‘మనా’ లో ఒక రోజు.
భారత దేశపు చిట్టచివరి గ్రామము “మనా” ను సందర్శించే అవకాశము నేను బదిరికి వెళ్ళిన రెండో రోజు కలిగింది.
బదిరిలో నేను వున్న ఆశ్రమ సిబ్బంది నాతో ఎంతో ప్రేమగా వారి సొంత కుటుంబ సభ్యులలా ఆదరించారు. నే వెళ్ళిన తరువాత రెండోనాడు దేవాలయం నుంచి మధ్యహానము వేళకు నేను ఆశ్రమము చేరగానే శ్రీదరు (అక్కడి కేర్టేకరు) మనము ఈ రోజు మనా వెడుతున్నాము అన్నాడు. నే సరే యని భోం చేసి రెడి అయ్యాను. నాకు ఎవరెవరోస్తున్నారో తెలియదు. నే వ్యాను దగ్గరకు వెళ్ళి ఎక్కాకా తెలిసింది. 5 మంది కూర్చునే వ్యానులో 10 మంది కూర్చొని వెళ్ళుతున్నామని. నా చిన్నప్పుడు అలా నాన్నాగారు పక్కింటి ఎదురింటి సమస్త ప్రజను తెచ్చి 5 మంది కూర్చునే చోట 10 మంది కుక్కి తీసుకుపోయేవారు. అది గుర్తుకు వచ్చి మంచి సరదా వేసింది. ఏమైతేనేమిటి ఒక 10 నిముషాలలో ‘మనా’ కు చేరిపోయాము.
ఆ గ్రామము అన్ని హిమాలయ పర్వత గ్రామలలా ఎత్తులు పల్లాలు. పర్వత ప్రాతాల గ్రామాలు బల్లపరుపుగా వుండవు కదా. క్రింద నుంచి పర్వతం పైపైకి వెళ్ళటంలో ప్రతి వీధి ఒక్కో ఎత్తులో వుంటాయి. ఇది హిమాలయాలలో ప్రతి పూర్లో మనకు కనపడుతుంది.
ముందుగా మేము వినాయక గుహ కు వెళ్ళాము. అక్కడ కూర్చొని వినాయకుడు వ్యాసుల వారు చెప్పే భారతమంతా రాశారుట.
ఆనాడు వివాయకచవతి. మాకు అక్కడి పూజారులు పలు రకాల ప్రసాదాలను పంచారు. అనుకోకుండా అలా వినాయకచవితికి వినాయక గుహ కు వెళ్ళటం బావుంది.
అక్కడ్నుంచి ఒక 50 మెట్లు ఎక్కి వ్యాస గుహ కు వెళ్ళాము. వ్యాసుల వారు అష్టాదశ పురాణాలను భారతమును భాగవతమును అక్కడే రాశారుట.
మేమంతా ఆ గుహలో విష్ణు సహస్రం చదివాము.
అటు నుంచి దాదాపు ఒక కిలో మీటరు క్రిందకి పైకి నడిచాక భీమ రాయి ని చేరుకున్నాము. పాండవులు సంచరించిన ఆనవాలు అక్కడి హిమలయ ప్రదేశమంతా కనపడుతుంది.
మహాప్రస్థాన క్రమములో పాండవులు రకరకాల నదులు కొండలు దాటి వెడుతూ ఈ సరస్వతీ నది దగ్గర ద్రౌపది దాటలేక ఇబ్బంది పడిందట. భీముడు ఒక రాయి వేసి దాని మీదుగా రమ్మనాడట.
అది చిన్న కొన మీద ఆని వంతెనలా వుంటుంది. సరస్వతి నదిని దర్శించటానికి మనము దాని మీదుగా వెళ్ళి క్రిందకు దిగుతాము.
ఈ సరస్వతీ నదికి ఆవల వసుధార జలపాతాలు ధర్మరాజు సోదరులతో పాటు చేసిన మహాప్రస్థానము దారి వుందిట.
సరస్వతీ నది ఒక గుహ నుంచి చాలా వేగంగా వస్తూ వుంటుంది. ప్రవాహ వేగం అత్యద్బుతం. కొద్ది దూరంలో వున్న అలకనందను కలసి పరిపుష్ఠి చేస్తుంది. అంత వరకూ అతి నీరసంగా వున్న అలకనంద సరస్వతీ నదిని కలువగానే వేగంగా మారి దుముకుతూ సాగిపోతుంది. అక్కడే ఓక చిన్న సరస్వతీ అమ్మవారి గుడి కూడా వుంది. ప్రక్కనే చిన్న దుకాణం. భారతదేశపు చిట్టచివరి దుఖాణం అని బోర్డుతో వుంది.
మనా’ గ్రామము దాదాపు 25 గడపలతో వుంది. స్త్రీలు స్వేట్టర్లు అల్లుతూ, తోటపనిలో మునిగి వుంటారు. ఎక్కడ చూసినా స్వెట్టర్ల చిన్నచిన్న అంగళ్ళు. స్త్రీ వస్త్రధారణ కాశ్మీర్ వారిని గుర్తుకు తెస్తుంది.
మనా లో అలకనందకు ఆవల మిలటరీ వారి క్యాంపు వున్నది. జ్యోషీమఠం తరువాత సంవత్సరములో ఆరు నెలలు ఆ దారి మాముల ప్రజలకు మూసి వేస్తారు. ఆ ఆరు నెలలు ఈ పల్లె వారు కూడా కాళీ చేస్తారుట.
వున్న కొద్ది స్థలం లో ఆలు, క్యాజేజీ, మొదలగు కాయగూరలు పండించటము చూస్తే ముచ్చటేసింది. టీలో కలిపే మసాలా, డయాబేట్సీకు మందు కూడా అక్కడ విరివిరిగా కనిపించాయి.
ఎంత వయస్సు వారైనా ఎంతో స్నేహంగా చలాకిగా వున్నారు ‘మనా’ లో.
అక్కడ కొన్ని సాక్సులు హనీ కి బహుమతిగా తీసుకొన్నాను.
మూతో వచ్చిన వారు వారికి కావలసినవివారు తీసుకున్నారు. మేమంతా ఆ వూరులో కొంత సేపు గడపి బదిరి తిరిగి వచ్చేశాము. మనా ను సరస్వతి నదీ పుట్టు స్థానము కోసమే కాదు మన ద్శపు ఒక వైపుగా వున్న చిట్టచివరి గ్రామముగా చూసి అక్కడి వూలు వి సవనీర్లుగా తెచ్చుకోవటం నాకు నచ్చిన విషయం.
: మనా వెళ్ళాలంటే చార్ ధాము యాత్రలో భాగంగా బదిరినాథ్ వెళ్ళినప్పుడు ప్రక్కనే 3 కి.మీ. లలో మనా గ్రామము వుంది.
మాములు టూరులలో మనా కూడా చూపెడతారు.
అలా కాక బదిరి వెళ్ళితే మనం మనా ను సందర్శించవచ్చు.
సతోపంతు అనే ఆకుపచ్చటి సరస్సు కు ఇంకా ఎన్నో ప్రదేశాలకు మనా నుంచే పర్వతారోహణ మొదలవుతుంది.



