మహాకుంభ అనుభవాలు

1.
మహాకుంభ అనుభవాలు

సాయి చరిత్రలో చెబుతారు నా భక్తులను దారం కట్టిన పిచుకల్లా నా వద్దకు లాక్కుంటాయని.
ఈశ్వరుడు పిలిస్తే ఎంతవారైనా పరుగున చేరాలి  ఆ పవిత్ర గంగాతీరానికి.
మేము అంటే మా శ్రీవారూ నేను మహాకుంభ పవిత్ర స్నానాలు చేసి ఈశ్వర తపము చేసుకొని, పెద్దలకు పితృకార్యాలూ, తర్పణాలు చేసుకున్నాము. పవిత్రమైన మౌని అమవాస్యనాడు ప్రయాగరాజులో గణపతి, నవగ్రహ శ్రీసూక్త సహిత హోమం చేసుకున్నాము. మూడు రోజుల పవిత్ర స్నానాలు, ఉదయమే జపాలు.
నాల్గవనాడు వారణాసీ. శివలింగం ప్రతిష్ఠాపన చేసుకున్నాము. తిరిగి అట్లాంటా మా స్వగృహం చేరాము.
జీవితానికొక్కమారు వచ్చే ఇటు వంటి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవము అందరికీ కలగాలని భగవతిని కోరుకుంటున్నాము.
మరిన్ని వివరాలు…

2
మాఘమాసము సముద్ర స్నానానికి, నదీ స్నానానికి పెట్టింది పేరు.
ఎంతో పూర్వం నుంచీ మన పెద్దలు ఆచరించే ఈ కార్యక్రమం వలన స్థూల, సూక్ష్మ శరీరాలు శుభ్రమవటమే కాక, జీవితములో ప్రశాంతత పొందటము జరుగుతుంది.
కొంత సాధనలో ఉన్నవారికి సంవత్సరములో ఒక సారైనా ఇష్టదేవతా సంబంధమైన క్షేత్ర దర్శనం వలన సంవత్సరములో జరిగిన లోటు భర్తీ అవుతుంది.
పితృకార్యాలు ఎంతో ముఖ్యమైనవి. సంఘమాల వద్ద, పవిత్రమైన రోజులలో చేసే పితృకార్యాల ఫలము అధికము. పుష్కరాలలో, కుంభమేళాలలో చేసే పితృకార్యాల వలన, ప్రతి యేడూ చేస్తున్న పితృకార్యాలలో లోపాలు భర్తీచెయ్యబడతాయి.
వీటి ఫలితం వలన పెద్దల కృప కలిగి పిల్లలు జీవితంలో కావలసినవి పొంది వృద్ధిలోకి వస్తారు.
వ్యక్తిగత సాధన మెరుగుపడుతుంది. సుఖవంతమైన స్థితిలో సాధన కన్నా, సాధకుడు కొంత శరీరాన్ని కష్టపెట్టి చేసే సాధన ఉత్తమమైనది. నియమబద్ధమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానము- సాధన వలన కుదురుతుంది. అది ఇహలోక సుఖము. పారమార్థమైనది మన ఊహలకందనిది ఇస్తుంది కాబట్టే ఇటు వంటి సమయాలు ఉత్కృష్టమైనవి. భారతభూమి కర్మభూమి. పూజ్యులు మన పెద్దలు ఏర్పిచిన ఈ విధివిధానాల గొప్పతనము మన ఊహలకు అందనిది.
ఈ మహా ఉత్కృష్టమైన సమయాన్ని ప్రతి సాధకుడూ ఉపయోగించుకోవాలి.

గుంపుగా ఉండే జనాలలో భద్రత తక్కువగా ఉంటుంది. పైగా తోస్తే తోపించుకోవటం దూరంగా పోవటం తప్ప తిరగపడటం రాని టైపు. కాబట్టి అంతటి మహా సముద్ర మాన సమూహా కార్యానికి వెళ్ళాలంటే భయమేసింది.


కాని 144 సంవత్సరాలకు ఒక్కసారి కలిగే భాగ్యం. వదులుకోవటం కష్టమైనది. అన్నింటికి నమ్మిన ఆ పాదాలనే వేడుకోవటం జరిగింది. చేస్తున్న మంత్రము, పూజిస్తున్న గురుపాదుకలను కృప చూడమని వేడుకొని, సంక్రాంతి మరురోజు అడిగాను శ్రీవారిని “వెడదామా కుంభమేళా? మునిగి వచ్చేద్దాం…” అని.
ఆయన ఒక రోజు ఆలోచించి చెబుతానన్నారు.
ఈశ్వర ధ్యానమే గతి. ‘రోజు అర్పించే చెంబు జలలే గంగా జలాలుగా తలుస్తూ సమర్పించే నాకూ ప్రయాగలో ఉన్నానని తలవటం రాదా‘ అని అనుకున్నా.
కానీ గురుకృపన తను “వెళ్ళివద్దాము పద” అన్నారు.
ముందురోజు ఉన్న టెంట్లు అన్నీ పూర్తిగా బుక్ అయ్యాయి. “మరి అకామిడేషన్ లేకుండా వెళ్ళలేములే వదిలేద్దాం…” అన్నాను.
తను “చుద్దాం! మనం హోటల్ లో ఉందాం. టెంట్ దొరకపోతే…” అన్నారు.  మేక్‌మైట్రిప్ లో లగ్జరీ టెంట్ దొరికింది. కానీ మాకు చాలా ఖరీదనిపించింది. అయినా మూడు రోజులకు తీసుకున్నాము. ఇక చకచకా విమానాలు బుక్ చేసుకున్నాము. బ్యాక్‌ప్యాక్‌ ట్రావెల్ అనుకున్నా బ్యాగు బరువనిపించింది నాకు. బట్టలు మూడు జతలు, కావలసినవి దేవతార్చన తో బయలుదేరాము.
తన ఆఫీసులో నాలుగు రోజులు మానగలిగారు ఈ సందర్భం కోసము.

మాఘనవరాత్రులు మొదలైతాయి కానీ క్షేత్రంలో జపం చేసుకుందామని ఆ డేట్సు తీసేసుకున్నాము.  కాని ఈ మౌని-అమవాశ్య గురించి అవగాహనలేదు.

ఢిల్లీ లో ఎదురుచూస్తున్నప్పుడు నా ఎదురుగా ఒక ప్రకాశవంతమైన స్త్రీ కూర్చున్నారు. ఆమే ఋషీకేశ్ తన గురువును చూడవెడతున్నదట. నన్ను “జనాలు తోపిడి అని భయపడకు. భగవంతుని మీద దృష్టి పెట్టు” అన్నది.
“ఆ ఆలోచనే నన్ను ఇక్కడకు పట్టుకొచ్చింది…” అని చెప్పాను.
“నీ ఆలోచనా పద్దతి బావుంది. ఇలాగే ఆలోచించు…” అని వెళ్ళిపోయింది.

ప్రయాగ విమానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎందరో  ఎనారైలు విదేశాల నుంచి కేవలం కుంభమేళాకు వస్తూ కనిపించారు.
మా ప్రక్కన కూర్చున్న కుర్రాడు పాతిక సంవత్సరాలు. మేము ప్రయాణమంతా నర్మదానది గురించి, ఈశ్వర లీలల గురించే
మాట్లాడుతూ వచ్చాము. ఫ్లైట్ లో హరహర మహాదేవ అన్న శరణగోష. రుద్రం చదువుతూ ఒకరు… ఇలా పూర్తి ఆ భగవతి మీదే అంతర్‌బహిర్‌ దృష్టిగా సాగింది మా ప్రయాణం.
మా టెంట్లుకు వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. ఊరు అష్ట దిగ్బంధనంలో ఉన్నది అప్పటికే.
ఆ తల్లే అడుగడుగా నా వంటి జబ్బుదాన్ని తీసుకువచ్చింది. కొంత దూరం కారు, కొంత దూరం ఆటో, కొంత దూరం బైక్, కొంత నడక, కొంత బ్యాటరీకారులో మా ప్రయాణం సాగి మేము మహాకుంభ క్యాంపుసైటు లోని మా టెంటుకు చేరాము. బయలుదేరిన దాదాపు 50 గంటల తరువాత మేము మహాకుంభాక్యాంపు చేరుకున్నాము.
ప్రయాగలో దిగేముందు మా ఫైలెట్ టెంట్ సిటీ మీద త్రిపుత్తూ “చూడండి మహాటెంట్ సిటీ. హరహర మహాదేవ్” అనగానే అందరూ ముక్తకంఠంతో హరహరమహాదేవన్న శరణగోష నాడి మండలమంతా మారుమ్రోగి హృదయం పొంగి కళ్ళ వెంట స్రవించింది.

3
మేము వెళ్ళిన మహాకుంభా క్యాంప్ బై అద్వాతా.
నాలుగు ఐదు రకాల టెంట్లు. చాలా టెంట్లు ఉన్నాయి. క్రమపద్దతిలో అమర్చి ఉన్నాయి. మా టెంట్లకు బాతురూమ్‌ కలిపే ఉన్నాయి. ఈ క్యాంపుకు గంగ 500 అడుగుల దూరం. మేము ముందు వెళ్ళి స్నానం చేశాము. తరువాత వచ్చి చూస్తే లంచు ఏమీలేదు.టైం అయిపోయిందట. ఒక టీ క్యాంటిన్ ఉంది. ఎప్పుడైనా టీ దొరుకుతుంది.
తెలుగువాళ్ళు కలిశారు కొందరు. వారు ఎన్‌ఆరఐలే. మిగిలినవారు విదేశీ యాత్రికులు. పెద్ద పెద్ద కెమారాలతో ఉన్నారు.
క్యాంపులోనే హోమకుండము, శివాభిషేకానికి అవకాశము ఉన్నాయి. మేము అడిగితే పితృకార్యాలకు చేయిస్తామన్నారు.
మేమిద్దరమూ ఆయనతో సామానంతా తనే తేవాలని చెప్పాము. అన్నింటికీ కలిపి ధర చెప్పారు. “సరే” చెప్పారు మావారు. అలా ఆ రోజు సాయంత్రం మేము పెద్దలకు పిండప్రదానాలు, దానాలు తర్పణాలు సమర్పించటము చేశాము.
ఆ సాయంత్రపు మునిమాపువేళ గంగా పూజ చేసి, అమ్మవారికి హారతి ఇచ్చాము. అప్పటికే శరీరం డస్సిపోయింది.
క్యాంపులో డైనింగు హాల్ లా ఉన్న టెంటులో రాత్రి భోజనం చేసి వెళ్ళి పడుకుండిపోయాము.


మర్నాడు ఉదయమే సూర్యోదయమే గంగ లో మునక, ఒడ్డున జపము సాగాయి.
చాలా మంది చుట్టూ చేరి తెగ ఫోటోలు, వీడియోలు. మావారు చాలా చికాకు పడ్డారు. కాని నే పట్టించుకోవద్దని చెప్పాను. దృష్టి ఈశుని మీద నిలపి, ఆ పుణ్యకాలంలో ఆ చలిలో పూజ అభిషేకం, జపమూ అన్నీ మరోలోకంలో ఉన్నట్లుగా అనిపించాయి.
ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గంగ మీద లైఫ్ గార్డులు తిరుగుతూనే ఉన్నారు.
గంగాతీరాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూనే ఉన్నారు.
పూజ తరువాత పూలను తొలగిస్తున్నారు. గట్టు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూనే ఉన్నారు.
విసుగు లేదు వారికీ విరామమూ లేదు. చిన్న పిల్లాడు పాలతో వచ్చాడు. “ఎంతరా?” అంటే “మీ ఇష్టమైనంత ఇవ్వండి” అన్నాడు. మావారు ఎంతిస్తే అంత తీసుకున్నాడు.
పూలవాళ్ళూ కకుర్తి చూపలేదు. అసలు వాతావరణంలో కూడా కాలుష్యం లేకపోవటం నే గమనించాను.
అంతటి పరిశుభ్రంగా ఉన్న చోట, హృదయ పరిశుభ్రతను కలిగించే భగవతిని ధ్యానించుకోవటానికి ఏం భాగ్యమో అనిపించింది.
పరమాత్మకు ఎంత దయ… మూలకు ఎక్కడో అట్లాంటాలో రొజులు నెట్టుకొస్తున్న నా వంటి అల్పజ్ఞులకు సైతం ఈ దివ్య అవకాశమివ్వగా… సదా కర్మభూమిలో నిలచి ఆయనను కొలచే భక్తులకు కొంగు బంగారమే కదా!
ఎక్కడి మా ఊరు…ఎక్కడి ప్రయాగరాజ్… ఇదే కదా గంగ ప్రాప్తి’ అనుకున్నాము. మావారు కూడా తన జపమదీ కానిచ్చాక మేము సాదుదర్శనానికి వెళ్ళాలని బయలుదేరాము.
కాని వస్తున్న జనాలను ఆపలేక ఏక్కడి రోడ్లు అక్కడ మూసేసారు. మేము అలా మా క్యాంపులో బంధీ అయ్యాము. మావారు చాలా నొచ్చుకున్నారు వెళ్ళలేకపోతున్నామని. ఈశ్వరుడే సమాధానం చెబుతాడు మనకు చూసే దృష్టి ఉండాలి కానీ…

4

మేము రెండోరోజు అకాడాల వైపు సాదు దర్శనానికి వెళ్ళటానికి ప్రయత్నించి భంగపడ్డాము. అన్నీ దారులూ మూసుకున్నాయి. ‘ఈశ్వరా! నీదుకృప ఇలా ఉందా తండ్రీ. నాకు సాదుసంత్ దర్శనభాగ్యం లేదేమో’ అని తలచి వగచాను. 
ఇక కుదరదని తెలిసాక మళ్ళీ మా క్యాంపు దగ్గరి గంగాతీరానికి వచ్చి ఇద్దరం కలిసి మూడు మునకలు వేశాము. నదిలో నడుము వరకూ నీళ్ళలో కూర్చొని నేను జపం చేసుకున్నాను. మావారు ఒడ్డున తన మధ్యహ్నాం సంధ్య కానిచ్చుకున్నారు. గంట తరువాత నేనూ బట్టలు మార్చుకున్నా. ఒడ్డున బట్టలు మార్చుకోవటానికి వసతిగా క్లోజ్‌డ్‌ టెంట్లు మా క్యాంపు వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారిది కూడా ఉంది. ఆ ఏర్పాట్లు నాకు చాలా నచ్చింది. 
మేము మళ్ళీ ఒడ్డున మా పనులలో ఉండగా నే ఒకతన్ని గమనించా. అతను అక్కడ ఎప్పట్నించి ఉన్నాడో తెలీదు కానీ నిశ్చలంగా జపం చేసుకుంటున్నాడు. ముందర చిన్న శివుడి ఫోటో. దీపము వెలిగించి ఉంది. నేను నా మానాన నా జపం చేసుకు వచ్చేశాను. మావారు భోంచేద్దాం రమ్మని చాలా సార్లు పిలిచారప్పటికే. ఇక లేచి వెళ్ళి డైనింగు హాల్లో వాళ్ళు ఉంచిన ఆహారం తిన్నాము. 

ఆహారం వడ్డించే చోట తెల్లజాతీయులైన విదేశీయులు ఎడమ చేయి కుడి చేయి కలగాపులగం గా పెట్టేస్తూ అప్పడాలు ఆబగా అక్కడే తింటం నాకు పరమ చిరాకు కలిగించింది. 
‘ఆ ఎంగిలెంటి చెత్తగా మనమా ఎంతో శ్రద్ధగా మడీ తడీ పాటిస్తుంటేనూ’ అనుకున్నాము మేము. 
మాకు భోజనాల తరువాత నిద్ర ఊపేసింది. జట్‌లాగ్‌ వల్ల నిలవలేక పడుకుండి పోయాము. రెండు గంటల తరువాత నిద్రలేచి, అయ్యో దివ్యమైన ఈ కాలం నిద్రకు పెట్టామా అన్న దిగులుతో గంగా తీరానికి వెళ్ళాను వడివడిగా. 
గంగాతీరాన హారతి హడావిడి నడుస్తోంది. దేశీయులు, విదేశీయులు కెమారాలతో చుట్టుముట్టి నిలబడి ఉన్నారు. గంగాహారతిలో భక్తి లోపించిందో చుట్టూ ఉన్న జనాలలో విషయాలను మస్తిష్కములో, హృదయంలో నిలుపుకునే అలవాటు తప్పి కెమెరాలో, ఫోనులో బంధించే పద్ధతి. నేను తీరానికి వచ్చి నదిని నమస్కరించి తర్పణం సమర్పించి మౌనంగా నా జపంలో నేనున్నా. కొంతసేపటికి మావారూ వచ్చి చేరారు. అప్పటికి జనాలు ఎంతగా గుమిగూడారంటే మనకు హరతి కనపడదు, నిలబడినా. 
గంగకు అటువైపు (మరోవైపు) కూడా భజనలు, హారతి సాగుతున్నాయి. చిన్నపిల్లల పరుగులు, పెద్దల స్నానాలు, మైకులో భజనలు, హారతులు… గొప్ప హడావుడిగా ఉంది… 
అంత హడావిడిలో కూడా ఏమీ పట్టక తన జపం తను చేస్తూ, తన లోకంలో తానున్నాడు నే ఆనాటి ఉదయం చూసినతను. సన్నని శరీరం. వంటి మీద విభూది. పల్చటి అంగవస్త్రం కప్పుకున్నాడు. ముందు అదే శివుని ఫోటో. దీపం వెలుగుతోంది. అతని చేతిలో మాల తిరగటం తప్ప మరో కదలికలేదు. 
ఆనాటి మధ్యాహ్నం ఎండకు అదే పల్చటి అంగోస్త్రం, సాయంత్రం చలికి అదే. అతనిని ఈ ఎండా, చలీ ఏమీ చెయ్యటంలేదు. చుట్టూ ఉన్న హడావిడీ, భజనలూ, జనాల గోల అతని చెవి లోకి కూడా వెళ్ళి ఉండవు. దృష్టి ముందర శివుని ఫోటో మీద నిలిపి, చేతిలో మాల తిప్పుతూ అలాగే కాలన్ని స్తంభించి నిలిపాడా అన్నట్లుగా అనిపించింది. 

వెళ్ళి పలకరించాలన్న బలమైన కోరిక కలిగింది.
కొద్దిగా దగ్గరగా వెళ్ళి “హరహరమహాదేవ్” అన్నా నమస్కరిస్తూ. అతను కళ్ళు త్రిప్పి చూసి “మహాదేవ్ మాతా” అన్నాడు. 
“ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు…” అన్నా గమనించానన్న విషయం తెలుపుతూ…
“ఈ రోజు కోసం MP నుంచి నడిచి వచ్చాను మాతా” అన్నాడు. అతనే మళ్ళీ “మీరెక్కడ్నుంచి వచ్చారు?” అన్నాడు. ఇండియాలో తిరిగేటప్పుడు మేము హైద్రాబాదు అని తప్ప మా టపాటోపం ప్రదర్శించటానికి ఇష్టపడము. 
అదే చెప్పా “హైద్రాబాదు” అని. అతను మాట్లాడలేదు. చాలా పేదవాడిలా (మనము కదా అసలు పేదలము) ఉన్నాడు కానీ చిన్న పంచ అడ్డుగా పెట్టి దీపం వెలిగించి జపంలో ఉన్నాడు. కదలిక లేదు అతనిలో.  చుట్టూ ఉన్న మైకులలో భజనలు, జనాల గోల అతనిని కదిలించటములేదు. 
అతను మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడట నడుస్తూ ఈ అమవాశ్య స్నానానికి. 
అక్కడే ఉన్నాడు నదిలో మునుగుతున్నాడు శివయ్యను ధ్యానిస్తున్నాడు. గురువులేడట. శివుడే గురువుట. నిటారుగా కూర్చోవటం లేదు. ఒక కాలు మడిచాడు ఒక కాలు మడవలేదు. పల్చటి అంగవస్త్రం కప్పుకున్నాడు. ముందు చాలా చిన్న శివుడు పోటో అమ్మవారిది ప్రక్కన ఉంది. 
దీపం వెలుగుతోంది. నూనే సీసా. తిండి తిప్పలు లేవతనికి. ఎండ చలి లేవు. జనాలు గోల అతనిని డ్రిస్టబ్ చెయ్యటంలేదు. మంచినీరు రెస్టురూమ్ అవసరాలు లేవు. మంత్రంలేదు అతని వద్ద తంత్రం లేదు. కేవలం శివుని నామం తప్ప. అతనిలో ఏదో గొప్ప ఆకర్షణ ఉంది. అది అతని భక్తి కాబోలు. 
అతను శివుడని నాకనిపించింది. అతనితో “నీవే మహాదేవుడవని” అంటే “నీవు నాకు అమ్మవారివి మాతా” అన్నాడు. చాలా ఘాటైన హిందీ. నాకు సరిగ్గా అర్థం కాలేదు. కడు పేదవాడు. బస్సుకు కూడా డబ్బులేదతనికి. 
నా వద్ద ఇండియన్ క్యాష్ లేదు. పర్సులో పది రూపాయలుంటే ఇచ్చా. మౌనంగా చూశాడు. “ఫోటో తీసుకోనా?” అని అడిగితే “నీ ఇష్టం” అన్నాడు. 
మావారితో  అతనిని గురించి చెబితే ఓ ఐదొందలు ఇచ్చాడు. అవి అతనికి “శివుడికి ప్రసాదం పెట్టు” అని ఇస్తే పది రూపాయలు చూసిన చూపే ఐదొందలిని చూశాడు. 
డబ్బు కదిలించని, చప్పుళ్ళు డ్రిస్టబ్ చెయ్యని అతని భక్తికి  నాకు హృదయం కరిగి కన్నీరాగలేదు. 
ఈశుడే అతను. పరమశివుడే నా ముందున్నాడు. నా నెత్తిన గురుపాదుకలున్నాయి కాని లేకపోతే అతనికి సాష్టాంగం చెయ్యాలనిపించిందండి.  పరమేశుడు నాకు ఈనాటి సాయంత్రం ఇలా దర్శనమిచ్చాడు. నేను సాదుదర్శనం చెయ్యాలని పరమేశ్వరుడ్ని కోరాను. ఆయనే వచ్చి ముందు నిలిచాడు. 
అతని రూపం మరవలేకపోతున్నా. భక్తికి వ్రజగోపికల ఉదాహరణ చెబుతారు. నే నీనాడు గంగాతీరాన ఆ భక్తిని చూశాను.
మహాకుంభ గంగాతీరానికి పిలిచిన స్వామి ఇలా దర్శనమిచ్చాడని బలంగా తోచింది. కాని అతన్ని పదే పదే డ్రిస్టబ్ చెయ్యకూడదని దూరం నుంచి నమస్కరించి వచ్చేశాను. మావారు మాత్రం “అతను అవధూత. నీకు తెలీటంలేదా? డిస్ట్రబ్ చెయ్యకు…” అన్నారు. 
అక్కయ్యకు చెబితే “అది వీరభక్తి. పాల్కురిసోమనాథుడు చెప్పిన భక్తి ఇదే. అంతా శివుడే. శివుడు లేనిది మరోటిలేదన్న భావనలో ఉంటారు…” అంది. 
నావరకు నాకు మాత్రం సాదు దర్శనం వెళ్ళలేని నా అశక్తతను స్వామి ఇలా తీర్చాడని అనిపించింది. 
హరహరమహాదేవ్!

5

అమవాశ్య నాడు విపరీతమైన పొగమంచు. అంతటి మంచులో కూడా ఎందరో పవిత్ర స్నానాలు చేశారు. మేమున్న గంగాఘాటుకు కిలోమీటర్లు దూరంలోనే తొక్కిసలాట జరిగింది. మేమున్న చోట ఆనాడు చాలా హడావిడి కనిపించింది. 

మేము ఉదయం ఆరుకు గంగాతీరంలో శివాభిషేకము యధావిధిగ చేసుకొని, మేమున్న క్యాంపులో హోమము కూడా చేసేసుకున్నాము. గంగాతీరములో హోమానికి వెసలుబాటు కలిగించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాము. 

ఆనాడు ఉపవాసమున్నాము. కొంత పారాయణము జపము చేసుకున్నాము కానీ అప్పటికే మేమిద్దరం చాలా సిక్‌అయ్యాము. 

టెంటు బావుంది కానీ రాత్రి చలికీ, పగలు వేడికీ అది గొప్ప ప్రొటక్షన్ కాదు. మేము ఏర్పాటుచేసుకున్న బండి కూడా ఊరు బయటే ఉండిపోయింది. 

మహాకుంభు నుంచి మేము తప్పక తీసుకొచ్చుకున్నవి: గంగా నది నుంచి కొద్దిగా మట్టి మా తులసికోటలో కలుపుకోవటానికి, రుద్రాక్షలు, రెండు చిన్న శంఖాలు, గంగాజలము. ప్రతి ఒక్కరు మహాకుంభ లో సేకరించి తీసుకోవాలని చెప్పారు. అదే చేశాము.

మేము ఎలాగో తంటాలు పడి అనుకున్నదానికి నాలుగుగంటలు ఆలశ్యంగా ప్రయాగ నుంచి బయలుచేరగలిగాము. వారణాసి చేరి అక్కడ్నుంచీ మా ఊరు చేరుకున్నాము. 

ప్రభుత్వ ఏర్పాట్ల బావున్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. యాత్రికులకు మంచి అనుభవము మిగులుతుంది. 

నేనే ఈ యాత్ర చెయ్యగలిగానంటే ( నా ఆరోగ్యం గత రెండేళ్ళుగా ఇబ్బంది కలిగిస్తోంది) ఎవ్వరైనా అలవోకగా చెయ్యవచ్చు. 

మనఃసంకల్పానికి మించిన మంచి ముహూర్తం లేదు. దివ్యమైన మాఘమాసపు కుంభమేళా పుణ్య సమయాన్ని సాధకులందరూ ఉపయోగించుకోవాలని భగవతిని ప్రార్థిస్తున్నాను. 

మనమే అడుగు వేస్తే ఈశ్వరుడు చెయ్యందుకొని గమ్యం చేరుస్తాడు

హరహరమహాదేవ్!!

2 Comments Add yours

  1. Vadrevu Ch Veerabhadrudu's avatar Vadrevu Ch Veerabhadrudu says:

    అదృష్టవంతులు. ధన్యాత్ములు .

    Liked by 1 person

  2. N.seetarami Naidu's avatar N.seetarami Naidu says:

    చాలా అదృష్టం.. మీ బ్లాగ్ చాలా బాగుంది.. మీ అనుభవాలు… మార్గం చూపుతాయి

    Like

Leave a comment