కృతికా నక్షత్రం…
వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||
శివశివానిలు జననిజనకులు ఈ జగతికి. వారు జగతికే కాదు గణపతి, స్కందులకు కూడా జననీజనకులు.
కుమారస్వామి శివశక్తుల పుత్రుడు. ఆయనను జ్యోతి స్వరూపంగా కొలుస్తారు భక్తులు.
ఈ స్వామికి కుమార స్వామి, స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, మురగన్, దండపాణి, వేలాయుదం అన్న పేర్లు ఉన్నాయి.
ఈయన యజ్ఞస్వరూపుడు. అగ్ని స్వరూపుడు. శివ పంచాయతనంలో ఈ స్వామి రూపు ఉండదు.(పంచాయతనం అంటే శివ,శక్తి,గణపతి, విష్ణవు, ఆదిత్య రూపాలను కలిపి కొలవటం) ఆయన అగ్ని రూపమని భావనతో దేవుని ముందు పెట్టే దీపమే సుబ్రమణ్య అవతారంగా కొలుస్తారు.
జ్ఞానస్వరూపము కూడా అయిన స్వామి ఈయన. అందుకే గురుగుహ అన్న నామం కూడా ఉంది. గుహ అంటే రహశ్యమని అని అర్థం.
ఈయనే దేవసేనాని కూడా. ఆరోగ్యానికి, జాతకంలో దోషాలకు ఈ స్వామినే అర్చిస్తారు. ఆది శంకరులవారు తనకు కలిగిన అనారోగ్యాన్ని భుజంగస్తోత్రమన్న స్తోత్రంలో సుబ్రమణ్యుడిని ప్రార్థించి ఆరోగ్యం పొందారు.
ఈ స్కందుని వివరాలు చాలా అనాధిగా లబ్యమే మనకు. ఈ స్వామి ప్రస్థావన వేదాలలో ఉన్నది. రామాయణ భారతాలలో కూడా చాలా వివరంగా స్కందుని ప్రస్థావన కనపడుతుంది.
రామాయణంలో బాలకాండలో రామునికి విశ్వామిత్రుడు స్కంధోత్పత్తి గురించి ఎంతో వివరంగా చెబుతాడు.
మహాభారతంలో కుమారస్వామి గురించి మార్కండేయ మహర్షి వివరిస్తాడు. ఆ వివరాలు ఎంతో విస్తారంగా వివరించబడాయి. స్కంద పురాణంలో స్కందోత్పత్తి గురించిన వివరంగా చెబుతుంది. శివపురాణంలో కూడా స్కందుని ఉత్పత్తి గురించి వివరాలు ఉన్నాయి.
స్కందుడు శివశక్తుల సమన్వయరూపం.
శివుని తేజస్సు జారిన పడుతుంది. అగ్ని దానిని స్వీకరించాడు. అగ్ని యజ్ఞస్వరూపుడు. దేవతలకు ఏ హవిస్సు అందాలన్నా అది అగ్ని ద్వారా మాత్రమే వెడుతుంది. యజ్ఞంలోని అగ్నికి దేవతల కోసం హవిస్సు సమర్పణ ఇస్తాము. అలా అగ్నికి అర్పించిన సమస్తం దేవతలకు వెడుతుంది. అందుకే అగ్ని దేవతలకు నోరు వంటివాడు. అగ్ని స్వీకరించాడంటే దేవతలు ఆ హవిస్సు అందుకొని భరించాలి. శివతేజమును అగ్ని స్వీకరించినప్పుడు దేవతలు ఆ తేజంను భరించలేకపోయారు.
ఆ సమయంలో ఒక్క అరుంధతి తప్ప సప్తఋషుల భార్యలు అగ్ని దగ్గరగా వస్తారు. అరుంధతి వారిని నివారించినా వినక వారు ఆరుగురు అగ్నిని సమీపించి అగ్ని నుంచి ఆ తేజస్సును స్వీకరిస్తారు. ఆ తేజస్సును వారు భరించలేక గంగలో వదిలివేస్తారు.
గంగ ఆ శివతేజస్సును తన ఒడ్డున ఉన్న రెల్లు వనంలో నిలుపుతుంది. ఇలా శివ తేజం రెల్లువనంలో చేరి షన్ముఖుడై రూపం సంతరించుకున్నది. ఆరు ముఖాలు (శివుడు, అగ్ని, సర్వదేవతలు, సప్తఋషిభార్యలు, గంగా, రెల్లువనం) వాడుగా కుమారస్వామి ఉద్భవించాడు.
ఆయన శుక్ల-రక్త వర్ణంలో ఉన్నాడు. శివశక్తుల ఏకత్వానికి సంకేతంగా ఉన్నవాడు.
శివుడు పంచ ముఖాలు, శక్తి ఒక్క ముఖం కలిసి ఆరు ముఖాలుగా శరవణుడు శివశక్తుల ఏకత్వానికి కూడా సంకేతం. వారందరూ ఆయనను కుమారా అని పిలిచి తమ ప్రేమను పంచుకుంటారు.
స్కందుని ఆరు ముఖాలు శివశక్తుల ఐఖ్య స్వరూపానికి గుర్తు. ఆయన యజ్ఞ స్వరూపంగా కూడా కొలవబడుతారు.
స్కందుడు ఆరు ముఖాలు ఆరు చక్రాలకు గుర్తు. సుబ్రమణ్య శక్తి కుండలినీ శక్తికి కూడా సంకేతం.
నాలుగు దిక్కులు, భూమి, ఆకాశం కలిపి ఆరు. ఈ విశ్వమంతా ఇదే. ఈ విశ్వమంతా సుబ్రమణ్యుడని కూడా ఒక సంకేతం.
సంవత్సరంలో ఆరు ఋతువులు సుబ్రమణ్య ఆరు ముఖాలకు సంకేతం.
“కాలస్వరూపుడు సుబ్రమణ్యుడు” ఆ స్వామి వలననే మార్పులు సంభవిస్తాయి.
ఆ స్వామి వలన వచ్చే మార్పులకు నెమలి సంకేతం.
షణ్ముఖుడిని భగవానుడని కూడా అంటారు. సమగ్రస్య ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీయః , జ్ఞానం, వైరాగ్యం లు ఆరు కలిసిన వాడు భగవానుడైతాడు.
కుమారస్వామి సమస్త విషయాలను ఎండ గట్టువాడు, సర్వ లోకాలను పోషించువాడు, అసురశక్తులను నశింపచేసేవాడు అన్న అర్థాలు కూడా ఉన్నాయి.
సుబ్రహ్మణ్యస్వామి రాశీభూతమైన జ్ఞానస్వరూపం.
సునిశితమైన మేధస్సుకు స్వామి చేతిలో ఉండే శక్తిఆయుధమే ప్రతీక. శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారికి ప్రసాదించిన దివ్యాయుధమిది. ఇదేఅజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము. “జ్ఞానశక్త్యాత్మా” అనేదిస్వామి వారి నామాలలో ఒకటి.
ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మాయమైన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజఃపుంజం – కుమారస్వామి.
ఆరుకోణాల చక్రం అనేది బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికీ, ప్రతిభకీ, ఆధారశక్తిగా కూడాకుమారస్వామి ఉపాసన చెప్పబడింది. “షణ్ముఖీ ప్రతిభ” ప్రసాదించే ఈ కార్తికేయుని‘కవి’గా పేర్కొన్నాయి శాస్త్రాలు.
శివుడు తన కుమారుని పిలిచి పార్వతికి తనకు మధ్య కూర్చుండబెట్టుకున్నడట. ఆ మూర్తిని సోమాస్కందుడని అంటారు.( స+ఉమా) సోములు మధ్య ఉన్న స్కందుని అర్చిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.
ఆ మూర్తిని మొదట ఉపాసించిన వాడు ముచుకుందుదన్న రాజు. తిరువారూర్ లో మనము ఈనాటికి సోమాస్కందుని చూడవచ్చు.
సుబ్రమణ్యుడి జనన కారణం త్రిపురాసుర సంహారం.
ఆయనకు పట్టాభిషేకం జరిపి దేవసైన్యానికి సైన్యాధక్షనిగా చేశారు.
కృత్తికలచే పెంచబడ్డాడు కాబట్టి కృతికా నక్షత్రంలో స్వామిని కొలిస్తే ఆయన సంతోషపడతాడు. కృతిక నక్షత్రం ఉన్న నెల కార్తీకం కాబట్టి ఆ నెలలో వచ్చే కృతిక మరీ ముఖ్యమైనది సుబ్రమణ్య ఆరాధనకు.
శివుని బాల తత్త్వమే సుబ్రమణ్యుడని అంటారు. ఈయన మహాశక్తిమంతుడు. తారకాసురుని నిర్మూలించి దేవతలకు శాంతిని కలిగించాడు.
తారకాసురుని సోదరుడు సూరపద్ముడన్నవాడు పాతాళంలో దాచుకుంటాడు. సుబ్రమణ్యుడు వాడిని భూమి మీదకు తెచ్చి యుద్ధం చేస్తుంటే వాడు చెట్టుగా మారుతాడు. ఆయన చెట్టును కొట్టివేస్తే వాడు రెండుగా మారి నెమలిగా, కుక్కుటంగా మారుతాడు. సుబ్రమణ్యుడు ఆ రెంటిని ఆకర్షిస్తాడు.
మానవుడు సుబ్రమణ్యుడ్ని శరణువేడితే పెరుకుపోయి చెట్టులా స్థిరపడి పోయే అహంకారం పెకలిస్తాడు ఆయన.
అజ్ఞాన్నాన్ని అణచి జ్ఞాన్నాని ఇచ్చే స్వామి ఈయన. సుబ్రమణ్య మరో నామం గుహ.
దేవతల అంతరంగాలలో వ్యాపించినవాడు గుహ అని ఒక అర్థం. రహస్యంగా ఉండే వాడు గుహ. రహస్యం మే హృదయంగా ఉన్నవాడు గుహ.
హృదయంలో ఉన్నవాడు పరమాత్మ. రహస్య స్వరూపుడు సుబ్రమణ్యుడు. గుహ కాపాడుట అన్న అర్థం.
కప్పి ఉంటువాడు అని మరో అర్థం గుహకు కలదు.
ఈ ఆషాడ కృష్ణ కృతిక్కకు కృతికా కావడి అని పేరు.
హిడింబాసురుడన్న అసురుడు రెండు కొండలను కావడిగా పెట్టుకుపోతుంటే, వాడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడని భావించి మురగన్ చిన్న పిల్లవాడిగా మారి కావడి మీద వాలుతాడు. అసురుడు బరువు భరించలేక వెనకకు చూసి బాలుని చంపే ప్రయత్నం చేస్తాడు. మురగన్ అయిన సుబ్రమణ్యడు అసురుని చంపేస్తాడు. ముని అగస్యుడు కోరిక మీద తిరిగి ప్రాణం పోస్తాడు.
కావడి పట్టుకు దేవళం ముందర ఉండమని ఆజ్ఞాపిస్తాడు సుబ్రమణ్యుడు. ఆ కావడి తో నిలబడ్డ అసురుడు మురగన్ దేవళం బయట నిలబడి ఉంటాడు. భక్తుల కోరికలను ఆ కావడిలో సమర్పిస్తే అసురుడు ఆ కోరికలను స్వామికి సమర్పిస్తాడట. ఈ కృతిక నక్షత్రం రోజున కావడి దించి స్వామి పాదాలు పట్టుకుంటాడు. భక్తులు ఆ మాట మీదుగా తమ కావడి తో స్వామిని దర్శిస్తారు.
ఇంతటి దివ్యమైన రోజున మురగన్, దండపాణి అయిన సుబ్రమణ్య ఆరాధన చేసుకుందాం.
స్వస్తి
- సంధ్యా యల్లాప్రగడ