అక్కడ- ఇక్కడ
చెక్క ఇల్లు – నిప్పురవ్వ
ఒక పాత జంధ్యాల చిత్రంలో ఒక సన్నివేశము “ఇండియా నుంచి అమెరికా వచ్చి, కుటుంబ పెద్ద ఇంటి గృహప్రవేశం అప్పుడు దూపం వేస్తుంటే పొగకు స్మోక్ అలారం మ్రోగి ఫైర్ ఇంజిన్ వస్తుంది”. హాస్యం పుట్టించినా ఆ సంఘటన ఇక్కడ, అంటే అమెరికాలో, నిప్పు అంటే వున్న జాగ్రత్తను, భయాన్నీ చూపుతుంది.
మన దేశంలో మనం మంటల గురించి గాని, నిప్పురవ్వ పుట్టించే దారుణం గురించి గాని, ఇంత జాగ్రత్తగా ఉండమేమో అనిపిస్తుంది వీళ్ళ అతి జాగ్రత్తను చూస్తే. దీనికి ముఖ్య కారణం ఇక్కడ ఇళ్ళు, మేడలు చెక్కలతో నిర్మించబట్టి.
ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు అధికం. అది దొరకటం చాలా ఎక్కువ కాబట్టి చెక్క ఇళ్ళలో జీవనం ఏర్పాటు చేసుకొనివుంటారు. చెక్క చలికి బాగా పనికివస్తుంది కూడానూ… అంటే చెక్క చాలా నెమ్మదిగా వేడి లేదా చలిని ప్రసరించు వాహకం(Bad conductors)కూడా కదా! అందుకనే చెక్కలతో నిర్మిస్తారు ఇళ్ళు, వాడలునూ. ఇవి ఎండా కాలంలో ఎండలకు బాగా వేడెక్కి, ఒక్క చిన్న నివ్వురవ్వ తగలగానే బుస్సున్న సర్వం స్వాహా అయిపోతాయి. అందుకే ఇక్కడ ఫైర్ అన్నా, స్మోక్ అలారంకి మోగడము అన్నా అంత ఉలికిపాటు, హడావిడి. ఫైర్ ఫైటర్సుకు చాలా గౌరవం, మర్యాద.
ఇక్కడ ఇంటికే కాక, ఫ్లోర్/ నేల మీద చెక్క పరుచుకోవటం చాలా మన్నికగా, ఉత్తమైన విధానంగా భావిస్తారు. అంటే హార్డువుడ్ ఫ్లోరింగ్ అన్నమాట. ఇంకో విధానం కార్పెట్/తివాచీలు. ఈ రెండు విధానాలు చాలా సాదరంగా ఇక్కడ వాడుకలో వున్నవి. కార్పెట్ చెక్క నేల కన్నా కొద్దిగా తక్కువ ధర. మైంటైన్ చెయ్యటం కూడా సులభమే. చెక్క నేలలకు మాత్రం జాగ్రత్తలు అవసరం. అంటే తడి అది తగలకూడదు.
కార్పెట్లో ఉన్న సులువేంటి అంటే చలికాలములో కూడా కాళ్ళకు చల్లగా తగలదు. వెచ్చగా ఉంటుంది. అదే చెక్కయితే అంత వెచ్చగా ఉండదుకదా. కానీ చెక్క నేలను శుభ్రంచేసుకుంటే చాలా హాయిగా వుంటుంది. కార్పెట్ మన్నిక తక్కువ.. ఎంత క్లీన్ చేసినా మనకు ఇంకా ఏవో క్రిములు ఉన్నాయనే అనిపిస్తుంది. దానికి తోడు కొందరికి కార్పెట్ మూలంగా చాలా ఎలర్జీస్ కూడా కలగటం కద్దు. ప్రతి 10 సంవత్సరాలకు మార్చాలి.
ఇంత ఉపోధ్గాతం ఎందుకు చెబుతున్నానంటే, మా ఇంట్లో క్రింద భాగం చెక్క పరిచినా, మేడపైన మాత్రం కార్పెట్ వేశారు. మేము వచ్చిన కొత్తలోనే ఈశ్యానం గది దేవుడికి అని నేను ఆ పడకగదిని దేవుడుగదిగా మార్చి మందిరం ప్రతిష్ఠించుకున్నాను.
ఈ కార్పెట్ మూలంగానూ, అసలు మాములుగా నివ్వురవ్వ గాని, లేదా అగరుబత్తి రాలినా ప్రమాదమని చాలా ఆందోళనగా ఉండేది. ప్రతిరోజూ ఎంత క్లీన్ చేసినా శుభ్రంగా అనిపించేది కాదు. దీపారాధన కూడా ఒక ప్లేట్ లో దీపం పెట్టి, దానికి ఇంకో పెద్ద ప్లేట్ లో నీరు నింపి, అందులో ఈ దీపం ప్లేట్ ఉంచి వెలిగించేదాన్ని. బయటకు వెళ్ళే టప్పుడు వెలుగుతున్న దీపం ఆర్పి రమ్మనే మా వారు. మనకు దేవుడి ముందు దీపం ఆర్పటం అన్నది చాలా కష్టమైన విషయం కదా. నేను అలాగే వదిలేసి వచ్చి రెండుమూడు సార్లు అక్షింతలు వేయించుకున్నాను. బయటకు వెళ్ళాలంటే దీపం వెలిగిస్తేకొద్దిగా నూనె మాత్రం ఉంచి వెంటనే కొండెక్కెలా ఏర్పాటు చెయ్యవలసి వచ్చేది. ఇంత జాగ్రత్త తీసుకున్నా బయటకు ఆఫీస్ కి వెళ్లి ఇంటికి వచ్చేవరుకూ టెన్షన్ తో ఉండాల్సి వచ్చేది.
హాయిగా బండలు పర్చుకుందామంటే కుదరదు. పోనీ శుభ్రంగా కనిపిస్తుంది కాస్త వుడ్ ఫ్లోర్ వేయించుకుందామంటే మా శ్రీవారు వింటేనా.
మా అమ్మాయి అప్పుడు 7 తరగతి చదువుకునేది. ఆ రోజులలో ఈయన చాలా ట్రావెల్ చేసేవారు, ఉద్యోగ పరంగా. ఒకసారి వారం అలా వెళ్ళారు. నేను, పిల్ల ఇద్దరం హోమ్ డిపో కి వెళ్లి, వాళ్ళ సహాయంతో గదికి సరిపడా చెక్క ఫ్లోర్ మెటీరియల్ అంతా తెచ్చుకొని, పాత కార్పెట్ తీసేసి, వుడ్ ఫ్లోర్ పరిచాము. పిల్ల చాలా ఉత్సాహ పడింది. ఇద్దరం చెకచెకా సర్ది పాత కార్పెట్ తీసి బయట చెత్త డబ్బాలో వేశేసాము. ఐదోరోజుకు వచ్చిన మా శ్రీవారు జీవితానికి సరిపడా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. “మీరేనా ఇది చేసింది అని”… ఆ తీసివేసిన కార్పెట్ను చూసి, మా పనిలో ఒక అంచు సరిగ్గా రానందుకు నమ్మాడు.
అసలు మాకే నమ్మకం కుదరలేదు అంత బాగా వస్తుందని.
అవి జిగ్సా ఫజిల్ లాగా ఉండే చెక్కలు. ఒక్కదానికి ఒకటి అంచులు కలుపుకోవాలి.అంటే ఒకదాని ఒకటి గా లాకు చేసికుంటూ వెళ్ళి, గోడ చివలకు వచ్చాక, ముక్క అంత వరకూ రంపంతో కట్ చేసుకొని, చివర్లు ఆ చెక్కలు లేవకుండా ఇంకో చిన్న చెక్కతో గోడకు మేకులతో బిగించాలి. నిజానికి మొదటి సారి చేయ్యటము. అంత వరకూ ఎప్పుడు మేకులు కొట్టటము తప్ప పెద్దగా ఇంటి కోసము ఏమీ చెయ్యలేదు. ఇంటికి రంగులు మాత్రం తెగ పులిమేసుకునేవారము.
మెదటిసారి కాబట్టి చాలా తక్కవ ధరవి చూసి తెచ్చుకున్నాము మెటీరియల్ అంతా. చెడిపోయినా బాగుచేయ్యించుకోవచ్చని.
అయినా చాలా శుభ్రంగా, తేలికగా చేసాము మేమిద్దరం. ఒక ఇంగ్లీష్ సినిమా “while you are away ” లో లాగా మేము అలాగా శ్రీవారు వూరికి వెళ్ళిన తరువాత చేసిన ఘనకార్యం. చాలా సార్లు మిగిలిన ఇంటిని కూడా కార్పెట్ తీసివేసి వుడ్ పరుద్దామంటే వినలేదు… పిల్ల కాలేజీకి వెళ్ళిపోయాక, నేను ఒక్కదాన్ని చెయ్యలేక ఉండిపోయాను.
అలా మా ఇంట్లో దేవుడి గదికి వుడ్ ఫ్లోర్ పరుచుకున్నాము, నేను హనీ కలిసి.
ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఫ్యాషన్ అయింది ఈ వుడ్ ఫ్లోర్. కానీ ఇండియా లో నేనైతే కేవలం పాలరాయి లేదంటే షాబాదు బండలు పరిపించుకుంటాను. చల్లగా హాయిగా, ఎంత దీపారాధన చేసిన భయంలేకుండా ఉంటుంది..
మేము కార్పెటు శుభ్రం చేయ్యటానికి పిలిచిన వారు చూడగానే మీరు ఇంట్లో అగరుబత్తి వెలిగిస్తారా? అని అడుగుతారు. ఎలా తెలిసింది అంటే కార్పెటుకు అంచులు నల్లని రంగు వచ్చెసీ ఎంత శుభ్రం చేసినా పోదు. దాన్ని చూపించి చెప్పాడు క్లీనరు. అవి అందరు దేశీయలు ఇళ్ళలో వుంటుందని. ( భారతీయులనీ దేశి అని అంటారు వాడుకగా)
మొత్తానికి ఇళ్ళయినా, ఫ్లోరైనా, దేశ కాల పరిస్థితుల బట్టి కాని, అనుకరణ ఆధునికత అని పొలోమంటూ అనుసరించటం పులిని చూసిన చందాన వుంటుంది కానీ, మన అభిరుచిని చూపుతుందా??
మీరేమంటారు?
