.
ఎంత వచన కవిత్వం అలల మాదిరి సాగిపోయినా, పద్యం తెలుగు భాషకి ఉన్న అత్యుత్తమమైన ఆభరణాలలో ఒకటి!
చెణుకుల పద్యాలూ, చాటువులు, తిరకాస్తు పద్యాలూ, పొడుపుకథ పద్యాలూ తెలుగులో విరివిరిగా ఉన్నా, పద్యాలను చదవటం అందరూ ఇష్టపడరు. అంతెందుకు తెలుగునాట మారుమోగి పోయిన కృష్ణ రాయబార పద్యాలు నేడు ఎక్కడా కనిపించవు, వినిపించవు. పద్యం తెలిసిన వారు క్రిందటి తరానికి పరిమితమౌతున్నారు అనిపిస్తున్నది చూస్తుంటే!
మాకు వ్యాకరణంలో ఛందస్సుకు 10 మార్కులని నేర్చుకొని, కొన్ని పద్యాలు ముక్కున కట్టుకు తుమ్మేశాము స్కూల్ లో ఉన్నప్పుడు. నా తోటి వారు కాలేజీలో సెకండులాంగ్వేజుగా కూడా తెలుగు వద్దని, మార్కుల కోసం సంస్కృతమునకు మారిపోవటం కూడా నాకు తెలుసు. కానీ నాకు తెలుగు మీద ఉన్న అభిమానంతో అప్పుడు నేర్చుకున్న పద్యాలూ, నేటికీ కొంత గుర్తు చేసుకుంటున్నాను అనుకోండి.
ఈ ఉదయం హఠాత్తుగా శ్రీనాధుని చాటువులు మనసులో మెదిలాయి. వార్తలలో అమెరికాలో, అందునా చికాగోలో కనిపించిన దృశ్యం ..శాస్రజ్ఞులు గ్లోబల్ వార్నింగ్ అన్నా మరోటన్నా ..ప్రకృతి లో మారిన సమతుల్యత కు నిదర్శనం. దానికీ పద్యానికీ సంబంధమేమిటా అని కదా అనుమానము!
మా సింక్ రాత్రి అంతా కొద్దిగా తిప్పి ఉంచాము.. పైప్ లో నీళ్లు ఫ్రీజ్ అయి అవి పగలకూడదని …
ఇలా చెయ్యటం పైపుల జాగ్రతకైనా నీళ్లు లేక, గంగకై అలమటించి శ్రీనాథుడు చెప్పిన చాటువు గుర్తుకు వచ్చింది. ఉదయము అది చూడగానే.
ఆ సందర్భములో శ్రీనాథుని చాటువు :
“సిరిగల వానికి జెల్లును
దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్ద రాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్”
పలనాటి సీమలో గంగకై వెదుకులాడాడు.
మరి ఈ నాటి హిమము తో కూరుకుపోయిన చికాగో నగరం చూసి ఏమంటాడో…
(బహుశా ఇలా అనుకోవచ్చును నని నా వూహతో రాసిన కందం)…
కంll
కైలాసముతో కదిలె
కైవల్యము నందచేసి కాపాడగన్
కైమోడ్పులు అందుకొనగ
కారుణ్యమున శివుడమెరికాకరుదెంచెన్ !!
కంll
చలికి వణుకుతు చికాగో
చలితో గాలులు కలువగ జంకుచు నగరం
చలితో వణకుచు జనులున్
జలదరమున నెగడెలు జెరి చలి కాచుకొనన్ ।।
అంటాడేమో మరి!!
కైలాసమే కదలి వచ్చినట్లు ముద్దలు ముద్దలుగా హిమము నిండిపోయింది ఆ చికాగో నగరం…
చలిని మర్చి, వదిలి చక్కటి పద్యాలను తలచుకోవటం నయమని అనిపించింది. ఇలా నా మనసులో తట్టిన పద్యాలతో పాటు నాకు గుర్తుకు వచ్చిన ఈ పద్యాల సమాహారము.
ఏమైనా తెలుగు భాషలో చాటువులు,పరిహాస పద్యాలూ చాలా గొప్ప విశేషము.
కొన్ని శ్రీనాథుని చాటువులు ఆయనవి కాదని ఒక వాదన ఉన్నా, శ్రీనాధునివేనని వాదించు వారు వున్నారు.
మేము ఇంటర్ లో ఉన్నప్పుడు ఈ చాటువులు మా తెలుగు లెక్చరరు గారి లెక్చర్ లో విన్నాను.
పద్యం సందర్భోచితంగా వాడుతూ, పద్యం మీద ఇంటరెస్ట్ పెంచుతూ, వారు పద్యం చదివేటప్పుడే మనకు అర్ధమయ్యే విధంగా చదవటం, అది ఒక కళ కదా !
ఆమెకు ఆ కళ చాలా మెండుగా ఉండేది.
ఆనాడు విన్న కొన్ని చాటువులు నాకు అలా గుర్తుండిపోయాయి.
అందులో కొన్ని నేను చాలా సందర్భాల్లో వాడేస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు.
ఉదా:
“మేతకు గరిపిల్ల పోరున మేకపిల్ల
పారుబోతుతనంబున బందిపిల్ల
యెల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
యందమున గ్రోతిపిల్ల యీ యరవపిల్ల “
ఈ చాటువు నిజంగానే శ్రీనాథుడు చెప్పాడా?
చెప్పిన సందర్భమేమిటో…
ఇది శ్రీనాథునిది కాదని కూడా ఒక వాదము ఉందని అంటారుగా .
శ్రీనాథుడు పల్నాడు సీమ తిరిగినప్పుడు చెప్పిన చాటువులు మాత్రం చాలా బాగుంటాయి..
కొన్ని NTR ‘శ్రీనాథకవిసార్వ భౌమ ‘చిత్రంలో వాడారు…
“రసికుడు పలనా
దెసఁగంగా రంభ అయినా ఏకులే వణకున్
వసుదేశుడైనన్ దున్నున్
కుసుమాస్తృ డైన జొన్నకుడే కుడుచున్ ”
పల్నాడు చాలా డ్రైగా ఉండేవి కాబట్టి అక్కడ అందంతో పనిలేదని, ఎవ్వరైనా పని చెయ్యాలని, జొన్నలే తినాలనే చరిత్ర కూడా చెబుతున్నది ఈ పద్యం కదా! నాటి పల్నాటి సీమలో ఉన్న భౌగోళిక పరిస్థితులు తెలియచేసే పద్యమది.
ఇంట్లో అక్కయ్య కూడా మాకు పద్యాల మీద ఇంటరెస్ట్ వచ్చేలా ఒక్కొక్కసారి ఒక పద్యం చెప్పేది.
ఇప్పటిలా అప్పుడు ఇంటర్నెట్ గూగుల్ లేదు కాబట్టి– బుక్స్ చదివి చెప్పేవారము ఆ పద్యం ఎక్కడిదో
అలా మాకు ఒకసారి తాను ఇచ్చిన పద్యం,
కం।।
“ఖగపతి అమృతముతేగా
భుగభుగమని చుక్క భూమిని వ్రాలెన్
పొగ చెట్టై జన్మించెను
పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్ “
ఇది కన్యాశుల్కం లో గిరీశం చెపుతాడు
అలా నేను కన్యాశుల్కము చదవటం కూడా జరిగినది .
పద్యాలలో చమత్కార పద్యాలూ విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి.
పద్యాలలో చాలా విశేషాలు కనపర్చినవి ఉన్నాయి కదా. ఒక్క అక్షరంతో పద్యాలు, ఒక్క మాటతో పద్యాలు ఇలా.
ఒక్క మాట అంటే తప్పక అందరికి తెనాలి రామకృష్ణ కవి గుర్తుకు వస్తాడు…. మేక తోక కూడా గుర్తుకు వస్తుంది కదా!!
ఆ పద్యం
సీ।।
మేకతోకకు మేక తోకమేకకు మేక
మేక తోకకు తోక తోకమేక
మేకతోకకు మేక తోకమేకకు మేక
మేక తోకకు తోక తోకమేక
మేకతోకకు మేక తోకమేకకు మేక
మేక తోకకు తోక తోకమేక
మేకతోకకు మేక తోకమేకకు మేక
మేక తోకకు తోక తోకమేక
గీ।।
మేకతొకతోక తొకతోక మేక
మేకతొకతోక తొకతోక మేక
మేకతొకతోక తొకతోక మేక
మేకతొకతోక తొకతోక మేక
ఇక ఒక్క అక్షరంతో పద్యం కూడా నాలిక మాటలతో (టంగు twist)తో సరదాగా ఉంటాయి.
మచ్చుకు ఇవి చుడండి :
-నానినిన నేనును నని నను
నననేనును నిన్నుని నున్న నన్ను
నెన్ననున్నను నిన్నేన నున్నానన
నిన్న నాన్ననున్న నాన్నను నాన్ని।।
-కాకీక కాకికి కోక,
కోకిలీక కోకిల కొక
కాకి కోకీలలకిక కోకాలెలా
కోకల కలాలెలా ,కేక లెలా ।।
తెలుగు బాషా మీద మనకు ఇంట్రెస్ట్ పెంచుకొని మన పిల్లలకు ఇలాంటివి కొన్ని నేర్పిస్తే, అల్లా ఉండిపోతాయి వారి లేత మెదడులో. అమెరికా లో అయితే ‘మన బడి’ వారు కృషి చేస్తున్నారు. మరి భారతావనిలో ఎవరు పుణ్యం కట్టుకుంటూన్నారో నాకు తెలియదు. మా చిన్నదానికి శతకాలు చాలానే నేర్పించాను అది చిన్న పిల్లగా వుండగా. ఇండియా వెళ్ళినప్పుడు నాన్నకు చెప్పి ఆయన్ను సంతోషపెట్టేది. అట్లాంటాలో నేను తామాలో వాలంటీర్ చేస్తున్నప్పుడు మా పిల్ల కూడా తెలుగు బడి లో పిల్లలకు కథలు అవి తెలుగులో చెప్పేది. మధ్యలో నా సొంత డబ్బా కొంత కట్టి పెట్టి , తిరిగి పద్యములోకి పోయెదము ….
కొన్ని పొడుపు కథలతో ఉండే పద్యాలూ చూదాం! మా చిన్నప్పుడు ఇవి రోజుకు ఒక్కటి చొప్పున నేర్చుకొని, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేసేవారము మేము.
అప్పటివే ఇవి. ఇంకా కావాలంటే ఇంటర్నెట్ లోనో, పెద్ద బాలశిక్షలోనో కనపడుతాయి నేడు .
ఆ।
ఒడలి నిండ కన్నులుండు నింద్రుడుకాడు
కంఠము నందు నలుపు కాడు శివుడు
ఫణులబట్టి చంపు పక్షీంద్రుడా? కాడు
దీని భావమేమి తెలిసికొనడు.
వంటి నిండా కళ్ళు ఉంటాయి కానీ ఇంద్రుడు కాదట, కంఠం నలుపు శివుడు కాదు,
పాములను పట్టుకొని చంపుతాడు కానీ గరుఖ్మంతుడు కాదు ..ఎవరై ఉండవచ్చు?
(నెమలి)
అలాగే ఈ ఆటవెలది చుడండి :
ఆ।।
కరయుగంబు గలదు చరణంబులా లేవు/
కడుపు, నడుము, వీపు మెడయు గలదు/
శిరము లేదు కానీ నరుల బట్టుక మ్రింగు/
సొగసు గూర్చు దీని సొగసు గనుడి।।
చేతులు కాళ్ళు లేకుండా, కడుపు నడుము వీపు ఉంది, తలలేనిది, మనుషులను పట్టుకు తింటుంది.
చాలా సొగసుగా కూడా ఉంటుందిట…
దానికి సమాధానం (చొక్కా)
మరొకటి మేనబావలతో, బావా బావమఱఁదులలో హాస్యం తెలుగు నాట చాల ప్రసిద్ధి చెందినది:
అలాంటిదే ఇది ;
తే।।
అందము చూడ రామ బంటైన వాడు
నాగరికతకు జము వాహనమున కూడు
శుచికి హేమాక్షు జంపిన శూరుజోడు
వసుధలో లేడు మా బావ వంటి వాడు.
అందంలో రామ బంటు అంటే వానరం, నాగరికత చూద్దామంటే యముని వాహనంట అంటే దున్నపోతు,
శుభ్రంలో (హేమాక్షు – హిరణ్యాక్షుడు) చంపినవాడు వరాహం – పంది
అలాంటి వాడు మా బావ అని మరది ఆటపట్టిస్తున్నాడు మేనబావను.
చాల సార్లు గరికపాటి నరసింహారావు గారు ఉదహరించిన ఈ పద్యము:
ఆ।।
వంగతోట నుండు, వరిమళ్ల నుండు
జొన్నచేల నుండు తలమీద నుండు
దీని భావమేది తిరుమలేశా!!
ఇది “రాముని తోక పివరు డిట్లనెను” లాంటిది. అంటే విడదీయటము లో శ్లేషలో అందమున్నది ఈ పద్యంలో.
వంగతోట నుండి అని కాకుండా – వంగ – తోట నుండు
వరి – మళ్ల నుండు అని చదివితే తెలిసి పోతుంది. ఇందులో కిటుకు.
ఇలా విడదీయుటలో అర్థం మారె మరో పద్యం చుడండి
–
కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు/
పశువు శిశువు తోడ పలుక నేర్చు/
వనిత వేదములను వల్లించు చుండును/
బ్రాహ్మణుండు కాకి పలలము దిను
ఇందులో కామా పెట్టుకోవాల్సిన చోట పెట్టుకుంటే అర్థమౌతుంది.
అంటే చదవ వలసిన విధానము :
"కొండ నుండు నెమలి,
కోరిన పాలిచ్చు పశువు -
శిశువు తోడ పలుక నేర్చు వనిత ,
వేదములను వల్లించు చుండును బ్రాహ్మణుండు,
కాకి పలలము దిను"
- మరో చమత్కార పద్యం :
“వృక్షాగ్రవాసీ నచపక్షిరాజః
చర్మాంబరధారీ నచ సోమయాజిః
త్రినేత్రధారీ నచశూలపాణిః
జలంధరిత్రి ర్నఘటోనమేఘః”
చెట్టు పైన ఉండేది పక్షి కాదు, చర్మం ధరిస్తుంది సోమయాజి (యాగం చెయ్యువారు) కాదు.
మూడు కళ్ళు ఉంటాయి కానీ శివుడు కాదు .
ఎవరై ఉంటారంటే – కొబ్బరికాయ
మరో పొదుపు కథ :
–చలనశక్తిగలదు జంతువు గాదది/
చేతులెప్పుడు త్రిప్పు శిశువుకాదు/
కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును/
దీని భానమేమి తిరుమలేశ!
కదులుతున్నది కానీ జంతువూ కాదు,
చేతులు ఆడిస్తుంది శిశువు కాదు ,కాళ్ళు లేదు కానీ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది
అదే –
గడియారం.
అలాగే మరోటి
“కాళ్ళు రెండు కలవు గాని మానిసిగాడు/
నోరుగల్గి యెడుటివారినఱచు/
గాలి మేసి లెస్సగా నరుమోయును/
దీనిభావమేమి తిరిమలేశ!!
సమాధానం – సైకిల్
–మనుజుడేమీకాదు మాటలాడగనేర్చు/
పాటగాడు కాదు పాటనేర్చు/
కథలు పెక్కునుండుపు కాదు జేజయ్యము/
దీనిభావమేమి తిరుమలేశ!
సమాధానం – రేడియో
చదివితే అర్థమౌతున్న సులువుగా ఉన్న ఇలాంటివి పిల్లలకి నేర్పించటానికి కూడా బాగుంటాయి…
“ముక్కున పైనము నడచును/
ప్రక్కల నోరుండు గాలి పారణ సేయున్/
గ్రక్కున వేసిన కూయును/
మక్కువతో దీని దెలియు మనుజులు గలరే?
ముక్కుతో ప్రయాణిస్తుందట.
నోరు పక్కన ఉంటుందట.
గాలిని తింటుందట.
వేసివేయంగానే మక్కువతో కూస్తుందట
అదేమిటో చెప్పమంటున్నాడు కవి.
దీనికి సమాధానం – బొంగరం
అది ములికిమీద అంటే ముక్కుతో
నడుస్తుందికదా!
అలాగే వేగంగా తిరుగుతూ
గాలిని తిన్నట్లుందికదా!
ఇష్టపడి వేస్తే శబ్దం చేస్తూ
తిరుగుతుందికదా!
కాబట్టి సమాధానం బొంగరమేకదా!
భాగవతం లో పద్యాలూ అతి సుందరముగా, సంతోషాన్ని పంచేవిగా ఉంటాయి.
భాగవతపు పద్యము ఒకటి రెండు పద్యాలు రాని వారు ఉండరన్నది అతిశయోక్తి కాదు.
భాగవతం లో లేని ప్రక్రియలేదు… రెండు పదాలతో, toung twist పద్యాలూ…. అలా చాలా ఉన్నాయి.
భాగవత పద్యం లేకుండా చమత్కార పద్యాలూ పరిపుష్టి, పూర్తీ కావు. అందుకే ఒక్కటి :
గజేంద్ర మోక్షం నుంచి:
కం।।
కరి దిగుచు మకరి నరసికి
గరి దరికిని మకరి దిగుచు। గరికరి బెరయున్/
గరికి మకరి మకరికి గురి
భర మనుచును నతల కుతల।భటులదరిపడన్।।
ఇది ఏనుగ మొసలి మధ్య సాగిన పోరు వివరిస్తున్న పద్యం.
ప్రజాకవిగా మహాప్రస్థానంకి పూర్వం శ్రీశ్రీ కూడా పద్యాలూ రాసి ఉన్నారు.
పూర్వపు వచన కవులు పద్యంలో మెళుకువలు నేర్చి తరువాత వచనానికి వచ్చారు.
నేడు వచనమే పూర్తిగా రాజ్యమేలుతున్నా మన పూర్వ వైభవానికి గుర్తు అయిన పద్యం మరువకూడదు.
కనీసం వేమన శతకంలో, సుమతి శతకంలో, ఒకటి రెండెన్నా మన పిల్లలకు వచ్చి ఉండాలి.
ఇది మనకున్న ఘనమైన బాషా స్వరూపాలలో ఒకటి కాబట్టి ఈ సౌందర్యాన్ని కాపాడుకోవటం మన విధి కూడా అని నా అభిప్రాయము.
– సంధ్యా యల్లాప్రగడ.
Like this:
Like Loading...