“శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేతి గానరసం ఫణి
కోవేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా ”
అన్ని పెద్దలు చెప్పారు.
చిన్నలను పెద్దలను, పశు పక్షాదులను సమానముగా అలరించి మైమరపించే శక్తి సంగీతానికి ఉంది.
అలాంటి సంగీతంలో కొన్ని రాగాలు మరీ అవలీలగా ఆకట్టుకొని, హృదయాన్ని ఉరూతలూగిస్తాయి.
అలా అలవోకగా మనసును రంజించే రాగాలలో “హిందోళ” రాగ మొకటి.
హిందుస్తానీ వారు ‘మాల్కోస్’ అంటారు దీనినే.
దీనికి 20వ మేళకర్త అయిన ‘నటభైరవి’ జన్యం.
ఈ రాగం చాలా సున్నితమైన రాగాలలో ఒకటి. పాదరసములా సాగిపోతుందనిపిస్తుంది వింటుంటే.
దీని
ఆరోహణ : స గ మ ద ని స
అవరోహణ :స ని ద మ గ స
మా పాప చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ ‘హిందోళ’లో ఉన్న సినిమా పాటలు విని, ఆ పాటే కావాలని చాలా మారం చేసేది. దానికి రాగాల గురించి జ్ఞానం లేకపోయినా హిందోళ రాగం అక్కట్టుకున్నట్లుగా మరో రాగం వినేది కాదు అంటే అతిశయోక్తి లేదు. హిందోళ అలాంటి రాగము. ఈ రాగానికి ఉన్న మైమరపించే గుణం అలాంటిది. మా అమ్మాయి ఆ పాటనే ప్రతి రోజు వినాలని గోలుచేసినది. “పగలే వెన్నెలా – జగమే ఉయ్యాల” అన్న ఆ పాట హిందోళ లో s. రాజేశ్వవరావు గారు జత పరిచారు. పూజాఫలమన్న చిత్రం లోనిది. సుశీల పాడారు ఈ పాటను.
హిందోళ రాగము ఔఢవ రాగం. పంచ స్వరాలతో ఉండే ఈ రాగం లో మోహన ఛాయలు కూడా కొంత మనకు కనిపిస్తాయి.
ప్రపంచ సంగీతంలో చైనా కు చెందిన సంగీతంలో హిందోళ చ్ఛాయలు ఉన్న సంగీతం ఉందని విద్వంసులు చెబుతారు.
చల్లని వేళ మనసును రంజింపచేయు ఈ రాగం, ఆరోగ్యం కూడా అందిస్తుంది.
ఈ రాగము వినటం వలన చిన్నపాటి జ్వరాలు రాకుండా సహాయపడుతుంది.
అజీర్తి వేళ ఈ రాగం వింటే, అజీర్తి తగ్గుతుందని సంగీత వైజ్ఞానులు చెబుతారు. కాలేయానికి సంబంధించిన రుగ్మతలకు కూడా తగ్గిస్తుందని అంటారు.
వాజ్ఞేయకారులు ఎన్నో గొప్ప పాటలను ఈ రాగంలో కూర్చారు.
ప్రజల నాలుకలమీద ఆడిన “సామజవర గమనా” అన్న త్యాగరాజ కృతి ఈ రాగం లోనిదే.
‘ మనసులోని మర్మమమును తెలుసుకొని, గోవర్ధన గిరి ధారి ” అన్న త్యాగరాజ కీర్తనలు హిందోళ రాగంలోనివే !
– ప్రఖ్యాత పురందర దాసు “రామ మంత్రవే జపిసో” అన్న కృతి హిందోళ రాగములోనిదే!
– ‘మామవతు శ్రీ సరస్వతీ’ అన్న మైసూర్ వసుదేవాచార్య వారి క్రిర్తన ఈ రాగం లోనిదే.
-‘నీరజాక్షి, కామాక్షి ” అన్న మురుస్వామి దీక్షితులు వారిది ‘భజరె గోపాలం మానసభజరే గోపాలం ” అన్న సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిని హిందోళ రాగములోనివి.
M S సుబ్బలక్ష్మి గారి కంఠంలో మధురంగా పలికే అన్నమయ్య కీర్తన “దేవదేవం భజే , కొండలలో నెలకొన్న ” హిందోళమే! “నిగమ నిగమాంతరంగా” అన్న అన్నమయ్య కీర్తన కూడా హిందోళ రాగమే!
బాల మురళి కృష్ణ తిల్లానా “డిం న నా త ధీరనా ” హిందోళా లో కూర్చినదే.
ఈ రాగం మోహన రాగం తరువాత చిత్రపరిశ్రమలో అత్యధికంగా వాడిన రాగం.
ఇందులో ఎన్నో ప్రఖ్యాతమైన పాటలు ఉన్నాయి.
అందులో కొన్ని :
1.విప్రనారాయణ చిత్రం లో “చూడామదే చెలియా”.
2.మంచి కుటుంభం లోనుంచి – మనసే అందాల బృందావనం. –
3. సువర్ణ సుందరి చిత్రం నుంచి – పిలువకురా – అలుగకురా “.
4. తెలుగు ప్రజలను ఉరూతలూగించిన లవకుశ చిత్రం లోని “రామ కథను వినరయ్య – “.
5. అనార్కలి నుంచి ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా”.
6.సాగర సంగమం లో “ఓం నమః శివాయ”
7. బలమిత్రుల కథ నుంచి ‘గున్న మామిడి కొమ్మ మీద ”
8. పూజాఫలం నుంచి – పగలే వెన్నెలా జగమే ఊయల”
9. మంచి మనసులు లోని “నన్ను వదిలి నీవు పోలేవు లే”
10. వాగ్దానం లోని “నా కంటి పాపలో నిలచిపోరా”
11. అల్లరి మొగుడు లోని “నా పాట పంచామృతం”
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ప్రఖ్యాత ప్రజాదరణకు నోచుకున్న పాటలు ఈ రాగంలో కనిపిస్తాయి.
ప్రతి రాగానికి నాదం ముఖ్యం.
మనకు మన పూజ్యులైన సంగీత త్రయం అందించిన ఈ రాగాలను మనః శుద్ధిగా పలికించి, సాధన చేసినా,
అవి ప్రజలను అలరించటంలో, మనసులను ఆకట్టుకోవటంలో తప్పక విజయం సాధిస్తాయి.
సంగీతానికి సాహిత్యం కూడా సహకరిస్తుంది. పూర్వపు సంగీతంలో సాహిత్యం పెద్దపీట వేసుకునేది. అందుకనే నాద, రాగ సాహిత్య ఆలంబనగా వచ్చిన సంగీతం ఆపాతమధురంగా వుండి అజరామరమైనది.
సర్వ జనులను అలరించి, పిల్లలను, పెద్దలను, జ్ఞానులను పామరులను అందరిని ఏక కాలములో ఆనందింపచేసింది.
నేటి సంగీతం నెత్తి నొప్పి తెప్పిస్తుంటే,
పూర్వపు సంగీతం సర్వ రోగాలను తీరుస్తూ నేటికీ ప్రజాధారణ పొందుతున్నది అనటంలో అతిశయోక్తి లేదు.
హిందోళ ఏ కాలంలోనైనా వినవచ్చును. వినదగిన రాగం కూడా. హిందోళ రాగముతో ఈ రోజంతా పండింది ఇలా.