ప్రతి వేసవిలో పెద్ద ముతైదువలా ప్రతి తెలుగువారు గడపను పావనము చేసి వారి ఆలనా పాలనలో ప్రధమ సహయాకారి, అందరి ప్రియతమ అవకాయ ను అందరు స్వాగతించ సన్నాహాలు జరుపుతున్నారుగా.
బాగు!బాగు!
మేము మీ అంత పకడ్బందీగా కాకపోయినా కొద్దిగ ముక్కల పచ్చడి, మెంతిబద్దలు గట్రా చేసి ఆనందిస్తున్నామన్నమాట.
ముందు ఘనస్వాగతము పలికాను, షాపులో మామిడికాయలు కనపడగానే…
గౌరవముగా తీసుకొచ్చి ఇంటికి రాగానే..
శుద్దోదక సాన్నం సమర్పయామి యని, శుభ్రముగా కడిగాను.
వస్త్రం సమర్పయాని, తుడిచాను మెత్తని వస్త్రంతో..
సేవలు సమర్పయామి యని సన్నని ముక్కలుగా తరుగితి,
వివిధ చూర్ణములు మెండుగ, కన్నులకు, జిహ్వకు పండుగగా, తెచ్చి
ఎఱ్ఱని కారము 4 చెంచాలు, తెల్లని ఉప్పు 4 చెంచాలు, మెంతి పొడి 1 చెంచా, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువలు సమర్పయాని అని కలిపాను.
నూనెను వడుపుగా వెచ్చపెట్టి కొద్దిగా ఆవాలు వేసి ఈ రంగుల హరివిల్లుకు సమర్పయాని యని కలిపాను.
మామిడి ఆకుపచ్చ, కారపు ఎరుపు, పసుపు పచ్చటి పసుపు మెరుపులతో, నూనెతో కలసి, ఇంగువ గుమగమలతో గుభాళించి మా గృహము పావనమైనది.
అలా మా ఇంట ఈ ఏడు అవకాయకు గుర్తుగా ముక్కల పచ్చడి వెలిసింది.
శ్రీవారు మురియగా, నా కళ్ళు మెరువగా
వారము రోజులు హాయిగ
ఇక మాకు పండగ..🙂