ఈ భాద్రపద శుద్ధ అష్టమి రాధారాణి జన్మాష్టామి. బృందావనవాసులకే కాదు సర్వ జనులకు పండుగరోజే. కృష్టాష్టమి ఎంత వేడుకో, అంతకుమించి పండుగ ఈ రోజు.
కృష్ణుని ప్రియురాలని తలచే ఈ రాధారాణికి ఎందుకింత ప్రాముఖ్యత? అని ఆలోచన కలిగితే, ఆమె గురించి విచారిస్తే, తరచి చూస్తే మూలప్రకృతిగా, శక్తి స్వరూపిణిగా రాధారాణి మనకు కనపడుతుంది.
రాధను తిప్పి రాస్తే ధార అవుతుంది. నిరంతరాయంగా అంటే ధారగా కురిసే కరుణ, ప్రేమ, అనురాగం, దయకు గుర్తు రాధ. కృష్ణుడ్ని కరుణ ప్రేమ రాధ ద్వారా భక్తులకు అందుతుంది.
రాధారాణి, కృష్ణుడి శక్తి. కృష్ణుడ్ని చేరాలంటే ముందు ఆయన శక్తిని ఆరాధించాలి. మనకు శైవములో, శాక్తేయంలో కూడా ఈశ్వరుడ్ని చేరాలంటే ముందు అమ్మను ఆరాధించాలి. అమ్మను సేవించిన వారికి అమ్మ అయ్యను చూపుతుంది. ఇదే మార్గం. ఏ సంప్రదాయమైనా ఇదే రహస్యం. కృష్ణుడ్ని చేరాలంటే రాధను సేవించాలి.
రాధారాణి మంత్రం శక్తివంతమైన మంత్రం. బృందావనంలో, వ్రజభూమిలో ఈ రహస్యం తెలిసినవారే కాబట్టి వారు సతతం ‘రాధే రాధే’ అని జపిస్తూ ఉంటారు. మనను అలాగే పలకరిస్తారు.
రాధారాణి గోలోక మహారాణి. ఈ గోలోకం కృష్ణలోకం. ఈమె బృందావనేశ్వరి. రాధారాణి కనుసైగలలో, ఆమె ఆజ్ఞతో నడిచే ఈ గోలోకం అత్యంత ఉత్కృష్టమైనది. కృష్ణభక్తులు సదా చేరుకోవాలనుకునే అత్యంత్య ఉన్నతమైన లోకం.
వైష్ణవులు ఈమెను శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. ఈమె శ్రీకృష్ణునితో కలిసి గోలోకధామంలో ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈమె హ్లాదినీశక్తిగా ఉంటుంది. ఈమె ఉన్న చోట ఆనందం తాండవమాడుతూ ఉంటుంది.
కొందరికీ రాధారాణి కృష్ణుని ప్రియురాలు. కొందరికీ ఆమె శక్తి స్వరూపిణి. కొందరికీ మహాలక్ష్మి. కాని అందరూ ఆమెను మూలప్రకృతిగా కొలుస్తారు.
పురాణాలలో రాధారాణి గురించిన ప్రస్థావన మనకు పద్మ పురాణంలో, నారద పురాణంలో, గార్ఘసంహితలో కనపడుతుంది. భాగవతంలో రాధా గురించి ఛాయా మాత్రంగా ప్రస్థావనుంది.
రాధావల్లభ సంప్రదాయంలో ఈమె శక్తిస్వరూపిణి. సర్వ ప్రపంచాన్నికి సృష్టిస్తితిలయకారిణి. చైతన్య ప్రభు శిష్యసంప్రదాయములో (వీరిని గౌడ వైష్ణవులంటారు) రాధారాణి మూలప్రకృతి స్వరూపం. వైష్ణవులూ ఈమెను సీతగా, మహాలక్ష్మి అవతారంగా కొలుస్తారు.
వ్రజగోపికలలో రాధారాణి ప్రముఖురాలు. ఆమె ఆ ధామానికి మహారాణిగా ఉంటుంది.
రాధ కేవల ప్రేమ తత్త్వం. మూర్తీభవించిన కరుణ, దయా , అనురాగమే రాధ.
బృందావన గోపిల కృష్ణ భక్తి ఉత్తమమైనది. నారదుల వారు తన భక్తి సూత్రాలలో
నిజభక్తుల గురించి –
“అస్యైవ మేవమ్ యథా వ్రజగోపికానామ్
తత్రాపి న మహాత్మ్యజ్ఞాన విస్మృత్యపవాదః
తద్విహీనం జారాణామివ
నాస్వైవ తస్మింస్తత్సుఖ సుఖిత్వమ్” అని చెప్పాడు.
గోకులంలో గోపికా స్త్రీలు శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి మైమరచి తన్మయులై ఉంటారు. గోపికలకు కృష్ణుడే సర్వం. తన పరిపూర్ణమైన భక్తితో తాము తమ సర్వం కృష్ణుడికి సమర్పించుకుంటారు గోపికలు.
గోపికల భక్తి ముందు మరే భక్తి నిలబడదని కృష్ణుడే చెప్పాడు. పరమాత్మలో ఐఖ్యమై పోవటం కోసం తప్పించి ఆయనలో కరిగిపోవటం భక్తి యని నారదుల వారు చెబుతారు. గోపికలు కృష్ణునిలో ఐఖ్యం చెంది బ్రహ్మానందం పొందారు. తమను తాము కృష్ణుడికి సర్వస్య శరణాగతి చేశారు. వారి ఉనికిని సంతోషంగా కోల్పోయారు. అది భక్తిలో ఉత్కృష్టమైనది.
అత్యంత ఉత్కృష్ఠమైన భక్తికి వ్రజగోపికలు తార్కాణం. వారికి మహారాణి రాధారాణి.
రాధ కృష్ణుల రాసలీల ఎంతో అద్భతమైన ఘట్టము. గోపికలతో, రాధతో కలిసి కృష్ణుడు ఆడిన ఆటనే రాసలీల.
రాసలీల యోగ పరంగా ఎంతో గూఢార్థం కలిగివుంది. పదహారు వేల గోపికలు, ఒక కృష్ణుడు అన్నది కేవల సంకేతమాత్రంగా చెబుతారు. మనకు విశుద్ధి చక్రంలో 16 దళాలు ఉంటాయి. అవి 16 అచ్చులు. సహస్రారంలో వెయి దళాలుంటాయి. మంత్రం అంటే అక్షరాలే. అవి మెల్లగా సహస్రారంలోకి వెళ్ళి ఆ 16 దళాలూ, సహస్రారంలో యున్న వెయ్యి తో కలిసి పదహారువేలుగా మారుతాయి. అవే గోపికలయ్యారు. అప్పుడు మంత్రజపం గోపికగా, మంత్రం మధ్య నిశ్శబ్ధం కృష్ణుడని తెలుసుకోవాలి. ఆ మౌనమే ఆత్మ. ఆ మౌనమే కృష్ణుడు. ఇది పూర్ణయోగరహస్యం. ఇది తెలియక రాసలీలను అవహేళన చెయ్యటం సామాన్యమయిపోయింది.
బృందావనంలో, వ్రజభూమిలో నేటికీ రాధారాణిని దర్శించిన భక్తులున్నారు. నేటికీ రాసలీలా జరుగుతుంది ఆ భూమిలో. పూర్ణభక్తులకు కృష్ణ వేణునాథం వినపడుతుంది. అది సాధనలో అతియంత ఉన్నత స్థితి. భక్తులను ఆ స్థితికి తీసుకుపోవటానికి రాధారాణి ఎంతో కరుణతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ దివ్య రాధాష్టమినాడు ఆ తల్లిని ఆరాధించి, మనలో రాసలీలను ప్రతిష్ఠించుకుంటే మనకు వేణుగానమైన ఆత్మగానం వినపడటం తథ్యం.
రాధేరాధే-
“కంసారిరపి సంసార వాసనాబద్ధ శృంఖలామ్
రాధామాధాయ హృదయే తత్యాజ వ్రజసుందరీః”
సర్వం శ్రీమాత చరణపంకజాలకు సమర్పిస్తూ
సంధ్యా యల్లాప్రగడ
