గురుమండలం

గురువు – గురుమండలము


గురు మండలము సూక్ష్మలోకంలో ఉంటుంది. 
మనకు కనపడుతున్న భౌతిక ప్రపంచము మాత్రమే ప్రపంచమని తలవటమే అజ్ణానము. 
మనకు కనపడేది కేవలం1/7 భాగము. మనకు కనపడని విశ్వం అనంతం. 
ఇంతటి విశ్వంలో పెనుచీకటికి ఆవల ఉన్న ఈశ్వరుడ్ని ఎలా పొందగలము?
దానికే మనకు గురువును సహాయం కావాలి. 
అంతేనా అంటే కాదు గురువు ఈశ్వరుడై జీవుని/సాధకుని వేదన తగ్గిస్తాడు. 

ఈశ్వర ప్రభతో  వెలిగే గురుదేవులు జీవుడి వేదన తగ్గించి అంతర్మఖమై స్వాత్మను తెలుసుకోవటానికి సహయపడతాడు. 
అందుకే గురువు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అఖిల జగత్తుకు ప్రథమగురువు శివుడే. 

శివాయగురవే నమః

ఆ గురువు మనకు ఏ రూపంలోనైనా ఏ ప్రదేశంలోనైనా కలవవచ్చు. భౌతికమైన గురువుగా సాధకునికి ప్రత్యక్షమైన దీక్ష ఇచ్చినా, సదా ఆ భౌతిక గురువును అంటుకు తిరిగే అదృష్టం, అవకాశం అందరికీ లభ్యము కాదు. 
మరి వారికి గురుకృప ఎలా అన్న ప్రశ్నకు సమాధానమే గురమండల రూపిణి అనుగ్రహం. వారికి ఆ గురుమండలం నుంచి సమాధానం లభిస్తుంది. 

సమస్త గురువులూ సూక్ష్మభూమికలో ఆ గురుమండలంలో సంచరిస్తూ ఉంటారు. మనము గురువుకు “గురుభ్యో నమః” అని నమస్కారం చేసిన ప్రతిసారి ఆ నమస్కారం గురుమండంలో పరమగురువులకు అందుతుంది. 
గురువును నమ్మి కొలచిన ప్రతిజీవుడికీ గురుమండలం నుంచి సమాధానం వస్తుంది. 
శిరిడి సాయిబాబా కూడా భౌతికంగా నమస్కారం చెయ్యటానికి ఆత్రపడుతున్న భక్తునితో “భక్తితో ఎక్కడ్నుంచి నమస్కరించినా తనకు అందుతుందని” చెప్పారు.
మనకు దీక్షనిచ్చిన గురువు మాత్రమే గురువుకాదు. అందరు గురువులూ ఆ ఈశ్వర స్వరూపమే. 
మన గురువులో ఉన్న ఈశ్వర అంశ ప్రతి గురువులో ఉంటుంది కాబట్టి ఏ గురువును దర్శించినా మన గురువుకు నమస్కరిస్తున్నా
మన్న భావనతో నమస్కారం చేసుకోవాలి. 
ప్రతి ఉదయం తొలి నమస్కారం గురువుకు సమర్పించి లేచి ధ్యానాదులలో గురువును తలచుకొని నమస్కరిస్తే అది ఆ పూజ్యగురువుకు అందుతుంది. 

ఏ గురుమూర్తికి నమస్కరించినా అది మన గురువుకు చేరి వారి అనుగ్రహం మనకు లభ్యమవుతుంది. 
చాలాసార్లు అందువలననే మన గురుమూర్తి స్వరూపం మనం దర్శించిన గురువులో కనపడుతుంది. 
గురువులు ఎందరో ఎవరెవరో కలలో దర్శనం కలగటం, క్షేత్రదర్శనాలలో దివ్యగురువుల దర్శనాలు కలగటం ఇదంతా గురుమండలంలోని గురువుల కృప వలననే. 

అమ్మవారి నామాలలో గురుమండల రూపిణి అన్న నామం కూడా ఉంది. 
అమ్మవారే ఈ గురుమండలం అందలి గురువుల స్వరూపం. అసలు అమ్మ కానిదేముంది? 
ఇహపరాలకు అమ్మే గతి మనకు. 
ఆ అమ్మ మనలను గురువు రూపం లో అనుగ్రహిస్తున్నది సదా అన్న విషయం మనం మరువరాదు. 
అమ్మవారూ, పూజ్యగురుదేవులూ మంత్రం అంతా ఒక్కటే. అనేకమేకమై సాధకుని ఒకటి చేయ్యటమే సాధన లక్ష్యం. కాబట్టి గురువు నరదేహంతో కనపడు జగదంబగా కొలవాలి. 
ఆ భావన రావటానికి పూణ్యమూర్తుల చరిత్ర సహాయం చేస్తుంది. సాధకుల సత్సంగం మనకు నిరంతరం దారిలో సాగటానికి సహకరిస్తుంది. 

మనము ప్రయత్నపూర్వకంగా పంచేంద్రియాలతో ఆ ఈశ్వరిని చింతన చేస్తూ ఉంటే గురుకృపతో ఆత్మదర్శనం కలుగుతుంది. అంటే మనము చూసే జగమంతా జగజ్జనని రూపమని, వింటున్నది ఆమె గుణకీర్తుని, చదువుతున్నది తలుస్తున్నది ఆమె విషయమే అయితే మనకు శ్రద్ధ గురి కుదురుతాయి. 
నిరంతర ధ్యాస వలన మనము “అదై”పోతాము. ఇనుముకు అయస్కాంతం రుద్దగా రుద్దగా ఇనుము కూడా అయస్కాంతమైనట్లుగా.  అదే తత్వమసి. ఆ ఆత్మానందమే ముక్తి. 

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం|
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ‖

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment