జ్ఞాపకాల సందడి -4
పిడకలవేట – తీసినతాట
మేము పెరిగినది తాలూకా పట్టణము వంటిదైనా, చాలా చిన్న వూరే. నాన్నగారు డిప్యూటితాసిల్‌దారు. మాకు ఎవ్వరూ తెలియకపోయినా అందరికి మేము బానే తెలుసు.
మా ఇల్లు చుట్టూ వున్న ఇళ్ళ పిల్లలతో భేదాలు లేకుండా తిరిగేవాళ్ళము.
ఆటలలో, చదువులలో ఒకటేమిటి… సర్వం.
మా నానమ్మ నా మిత్రులను ఇంట్లో కి రానియ్యకపోతే అందరము వెనక దొడ్డోనో, నడిమి గదిలనో తినేవాళ్ళము తిండి. అంతలా కలిసితిరిగేవాళ్ళము. మా ఇంటి చుట్టూ వుండేవాళ్ళలో ఎవరు ఏ కులమో మతమో తెలియదు. మాకు తెలుసుకోవాలని కూడా తెలియదు. అమ్మ కూడా ఎప్పుడూ తేడాలు చూపేది కాదు. మాయామర్మం తెలియని మా అమాయక హృదయాలను అలాగే వుంచేది. నానమ్మ మాత్రం ఇంట్లోకి ముఖ్యంగా వంటగదిలోకి ఎవ్వరిని రానిచ్చేది కాదు. ఆవిడ మడి పిచ్చిది అని మేమూ దూరంగా వుండే వాళ్ళము.
మా ఇంటి చుట్టు ప్రక్కల వారికి చాలా మందికి చాలా పశు సంపద వుండేది. పశువుల కాపరులు ఉదయము వాటిని నడిపించుకు వూరు బయటకు మేత కోసము తీసుకుపోవటము, సాయంత్రము మళ్ళీ గమ్యస్థానం చేర్చటము సామాన్యంగా జరిగేవి. అలా తీసుకుపోయే పశువులు బారులుగా, గుంపులుగా మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవి. మా ఇంటి ముందు చాలా పెద్ద రోడు వుండేది. రోజుకొక్కసారి మాత్రమే ఒక బస్సు వెళ్ళేది.
ఇంటి ప్రక్కన వున్న కొందరు తక్కువ స్థాయి ( ఆర్ధికంగా) వున్న వారు రోడు మీద పోతున్న పశువుల వెంట బడి తట్టలలో పేడ ఎత్తుకు తెచ్చుకునేవారు. మరీ ప్రత్యేకంగా మా ఇంటి ప్రక్కన వున్న వాళ్ళు అలా చేసేవారు. వాళ్ళ అమ్మ ఆ పేడకు వరి పొట్టు కలిపి పిడకలు గోడకు కొట్టేది. ఆ పిడకలు చెయ్యటము నాకు చూడటానికి బహు బాగుండేది. ఆవిడ పేడ మొత్తం ఒక తొట్టిలో వేసి, దానిలో నీరు పోసి, పొట్టు వేసి, ముందు బాగా కలిపేది రెండూ చేతులతో. మనము గోదుమపిండి కలిపినట్టుగా. తరువాత చాలా గుండ్రటి బంతులుగా చేసేది. వాటిని ఈడ్చి గోడకేసి కొడితే, అవి టక్కున అతుక్కుపోయేవి. అలా ఎలా అత్తుక్కుపోతాయో అర్థమయ్యేది కాదు. ఆవిడ పిడకలు చేసి, గోడకేసి కొట్టడం చూసి నేను చాలా ఎంజాయి చేసేదాన్ని.
ఇలా వుండగా ఒక రోజు మేము నాలుగు డబ్బాలాట ఆడు కుంటునాము. ఆ ఆట బలే బావుంటుంది. నాలుగు డబ్బాలు గీసి, మధ్యలో నాలుగు రాళ్ళు పెడతారు. నాలుగు డబ్బాలలో నలుగురు వుండాలి. ఔటు అయినవాళ్ళు ఆ డబ్బాల చుట్టూ తిరుగుతూ కాసుకోవాలి రాళ్ళను. ఈ నలుగురూ ఆ రాళ్ళని లాక్కిని దొంగ తాకకముందే అన్ని ఒక దగ్గర చేర్చాలి.
ఔటు ఎవరవ్వాలో నిర్ణయించటానికి చేతులు కలిపి పంటలెసేవాళ్ళము.
సరే, ఆ రోజు మా గేము మంచి రసపట్టులో వుంది.
ఇంతలో మా పక్కింటావిడి –
‘ఓ రమా! బర్రెలోచ్చే టైం అయ్యింది, వెళ్ళి పెండ పట్టుకురా పో। ‘ అని పిలిచింది.
ఈ పిల్ల అంత సిరీయస్ ఆట మధ్యలో వదలి వెళ్ళిపోయింది తట్ట పట్టుకు.
మేము
‘రామా పోకే! మీ అమ్మకు పోనని చెప్పు” అంటే వినలేదు.
అది భయపడుతుంది వాళ్ళ అమ్మకు.
“పెండిచ్చి వస్తనే, మీరాడండి’ అంటూ తుర్రు మంది.
మేము ఆట మధ్యలో ఆగిపోతుందని, అందరము దానికి హెల్ప చెయ్యాలని డిసైడు చేశాము. అక్కా ఇంకో పిల్లా రామన్నారు. నేను ఎదురుంటి పిల్ల కలసి దీనికి సహాయానికి వెళ్ళాము.
అక్కడ మా మజా చూడాలి. పేడ ముట్టుకోవటానికి మాకేమి అసహ్యం కూడా వెయ్యలేదు.
ఆదో ఆట మాకు అక్కడ. గుంపులు గుంపులుగా వచ్చే పశువులకు క్రింద తొంగి చూడటం దూరం నుంచి,పెండ కనపడగాన్ రయ్యిమని పరిగెతి తీసుకొని తట్టలో వెయ్యటమూ.
అసలు మా వేగానికి కాపరులు ఆశ్చర్యపోయారు. మేము దాని తట్ట నింపి, తొట్టి నింపి విజయగర్వముతో సంతోషముగా ఇంటికి వెళ్ళాము.
అంత మురుకుగా వురుకుతూ దొడ్డోకి వెడితే మా అమ్మ తెల్లబోయ్యింది పాపం. నా నిర్వాకం వేషం చూసి.
వంటికి బట్టలకు ఫుల్ పేడ. అందునా అక్క అప్పటికే సిద్దం చేసింది ఇంట్లో వాళ్ళని.
ముందు సాన్నం చెయ్యనిచ్చి, ఆ బట్టలు తడిపించింది నానమ్మ. ఇంట్లోకి వచ్చాక అమ్మ ఫుల్‌గా వడ్డించింది. అలా మొదటి సారి అమ్మ చేత దెబ్బలు తిన్నాను ఆ రోజు.
“నాకు హడావిడి తప్ప ఆలోచన లేదని, నాన్న పేరు చెడగొడుతున్నామని” కొప్పడింది. అమ్మ నన్ను కొట్టడము చూసి నానమ్మ కూడా శాంతించి నన్ను ఆ రోజు ఏమీ అనలేదు. నాకు నాన్న పరువు గట్రా అర్థం కాలేదు కానీ, అమ్మకు ఇష్టం లేదని మాత్రం తెలిసింది. అమ్మ తరువాత నన్ను ప్రేమగా ముద్దుచేసి నన్ను కొట్టినందుకు బాధ పడుతుంటే నాకు చాలా ఏడుపొచ్చింది.
తరువాత మళ్ళీ అలాంటి (పేడ కోసం పరుగెత్తే)అవకాశమొచ్చింది కానీ అమ్మకు నచ్చదని నేను వెళ్ళలేదు. ఆ రోజే కాదు ఏ రోజు అమ్మకు నచ్చని పని చెయ్యకూడదని నిర్ణయించుకున్నా. అది నా ఐదవ తరగతిలో నేను తీసుకున్న నిర్ణయము. జీవితమంతా పాటించా. అందుకే అమ్మను నేను కోల్పోపోయిన తరువాత నన్ను నేను కోల్పోయాను.