రామాయణం సుందరకాండ

సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా| 
సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనమ్ ||
సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః |
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరమ్||
సుందరకాండ గురించి చెప్పిన మాట ఇది. 
ఏమిటీ సుందరం? అని సందేహ పడే జీవులకు
“నష్టద్రవ్యస్య లాభోహి సుందరః పరికీర్తితః”

పోయిన వస్తువు దొరికితే కలిగే ఆనందం సుందరం. 

పోయినది సీతమ్మే కాదు, సీతకు రాముడి జాడ కూడా తెలిసిందీ కాండలో
అందుకే సుందర కాండ పారాయణంతో దుఃఖం తొలుగుతుంది. 
ఇంతటి ఆనందానికీ కారణం హనుమంతులవారు కాబట్టి వారు సుందరులు. 
సుందరకాండలో అంతా హనుమ చూస్తున్నది, వింటున్నది, అనుకున్నదీ, అన్నదీ. ఇది పూర్తిగా హనుమత్ స్వరూపమే. ఆయన వివిధ రూపాలుగా వ్యాపించినదే ఈ కాండ. 
సుందర హనుమత్ మహా మంత్రంలో చెప్పిన 27 నామాలూ ఈ కాండ మనకు హనుమ దర్శనాలు కలుగుతాయి. 
సుందరకాండ పారాయణం చేస్తే 32 హనుమత్ మంత్రాలనూ ఉపాసించిన ఫలం లభిస్తుంది. 

సుందరకాండకు “బీజకాండ” యని మరోపేరు. 

రామాయణంలో ఉన్నది సుందరకాండలో బీజప్రాయంగా ఉన్నది. 
“త” కారంతో మొదలవుతుంది కాబట్టి బ్రహ్మవిద్య అన్నారు. 
సీతమ్మ వారంటే బ్రహ్మ విద్యే. సీతమ్మే రామాయణానికి ప్రధానం..  అందుకే  సుందరాకాండ శక్తి ప్రధానమైన కాండ.  ఆ శక్తి సీతామహాత్రిపురసుందరి. ఆ శక్తిని ఈ కాండలో ఋషి చూపాడు. అలా మనకు ఆ దివ్య శక్తి దర్శనమవుతుంది.  
ముగ్గురూ మంత్రస్వరూపులున్న కాండ., ముగ్గురి దివ్యత్వం ప్రకటించబడిన కాండ సుందరకాండ. (రాముడు, సీతమ్మ, హనుమ)

హనుమ అంటేనే ఉపకారి
“రామ పూజారి పర ఉపకారి
మహావీర బజరంగబలీ
సద్దర్మచారి సద్ర్బహ్మచారి
మహీవీర బజరంగబలీ”
ఏ పనైనా తన కోసం కాక పరుల కోసమే చేశాడు హనుమ. అందుకే సుందరుడు. 

అమ్మ సీతమ్మ తన చూడామణిని ఇచ్చింది. 
చూడామణి తలపైన ఉండే ఆభరణం. 
అంటే అమ్మవారి సహస్రాంతర్గతమైన శక్తిని కలిగినది. 
యోగపరంగా చూస్తే శక్తిపాతం ఇవ్వటంగా చెబుతారీ చర్యను. 
ఈ శక్తిపాతం వలన హనుమ సుస్థితరమై స్వస్థచిత్తుడై నిలిచాడు. 
ఈ మణిని చూసి రాముడు ముగ్గుర్ని తలుస్తాడు అంటుంది సీతమ్మ.  వారే మా అమ్మ , నాయన, దశరథ మహారాజు అని చెబుతుంది. రాముడు వారినే తలుస్తాడు. 
సీతమ్మ రాముని హృదయం. రాముని అభివ్యక్తి. ఇది శివశక్త్యాత్మక తత్త్వం. ఏది శ్రీవిద్యగా ఉపాసించబడుతున్నదో ఏది బ్రహ్మవిద్యయో అది సీతమ్మ.

మనకు సీతమ్మతల్లి కుండలినీ శక్తిగా దర్శింపచేసిన కాండ కూడా ఇదే. ఇక్కడ ఋషి ఎన్నో మార్లు పడుకున్న పాము అని, పడగలతో ఉన్న పాముయని సీతమ్మని పోలుస్తాడు. 
సీతమ్మకు రాముడు తన కొరకు వస్తాడని కబురు తెలిసినదీ కూడా ఈ కాండలోనే.
రాముని వద్దకు తిరిగి వెళ్ళి “చూచితి సీతను” అని పలికి రామస్వామి హృదయాన్ని ఊరడించినదీ ఇక్కడే. 
ఇన్ని విశేషములున్న మంత్ర రహస్యములున్న కాండ సుందరకాండ. 
ఇంతటి అద్భుతమైన సుందరకాండను తేటతెలుగులో చదువుకునే విధంగా పూజ్యగురువులు కృపతో మనకు అందించిన పుస్తకం “ముగ్గురు సుందరుల కథ”.

ఈ గ్రంధం పఠితులకు మానసికోల్లాసం కలిగించటం తథ్యం!!

సర్వం శ్రీరామార్పణం🙏🏽 స్వస్తి🙏🏽🙏🏽

Leave a comment