నే చదినిన పుస్తకం

ఈ మధ్య కాలములో నే చదివిన పుస్తకాలలో చాలా మటుకు సాధనకు పనికివచ్చేవే అని చెప్పలేను. కొన్ని మాములు పుస్తకాలు… కొన్ని కథలు…కాని ఈ పుస్తకం అలా ఏ కోవకూ చెందనిదిగా చెప్పాలి. ఎందుకంటే ఇది రమణభక్తురాలి కథ అయినా, ఆమె భగవానుతో తన అనుబంధం గురించి కానీ, సాధన గురించి గానీ ఈ పుస్తకంలో వివరించినది పెద్దగా ఏమీ లేదు. కాని రమణాశ్రమం, ఆనాటి స్థితిగతులు, ఆశ్రమం ఎలా వృద్ధి చెందింది, ఏ ఏ ప్రముఖులు ఆశ్రమానికి ఏ సేవలందించారు మనకు తెలుస్తుంది. 

ఇది మా ఫిరోజా తల్యార్ఖన్ జీవిత చరిత్ర ఆమె మాటలలో వివరించిన ఆత్మకథ.  ఆమె పార్సి యువతి. ధనవంతురాలు. నాటి పార్సి సంపన్న కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య అభ్యసించి, ఆనాటి ఉన్నత వర్గ నాయకులతో సంబంధబాంధవ్యాలు ఉన్న స్త్రీ. ఆనాటి మహారాజాలతో, మహారాణులతో ఆమెకు స్నేహం ఉండేది. బ్రిటీషు వారితో ఆమెకు ఎంతో మైత్రి.  ఆమె జీవితంలో దేనికీ లోటులేదు. కాని ఆమె హృదయంలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతి ఆమెను హిందు మత గురువుల వైపుగా నడిపించింది. యొగదా(yogada) లో క్రియాయోగ సాధన చేసినా, అరుణాచలం చేరి రమణుల పాదాల వద్ద మ్రొక్కినా ఆ జ్యోతిని నడిపించిన కాంతి వల్లనే. 

రమణుల పాదాలు చేరిన తరువాత ఆమెకు శాంతి కలిగింది. కాని భాష రాకపోవటం, ఒక స్త్రీ కుటుంబం వదిలి గురుపాదాలు పట్టుకోవటం ఆనాటి సమాజంలో సామాన్యం కాదు. నేటీకి కాదనుకోండి. కాని ఆమె తన అంతరాత్మ మాట విని తిరువన్నామలైలో

భవనం నిర్మించుకుంది. తోటి భక్తులకు సహాయ సహకారాలందించింది. ఎవ్వరూ అవసరంలో ఉన్నా ఆదుకుంది. ఆశ్రమానికి వచ్చిన స్త్రీ భక్తులకు చేయూతనిచ్చింది. 

రమణాశ్రమానికి ఎందరో విదేశీ భక్తులను తీసుకువచ్చింది. మరారాజాలను, మహారాణులను భగవాను పాదాల వద్దకు, అరుణగిరి ప్రదక్షిణా చేయించింది.
ఆశ్రమ నిర్వహణకు ధన సమీకరణ చేసింది. 
భగవాను తొలినాళ్ళలో ఉన్న పాతాళలింగ మండపాన్ని పునర్వనిర్మించి రారాజీ చేత జాతికంకితం చేయించింది. 
ఆమెకు మద్రాసు గవర్నర్ తో, మంత్రులతో ఉన్న స్నేహంతో ఆశ్రమం కొరకు ఎన్నో పనులను నిర్వహించింది. ఇవ్వన్నీ తన ప్రతిభ కాదని, భగవాన్ అనుగ్రహం వల్లనే సాధ్యమైనాయని వినమ్రంగా తెలిపిన భక్తురాలు మా. 
ఆశ్రమంలో గొడవలలో ఈమెను మిగిలిన వారు రానీయక పోవటం, ఈమె తెచ్చిన ధనాన్ని దుర్వినియోగ పరచటం వంటివి కూడా మనమీ గ్రంధంలో చదువుతాము. 
సంస్థలలో స్త్రీలు అందునా వాలంటిరీగా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడతారో ఈమె కూడా అవన్నీ పడింది. నేటికీ ఆ పరిస్థితిలో మార్పులేదని ఎన్నో సంస్థల కొరకు స్వచ్ఛందంగా పనిచేసిన మనకు తెలుసు  స్త్రీలకు పెకి రానీయ్యకపోవటం. వారి సేవను స్వీకరించి వారిని అణచటం అన్నది నేటికీ రివాజే. ఆమె వాటిని దాటుకు ముందుకు నడిచింది. ఆమెకున్న ధనబలం, పెద్దలతో పరిచయం వల్ల అది సాధ్యమైయింది. 

భగవాను శరీర త్యాగం తరువాత ఆశ్రమ  రూపురేఖలకూ, పనితీరూకు మా ఫిరోజా ఎంతో సహకరించింది. సేవలందించింది. ఆశ్రమం ఒకటిగా నిలబడటానికీ, వేద పాఠశాల నడవటానికి ఆమె తన వంతు కృషి చేసింది. 
భగవాను మూకీ చిత్రం మనకు లభించిందంటే అదీ శ్రీమతి  ఫిరోజా తల్యార్ఖాన్ వల్లనే. 
ఆమె పూనుకొని భగవాన్ చిత్రం తీయించింది. ధనం, ఉన్నతవర్గాలలో ఉన్న పలుకుబడి వలన ఆమె ఆశ్రమానికి ఎంతో సేవ చెయ్యగలిగింది. ఆశ్రమ యాజమాన్యానికి ఇది కంటగింపుగా మారటం సహజం.  పైగా లోకల్‌ స్త్రీలకు తమిళం తప్ప మరోభాష రాకపోవటం వలన, ఈమెకు తమిళం తెలియక ఇంగ్లీషు వచ్చు పురుషులతో మాట్లాడుతూ ఉండటం వలన ఈమెను అందరూ తలా మాట అనటం కూడా ఈమెను ఇబ్బంది పెట్టాయి. అయినా భగవాను మీద భక్తితో, ఆయన చూపిన కరుణతో ఆమె అరుణాచలంలో స్థిరపడింది. బొంబాయి వెళ్ళి కుటుంబాని చూసుకుంటూ, యాత్రలు చేస్తూ కొంత కాలం భగవాను సమక్షంలో ఉంటూ జీవించింది. భగవాను దేహత్యాగం తదనంతరం ఆమె మా ఆనందమాయికి సన్నిహితంగా తిరిగింది. ఎందరో సాధుసంతులను కలసి వారి గురించిన వివరాలు కూడా ఈ గ్రంధంలో పొందపరిచింది. 
ఈ గ్రంధానికి ముందు మాట సర్వేపల్లి రాధాకృషగారు రచించారంటేనే మనకు ఆమె కున్న పేరుప్రఖ్యాతలు అర్థం అవుతాయి. 
ఆశ్రమంలో మేనేజ్ మెంటు ఈమెకు కావలసినంత ఇబ్బంది కలిగించింది. భగవాను మీద ప్రేమతో ఈమె ఆ ఇబ్బందులన్నీ సహించింది. తన పేరు కూడా నిలబడేలా చేసుకోగల తెలివి ఈమెకుంది.  అందుకే మనకు నేటికీ ఈమె సేవలు తెలుసుకునే అవకాశం లభిస్తున్నది. 
భగవాను జన్మించిన గృహం, మధురలో ఆమెనకు మరణానుభవం కలిగిన గృహం సేకరించి ఆశ్రమానికి ఇచ్చిన చొరవ ఈమెదే. 
ఆశ్రమం దేవాదాయశాఖ నుంచి బయటకు లాగటానికి కోర్టు గుమ్మమెక్కిన ధీర ఈమె. 
జీవించినంత కాలం భగవాను భక్తురాలిగా జీవించిన ధనవంతురాలు మా ఫిరోజా తల్యార్ఖాన్. 
ఈ గ్రంధం మనకు ఆశ్రమం తీరుతెన్నులు, అన్నింటా తట్టస్తంగా ఉన్న భగవాను వైఖరి గురించి తెలుస్తుంది. 
ఆశ్రమం గురించి లోతుపాతులతోపాటూ ఇది ఆమె ఆత్మకథ కావటం వలన ఆమె వైపు కథగా తెలుస్తుంది. ఇందు కొంత అహంకారమనిపించినా…. తను ఆశ్రమానికి చేసిన సేవలు చెప్పుకోవాసని కాబట్టి చెప్పిందని మనం సర్దుకుంటాము. 

వీటితో పాటూ ఆమెకు కలిగిన ఆధ్యాత్మిక ఉన్నతి గురించి కూడా రచించి ఉంటే బావుందేదనిపించింది. 

దీనికన్నా నాకు సూరి నాగమ్మగారి ఉత్తరాలు ఎక్కువగా నచ్చిందని చెప్పవచ్చు. 

ఇది మాకు తణుకు వెళ్ళినప్పుడు లభించిన ప్రసాదం. అందుకే శ్రద్ధగా చదవటం జరిగింది. 

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment