“హ్యాండు బ్యాగు” అంటే క్లుప్తంగా చేతి సంచి. నేటి ఆధునిక స్త్రీ చేతి లో అత్యవసరమైన ఆభరణాలలో లేదా వస్తువులలో ఒకటి. ఇది చేతిలో లేకండా మనము గడపదాటము. మనకు తోచదు కూడా. మన సర్వ సందలు ఒక ఎత్తు మన హ్యండు బ్యాగు ఒక ఎత్తు.
దీని పుట్టు పూర్వోత్తరాలు పరిశీలిస్తే చాలా వింతైన విషయాలు కనిపిస్తాయి.
పూర్వం పశ్చిమ దేశాలలో, యూరోప్ లో ముఖ్యంగా 17 వ శతాబ్దంలో పురుషులు డబ్బును, నాణ్యాలను ఉంచుకోవటానికి చిన్న సంచులు వాడేవారట. తరువాత స్త్రీ లు తమ వ్యక్తిగత వస్తువులు ఉంచుకోవటం కోసం,వారి వస్త్ర ధారణలో జేబులు ఉండవు కాబట్టి, ఈ బ్యాగులు అన్న కాన్సెప్ట్ వచ్చింది.
18 వ శతాబ్ధ ప్రారంభలో స్త్రీలు చిన్న సంచి తమ కూడా ఉంచుకునే వారు . ఈ సంచులు అప్పుడు బట్టతో కానీ, తోలుతో కానీ చేసినవి వాడేవారు. వాటికి లేసులు అల్లినవి, అందంగా కనపడేలా చెయ్యటం మొదలెట్టారు 19 వ శతాబ్దము మొదట్లో. అలా అందమైన సంచులు, చిన్న లేసు చేతి సంచులు గా రూపాంతరం పొంది, వివిధ రూపాలుగా, రకాలుగా మారి నేటి మన జీవితంలో ఒక పెద్ద భాగంగా మారాయి ఈ హ్యండు బ్యాగులు.
నేటి ఆడవారికి చేతిసంచి లేదా బ్యాగు లేనిదే రోజు కుదరదు.
వారు వాడే చాల పర్సనల్ సామాను నుంచి వంటగది కోసం కొన్న చిన్న సరుకుల వరకు, కలం, కాగితం నుంచి పిల్లల స్కూల్ బుక్ వరకు, తలనొప్పి టాబ్లెట్ నుంచి పిల్లల దగ్గు మందు వరకు, స్టేపీలరు నుంచి పక్క పిన్ను వరకు, పిన్నీసుల్నుంచి ఇంటికి తాళాల గుత్తి వరకు, రెండేళ్ల నాడు కనపడకుండా పోయిన బిల్ నుంచి నిన్నటి వంట రెసిపి వరకు…… అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఆడవారు తమ చేతి సంచిలో దాస్తారు. ఇంద్రజాలకుని చేతిలో ఉన్న టోపీ లోంచి సర్వ జీవులు, వస్తువులు వస్తున్నట్లుగా, స్త్రీ తమ చేతి సంచినుంచి తియ్యని వస్తువు ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఈ చేతి సంచులు ఎలా రూపాంతరం చెందాయో, అలానే వాటిలో ఉంచుకునే వస్తువులు కూడా వారి జీవన ప్రయాణం బట్టి మారుతూ ఉంటాయి. వివరంగా చెప్పాలంటే, స్కూలులో ఉన్న పిల్లల చేతి సంచి ఒక లాగా, కాలేజీ అమ్మాయి హ్యాండ్బాగ్ ఒకలాగా, ఇంక పెళ్లి అయిన మహిళ బ్యాగు మరోలా, తల్లి గా మారిన మగువ చేతిలో మరోలా ఇలా వస్తువులు రూపాంతరం చెందుతాయి.
స్త్రీ ల అవసరాల నుంచి నేటి ఫ్యాషన్ వరకు ఈ బ్యాగు మోస్తుంది. బ్యాగు ఆ స్త్రీ యొక్క జీవితం వివరిస్తుంది కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే.
ఈ బ్యాగులతో కొంతమంది వారు నమ్మిన, నమ్ముతున్న సిద్ధాంతాలను ప్రచారం చేయ్యటానికి వాడుతూవుంటారు. అందుకు కూడా బ్యాగులు పనికి వస్తాయి.
చేతి సంచి అని మాములుగా అనుకోవటానికి లేదు. ఇవి కాటన్ బ్యాగుల నుంచి అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగుల వరకూ ఉన్నాయి.
ప్రపంచంలో నేటి వరకు అత్యంత ఖరీదైన చేతి సంచిగా డైమండ్స్ తో చేసిన హీర్మేస్ బిర్కిన్ బ్యాగు. అది 300,000 డాలర్ల కు అమ్ముడు పోయి ప్రపంచంలో లోనే అత్యంత ఖరీదైన బ్యాగుగా నమోదు చేసుకుంది.
బ్రాండెడ్ బ్యాగులు అన్నీ చాలా ఖరీదుతో కూడిఉంటాయి. వాటి ధరలు మోడలు బట్టి మారుతూ వుంటాయి. ప్రతి సంవత్సరము ఒక కొత్త మోడలు మార్కెటులోకి విడుదల చేస్తారు తయారీదారులు.
బ్యాగుల గురించి ఆమస్టడమ్ లో క్యాలిఫోనియాలో మ్యూజియం కూడా వుంది. అందులో వీటి పుట్టుక నుంచి నేటి వరకూ వచ్చిన మార్పులతో వున్న బ్యాగులు చూడవచ్చు.
బ్రాండ్ అన్నది మనిషికనిపెట్టినా ఆ బ్రాండ్ మనుషులను ఆడిస్తోంది ఇప్పుడు. మీరు వాడే చేతి సంచితో, మీకున్నదేమిటో, లేనిదేమిటో కూడా కనిపెట్టే పరిస్థితులు నేడు ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత బ్రాండ్ బ్యాగులుగా ‘ఛానెల్, ఫెండి, లూయిస్ విట్టోన్, మార్క్ జాకబ్స్, యాప్స్ సెయింట్స్,’ ఇత్యాదివి పేరు గడించాయి.
గత సంవత్సరం భారతదేశంలో మగువల మనసును చూరగొన్న బ్రాండులు డామిలన్, హిడిజైన్, బగ్గీట్, క్యాప్రెస్ లాడిదా మొదలైనవి.
ఈ బ్రాండ్ బ్యాగులన్నీ మనం సామాన్యంగా బాలీవుడ్, హాలీవుడ్ వారి చేతులలో చూస్తూనే ఉంటాము.
మనమూ కొనవచ్చు మనకు ఆ డిజైన్లు, ధరలు నచ్చితే.
ఇక్కడ థాంక్సు గివింగ్ సమయంలో అమ్మే అమ్మకాలలో బాగ్యులు అత్యంత ఎక్కువ అమ్మే వస్తువు – ఎలక్ట్రానిక్ వస్తువుల తర్వాత.
అమెరికా లో మిడిల్ స్కూల్ , అంటే ఆరవతరగతికి, వచ్చాక బ్యాగు వాడటం మొదలుపెడుతారు అమ్మాయిలు. అసలు ఆ వయసులో వారికి బ్యాగులు ఎందుకో నాకు అర్థం కాదు.
అప్పట్నుంచి వారికి ఆ పిచ్చి మొదలవుతుంది. హై స్కూల్ లో ‘వేరా బ్రాడ్లీ’ చాలా పేరు మోసిన బ్రాండు. ఆ బ్రాండ్ అంటే పిల్లలు తెగ ముచ్చట పడుతూ ఉంటారు. ఆ బ్రాండ్ అందమైన మన భారతీయ డిజైన్ లా ఉండే డిజైన్స్ తో, బట్ట బ్యాగులు అద్భుతంగా తయారు చేసి మార్కెట్ చెయ్యటంలో సఫలీ కృతులయ్యారు. ప్రతి స్కూల్ వెళ్లే అమ్మాయికి ఈ వేరా బ్రాడ్లీ బ్యాగు తప్పక ఉండవల్సినదే.
అలాగే మొసలి చర్మంతో చేసే బ్యాగులు ప్రపంచంలో అత్యంత పేరుపొందిన ఖరీదైన బ్యాగులు. వీటిని వాడవద్దని జంతు ప్రేమికులు పిలుపునిచ్చినా వాడటం ఆపరు అలంకరణ ప్రియులు.
అమెరికా లో ఉన్న తూర్పు ఆసియ సంతతి వారు బాగా పాపులర్ చేసిన బ్రాండ్లు కోచ్, మైకేల్ ఖోల్స్ బ్యాగులు. ఇవి కాన్వాస్ వంటి మెటీరియల్ తో తయారు చెయ్యబడి ఉంటాయి. ఖరీదు కూడాను ఒక్కోటి 100 నుంచి 900 డాల్లల వరకూ పలుకుతాయి.
అవి భారతీయులు కూడా విరివిరిగా వాడుతారు. ఈ మధ్యన హైదరాబాద్ లో కూడా చూశాను చాలా మంది వాడటం.
ఈ బ్యాగులలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగు (చేతి సంచి), పర్సు (చిన్నదిగా ఉంటుంది), బ్యాక్ ప్యాక్ (భుజాలకు వెనకగా వేసుకుంటారు) ఇత్యాదివి.
బ్యాగుకు పర్సుకి పెద్ద తేడా ఉండదు. కొన్ని బ్యాగులు పర్సుగా మార్చొచ్చు.
బ్యాగులు అవసరం తీర్చటం మాత్రమే కూడా కాకుండా,నేటి అందంలో అలకరణంలో భాగం కూడా. అందుకే ఇన్ని రకాలైన, విధాలైన బ్యాగులు మనకు లభ్యమౌతున్నాయి బజారులో.
ఎంత అందానికి ప్రాముఖ్యత నిచ్చినా అవి వాటి ప్రథమ అవసరము తీర్చటం మాత్రం అవి తప్పక చెయ్యవలసినదే. అంతే కాక మంచి మన్నిక కూడా వుండాలి. అందుకే మనము బ్యాగులు కొనే ముందు ఈ విషయము మరవకూడదు.
అలాగే నేటి మారిన కాలానికణుగుణంగా బ్యాగులలో మార్పులను కూడా చాడవచ్చు. నేడు సర్వత్రా మనకు చేతిలో ఆభరణంలా సెల్ఫోను వుండవలసినదే. అలా వాడే ఫోను చార్జింగులకు అవసరమయ్యే బ్యాగులను మనము త్వరలో చూడగలమెమో….