“మీరు చదివిన స్కూలును మళ్ళీ ఎప్పుడైనా విజిట్ చేశారా?” అని ఒక చోట యండమూరి పశ్నిస్తారు.
అవును మనము గతం మీద ఎంత భవిష్యతు సౌధాలు నిర్మించినా… వర్తమాన సమతుల్యం పాటించినా అలాంటి చిన్న చిన్న పనులు మన హృదయం లోలోపలి తేమను పైకి తెచ్చి, మనలోని మానవత్వపు మొక్కకున్న పూల సువాసన వెదజల్లుతాయి. ఆ ఆనందముతో మనము మరి కొన్ని సంతోషకరమైన రోజులు గడపొచ్చు.
అలాంటి కొన్ని బ్రతికిన క్షణాల వివరాలు….
మా నాన్నగారి రెవెన్యూ లో పనిచేశారు. మా చిన్నతనం పూర్తిగా కొల్లాపూరులో సాగింది. నిన్నటి రోజు నాకు మా చిన్ననాడు పెరిగిన వూరికి వెళ్ళే అవకాశము కలిగింది. బ్రహ్మనందము గారు ఆ పూర్లో జరిగే సంబరాలకు నన్ను తమతో రమ్మని ఆహ్వానించారు. అలా….నేను మళ్ళీ ఇన్ని రోజుల తరువాత కొల్లాపూర్ సందర్శించే అవకాశం కలిగింది.
ఆ రోజులు, మేము వున్న ఇల్లు, నేను చదివిన స్కూలు, తిరిగిన వీధులు, హో… ఒకటేమిటి సమస్తం నన్ను పూర్వ జ్ఞాపకాల వలయాల లోకి తీసుకుపోయి, అమ్మను నాన్నాను, చిన్ననాటి స్నేహితులను అందరిని కళ్ళ ముందు నిలిపి అన్నింటిని మనసులో మళ్ళీ రిఫ్రెష్ చేసుకున్న తరుణమది.
జీవితం కాంతి వేగం తో కొట్టుకుపోతున్న తరుణంలో….చిన్న విరామం నాకు కొల్లాపురం…
మేము తిరిగిన ఆ నేల…ఆడిన ఆ మైదానం, సైకిలు తొక్కుతూ పడి దెబ్బలు తాకించుకున్న స్కూలు గ్రౌండు… చెట్టు..తరగతి గదులు,వ్యక్తిత్వం నిలిపిన ఉపాధ్యాయులు…పోటికి సై అన్న మిత్రులు,
దెబ్బలాడిన నేస్తాలు….
రాజవీధి, రాజుగారి కోట,
కాలపు గాయం పూడ్చిన ఆ వూరు నన్ను చాలా లోలోతుల దాగిన పసితనపు అమాయక బాల్యపు ఆనందపు రుచుని చూపింది.
నన్ను ఆ సంభరాలలో అడిగారు…మీది ప్రాపరా అని…
నాకు చిన్నప్పటి నుంచి తెలిసినది
ఆ వూరు ఒక్కటే.
మరి దాన్ని ప్రాపరంటారో…ఏమంటారో కానీ…
“నేను ఆడిన నాలుగు స్తంభాలాట,
చదివిన చందమామ పుస్తకం,
వేసవిలో మిద్దె మీద వెన్నలలో అంతా పడుకొవటం…
కొత్తకుండలో చల్లటి నీళ్ళు..ఆది వారపు సంత..
సంతలో పూనకాలు…
మేము తినటానికి పెద్దలు వప్పుకోని మురుకులు…
వద్దన్నా తెచ్చిఇచ్చే మామిడి పళ్ళ గంపలు,
సీతాఫలలా మదురిమలు..
జొన్నరొట్ట బ్రేకుఫాష్టులు..
అదరుగొట్టె అధరవులు!!
BDO ఆఫీసు ఆవరణలో మేమెక్కి న కానుగ చెట్లు …..
ఆడిన కోతి కొమ్మచ్చులు..
దోస్తులతో తిరుగాడిన వీదులు..
కబాడి ఆటలు…
సైకెలు పై వీర విహంగము..
ఊపేసిన వరిదాల..
రాజవీధీ సైజుకు భయపడే పిల్ల భయాలు…
వాకిట్లో ముగ్గులు…పోటీలు…
తిరగాడి మా వూరది…
గూడు బండిలో సోమశిల ప్రయాణం..
మునకలేసిన కృష్ణా నది….
ఎన్నెన్ని జ్ఞాపకాలో!
ఎక్కడున్నావు ఇప్పటి వరకని అడిగిన వూరి బాట..
ఆనందంగా తలలూపి ఆహ్వానించిన వేపచెట్లు..
బతకమ్మకు తంగెడు పూలకై.. తిరగాడి చేల గట్లు..
ఇంత కాలమేమయ్యావని నిక్కి నిక్కి అడిగాయి,
ఇప్పటికైనా తిరిగొచ్చానని సంతసించిన మా వూరు,
నా బాల్యపు చిరునామా మాత్రం నేటికి కొల్లాపూరే!!
With Thanks to Brahmanandam garu



