“యత్ర నార్యస్య పూజ్యంతే రమంతే తత్ర దేవతా”
ఇది శృతి వాక్యం!
ఎంతమంది ఆధునిక పురుషులు దీనిని నమ్ముతారంటే అదో పెద్ద ప్రశ్న.
గుడిలో దేవతగా స్త్రీ బొమ్మను మొక్కుతారు, కానీ ఇంట్లో భార్యను కష్ట పెడతారు.
(అంతా కాదు, కానీ అధిక శాతం పురుషులు)
స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అయినా, ప్రతి మతం, కులం అనాదిగా స్త్రీలను ద్వితీయ పౌరుల తరహాలోనే చూసింది, చూస్తున్నది,చూపించింది అన్నది నిర్వివాదం.
హిందూ లైన మనకు స్త్రీ శక్తి ని ఇంతగా కొలిచే సంస్కృతి ఉన్నా… మన సమాజంలో స్త్రీ లమీద వివక్షత అత్యంత ఎక్కువగా వుంది. ఆంక్షలూ ఎక్కువే!
తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా, స్నేహితురాలిగా ఉన్నా, ఎప్పుడు ఏ పురుషుని నుంచి తిప్పలు ఎదుర్కోవాలో తెలియని పరిస్థితే నేటి మహిళకు భారతీయ సమాజంలో ఉన్నది.
మాతృ సామ్యక సమాజం నుంచి పితృ సామ్యకంగా ఈ యుగం లో ఎప్పుడు మారిందో నాకు తెలియదు కానీ, చరిత్రలో స్త్రీ లు తమ స్వేచ్ఛ కోసం చాలా యుద్ధాలే చెయ్యవలసి వచ్చింది.
ధైర్యం కోసం రుద్రమదేవిని, లక్ష్మి భాయిని చూడటం కాదు, నేటి పరిస్థితులలో ఇంటికో రుద్రమదేవి ఉండవలసిన సమయము, అవసరము నేడు కలుగుతోంది.
రాజుల, రాణుల చరిత్ర కాస్త పక్కన పెడితే ఆధునిక యుగంలో స్త్రీ నేటికి స్వేచ్ఛ గా ఉన్న పరిస్థితికి కూడా అంత తొందరగా రాలేదు. దీనికి దాదాపు రెండువందల సంవత్సరముల ప్రతిఘటన జరిగింది. స్త్రీ కన్నీటి చరితల మధ్య, ప్రతిఘటనల మధ్య నేటికి కూసింత వెసలుబాటు దొరికింది. చరిత్రలో చూస్తే ప్రపంచదేశాలతో ఎక్కడా స్త్రీ కి న్యాయం జరిగినట్లు కనిపించదు.
ఎంతో ఆధునిక ప్రపంచమని అంతా అనుకునే ‘అమెరికా’లో కూడా స్త్రీ లకు ఓటు హక్కు 1920 వరకు సాధ్యపడలేదు, అంటే మనకు నమ్మశ్యక్యం కాదు. ఈ ఓటుహక్కును సాధించటానికి స్త్రీ లు అందరు కల్సికట్టుగా ఉద్యమించినది 1800 ప్రథమార్థంలో. అంటే 100 సంవత్సరాల ప్రతిఘటన తరువాత ఇది సాధ్యమైయ్యింది.
1920 లో 19 వ రాజ్యాంగ సవరణతో స్త్రీలకు ఓటు హక్కు సాధ్యమైంది.
ఒక మనిషిగా తమను తాము నిరూపించుకోవటానికి, తను సంపాదించే ఆస్తిలో, ధనం వాడటములోను హక్కు కోసం అమెరికాలో స్త్రీ లు ఎంతో యుద్ధం చేశారు. 1839 ప్రాతంలో ఆ హక్కుని కలిపించారు. అంటే ఆ పూర్వం తను సంపాదించిన ధనము భర్త సొత్తు అన్నమాట!
అయినా నేటికీ అమెరికాలో స్త్రీ కి పాలించే శక్తి ఉందని నమ్మరు. స్త్రీ లను తమతో సమానంగా చూడరు. వైట్ హౌస్ లోకి స్త్రీ ప్రవేశించటానికి ఇంకో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్ఛర్యపోనక్కర్లేదు.
స్త్రీ ని అంతరిక్షం లోకి పంపారు కానీ, రాజ్యాన్ని పాలించే అవకాశం ఇవ్వరు అని క్రితం ఎలక్షన్ లలో నిరూపించారు అమెరికాలో మగవారు.
2017 నాటికి, అంటే నేటికీ, వారి చట్టసభలో 500 మంది సభ్యులలో మొట్టమొదటి సారిగా 104 స్త్రీలు ఎన్నిక కాబడ్డారు. ఇంత మంది స్త్రీ లు వున్న మొట్టమొదటి చట్టసభ ఇదే.
సమాన పనికి – సమాన వేతనం అన్నది నేటికీ మృగ్యమే. 1963 లో అమెరికా చట్టసభలలో ఈ ‘లా’ వచ్చినా, పనిచేసే చోట తేడా ఇంకా ఉందని అందరికి తెలుసు.
ఇప్పటి మన అమెరికా ప్రెసిడెంటుకి స్త్రీ లమీద ఉన్న గౌరవం గురించి మాట్లాడకోకపోతే మంచిది. ఆయనకు అసలు స్త్రీ అంటే ఒక మనిషే కాదు కదా!
నవ నాగరికతకు మారు పేరైన ప్రపంచానంతా ఒక్కప్పుడు ఏలిన బ్రిటిష్ లో 1918 వరకూ కూడా స్త్రీ లకు ఓటు హక్కు లేదు. అంటే అంతవరకు వారికి స్త్రీ ఒక మనిషి అని అనిపించలేదు. 1918 లో వారు స్త్రీలకూ ఓటు హక్కుని కలిపించారు.
– ఇక మనదేశానికి వస్తే మనకు స్వాతంత్రం వచ్చినా స్త్రీ కి స్వాతంత్రం ఇప్పటికి పూర్తిగా రాలేదు అనే అనిపించే, కనిపించే సత్యం.
మన సమాజములో ఇంకా అవిద్య, స్వేచ్ఛ, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, అంటరానితనం, స్త్రీల నెలసరి, ఆరోగ్యం ఇలాంటి ప్రథమ విషయాల మీద అవగాహాన లోపము అధికము. ఇలాంటి మౌలిక వనరులు అన్ని వర్గాల స్త్రీలకు అందించటములో విఫలమవుతున్నారు ప్రభుత్వం, సమాజము.
స్త్రీని బయటకు పంపించటంలో మనకు కనిపించని, కనిపించే పరిధులు ఎన్నో, ఎన్నెన్నో !!
స్త్రీ నడక, నడత చివరకు వస్త్ర ధారణ మీద కూడా ప్రతి వారు మాట్లాడటం నిజంగా సహించరాని దోషం.కొంత పరిధి దాటి పురోగమించిన వారికి వెన్నక్కి లాగేవారు ఎక్కువ. సహాయం చేసే చేతులు తక్కువ.
తెలుగుస్త్రీ కి ఆస్తి లో హక్కు 1985 వరకు లేదన్నది నిజం. పూర్వం ఇచ్చే స్త్రీ ధన, వరకట్నం లాంటిదే తప్ప, ఆస్తిలో హక్కు పూర్వం లేదు.
నేటి ఆధునికత మూలంగా పని భారం రెట్టింపు అవటము, వత్తిడి, ఇంట్లో వాతావరణము స్త్రీలను క్రుంగతీసేవే కాని సహాయపడే వారి శాతము తక్కువే. నేటి మారిన కాలముతో వివక్షత కొత్త చోట్లకు కూడా వ్యాపించింది. అడుగడుగు గండాలని దాటుకొని స్త్రీలు పురోగమిస్తున్నా, వారికి వత్తిడి కలిగించేవి అత్యధికం. వారు ప్రతి క్షణం తమను తాము నిరూపించుకుంటూనే ఉండాల్సిరావటము నేడు సర్వత్రా కనపడుతోంది.
‘వినా స్త్రీ యా జననం నాస్తి
వినా స్త్రీ యా గమనం నాస్తి
వినా స్త్రీ యా జీవం నాస్తి
వినా స్త్రీ యా సృష్టి యేవ నాస్తి’
అన్న విషయము కనుక గుర్తు పెట్టుకుంటే అసలు స్త్రీలకు ఇలాంటి స్థితి కలగదు. పురుషులకు, అజ్ఞానపు స్త్రీలకు కూడా మనము ఈ విషయము గుర్తు చెయ్యాలి. అందుకే మనకు మధ్య మధ్యలో ఇలాంటి మహిళాదినోత్సవాల అవసరము తప్పదు. ప్రతి వారు స్త్రీలను సగటు సాటి మనిషిగా గుర్తించి గౌరవిస్తే ఇలాంటివి పర్వదినాలు. లేనిచో ఇవి హక్కులు గురించి, సాధించ వలసిన గమ్యాల గురించి చర్చించే పనిదినాలు. అంత వరకూ ఇది ఉద్యమమే తప్ప పండుగ కాదు.