నిర్జన వారధి – సమీక్ష

మనం మన తప్పుల నుంచి  నేర్చుకోవాలంటే  మన జీవితకాలం సరిపోతుందా? 
చాలదు కదా! 
అందుకే మనం ప్రక్కవాళ్ళ జీవితం చూసి కొన్ని నేర్చుకోవాలి.  అది ఎలా అని ప్రశ్న వచ్చినప్పుడు, జీవిత చరిత్రలు చదివి అని చెప్పవచ్చు. మంచి జీవిత చరిత్రలు, మనలను ఉత్తేజపరిచే జీవిత చరిత్రలను ఒక లిస్టు రాసుకుంటే దానిలో తప్పక జత పరచవలసిన  పుస్తకాలలోనిర్జన వారధితప్పక ఉంటుంది. 
కొండపల్లి కోటేశ్వరమ్మగారి సమగ్ర చరిత్ర ఇది. కోటేశ్వరమ్మ గారు కమ్యూనిష్టు పార్టి కార్యకర్త. తన జీవితమంతా పార్టి భావజాలాన్ని ఆకళింపుచేసుకున్న మహిళ. కొండపల్లి సీతారామయ్య గారి భార్య. 

నిర్జనవారధినేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. 
మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే చక్కటి పుస్తకం ఇది. ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టకుండా ముగించలేము. నేను పెరిగిన తెలంగాణాలో రాడికల్స్ ప్రభావం, నక్సలైట్స్ అంటే సానుభూతి ఉండేది. అప్పుడుకొండపల్లిఅన్న పేరు చాలా పాపులర్. పేరు చూసి పుస్తకం కొన్నాననుకుంటా, గుర్తులేదు. – 
కానీ కొన్నప్పుడు, 
నేను ఒక్క అద్భుత జీవితం గురించి తెలుసుకోబోతున్నానని,
పడి లేచి కెరటంలా, జీవితంలో ఎదురైనా సవాళ్ళను ఒంటి చేత్తో ఎదురుకొని నిలిచిన  అపూర్వమైన వ్యక్తిత్వాన్ని చదవబోతున్నానని,   
ఒక ధీరోదాత్తమైన, ఉదాత్తమైన, కరుణరసాత్మకమైన, అన్నిటికీ మించి స్ఫూర్తిదాయకమైన సజీవమైన జీవిత కథను చదవబోతున్నానని, 
సంస్కరణోద్యమ, జాతీయోద్యమ, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ, నక్సల్బరీ ఉద్యమం”   నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న ఘనమైన చరిత్ర కల విప్లవ నారి జీవితం చదువబోతున్నట్లు,
నమ్మిన సిద్దాంతాన్ని జీవితమంతా పాటించి నిలచిన ఒక మొక్కవోని, అపజయం లేని కార్యకర్తని చదవబోతున్నానని,
మహిళలకే తలమానికంలా మెరిసే ఘనమైన చరిత్రను చదబోతున్నానని తెలియదు.
మహిళా రత్నం, మొక్కవోని కమ్యూనిస్టు కార్యకర్త, ధీశాలి, మృదు స్వభావి, మంచితనంతో, నమ్మిన పార్టీ సిద్ధాంతంతో చివరివరకు తమ తోటివారికి, తమ చుట్టూ ఉన్నవారికి ఒక మార్గదర్శకంగా ఉన్నకొండపల్లి కోటేశ్వరమ్మడగారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. 

ఆమె జీవితం ఒక కష్టాల కడలి. పార్టీ కోసం, తన జీవితాన్ని క్రొవ్వత్తిలా కరిగించిన త్యాగి. 
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చిన లెక్క చెయ్యక, పార్టీకోసం, ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం తనను తానూ సమర్పించున్న మహా వ్యక్తిత్వం చదివితే తప్పక స్పూర్తి పొందుతారు. అందుకే ప్రతి వారు ఆమె గురించి తప్పక తెలుసుకోవాలి అని మాత్రం చెప్పగలను. 

ఆమెది చిన్నతనంలో బాల్య వివాహం. అదిగో పసుపు, ఇదిగో ముసుగులా 7 సంవత్సరాలకే ముక్కుపచ్చలారని చిన్నారి వితంతువు. చదువు హైస్కూలు వరకూ. తరువాత ఆమె తన చదువు కొనసాగించారు దుర్గాబాయి గారి మహిళా సభలో. 

చిన్నతనం నుంచి సర్వం ప్రజలకోసం అర్పించే త్యాగం ఆమె సొంతం. గాంధీజీ స్వాతంత్ర సమరంలో భాగంగా వారి ఊరు వచ్చినప్పుడు తన శరీరం మీద ఉన్న నగలు పెద్దలను అడగకుండానే తీసి ఇచ్చిన ఉదంతం అందుకు ఉదాహరణ. 
కమ్యూనిస్టు, మావో భావజాలాలతో పెరిగిన కొండపల్లి సీతారామయ్య గారితో వివాహం. వారి వివాహం కూడా సంఘ సంస్కరణోద్యమంలో భాగం. 
చిన్నతనం నుంచి మధురమైన కంఠస్వరం, సంగీతం నేర్చుకొన్న నేపథ్యం వలన దేశ భక్తి గీతాలు పాడటం, ప్రజలను ప్రభావితం చెయ్యగలిగారు కోటేశ్వరమ్మగారు. 
పార చేత పట్టావే చెల్లెమ్మ, మట్టి తట్ట ఎత్తివే చెల్లెమ్మవంటి పాటలతో ఉత్తేజ పరిచేవారు. 
పార్టీ కోసం కలం పట్టినా, పాడినా, ప్రచారం చేసినా, సంసారం, పిల్లలను వదిలి రహస్య జీవితం గడిపినా అన్నిటిలో సమసమాజ స్థాపన కోసం, ప్రజల కోసం అన్న ఒక బలమైన సంకల్పము ఆమెను నడిపించింది. 
తన ఆరోగ్యం సైతం లెక్క చెయ్యక ఆమె పార్టీని, నమ్మిన సిద్ధాంతాలను పాటించటం మనకు ఆశ్చర్యంగా వుంటుంది. ఎలాంటి కష్టాలు, ఎంత వంటరి జీవితం గడపవలసి వచ్సినా, మొండిగా వాటిని ఎదుర్కోవటం మనకు వింత గా వుంటుంది.   

అది కమ్యూనిస్టుల మీద ప్రభుత్వం ఆంక్షలు వేసిన రోజులు. పార్టీలో ముఖ్యులు అంతా రహస్య స్థావరాలలో తల దాచుకున్నారు. 
సాయుధులైన మహిళలు పిల్లలను గుర్తుచేసుకోరుఅని సమాధాన పడుతారు తన రహస్య జీవితంలో పిల్లల గురించి ఆలోచించినప్పుడు. 
పిల్లలు ఎక్కడో, భర్త ఎక్కడో తెలియకుండా నాలుగు సంవత్సరాలు ఆమె అలా వివిధ స్థావరాలలో గడిపిన జీవితం గురించి వివరముగా చెబుతారు. 
అవి చదువుతుంటే మనకు నమ్మిన సిద్దాంతాల కోసం, సమ సమాజ స్థాపనకు కొందరు చేసిన త్యాగం కళ్ళ ముందు తారాడి, గౌరవము కలిగిస్తుంది. 
సందర్భంలో ఆంధ్రాలో వీర మరణం చెందిన చింతపల్లి పాపారావు గురించి తెలుసుకొని చాల ఖేదపడతారు కోటేశ్వరమ్మగారు. సందర్భంలో ఆమె రాసిన గీతం నేటికీ తూర్పు ఆంధ్రాలో గీతంగా పాడు కుంటున్నారు. 

తన అనుభవాలని ఇదేదో మేనిఫెస్టోలా కాకుండా చక్కటి వర్ణనలు, రోజు పాడుకున్న పాటలు, జీవన శైలి గురించి ముచ్చటిస్తారు. 
పార్టీ మీద నిషేధం ఎత్తివేసిన తరుణంలో సొంత ఇంటికి వెడుతున్నప్పుడు ఆమెకు వెలుగు గురించి వర్ణించటం, ఆమె రహస్య జీవితం అంతమై ఇంక కుటుంబంతో కలిసి ఉంటున్నందుకు సంతోషం కనపడుతుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ లోకి వెడుతుంటే కన్నతల్లి ఇంటిలోకి వెడుతున్నట్లు భావిస్తారు ఆమె. 
అంతగా పార్టితో  వారు మమైక్య మైపోయారు. 
కోటేశ్వరమ్మగారు మహిళా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. వారు వెళ్లిన చోట్లలో మహిళా వికాసం గురించి, మహిళలకు ఉండవలసిన పద్ధతులు గురించి వివరించేవారు. ఉదా: రవిక వేసుకొనమని వారు గిరిజనులను వప్పించటము వంటివి. 
వీటన్నిటి మధ్య ప్రజల కోసం బ్రతికిన సీతారామయ్య గారు కోటేశ్వరమ్మను వదిలి వెళ్లి పోవటం నాకు అసలు అర్థం కాని విషయం. తనతో పాటు ఆస్తిని వదిలిన స్త్రీ, పార్టీ కోసం చిన్న పిల్లలను వదిలేసి రహస్య జీవితం గడిపిన మహిళను ఆయన వదిలేసి వెళ్ళిపోవటం, అదీ మరో స్త్రీ తో కలిసి ఉండటానికిఅన్నది మనకర్థం కాదు. 
అలాంటి సందర్భాలలో కానీ,జీవితంలో ఆమె ఒక్కసారిగా ఒంటరిగా అవటం, కష్టాల సుడిగుండాలు కౌగిలి,ఆమె కొడుకును నక్సలైటు అని పోలీసులు మాయం చేసినప్పుడు కానీ,మనస్సు వికలమైయ్యే సంఘటనలలో కానీ కోటేశ్వరమ్మగారు మౌనం వహించారు, దాన్ని అందరి మధ్యకు తీసుకురారు. ఎవ్వరిని నిందించరు. ఆమె మౌనం, ఆత్మాభిమానంతో వంటరిగా నిలబడటం నిజంగా మనలను ఆశ్చర్యం లోకి నెట్టివేస్తుంది. ఆమె నమ్మిన సిద్ధాంతం ఆమెకు బలం ఇచ్చాయి కాబోలో. 
ఆమె తల్లి ఆమెతోకష్టాలకే పుట్టేవేఅని బాధపడుతుంది. తల్లి మరణం, అల్లుని హఠాత్ మరణం, కూతురు ఆత్మహత్య, ఇవి ఆమెను మరింత కృంగచేస్తాయి. సీతారామయ్య తిరిగి వచ్చినప్పుడు ఆమె చూపిన ధైర్యం, ఆయన్ని కలవటానికి నిరాకరించటంఆత్మ విశ్వసం అంటే కోటేశ్వరమ్మగారని అని చెప్పకనే చెబుతాయి. అలాంటి సందర్భాలలో పార్టీ పెద్దలు ఆమెను బ్రతిమిలాడితే  ఆమె పలికిన మాటలు మణిపూసలు. 
ఇవ్వనీ కళ్ళచూసినశీత గాలికి చలించినా , గ్రీష్మ తాపానికి భీతి చెందినా….. శిశిరంలో రాలి పోకుండా తొంభై వసంతాలు చూశానన్నారు. 
ఆమె రాసిన పాటలలోమనది తెలుగు దేశమమ్మా!
మనది తెలుగు జాతి తల్లీ ! 
వీరులను గన్నది తల్లీ 
వీర మాతల జన్మభూమిఅన్న పాట చాలా పేరున్న గీతం.
కష్టాలు ఆమెను కష్టపెట్టాయై కానీ ఆమె నుంచి ఆమె ఆశయాలకనుగుణంగా జీవించే ధైర్యం మాత్రం తీసివెయ్య లేకపోయాయిఅంటే కోటేశ్వరమ్మగారి ముందుజీవితం ఓడిపోయింది. 
మొక్కవోని ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా కోటేశ్వరమ్మ గారు నిలిచారు. అందుకే ఆమె  జీవిత గాధ ప్రతి ఒక్కరు చదవలసిన పుస్తకం.  

Leave a comment