శంకర భగవత్పాదుల వారు రచించిన మోహముగ్ధరంలో ఒక శ్లోకం మనకు సత్సాంగత్యము గురించి చెబుతుంది.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
సత్పురుష సాంగత్యము వలన భవబంధములు తొలగును. బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానం ఏర్పడును. స్థిరజ్ఞానం ఏర్పడగా జీవన్ముక్తి కలుగును.
దీనికే మనకు సజ్జనులతో సాంగత్యము అవసరం.
ఏది లభించినా సజ్జనులతో మాత్రం సాంగత్యము దొరకటం అంత తేలికకాదు. అలాంటిది, మంచి మిత్రులు సజ్జనులు, మనలను మంచి వైపు నడిపించే స్నేహితులు మనకు లభ్యం అయ్యారంటే కేవలం మనకు ఆ జగజ్జనని కృప వలన మాత్రమే సంభవం.
నా భారతదేశ యాత్ర మొత్తం జగదంబ అనుక్షణం చెయ్యి పట్టుకు నడిచిన అనుభవమే. మరీ ముఖ్యంగా మా మిత్రులతో శ్రీశైల యాత్రలో కూడా అమ్మ ఆ అనుభవమే తిరిగి కలిగించింది.
నా వరకు ఆ యాత్ర యావత్తు ఒక విశేషమే! ఒక అద్భుతమే!
మేము బయలుదేరినది లగాయత్తు మా వాహనములో జగదంబ స్మరణతో, ఆ తల్లి లీలావిశేషాల కబుర్లతో గడిచింది. దారిలో మేము ఆగి భోజనం చేసినది శివపార్వతుల దేవాలయ ప్రాంగణమే.
శ్రీశైలములో మేము బస చేసినది పవిత్ర శ్రీపీఠ ప్రాంగణము. వారి చక్కటి వసతి, భోజనము, వారి అతిథ్యము అన్నపూర్ణమ్మ తల్లిని అనుక్షణం గుర్తుచేసింది. ఆ ప్రాంగణములో మేము మా పూజ, అభిషేకం, శ్రీచక్రారాధన, హోమం ఇత్యాదివి చేసుకొని, జప తపాదులతో తరించాం.
మల్లికార్జున స్వామివారి దేవాలయము నా చిన్నతనాన్ని బాగా గుర్తుకు తెచ్చింది. దేవాలయ ప్రాంగణములో అమ్మ చేసుకున్న లక్షవత్తుల నోము, పిన్ని చేసిన పసుపు కుంకుమ నోము, మేము ఆడిన ఆటలు అన్ని వరుసగా కళ్ళ ముందు కదలాడాయి. ( మేము చిన్నతనంలో ఈ దేవాలయం చాలా సార్లు వెళ్ళేవారం)
శ్రీశైలము పరమ పవిత్రమైన క్షేత్రం. మన తెలుగువారు చేసుకున్న అదృష్టం అంత శక్తివంతమైన క్షేత్రం తమ లోగిలిలో ఉండటము. అటు వంటి ఆ క్షేత్రంలో మేము మా చిన్న తనము ఆడి పాడామనుకుంటే నాకు ఆనంద పారవశ్యమే కలుగుతుంది.
సాక్షి గణపతి దర్శనము, శిఖర దర్శనము, భ్రమరాంబ దేవాలయ వెనక భాగములో చెవి ఒగ్గి భ్రమర నాదం వినటము మొదలైనవి చెయ్యని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మేము ఇవన్ని చేసి మురిసాము.
ఈ దేవాలయంలో మల్లన్న ప్రియంగా పలకరిస్తాడు. మేము మా చిన్నతనంలో ఈ మల్లన్న ఒక్కడే ప్రతివారు వెళ్ళి తాకి, తల కొట్టి “సామి వచ్చాము…దయ సూడు” అని చెప్పగలిగే దేవుడని అనుకునేవాళ్ళము. నిజానికి మల్లన్న పరమ దయాళువు కదా. శ్రీశైల క్షేత్రంలో శంకరులు నుంచి మొన్నమొన్నటి నడిచే దైవమైన శంకరభగవత్పాదుల అవతారముగా భక్తులచే కొలవబడిన శ్రీ చంద్రశేఖర యతివరేణ్యుల వరకు తపస్సు చేసుకున్నారు. శ్రీగురునిగా కొలవబడే శ్రీ నృసింహసరస్వతీ స్వామివారు కూడా శ్రీశైలం వచ్చే కదా… కదలివనంలో కలిసిపోయారు.
ఈ జ్ఞాపకాల తెరల మధ్య, ఈ విషయాల మాటల మధ్య మా ఈ యాత్ర చాలా ఉత్సాహంగా సాగింది.
భ్రమరాంబ తన గడప వద్దకు తిరిగి తిరిగి పిలుచుకుంది. కుంకుమ పూజకు మమ్ములను గడప వద్ద కూర్చోబెట్టి చేయించారు(కేవలం రెండు అడుగుల దూరంలో అమ్మ ఒడిలో కూర్చున్నాను). ఖడ్గమాలతో చేసే ఆ సేవ నాకు ఎల్లప్పుడు ఇష్టమే. మేము ఆ రాత్రి అమ్మ సేవ చేసుకొని, ఆ ప్రాంగణములో ఉయ్యాల సేవ చూసి లలితా సహస్రం పఠించి ఆనందించాము.
అటు పైన కష్టమైనా, పరమ ఇష్టంగా ఇష్టకామేశ్వరిని దర్శించి, అర్చించి పునీతులైనాము. అమ్మవారికి కుంకుమ దిద్ది, తల్లికి కానుకలు సమర్పించి, బుగ్గలు పుణికి సదా ధృడమైన భక్తిని ప్రసాదించమని ప్రార్థించాను.
మరునాడు తిరిగి ప్రయాణంలో నేను నా చిన్నతనంలో దర్శించిన బాలాత్రిపుర సుందరిని “ త్రిపురాంతకం”లో దర్శించాను. బాలమ్మను దర్శించాలని ఈ కళ్ళు కాయలు కాచాయి. ఆ కోరిక ఈ నాటికి తీరింది. అమ్మను సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకునే భాగ్యం కలిగింది. అటునుంచి భాగ్యనగరం చేరుకున్నాము మేము.
ఇంతటి మధురమైన దర్శన, స్పర్శన, అర్చనము నాకు మా మిత్రుల సత్సాంగత్యంతో మరింతగా మధురంగా తోచింది.
సాధనలో ఉన్నవారు ఎప్పుడూ ఓంటరి ప్రయాణం ఉత్తమమని పెద్దల మాట.
కాని సత్సాంగత్యంలో మరింత అర్థవంతం, విజయవంతం అవుతుందని మరోసారి తెలిసింది.
అసలు సత్సాంగత్యం మీద యోగవాషిష్ఠంలో చక్కటి కథ. ఉంది.
బహుశా చాలా మందికి తెలిసిన కథే ఇది.
ఒకరోజు సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగి నారాయణుని దగ్గరికి వచ్చి “స్వామి! సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏంటి?” అని ప్రశ్నించాడు.
“దీనికి నేను ఎందుకు సమాధానం చెప్పడం! వెళ్లి అక్కడ ఒక పురుగు ఉంది దానిని అడుగు…” అన్నాడు నారాయణుడు.
నారద మహర్షి పురుగు దగ్గరికి వెళ్లి “సత్సంగం అంటే ఏంటి? దానివలన ఉపయోగం ఏమిటి?” అని అడిగాడు.
పురుగు నారద మహర్షిని చూడగానే చనిపోయింది.
వెంటనే నారాయణుడి వద్దకు వచ్చి “స్వామి! సత్సంగం గురించి అడిగితే పురుగుని అడగమన్నారు. అడిగితే చనిపోయింది…” అన్నాడు.
నారాయణుడు నవ్వి “అవునా! అయితే అక్కడ ఉన్న ఆ పావురాన్ని అడుగు” అంటు పావురాన్ని చూపాడు.
నారదుడు వెళ్లి పావురాన్ని అడిగాడు.
పావురం కూడా మహర్షిని చూడగానే చనిపోయింది.
మహర్షికి కంగారు కలిగింది. ‘అయ్యో ఏంటి సత్సంగం గురించి అడిగితే ఇలా చనిపోతున్నాయి’ అనుకున్నాడు. వెళ్ళి నారాయణుడితో చెప్పాడు.
“అదిగో ఇప్పుడే పుట్టిన లేగదూడని అడుగు సత్సంగం గురించి!” అన్నాడాయన.
నారదుడు వెళ్ళి లేగదూడతో “సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏమిటి?” అనగానే మహర్షి వైపు చూసి చనిపోతుంది దూడ.
అప్పుడు నారదుడు భయపడి “ఇక సత్సంగం గురించి అడగను. అడిగితే చనిపోతున్నారు…” అని అనుకున్నాడు.
మళ్ళీ ఒక్కసారి నారాయణుడితో చెప్పాలని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు సందేహన్ని.
మహావిష్ణువు చెప్పాడు, “ఆ కనపడుతున్న రాజ్యంలో ఇప్పుడే పుట్టిన యువరాజు ఉన్నాడు…వెళ్ళి అడుగు…”
నారదుడు ‘ఇంతవరకు పురుగుని అడిగాను, పావురాన్ని అడిగాను, లేగదూడని అడిగాను కానీ అవన్ని చనిపోయాయి. ఈ సారి ఈ పిల్లాడిని అడిగితే వీడికి ఏమౌతుందో!’ అని భయపడుతు పిల్లాడి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా చెవిలో అడిగాడు, “సంత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏమిటి?” అని అడిగాడు.
పిల్లాడు నారదుడిని చూసి నవ్వుతూ, “మహాత్మా నారదా! నేను ఎవరో గుర్తుపట్టలేదా? నేనే ఆ పురుగుని, ఆ పావురాన్ని, ఆ లేగదూడని.. మీరు వచ్చి నాతో మాట్లాడడం వలన పురుగుగా ఉన్న నేను పావురాన్ని అయ్యాను. పావురంగా ఉన్న నేను లేగదూడగా పుట్టాను. మళ్ళీ వచ్చి మాట్లాడడం వలన 84 లక్షల జీవరాసులలోకెల్లా ఉత్తమమైన ఈ మానవ జన్మ పొందాను. మనిద్దరి మధ్య ఉన్న సత్సాంగత్యం వలన అపురూపమైన మానవ జన్మను పొందగలిగాను. ఇదే సత్సంగం యొక్క గొప్పతనం…” అంటూ వివరించాడు.
ఇదీ సత్సాంగం వలన ఉపయోగం.
కాబట్టి భారతదేశములోని మిత్రులు ఇక్కడి ఈ పుణ్యభూమిలో ప్రతిక్షణం అర్థవంతంగా, అమ్మను తలుస్తూ సత్సాంగంలో గడపాలని కోరుతున్నాను.
మరోసారి నా ప్రియ మిత్రులకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.