అమ్మఆలోచనలు

అమ్మఆలోచనలు

1954 లో గుంటూరులో చికిత్స పొందుతున్న లోకనాథంగారిని చూడటానికి అమ్మ వచ్చింది. అమ్మ కట్టు బట్టలతో బయలుదేరింది ఆరోజు.
ఆనాటి వారి పరిస్థితి అది.

అమ్మ రోడ్డు మీద ఏడవ నెంబరు మైలు రాయి వద్ద కూర్చొని ఉంది.
ఆ సమయంలో రెడ్డి సుబ్బయ్య 8 రూపాయులు పెట్టి చీర కొని తెచ్చి అమ్మకిచ్చాడు.

తరువాత అమ్మ ఆ సంఘటన తలుచుకుంటూ “నాన్నా! ఇవాళ అమ్మకి పట్టు చీరలు పెట్టారు. బంగారం దిగేశారు. వీటి విలువ ఎక్కువ కావచ్చు. కాని నాకు మటుకు ఆనాడు సుబ్బయ్య 8 రూపాయులు పెట్టి తెచ్చిన చీరకు వీటికి పోలిక లేదు. దాని విలువ చాలా ఎక్కువ. ఆ చీర గొప్పది…” అన్నది.

***.

ఒకరోజు ఒక ముసలమ్మ వానలో తడుస్తూ అమ్మ వద్దకు వచ్చింది. ఆమె కట్టుకున్న చీర నీరు కారుతోంది. ఆ ముసలమ్మ చలికి గజగజ వణుకుతోంది.
ఆమె చూడగానే అమ్మ అక్కడ ఉన్న రామకృష్ణఅన్నయ్యని లోపలికెళ్ళి చీర తెమ్మంది.

అన్నయ్య లోపలికెళ్ళి వసుంధరక్కయ్యని “ అమ్మ చీర తీసుకు రమ్మంది” అన్నాడు.

ఆమె “ఎవరికి” అని అడిగి, ముసలమ్మ కివ్వటానికి అని తెలుసుకొని
బీరువా తీసి “లేవు” అన్నది.

అన్నయ్య వచ్చి అమ్మతో “లేవట” అన్నాడు.

అమ్మ చివ్వున లేచి లోపలికొచ్చి బీరువా తీసి అందులో మడతపెటిటన కొత్త పట్టుచీరను తీసుకొని బయలుదేరింది.

“అమ్మా అదొక్కటే ఉన్నది.ఇది కూడా ఇచ్చేస్తే రేపు నీవు కట్టుకోవటానికి చీర ఉండదమ్మా” అన్నది అక్కయ్య.

అమ్మ అదోలా చూస్తూ “నాకు చీర ఉండదని ఆలోచిస్తున్నావా? అదే వస్తుంది. మనకున్నవి ఇస్తే కొత్తవి వస్తాయి” అంటూ ఆ ముసలమ్మకు చీరనిచ్చింది.

మనం మనుషుల రూపం, వేషం చూసి గౌరవము, ప్రేమా స్నేహం ఇస్తాం.

కాని అమ్మ అందరినీ ఒక్కలాగా చూడగలదు. అందరినీ ఒక్కలాగానే ప్రేమించగలదు.

అమ్మ “రాగద్వేషాల రహితమైనదే అనసూయ. అసూయ లేనిదే అనసూయ” అని ప్రకటించింది అమ్మ.

“ప్రేమ నాకు సహజం.” అన్న అమ్మ ప్రేమించేవాళ్ళని, ద్వేషించే వాళ్ళనువిమర్శించేవాళ్ళను సమానంగా ఆదరించిందన్న విషయం అందరూ చూచినదే.

‘జగదంబా! పైపై మెరుగులకు భ్రాంతి చెందక అంతర్మఖమగునట్లు మమ్ము కాపాడ’మని అమ్మని వేడుకుందాం.

జయహో మాతా!

Leave a comment