స్వీటుతో ఫీటు

స్వీటు తో ఫీటు

మొన్ననే మా 25 పెళ్ళిరోజు జరిగింది. దాని కోసమని నేను ఏవో స్వీట్లూ, హాట్లూ చేసి పెడితే శ్రీ వారు తినిపెడతారుగా అని అనుకున్నా. నాకా వంటలు అంతగా రావు. పిండి వంటలూ అసలే రావు. 
అందుకే నేను వారూ వీరూ చెప్పినవి చేసి, మార్కులు కొట్టేస్తానన్నమాట. మా గిరిజమ్మగారు వచ్చినప్పుడు చక్కటి మైసూరుపాకు వంటి స్వీటు చేసి ‘7 కప్పుల స్వీటుఅని చెప్పి వెళ్ళారు. అది ఆవిడ చేస్తూవుంటే చాలా ఈజీ అనిపించింది సుమండి. నేను మాత్రం చెయ్యలేనా అని యద్దనపూడి హీరోయిన్ లెవల్ లో ముక్కపుటాలు అదరకొడుతూ వంటగదిలో ప్రవేశించాను. 

స్వీటుకు శనగపిండి, పంచదార, నెయ్యి, కొబ్బరిపొడి, పాలు,వెయ్యాలి. ఇందులో ఎదైనా రెండు మూడు కప్పులు వెయ్యాలి అనుకుంటా. 45 నిముషాలు త్రిప్పాలి, పొయ్యి మీద వుంచి. స్వీటు రెడీ. సులువైనదే కదూ. ముందు శనగపిండి వేయించి దాంట్లో నెయ్యి వేసి, తిప్పటము మొదలెట్టా. కొంత సేపటికి పంచదార రెండు కప్పులు వేసి, కొబ్బరి పొడి ఒక కప్పు వేశాను. కొద్దిగా ఇలాచి పొడి కొట్టి అదీ వేసి తిప్పాను, తిప్పాను, త్రిప్పుతూనే వున్నాను. దాదాపు 25 నిముషాల తరువాత కూడా అది ఎంటో పాకంలా పారుతూనే వుంది. ఎదో మరిచాను.. అని ఆలోచించా. 
అంతకు ముందు రోజు ఆమెతో మాట్లాడుతూ మళ్ళీ రెసిపీ రాసుకున్నా కూడాను, కానీ పేపరును, అప్పుడు చదువుతున్న బుక్కు లో bookmarker లా పెట్టేశా. రోజూ నాలుగు బుక్స్ చదువుతూ వుంటా. ఎందులో పెట్టానో గుర్తులేక, వెతకలేక వదిలేశా. ఇప్పుడు దీన్ని చూస్తే ఎదో వింత పదార్థము వలె తయారవుతున్నది. 
హూ! కాగల కార్యం కాక మానదుకాబట్టి చూద్దాము..అంటే అది విచ్చుకుపోవటం లేదుఅంటుకుపోతోంది. మళ్ళీ వేళ్ళ మీద లెక్క పెడుతూ పాలు మరిచానన్న మాట గుర్తుకు వచ్చింది. అప్పటికి 35 నిముషాలైయ్యింది. ఇది తిప్పటము మొదలెట్టి. అప్పుడు కప్పు పాలు వంపాను పదార్థం బుసబుస మని పొంగటము మొదలెట్టింది. రంగు కూడా కొద్దిగా మాడిన రంగు అని అనుమానము. పది నిముషాలు త్రిప్పి, ముందే నెయ్యి రాసిన కంచంలో వంపాను. చాలా పల్చగా వుంది. గట్టి పడే సూచనలు కనుచూపు మేరలో లేవు. 
ఫ్రిజ్జులో పెడితే గట్టిపడుతుందా?  కాని వేడి పద్ధార్థాలు ప్రిజ్జులో పెట్టరు, అయినా వేడి ప్లేటు ఫ్రిజ్జులో పెట్టేశా. అయినా అనుమానం తీరలేదు గట్టిపడుతుందా అని.  పైపెచ్చు అన్నీ కలిపి ఆరు కప్పులే అయ్యాయి. 
ఇంకో కప్పు మిస్సింగు. 
ఏమిటి మిక్సింగు చెయ్యాలో. 
గిరిజగారినడుగుదా మంటే ఆవిడ నిద్ర  సమయము. మాకు మధ్యహానము మరి. ఇండియాలో అర్థరాత్రి. యూట్యాబు గొట్టంలో చుద్దామని చూశా. అందులో 
ఎదో వెయ్యి. కానీ ఏడు కప్పులు చెయ్యిఅంది. 
నేను ప్రిజ్ లో పెట్టిన ప్లేటు చూస్తే ద్రవము గోందు (జిగురు లేదా బంక) లా సాగుతూ పారాడుతోంది. గడ్డకట్టే సూచన ఏడాదిలో లేనట్టుగా వుంది. బయటకు తీస్తే వొలికేలా వుంది. ఇలా కాదని తీసి మళ్ళీ బాండిలో కుమ్మరించి దాని నెత్తిన ఇంకో కప్పు కొబ్బరి గుమ్మరించా. మళ్ళీజై భోలో భగవాను కీ!’ అంటూ త్రిప్పి త్రిప్పి ఐదు నిముషాలు తీసి ప్లేటులోనే పోసి మళ్ళీ ఫ్రిజ్జులో పెట్టేశా. మూడు గంటలు కాదు నాలుగు గంటల తరువాత తీస్తే కొద్దిగా గడ్డకట్టింది. ముక్కలు చెయ్యపోతే కంచానికి అత్తుకొని విసిగించింది. 
చీ నాకసలు వంటలవసరమా? 
వంట వార్పు చూసి సంతోషించి షాపుకెళ్ళి కొనుక్కోవచ్చుగా 
లేకపోతే విడియోలు చూసి సంతోషపడి, పడుకొని నిద్రలో స్వీట్లు తిన్నట్లుగా కలలు కని ఆనందపడ్డొచ్చుగా. 
ఏదో పెళ్ళిరోజు ఏదో వచ్చిన స్వీటు అని రవ్వకేశరి వండి పెడితే వద్దనే వారున్నారా? 
ఇలావండితినేపోసరిగ్గా రావొచ్చుగారాలేదో పోఅవతల పారేయ్యవచ్చుగా….వుంచుకొని వగచనేల? ఇలా నన్ను నేను నానా తిట్లు తిట్టుకున్నా మనసులో…. 
దానికి కాంపెన్‌సేషనుగా డ్రై ప్రూట్సు తో లడ్డూ చేశాను. తప్యాలా చెక్కలు వండాను. ఇవి చేసి అలసిపోయా. 
7 కప్పుల స్వీటు, డ్రై ప్రూటు లడ్డూ, చెక్కలూ అన్నీ ముచ్చటగా అమర్చి, వంట గదిలో సర్ది వచ్చి కూర్చున్నా. రోజంతా కష్టపడ్డాను. చాలా నీరసంగా అనిపించింది. 
శ్రీవారు ఆఫీసు నుంచి  ట్రాఫికు ఈదుతూ వచ్చారు. నే ఎదో వండానని గ్రహించిపాపం ఎవో చేశావు. స్వీట్లు. కష్టపడతావుఅని సాగతీస్తూ జాలిపడుతూ స్వీట్లవైపు వెళ్ళారు. 
పరిక్షా ఫలితాలప్పుడో, ఎమ్‌సెట్టు రిజల్టప్పుడో ఎంత టెన్షను వుండొచ్చో, నాకు అలాంటి టెన్షను. 
తను ఒక ముక్క తీసి నోట్లో పెట్టుకొని, ఆగి నా వైపు ఒక చూపు విసిరి కళ్ళు మూసుకున్నాడు. 
నాకు భయంకరమైన నిశబ్ధము అనుభవమైయ్యింది. 
ఆహా!! మధురము. ఇంత కమ్మని స్వీట్ ఇన్ని రోజులు చెయ్యలేదెందుకు? నాకు కొబ్బరి ఇష్టమని కొబ్బరి స్వీట్ చేశావాఅని పొంగి పోయాడు మగడు. 
నేనుహమ్మయ్యఅని వూపిరి తీసుకొని, ‘మరో 25 ఏళ్ళు ఆగాలి ఇంకో స్వీటు కావాలంటేఅంటూ బడాయికి పోయాను భయం కవరింగుగా….

తుదిమెరుపు: స్వీట్లన్నీ ఒక పూటలో హుళ్ళీ ..అంటే గాయబ్అలా ఆయన పొట్టలోకి మాయమయ్యాయి. 
స్వీటు అద్భుతంగా కుదిరిందని అర్ధం..అర్ధం!!

డ్రైప్రూటు లడ్డూ రెసిపీ
అన్నీ సరిసమూనమైన కొలతలు. -1 కప్పు. 
నానబెట్టిన కర్జూరపండు గింజులు తీసినది 1 కప్పు
జీడిపప్పు 
పిస్తా
బాదంపప్పు
వాల్‌నట్సు
గసగసాలు
2 చెంచాల నెయ్యి. 
కర్జూరాలు తప్ప మిగిలిన డ్రైగా వేయ్యించాలి. 
కచ్చా పచ్చాగా మిక్సో తిప్పాలి. 
బాండిలో నెయ్యి వేసి, సన్నగా తరిగిన కర్జూరాలని  వేసి, మెత్తబడుతుండగా కచ్చా డ్రై ప్రూట్సును కలిపి లడ్డూ కట్టుకోవాలి. చాలా ఆరోగ్యకరమైన స్వీటు. ఫ్రోటిన్సు తో నిండి మంచి స్నాకు ఇది. 

Leave a comment