అమ్మఆలోచనలు
ఒక భక్తుడు అమ్మను చూడటానికి జిల్లేళ్ళమూడి వెడుతున్నాడు. అది రాత్రి సమయం. అప్పటికి అక్కడికి రోడ్డు లేదు. కాలిబాట మీదుగా వెళ్ళాలి. రెండు కాలువలు దాటాలి. వచ్చే ఆ భక్తునికి ఆ కాలువ ఎక్కడ దాటాలో తెలియలేదు. వెతకగా అక్కడో పల్లెవాడు పడుకొని ఉన్నాడు.
ఈ భక్తుడు అతనిని నిద్రలేపి అడిగి, ఆ కాలువ దాటాడు. అతను అడగక పోయినా అతని చేతులో నలుభై పైసలు పెట్టి వచ్చాడు. పల్లెవాడు లెక్కపెట్టకుండా జేబులో పెట్టుకున్నాడు.
అమ్మ వద్దకు చేరాక అమ్మ ప్రేమగా భోజనం పెట్టింది. తిన్న తరువాత పడుకోమన్నది.
మాటల సందర్భంలో “ఆ పడవవాడికి నలుభైయా ఇచ్చావు నాన్నా?” అన్నది.
ఆ భక్తుడు జీవితంలో పొందనంత పెద్ద షాకుకు గురైనాడు. తనకే సరిగ్గా తెలియని వివరం అమ్మకెలా తెలుసు? అని అతనికి అర్థంకాలేదు.
మరో సంఘటనలో అమ్మ భక్తుడు శేషు హైద్రాబాదు నుంచి వస్తుంటే యక్సిడెంటు అయింది. ఎవరో. అతనిని లారీ ఎక్కించారు. సూర్యాపేటులో దింపారు. అక్కడ అతనిని బల్ల మీద పడుకోబెట్టారు. అతనికి స్ఫృహ తప్పతోందనిపించింది. ‘నేను చచ్చిపోతే అమ్మకు తెలియదు’ అనుకున్నాడు.
తరువాత అతనిని విజయవాడ ఆసుపత్రిలో చెర్చారు. రెండోరోజుకు అతను జిల్లేళ్ళమూడి చేరాడు.
“నీవు అక్కడ బల్ల మీద పడుకుంటే నిన్ను ఆసుపత్రి చేర్చారు …వాళ్ళు” అన్నది అమ్మ.
అమ్మకు ఎలా తెలిసిందో ఆయనకు అర్థంకాలేదు.
అమ్మనడిగితే “ఏముంది నాన్న – నా ముందు ఇప్పుడున్నట్లే కనిపిస్తూ ఉంటారు మీరు నాకు…” అన్నది.
మరో భక్తుడు అమ్మ దర్శనానికి వచ్చాడు.
అతను అమ్మను నమస్కరించి “ఇదే నా ప్రథమ దర్శనం అమ్మా!” అన్నాడు.
అమ్మ “ కాదు నాన్నా! నేను గుంటూరు వచ్చినప్పుడు సభ చేశారు. నీవు నీ మిత్రునితో కలిసి చివర ఆకరున నిలబడ్డావు. ఆ రోజు నీవు ఎర్ర చొక్కా వేసుకున్నావు…” అన్నది. అతను ఆశ్చర్యపోయాడు.
అమ్మ చెప్పినది నిజం. అమ్మ గుంటూరు వచ్చినప్పుడు సభ చేశారు. ప్రజలు వందలలో వచ్చారు. ఆ హాలు చివరన నిలబడి తన మిత్రునితో ఈ భక్తుడు అమ్మను చూసి, కాసేపు నిలబడి తదనంతరం వెళ్ళిపోయాడు. అంత మందిలో చూచి తదనంతరం వచ్చినప్పుడు అమ్మ అతనికి చెప్పటమే వింత.
అమ్మ చాలా సార్లు “నే నందరినీ ఎప్పుడూ చూస్తాను” అనేది.
“నేను మిమ్మల్ని ఎప్పుడూ చుస్తాను. కానీ నేను చూస్తున్నానని మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు నన్ను చూసినప్పుడే” అనేది.
అమ్మ భక్తులకు అమ్మ ఇలా చూడటమన్నది అనుభవమే.
అమ్మకు కాలభేదం లేదు. “నాకంతా వర్తమానమే!” అన్నది అందుకే అమ్మ.
అందరూ నా బిడ్డలే” అంది అమ్మ. అందుకే అందరినీ చూసుకోవటము అమ్మే చెయ్యగలదు.
“అమ్మా నీకంతా ఎలా కనపడుతుంది? దివ్యదృష్టి ఉందా?” అన్న ఒక భక్తునితో “అంతా దివ్యంగా కనపడటమే దివ్యదృష్టి” అని చమత్కరించింది అమ్మ.
తరువాత వివరిస్తూ “ ఇతరము కనిపించదు. అంతా నేనుగానే కనిపిస్తున్నారు…” అన్నది.
అందరిలో ఒకరిని “భోజనం చేశావా?” అని అడుగుతుంది.
“లేదమ్మా” అంటారు వారు.
“వెళ్ళి భోజనం చేసిరా!” అంటుంది అమ్మ.
భోజనం చెయ్యనివారే అమ్మకు కనపడతారు.
ఇటు వంటి ఉదాహరణలు ప్రతి భక్తులకు అనుభవమే జిల్లేళ్ళమూడిలో.
సదా సర్వలోకాలను చూస్తూ కాచుకొని ఉండే విశాలక్షి అమ్మ. అమ్మ “వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్నీనాభలోచనే!”
“జగదంబా! సదా మా దృష్టి నీ పదములని వీడక స్వస్వరూప సాధనలో ఉండేలా కాచుమని” అమ్మని ప్రార్థించటమే మనము చెయ్యగలిగేది.
జయహో మాతా!!