పూర్వం వంటంటే అదో ప్రహసనంలా ఉండేది. వడ్లు నూరటం నుంచి, విసరటం,దంచటం అంతా మనుష్యులే చేతులతో, రాతి పనిముట్లతోనూ (రోలు, తిరగలి,గాడి పోయ్యి, రోకలి, పొత్రం ఇత్యాదివి)చేసేవారు. ఆనాడు స్త్రీ కు రోజంతా వంటఇంట్లోనే గడిచిపోయేదంటే మరి వింత కాదు. విద్యుత్ కనిపెట్టాక, కొద్ది కొద్దిగా యంత్రాలు చోటు చేసుకుంటూ, స్త్రీలకు ఈ అవస్థను కొంత తప్పించాయి. తిరగలి బదులు వెట్ గ్రైండర్, రోళ్ళు బదులు మిక్సీ, కట్టెల పొయ్యి బదులు గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ పొయ్యి, జ్యూసు తీసెందుకు నుంచి రకరకాలుగా కూరగాయలు తరగటం వరకూ, కన్వెన్షన్ ఒవేన్, మైక్రో ఒవేన్, డిష్ వాషెర్ , వాషింగ్ మిషను, వ్యాక్యుమ్ క్లీనరు, ఒకటేమిటి ఎన్నెనో మానవ జీవితానికి సుఖపెట్టటానికి…
ఈ నవీన యుగవు స్త్రీ కి ఇంట్లో ఎంత పనో, బయటా అంత పని… కాబట్టి ఇన్ని నవీన సాధనలున్నా పని తెమలదు ఒక పట్టానా.
కొంత మంది చాదస్తులు ఉంటారు. మా అమ్మమ్మగారి ఇంట్లో, మిక్సీ ఉన్నా రోట్లో నూరితే కాని రుచి రాదు, అని ఆవిడ రోట్లో వేసి నూరిచ్చేది…నాతో…
పరమ విస్సుగా ఉన్నా, చిన్నపుడు నూరేదాన్ని… ఇప్పుడు, అప్పుడప్పుడు ఆ కళలు మావారు ప్రదర్శితారు.. ‘కాస్టుకో’ లో అప్పుడెప్పుడో దొరికిన రోళ్ళు పొత్రాన్ని 15 డాల్లర్లకు కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టారు.. నేను కొబ్బరి పచ్చడి కొంత మిక్సీ లో వేసి, కోస మెఱుపుగా ఆ రోట్లో వేసి రుబ్బి ‘మమ’ అనిపించి మార్కులు కోటెస్టు ఉంటాను. వంట ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే సగం హెల్ప్ ఉన్నట్లే కదా! నాకైతే సగం వంట దాంట్లో అయిపోతుంది. తొందరగా, ఈజీ గా ఉండే మైక్రోవేవ్ మీద ఈ మధ్య కొత్తగా యుద్ధం ప్రకటించారు కొందరు మేధావులు. అందులో వండినవి మంచివి కావు అని.. నాకర్థం కాదు అసలు ఇవ్వని కనిపెట్టి, మనకిచ్చి అలవాటు చేసి, మళ్ళీ తూచ్ అంటే ఎలా వప్పుకోవటం…. అందునా నాలాంటి వంట బద్ధకిస్టులు…
ఇలాంటి వన్నీ ఒక ఎత్తు… ఈ మధ్యనే మేము తెచ్చుకున్న రోటిమాటిక్ ఒక ఎత్తు..దాని గురించే ఇంత ఉపోద్ఘాతమూ….,
నా చిన్ననాటి నుంచి మా ఇంట్లో రాత్రిపూట చపాతీలు ఉండేవి. అందుకే నేను చపాతీ ఎక్కువ ప్రిఫెరెన్సు అన్నం కన్నా. వంట బద్దకంతో చపాతీలకు సులువు మార్గం కనిపెట్టటం కోసం నానా వేషాలు వేసాములెండి ఇక్కడకు వచ్చిన కొత్తల్లో.. ‘పిటా బ్రెడ్’ అని దొరుకుతుంది, పూర్వం అంటే 15 సంవత్సరాల క్రితం, అవే కొద్దిగా చపాతి దగ్గరగా వచ్చే బ్రెడ్. వారానికి నెలకో నేను చపాతీ చేసేదాన్ని. చాల సార్లు ఇలాంటివి తిని విసుగేసేది. ఇంట్లోనూ అవే, వీకెండ్ పార్టీస్ అవే. సరే రాతి యుగం తర్వాత మరో యంత్రాల యుగంలా ఇండియన్ స్టోర్స్ లో చపాతీ అమ్మటం మొదలెట్టారు. అవి బానే ఉండేవి కొన్న నాటికీ, రెండో నాటికీ ముక్కలు ముక్కలు లా విరిగి నమిలే అవసరం లేకుండా పోయేది.
ఇంత గొడవల మధ్య అసలు రోటి తినటం మానేద్దామంటే… అసలు అన్నమే తినమాయే… ఏంటో కర్మ.. వదిలించాలంటే వంటి బద్దకం బట్టలకంటిన మురికి కాదుగా, రింసోపు వేసి తోమటానికి… నాలాటి వారికి రక్షిస్తామంటూ మార్కెట్ లోకి ప్రవేశపెడతామన్నారు రోటిమాటిక్.. నాకు చిన్న ఆశ లాంటి మొదలై… చూస్తుండగానే పెరిగి వట వృక్షం అయింది.. waitlist కి అప్లై చేశాను… బానే ఉంది… ఒక ఏడాది తర్వాత… “ఇంకేమి తీసుకోండి మీరు అప్లై చేసిన రొట్టెల మిషిన్ రెడీ” అని మెయిల్ వచ్చింది. ఆనందంతో చూద్దును కదా మొఖం పగిలే రేటు… బాబోయి ఇంత ఉంటె కొనగలమా అని అసలు వద్దు… .. బాబోయి అని వదిలేశాను.
మిత్రులు ఒకరు కొని డెమో డిన్నర్ కి పిల్చారు. మేమంతా పోలో మంటూ వెళ్లి డెమో చూసి ఆహా!ఓహో! అని ఆనందించాము కానీ కోనటానికి దైర్యం చెయ్యలేదు… కానీ నా తిప్పలు చూసి శ్రీవారు నాకు చెప్పకుండా దడేలని అంతర్జాలములో ఆర్డర్ చేశారు. ఇంకేముంది ఒక శుభోదయాన ఇంటిముందుకు వచ్చి వాలింది పంచ వన్నెల రంగుల పెట్టలో…పిట్టలా.
నేను చాలా ఆశ్చర్య పడి, ఎందుకు ఇంత పోసి కొన్నారు… హాయిగా రెండు తులాల బంగారం వచ్చేది అంటూ గొడవ చేశాను.. కానీ దీని దుంప తెగా ! అది అలా చెక చెకా రోటీలు చేస్తుంటే… వేడి వేడివి అలా తింటుంటే ఆ మజానే వేరులేబ్బా!!
అది తెచ్చుకున్న వారానికి మేమిద్దరం ఫ్లూ బారి పడి తనో పక్క, నేనో పక్క పడుంటే పాపం అదే పెద్ద దిక్కులా మాకు రోజూ కాసిన రొట్టెలు చేసి పెట్టేది. మిత్రలు వచ్చి వారానికి సరిపడా కూరలు పెట్టివెళ్ళారు ప్రిజ్ లో. ఇంకేముంది ఇంక మేము పూర్తిగా దాని మీద ఆధారపడ్డాము. అదే మా అలనా పాలనాను, పెద్ద దిక్కు, వేడుకలప్పుడు వంట హెల్ప్, పార్టీలకు పబ్బాలకు చేతికింద పనికి సహాయం, ఉదయం సాయంత్రం వేడి వేడి రోటీలు అందించే వంటింటి నేస్తం… నాలాంటి బద్ధ జీవులకు… టైం లేని హడావిడి జీవులకు తినటానికి తిండి అందించే అన్నపూర్ణ..
మిషను పని విధానము, గట్రా : ఆ మిషనుకు పైన పిండి, నీరు, నూనె కి మూడు బాక్స్ లాంటివి ఉన్నాయి. మనం ప్లగ్ పెట్టగానే అది మన wifi కి కనెక్ట్ అవుతుంది. వాడే పిండి తరహా, ఎంత మందం, ఎంత కాల్చాలి, ఎంత నూనె వాడాలి ఇత్యాదివి మనం టచ్ స్క్రీన్ మీద ఎన్నిక (సెలెక్ట్) చేసుకోవాల్సి ఉంటుంది. మనం అన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా కానియ్యవమ్మా అని పెర్మిషన్ బటన్ నొక్కితే , అది మనలను మళ్ళీ అడుగుతుంది, ఇప్పుడే చెయ్యాలా? వ్యెట్ చెయ్యాలా? అని. కానీయ్యవోయి ఆకలిగా వుంది అంటే మొదలెట్టి 5 నిముషాలు సమయము వెడ్డెక్కటానికి తీసుకొని, తర్వాత అడిగినన్ని రోటీస్ చేస్తూ ఉంటుంది. ప్రతి రోటికీ పిండి కలుపుకోవటము, కలిపిన పిండి కింది కంపార్టుమెంట్ లోకి వస్తుంది. అక్కడ నుంచి మిషిన్ వెనకాల వత్తె ప్యాన్స్ ఉన్నాయి. అక్కడకి పిండిని తోస్తుంది తెడ్డులాంటి గరిటతో. రొట్టె ను వత్తి, మళ్ళీ ముందుకు తోస్తుంది.. ముందర వేడి వేడి పైన ఒకటి క్రింద ఒకటి చొప్పున రెండు పాన్ లు ఉన్నాయి. అని రోటి ని మనం ఎంపిక చేసుకున వేడికి సరిపోనూ కాల్చి బయటకు పంపుతుంది. పుల్కా లా అలాగే తినవచ్చు. లేదా నేయి రాచుకొని తినవచ్చు. మిషన్ లో పిండి గాని, వాటర్ కానీ తగ్గితే గంట కొడుతోంది. పొరపాటున ఎక్కడైనా పిండి అత్తుకుపోయినా, మరోటైనా పింగ్ చేస్తూ ఉంటుంది.
ఏమైనా వేడి వేడి రొట్టెలు తినటం మాత్రం మాకు సూపర్ గా సెట్ అయ్యింది.
ఏదైనా వస్తువు విడుదల అయ్యాక ముందు కొంచం రేట్ ఎక్కువే ఉంటుంది. కానీ తర్వాత తగ్గుతుంది కదా. అది కాక వాళ్ళు ఇప్పుడే మొదలెట్టారు. మనకు ప్రాబ్లెమ్ వస్తే మనం మన ఫోనులో వున్న( ముందు ఆ యాప్ మన ఫోనులో డౌనులోడు చేసుకోవాలి) లో వెంటనే రిపోర్ట్ చేయవచ్చు. మనకు వాళ్ళు రిమోట్ గానే సరిచేస్తారు.
ఇప్పుడు వాయిదాలలో నెల నెల కట్టే పద్దతి కూడా మొదలుపెట్టారు. కాబట్టి చపాతీ తినేవారు దీన్ని తెచ్చుకోవటం గురించి సీరియస్ గానే ఆలోచించవచ్చు. రోటిమాటిక్ మాత్రం ఇప్పుడు ఇక్కడ నాక్కున హెల్పేర్ అన్నొచు, లేదా వంటలక్క లేదా, నా నెచ్చెలి ..అన్నిటికి మించి అద్భుతంగా సహాయం చేస్తున్న అన్నపూర్ణమ్మ.




a