ప్రయాణములో పదనిసలు -7
బాలిలో మేము
మేము వైజాగు నుంచి సింగపూరు మీదుగా ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్ళాము. అక్కడ మా క్రిస్మస్ సెలువలు గడపాలని మా ఉద్దేశము.
వైజాగులో విమానము ఎర్రబస్సును పోలిన అనుభవమిచ్చినా, బాలిలో మాత్రం స్వాగతం అద్భుతంగా వుంది.
మేము వుండే ‘గ్రాండు హయత్తు’ వారు మా కోసం కారు పంపారు. మేము ఆ దీవిలో వున్నన్ని రోజులు మాకు ఇలలో కలలా, కలలో కల్పనలా, వెరసి భూతల స్వర్గంలా అనిపించిన మాట వాస్తవము. మేము హోటల్ కు వెళ్ళే సరికే మా అమ్మాయి శాన్‌ప్రాన్సిసుకో నుంచి ముందు రాత్రే వచ్చేసింది. మేము ముగ్గురము అలా బాలిలో కలుసుకొని మా సెలువలు గడపాలని ముందే నిశ్చయించుకున్నాములెండి.
ఇండోనేషియా 17000 చిన్న చిన్న ద్వీపాలతో కూడిన చక్కటి దేశం. భూమధ్య రేఖకు రెండు వైపులా వ్యాపించిన దీవులు, బాలీ అందులో ఒక అందమైన ద్వీపము. భూమధ్య రేఖకు దిగువన, దక్షిన గోళము వైపు వున్న దీవి.
శుభ్రమైన సాగరతీరము, గాలీ, పరిచిన చక్కటి రోడ్లూ, క్రమశిక్షణ కలిగిన ట్రాఫిక్, చవకైన రుచికరమైన ఆహారము, స్నేహపూర్వకమైన ప్రజలతో పాటు శతాబ్ధాల చరిత్రతో నిండిన దేవాలయాలతో రమ్యమైన దీవి.
ఇండియా నుంచి సమయములో రెండు గంటలు ముందుంటారు వారు.
రాత్రంతా ప్రయాణం చేశాము కాబట్టి వెళ్ళి నిమ్మళించాక ఎటైనా వెళ్ళాలని అనుకున్నాము. బాలిలో 80% హిందూ సంస్కృతి. దేవాలయాల ద్వీపమని (Temple Island)అని పేరు దానికి. హిందూ దేవతల ప్రతిమలు ప్రతి కూడలిలో కనిపించి కనివిందు చేస్తాయి. మన దేశం, వాళ్ళను చూసి నేర్చుకోవాల్సినది చాలా వుంది. ముఖ్యంగా మన సంస్కృతిని కాపాడుకోవటము అన్నది ఎలా వాళ్ళను చూస్తే అర్థమవుతుంది.
మేము ఏదైనా ట్రిప్పుకు వెళ్ళే ముందు శ్రీవారు, హనీ కలసి ఒక ఏక్సెల్ లో చూడవలసిన స్థలాలు, టైములు మొదలైనవి రాసి వుంచుతారు. వాళ్ళు గోలగా అది చూసి నాకర్ధము కాని బాషలో ఇది చుద్దాం, అది చుద్దాం అని పీకులాడుకొని చివరకు ‘టెంపుల్ ఆన్ క్లీఫ్’(Temple on cliff) అనే చోటు ఖరారు చేశారు.
ఆ ప్రదేశము సముద్రం ప్రక్కన ఎతైన కొండ అంచున వున్న గుడి. చాలా సుందరమైన ప్రదేశము. నీలి రంగు సముద్రము, తెల్లని ఇసుక, ఎంతో ఎత్తున కొండ శిఖరాగ్రన గుడి. సూర్యాస్తమయము అక్కడ చూడ చక్కనిదిట. హనీ తన ఫ్రెండ్సు చెప్పారని ఒక గైడు కం ట్యాక్సీ డ్రైవరును పిలిచింది. అతని పేరు ఆదిత్య. అతడు చక్కని ఇంగ్లీషు మాట్లాడుతూ, మంచి అనుభవముతో స్నేహంగా వున్నాడు. అతనికి మేము వెళ్ళాల్సిన ప్రదేశము చెప్పారు ఈ అప్పాకూతుళ్ళు.
బాలీ దీవి చిన్నదైనా ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళటానికి చాలా టైం తీసుకుంటుంది. రోడ్లు చిన్నవి, స్పీడు లిమిట్ కూడా తక్కువ . మధ్యాహ్నము మూడుకు బయలుచేరాము మేము. దానికి చేరటానికి దాదాపు గంట పైన పట్టింది. కారు వెళ్ళగలిగినంత వరకూ వెళ్ళాక పార్కు చేసి మాతో వచ్చి టికెట్ ఇప్పించాడతను. ఇండోనేషియాలో గుళ్ళలోకి వెళ్ళాలంటే ‘సరంగు’ అన్న లుంగీ ధరించాలి అందరూ తప్పక. మాకు ఆరెంజు, శ్రీవారికి వంకాయ రంగుదీ ఇచ్చారు. అవి చుట్టుకు మెట్ల వైపు సాగాము.
మేము మెట్లు ఎక్కుతుండగా ఆదిత్య
చెప్పాడు అక్కడ కోతులు అత్యధికమని, చాలా తెలివైనవని. మన చేతులలో ఏది దొరికితే అవి లాక్కొనిపోతాయి. వాటికి ఫుడ్ పడేస్తే మన వద్ద లాకున్న వస్తువును క్రింద పడవెస్తాయని, జాగ్రత్తగా వుండమన్నాడతను.
జనం చాలానే వున్నారు. బాలిలో అది టూరిస్టు సీజను. బాలీకి అసలు సంవత్సరము పొడుగునా జనాలేనట. అక్కడ వారి సాంప్రదాయమైన నృత్యము చూచి తీరవలసినదే అన్నాడు ఆదిత్య. మేము టికెటు ఖరీదైనా తీసుకున్నాము. వారి డ్యాన్సు చూడాలనే ఉత్సుకతతో. గుడి చాలా పాతది, 11 వ శతాబ్ధం నాటిది. గుడి మూసి వేసి వుంది. అందులోకి ఎవ్వరిని అనుమతించరు పూజారులు తప్ప. ఎవ్వరైనా బయటనుంచే చూడాలి. క్రింద నీలి సముద్రము తెల్లని ఇసుక కనువిందుగా వున్నాయి. అంతటి సౌందర్యమును ఆస్వాదిస్తూ మేము తెగ సంతోషపడ్డాము. కెమారాను జాగ్రత్తగా నా మెడ చుట్టూ కట్టుకు తిరిగాను నేను. కోతులకు భయపడి.
కోతులు వివిధ సైజులలో, వయస్సులలో వున్నాయి. ఎక్కడా వాటికి భయమన్నది లేదు. స్వేచ్చగా చాలా యాక్టివ్ గా తిరుగుతున్నాయి. జనాల వస్తువులు లాక్కుపోతున్నాయి. మేము సింగిల్ గా గ్రూపుగా అక్కడా ఇక్కడా బావున్న చోటా, బాలేని చోట ఫోటోలే ఫోటోలు తీసుకుంటున్నాము.
మావారు తనని సింగిలుగా ఫోటోలు తియ్యమని కూతురిని బ్రతిమిలాడి ఫోజులిచ్చుకుంటున్నారు. ఇంతలో ఒక తుంటరి టీనేజ్ మంకీ ఆయన ప్రక్కకు వచ్చింది. తన చేతులో ఏమీలేవి పీకటానికి. మేము కోతి అన్న కేక గొంతులో వుండగానే ఆయన ప్రక్కన కూర్చొని ఆయన కళ్ళజోడు దాని చేత్తో లాఘవంగా లాగి నొట్లో పెట్టుకొని వూపుతూ మమ్ములను తుంటరిగా చూడటం మొదలెట్టింది. మేము కేకలువేసాము కాని అది అవతలకు దుమికేసింది. ఉత్తర క్షణమే మా వారు కళ్ళు కనబడక కొతీలా తాతలా గెంతులు మొదలెట్టారు. నాకు కంగారు, తనకు కళ్ళు కనపడవని. హనీ ఒకవైపు, ఆదిత్య ఒక వైపు పరుగులు తీశారు. కోతి కోసము. అక్కడ గుడి సిబ్బంది ఇద్దరు గోడలు దుమికి, ప్రాకి చూశారు. పరిస్థితి అంతా క్షణాల్లో మారిపోయింది. ఈయన శివతాండవము ఆపటము ఎవ్వరి వల్లా కాలేదు. కథాకళిలో భరతనాట్యము కలపి జుగల్‌బంది ఆడటము మొదలెట్టాడు. ఆ కోతులు మరో అమ్మాయి కళ్ళజోడూ పీకాయి. ఆ పిల్లకూ సైటు ఎక్తువనుకుంటా. ఒక ముక్క దొరికింది. దాన్ని ఒక కన్ను మీద పెట్టుకు మిగిలిన భాగం వెతుక్కుంటోది. ఇంకో ఇద్దరు ఫోను కోసము, ఇద్దరు కళ్ళజోళ్ళ కోసము అలా చీకటి పడే వరకూ మాతో కలిసి వెతికారు. ఏమీ లాభము లేకపోయింది. ఈ లోపల హనీ వెళ్ళి కొన్న టికెట్లు ఎవరికో అమ్మి వచ్చింది. మావారు తనకు ఆంగ్లం వచ్చిన బూతులన్నిటితో ఆ కోతులను తిట్టాడు. ఇంకో కళ్ళజోడు పోగొట్టుకున్న వీరుడు కోతులను రాళ్ళెట్టి కొట్టాడు. అవి ఒక్కసారిగా కీచు మంటూ అరుస్తూ మీదకొచ్చాయి. అందరమూ పరుగో పరుగు అక్కడ్నుంచి.
నేనూ పతివ్రతకు పెద్దమ్మలా మావారి చెయ్యి పట్టుకు అక్కడ మెట్లు ఇక్కడ గుంట అంటూ లాక్కొచ్చేశాను.
హడావిడిగా వెనకకు వచ్చి మా బస దగ్గరలో వున్న షాపులో కాంట్యాక్టు కొన్నారు ఆ రాత్రి ,ఆయన తన చూపు కోసము …అలా ఆయన తాండవ కథాకళి కొంత ఆగింది. ఆవిధముగా బాలి లో కోతుల కోతి చేష్ఠతో మావారి దబిడిదిబిడితో మా అమ్మాయి దిబిడిదబిడిలతో హలీడే మొదటిరోజు ప్రారంభమైనది.