యోగులు– భూమిపై పరమాత్మ స్వరూపములు: శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా:
సూఫీ యోగి అంతర్ముఖముతో సదా ధ్యానము చేస్తూ, సత్యాన్వేషిగా వుంటాడు. దేవుడిని ప్రేమిస్తాడు. దేవునితో రమిస్తాడు. ధ్యాన దైవిక ప్రేమ భావనతో పరమాత్మలో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం. ప్రేమతో కూడిన భక్తి మాత్రమే దైవముతో ఐక్యమొందటానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఆడంబరాలకు దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, జీవితాన్ని గడుపుతారు సూఫీ యోగులు. భౌతికమైన ఉపవాసాలు, ప్రార్థనల కన్నా భక్తికి ప్రాముఖ్యతనిస్తారు సూఫీలు.
తపఃసంపన్నులైన
“ప్రేమ విస్తారంగా ప్రవహిస్తూ
ప్రభువుని అందరూ చూడగలిగే
ప్రవేశ నిష్ర్కమణ ద్వారాలు లేని
చోటుకి పదండి వెళదాం”
‘చాలా నేర్చుకున్నావు నువ్వు
వేల కొద్దీ పుస్తకాలు చదివావు
నిన్ను నీవు ఎప్పుడైనా చదువుకున్నావా
మసీదు మందిరాలకు వెళ్లావు
నీ ఆత్మను ఎప్పుడైనా దర్శించావా’
(18 వ శతాబ్దం సూఫీ కవిత్వం)
సూఫీ అంటే మతంలో గాఢమైన భక్తి. పరమాత్మలో ఐక్యమవుటకు కవిత్వం, నృత్యము, సంగీతము సాధనాలని నమ్ముతారు వారు.
సూఫీ అన్నది ‘సఫ్’ అన్న అరబిక్ మాట నుంచి ఉద్భవించినది. ‘సూఫ్‘ అంటే ‘కంబళి బట్ట‘ అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక సౌఖ్యాలకు లోనుకాక, నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల ఈ మతానికి ‘సూఫీ‘ అని పేరొచ్చింది.’సూఫీ‘ అంటే– పవిత్రతకు, స్వేచ్ఛకు సంకేతం!
సూఫీ యోగి అంతర్ముఖముతో సదా ధ్యానము చేస్తూ, సత్యాన్వేషిగా వుంటాడు. దేవుడిని ప్రేమిస్తాడు. దేవునితో రమిస్తాడు. ధ్యాన దైవిక ప్రేమ భావనతో పరమాత్మలో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం. ప్రేమతో కూడిన భక్తి మాత్రమే దైవముతో ఐక్యమొందటానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఆడంబరాలకు దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, జీవితాన్ని గడుపుతారు సూఫీ యోగులు. భౌతికమైన ఉపవాసాలు, ప్రార్థనల కన్నా భక్తికి ప్రాముఖ్యతనిస్తారు సూఫీలు.
ఇస్లాం నుంచి ఆవిర్భవించి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సూఫీతత్వం కేవలం ఒక మతం కాదు. అది మతమన్న హద్దులు చెరిపేసి విశ్వంలో విస్తరించిన చైతన్యాన్ని, తత్త్వాన్నీ చూపిన సిద్ధాంతము.
భారతదేశములో సూఫీలు 1100 సంవత్సరాలకు పూర్వము ప్రవేశించారు. రాజస్థానాలను తిరస్కరించి, యోగులుగా సాధారణ, పేద జీవితము సాగించారు. వారు ప్రభువులు పంపిన కానుకలను తిరస్కరించి, బిక్షాటనే జీవనంగా సాగించారు.
అహంకారం జయించటమే ముఖ్యమని భక్తులకు ఉద్భోదించారు. ఆర్భాటాలకు చోటులేదు వారి ప్రాంగణంలో.
నామసంకీర్తనం చేస్తూ భక్తులకు సందేశాలు అందిస్తూ, నిజమైన సత్యాన్వేషణలో వున్న భక్తులకు మోక్షం ప్రసాదించారు.
సూఫీ వేదాంతములో చివరి దశ ‘ఫనా ఫి అల్లాహ్’. నిశ్చల భక్తితో
నమ్మిన భక్తులకు సమాధి స్థితిని అనుగ్రహించారు సూఫీ యోగులు.
అలా చేరవచ్చిన భక్తులను అనుగ్రహించి పరమాత్మ సాన్నిధ్యం అనుగ్రహించిన యోగి, శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా.
నాగపూరు సమీపములో నివసించిన తాజుద్దీన్ బాబా ప్రసిద్ద సూఫీ యోగి.
బద్రుద్దీన్, మీరాబీల కుమారుడు తాజుద్దీన్ బాబా. ఆయన పుట్టిన వెంటనే ఏడ్వలేదుట. అందుకని తండ్రి ఆచారం ప్రకారం కణతల మీద ముఖం మీద కాల్చారు. ఆ గుర్తులు ఆయన చివర వరకూ ముఖముపై వుండిపోయాయి.
తండ్రి, బాబా పుట్టిన సంవత్సరములో, తల్లి ఆయన 9 వ సంవత్సరములో మరణిస్తారు.
ఆయనను చిన్నతనములో ప్రసిద్ధ మహాత్ముడు అబ్దుల్లా షా చూడవస్తారు. వచ్చి, మౌనముగా వుండమని, మితముగా తినమని, మితంగా నిద్రపో’మ్మని చెప్పి మిఠాయి తినిపించి
వెళ్ళిపోతారు. ఆనాటి నుంచి తాజద్దీన్ లో మార్పు వస్తుంది.
హృదయాలను చూడమని, భావాలను దెబ్బతీయ్యవద్దని ఆయన చెప్పిన సందేశము.
‘సారాయి తాగు– ఖురాను కాబాను తగలబెట్టు –కావాలంటే దేవాలయంలో నివసించు, కానీ ఏ మానవుని మనసును గాయపరుచకు’. ఆయన చరిత్ర కూడా ఇదే మనకు నిరూపిస్తుంది.
తల్లితండ్రులు మరణించిన తరువాత తాజుద్దీన్ మేనమామ వద్ద పెరుగుతాడు. మామకోరికపై సైన్యంలో చేరుతాడు. సైన్యంలో వున్నా ప్రతిరోజూ ధ్యానము చెయ్యటము మానరు బాబా.
ఆయన ఆధ్యాత్మిక సాధన పెరిగే కొద్ది ఉద్యోగము చెయ్యలేక ఇక దానిని వదిలేస్తారు. అందరూ ఆయనకు పిచ్చి పట్టిందనుకుంటారు. మేనమామ వైద్యం చేయించే
ప్రయత్నం చేసినా ఏమీ మార్పు రాదు. చేసేది లేక ఆయనను వదిలేస్తారు.
అందరూ పిచ్చివాడన్నా పట్టించుకునే స్థితిలో తాజుద్దీన్ బాబా వుండరు. ఎప్పుడూ తన ఆత్మానందములో మునిగి వుండేవారు. కొన్ని రోజులకు ప్రజలకు ఆయనలోని మహత్యము తేటతెల్ల మవుతుంది. ఒక కుమ్మరిని ఒకనాడు వస్తువులన్నీ తీసుకొని ఇంటి బయటకు రమ్మంటారు. కుమ్మరి రాగానే ఇంటి కప్పు కూలిపోతుంది. వూరి వారు ఆ విచిత్రం చూసి బాబా భక్తులవుతారు. భిక్షటాన చేస్తూ వుండగా ఒకడు తన వద్ద ఏమీ లేదని చెబుతాడు. అతని ఇంటి లోపల వున్న గిన్నెలో వున్న ఆహారము వివరము చెప్పి అసత్యం చెప్పవద్దని చెబుతారు బాబా. రోజురోజుకీ ఆయన మహిమలు సువాసనలలా చుట్టూ వ్యాపిస్తాయి. ప్రజలు ఆయన వద్దకు రావటము ఎక్కువవుతుంది. ప్రజల వింత పోకడలు భరించలేక బాబా తనంతట తానే పిచ్చాసుపత్రిలో చేరుతారు. ఆసుపత్రి డాక్టరు బాబా భక్తులుగా మారుతారు. బాబా గదికి తాళం వేసి వున్నా బయట తిరిగుతూ కనపడేవారు. నిజ భక్తులను ఎక్కడవున్నా కాపాడుతూ వుండేవారు. ఆయన ఆసుపత్రిలో వుంచినా బయట తిరుగుతూ కనపడేవారు. ఆసుపత్రిలో చూస్తే అక్కడా వుండేవారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి. ఒక డాక్టరు భక్తుడు బొంబాయి వెడుతూ ఆశీస్సుల కోసం బాబాను మ్రొక్కుతాడు. బాబా మౌనముగా వుంటారు. డాక్టరు బ్రతిమిలాడుతాడు. బాబా డాక్టరుకు ఒక ఆకు ఇచ్చి, కూడా వుంచుకోమంటాడు. అతడు మంచినీటి కోసం రైలు దిగినప్పుడు మరో రైలు వచ్చి గుద్దుకోబోయి చివరి నిముషములో ఆగిపోతుంది. డాక్టరు రక్షించబడుతాడు. అతడు బాబా ఇచ్చిన రక్షకు ఎంతో సంతోషపడి బొంబాయి వెళ్ళి పని జరుపుకు వస్తాడు.
నాగపూరు మహారాజు రఘేజీ
బాబా భక్తులుగా మారుతాడు. ఆయన బాబాను భవనములో వచ్చి నివసించమని ప్రార్థిస్తాడు. బాబా వప్పుకొని భవనానికి వస్తారు. కాని ఎప్పుడూ అడివిలో తిరుగుతూ, భిక్షాటన చేస్తూ గడుపుతారు. బాబా కీర్తీ నలుదిశలూ వ్యాపించింది. ఆయనను ప్రజలు గొప్ప సూఫీ మహాత్మునిగా గౌరవించారు. ఆయన దర్శనార్థము లక్షలలో ప్రజలు వచ్చేవారు. మహారాజు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు చూచేవారు. బాబా భక్తులు సమర్పించే కానుకలు పేద ప్రజలకు పంచేవారు.
కొందరు బాబా కీర్తి చూసి, ఆయనకు వచ్చే కానుకలు చూసి అసూయ చెంది కలహాలు రేపుతారు. బాబాను కేవలము ముస్లింలు మాత్రమే దర్శించాలని నిబంధన పెడతారు. వారంతా కలసి నాజర్‌ఖాన్ అనే ఆయన అధ్యక్షతన ఒక సంస్థ ఏర్పాటు చేస్తారు. ఇవి మహారాజు హృదయాన్ని కలచివేస్తాయి. అయినా మహారాజు రఘేజీ బాబాను నమ్మకముగా సేవించారు. బాబా మహారాజుతో ’నన్ను ఇక్కడనుంచి నీ నుంచి దూరంగా ఎవరు తీసుకెళ్ళ గలరు? నా బస నీ ఇంట్లో నే లక్షల సంవత్సరాలు వుంటుంది’ అని అభయము ఇచ్చారు. ఆ మాట ప్రకారము నేటికీ ఆయన సమాధి తరువాత కూడా ఆ మందిరములో జరిగే అద్భుతాలే నిదర్శనము మనకు.
తాజుద్దీన్ బాబా జాతి, కుల, మత, బేధాలకు పరిమితం కాకుండా మానవజాతిలో దుఃఖం హరించటానికి వచ్చిన మహాత్ములు. 1924 లో బాబాకు కొద్దిగా జబ్బు చేస్తుంది. ఆయన మసీదు కెళ్ళి కూర్చొని కొద్దిగా తిని బయటకు వచ్చి నడుస్తూ ఒక ఖాళీగా వున్న ప్రదేశములో కూర్చొని ‘ ఇక్కడ నాకొక భవనము కట్టించండి’ అని చెబుతారు. బక్రీద్ చంద్ర దర్శన సమయములో నాగపూరు పుర వీధులు తిరిగి అందరికీ దర్శనము అనుగ్రహించారు. 1925 లో ఒకనాడు భవనము పై ఎన్నో పక్షులు వాలాయి. అవి మౌనముగా వుండిపోయాయి. బాబా వాటిని చూసి పడుకున్నారు. ఆయన ఆత్మ అనంతమైన చైతన్యంలో ఐక్యమై పోయ్యింది. ఆయన దర్గాను పూర్వం ఆయన చూపిన స్థలంలో నిర్మించారు.
ఆయన మరణించిన నాడు పాండురంగ మందిరములో విఠల్, రుక్మిణి విగ్రహాల నుంచి 12 గంటలు ఏకధాటిగా కన్నీరు వచ్చాయి. ఆ విషయము ఆనాటి ‘ది మెడ్రాసు మెయిల్’ ‘ఆంధ్ర పత్రిక’ లో వచ్చింది.
బాబా సమాధి తరువాత కూడా ఆయన లీలలు యధాప్రకారము జరుగుతున్నాయటానికి ఎన్నో దృష్యాంతరాలు భక్తులకు వున్నాయి. మతకలహాలు తీవ్రరూపము దాల్చినప్పుడు పరమాత్మ వివిధ రూపాలలో వచ్చి మానవజాతికి సందేశం ఇచ్చివెడుతున్నాడన్నది సత్యం. కబీరు, నానక్, షిర్డి సాయి అలాంటివారే. వారి కోవకు చెందిన వారే తాజుద్దీన్ బాబా. అన్ని మత విశ్వాసాలు సత్యాలని, సత్యం ఒక్కటేనని, బాహ్య ఆడంబరాలకు, అంధ విశ్వాసాలకు ఇతర మతాల పట్ల ద్వేషానికి బానిస కాకూడదనీ నిరూపించారు తాజుద్దీన్ బాబా. కులాలకు, మతాలకూ అతీతముగా అందరినీ ఆదరించారు బాబా.
బాబా మహ్మదీయుడు కాబట్టి, ఆ మతములోకి మారితే బాబాను సేవించవచ్చని ఒక భక్తుడు తలచాడు. బాబా ఒకసారి ఒక పుస్తకము తెమ్మనారు. భక్తుని వద్ద భగవద్గీత వుంది. అది ఇచ్చాడు. బాబా దాన్ని అటు ఇటూ త్రిప్పి ’ఇందులో మనమే వున్నాము’ అన్నారు. భక్తునికి బోధ అర్థమయ్యింది. కాశీనాథ్ పటేలు బాబాకు చందన మద్ది పుష్పమాల అలంకరించేవారు. బాబా ఎప్పుడూ అడ్డు చెప్పేవారు కారు. శిరిడి బాబాలా తాజుద్దీన్ బాబా భక్తుల భక్తికి లొంగి వుండేవారు. నిజమైన భక్తి ఒక్కటే భక్తుని భగవంతుని వద్దకు చేరుస్తుంది. బాబా తనను సేవించిన ఎందరినో మహాత్ములుగా మర్చారు బాబా. వారిలో ముఖ్యులు పార్శి మహాత్ముడు మెహర్ బాబా. ఉపాసినీ బాబా మహరాజ్ కూడా తాజుద్దీన్‌బాబాను సేవించారు.
అందరు సూఫీ మహాత్ముల వలెనే బాబాకు సంగీతమంటే ఇష్టము. గాయకులను పాడమని పొత్సహించేవారు. వారు పాడుతుంటే తన్మయత్వంతో నృత్యం చేసేవారు.
‘నీది కానిది నీవు తీసుకోకు’ అని హెచ్చరించేవారు.
తాజుద్దీన్ బాబా ఎందరికో ఆధ్యాత్మిక ఉన్నతినిచ్చారు. ఎందరినో శిరిడి పంపుతూ వుండేవారు. తనకూ శిరిడీ సాయికీ భేదము లేదని సూచించేవారు.
తాజుద్దీన్ బాబా తన జీవితమే సూక్తిగా ఎందరికో బోధ చేశారు.
‘దేవుడిని చూడాలని వుంటే నిన్ను నీవు తెలుసుకోవట మొక్కటే మార్గం’.
‘మనోనేత్రం ముందు గురువు యొక్క రూపాన్ని నిలుపుకొని, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో భగవంతుని నామాన్ని జపించండి’
‘పక్షి గుడ్ల మీద కూర్చున్నట్లుగా నీ హృదియం మీద అధిష్టించు. ఈ అభ్యాసము నిన్ను పూర్తిగా మార్చి వేసి అద్భుతుమైన అనుభవాలు ప్రసాదించగలదు’.
‘సుఖదుఃఖాలు అతిథుల వలె వచ్చి పోతాయి’ వంటి ఎన్నో సూక్తులు భక్తులకు ఉపదేశించారు.
సర్వ మానవజాతి సంక్షేమమే మతంగా భక్తులను ఉద్ధరించిన తాజుద్దీన్ బాబా సమాధి నాగపూరు దగ్గర వున్న సకర్దరాలో వున్నది.
ప్రణాములతో
సంధ్యాయల్లాప్రగడ
సంధ్యాయల్లాప్రగడ