ఎవరికైనా బహుమతి ఎవ్వరైనా ఏ కొలమానము బట్టి ఇస్తారు?
వారు పిల్లలా? పెద్దలా?
వారికి ఇష్టాలు ఏమిటి? అఇష్టమేమిటి!
అని కదా చూసి ఇస్తారు.
అదే పరిచయస్తులకు అయితే గిఫ్ట్ కార్డు ఇస్తారు. అది తీసుకున్నవారి అభిరుచి బట్టి వాడుకోవచ్చు.
మాములుగా మన ఇంటికి ఎవరైనా వస్తే చీరలు, రవికలు పెడతాము. లేదా పండు చేతిలో పెడతాము. అదే అబ్బాయిలే వస్తే? వారికి చేతిలో ఎం పెడతాము?
పుట్టినరోజులు, కొన్ని ప్రత్యేకమైన రోజులకు పురుషులకు గిఫ్ట్ గా ఇవ్వతగినవి ఏమిటి?
ఏది ఇస్తే వారికి మర్యాదాగా వుంటుంది?
సమాధానము చెప్పటము చాలా కష్టమైన విషయం కదండి.
అదే అమ్మాయి అనుకోండి, మనకు లక్షా తొంభై వుంటాయి ఇవ్వటానికి.
బొట్టు బిళ్ళో, ప్రక్క పిన్నో, గోళ్ళ రంగో, సెంటో బుడ్డీ, జడ రిబ్బనో…. చివరకు గృహిణులకు డబ్బాలు, గిన్నెలు, అట్లకాడ, పూరీలు వత్తుకునే కఱ్ఱో… కాదంటే మసాలా దినుసులు.. గిన్నెలో, కిచను లోకి మరోటో ఇస్తారు.
సబ్బులో, లోషన్లో, దువ్వెనో కాటుకో, సబ్బుపెట్టే, వాసన షాంపు, రవిక పిన్ను, మెడలో గొలుసు, చెవి కమ్మ, చేతి గాజులు, చేతి గడియారము, అదీ ఇదీ కాదంటే పుష్పగుచ్ఛము, గులాబి పువ్వు…ఆ వరస…. అలా అలా హనుమంతులవారి తోకలా వెడుతూనే వుంటుంది.
ప్రపంచములో పనికి వచ్చే దాని నుంచి పనికిరాని సమస్తం ఆడవారికి బహుమతిగా ఇస్తారు… మీదు మిక్కిలి పండుగ చేసికోమని అనటము కూడా కద్దు.
కానీ పురుషపుంగములకు
ఇవ్వాలంటే ఎంత ఆలోచించాలి…..
వాళ్ళకు చొక్కా ఇద్దామా అంటే రెండు వుంటే మూడోది ఎక్కువ.
అందునా రంగులలో మరీ చాదస్తం మావారు లాంటి వారికి. ఆయన నీలి రంగు తెలుపు తప్ప వాడరు. అదేంటో. చేతి గడియారాలు ఎన్ని ఇచ్చినా, ఎప్పుడూ ఒకటే. మరోటి మార్చరు. మా అమ్మాయి షూస్సు ఇచ్చింది. అవి మూలకు పెట్టి పూజచేస్తున్నారు తప్ప వాడరు.
పర్ ప్యూమ్ కూడా అంతే. తన బ్రాండ్ ఒకటే వాడటము.
ఇంత పొదుపుగా వున్న మనిషి దుబారా చెయ్యరేమో అనుకోకుండా, ఆ హోమ్ డిపో లో వుండే సమస్త చెత్త తెచ్చి మా గరాజు నింపుతున్నారు.
మనము తోచకపోతే గనుకు విండో షాపింగు చేసినట్లుగా ఆయన వారానికి ఒక సారి ఆ దుఖాణం చుట్టూ తిరిగొస్తాడు. పోన్నీ, తిరిగెనే పో… గమ్మున రారు… ఎదో ఒక మేకో మరోటో తెచ్చి దేన్నో ఎదో మార్చాలని చూస్తారు.
ఆ హోమ్ డిపో వాడు కూడా “ఈ వాలెంటేన్స్ డే కు ఇవ్వండి మీ పురుషునుకి “ అని అడ్వటేజ్మ్ంట్లలో ‘ఒక సుత్తి ఒక మేకు ‘ అమ్ముతున్నారు. పవర్ టూల్స్ అని మర తిప్పేది, మేకు కొట్టేది, జంపరో మరోటో…
మగవాళ్ళకు ఇలా సుత్తి, కత్తి కొడవలి తప్ప మరోటి నచ్చదా? వాళ్ళకు గిఫ్టుగా ఇవ్వాలంటే సుత్తే గతా మనకు? ఇంత సుత్తా వీళ్ళు? ఎంటో ఇంత అన్యాయం.
మనకు తప్పటంలేదులా వుంది చూడబోతే … సుత్తిగా….
నేను మా వారికి ఇక ఇంట్లో వున్న అరడజను సుత్తులకు తోడుగా మరో వీర సుత్తే కొనాలమో చూడబోతే!!!😛😛
