మొన్నీమధ్యన వీధిలో నడచివెడుతున్నా. ఉదయం ఆరు గంటల సమయం… పాలకోసం ప్రొద్దునే వెళ్తున్నప్పుడు. వీధిలో మరో పురుగు లేదు… వెనకనుంచి ఒక మోటారు బైక్ … అంత ప్రశాంత వాతావరణం నీ బద్దలు చేస్తూ, హార్న్ మోగిస్తూ నా ప్రక్కగా వెళ్ళిపోయాడు. నేను వీధి మధ్యలో నడవటం లేదు… ప్రక్కగానే ఉన్నాను. ఒక ప్రక్కన వెడుతున్నా ఆ వీధిలో మరో పురుగు లేకపోయినా సరే, మరో జీవి కనిపిస్తే హార్న్ మోగించాలని మన దేశంలో డ్రైవింగ్ లెసన్స్ లో ఉన్నదేమో నాకు గుర్తు లేదు…
అసలు మన దేశంలో హార్న్ వాడినట్లు ప్రపంచంలో ఎక్కడా వాడరేమో.. ఎక్కడా అన్నది కొద్దిగా అతిశయోక్తి కానీ, యూరోప్ లో, అమెరికాలో అయితే డెఫినెట్గా వాడరు.
ఎవరి మానాన వారు వెడుతూ ఇంత చప్పుడు సృష్టించాలా అన్నది నా అనుమానం. అవసరం అయినా అవకపోయినా ఉంది కదా, అని హార్న్ మోగించటం వల్ల, మన వాతావరణంలో కాలుష్యం మనమే పెంచుకుంటు న్నాము. ఇంత చప్పుడు మనకు రోజూ వారి అవసరం లేదు కదండీ నిజానికి.
నేను ఆటో లో వెడుతూ డ్రైవర్ ని అడిగాను… ‘ఎందుకు బాబూ ఊరికే అలా హార్న్ హోరున మోగిస్తావు… వెనక నెమ్మదిగా వెడుతున్నాముగా’ అని… దానికి అతను చెప్పిన సమాధానం ” నేను వెనక ఉన్నానని చెప్పటానికి మేడం” …
అంటే-
ప్రక్కగా పోతుంటే హలో చెప్పటానికి ‘హార్న్’,
ఆగు ఆనటాకి ‘హార్న్’,
వెనక నేను ఉన్నాను అని చెప్పటానికి ‘హార్న్’,
ట్రాఫిక్ లైట్ దగ్గర లైన్ లో విసుగు తో ఉన్నాను ‘హార్న్’,
నీవు రాంగ్ సైడ్ వచ్చావు ‘హార్న్’
నాది రాంగ్ సైడ్ అయితే ఏంటి? ‘హార్న్’ టర్న్ తిరుగు తుంటే “నేను వస్తున్నాను …హార్న్’.. బండి సార్టు చేస్తే హార్న్, ఆగితే హార్న్….
అసలు ఎందుకు ఏమిటి అన్న ప్రశ్న అనవసరం, సదా హార్న్ వాయిస్తూ… మన వినికిడి శక్తిని తగ్గిస్తూ రోడ్ల మీద వాహనాలు ఇలా తిరుగుతుంటే, మనమందరము మన 40,50 ల కల్లా చెవిటి వారము అవటం గ్యారంటీ!
ఈ వాహనాల హార్న్ తొందరగా అరిగి పోతాయేమో, బ్రేక్ కన్నాను.
అసలు ఒకసారి ఆలోచించండి ఎవరి వరసలో వారి వెళ్ళితే ఎందుకు వస్తుంది ఈ అనవసర హర్న్ మొగించాల్సిన అవసరము, అనవసర శబ్దం.
ఒక హాస్పిటల్ లేదు, స్కూల్ లేదు సర్వ ప్రదేశాలలో ఈ ‘హార్న్’ గొడవ వుంటుంది మనకు. ఈ మధ్య ఈ ఫ్లైఓవర్ కట్టడం, మెట్రో కోసం మన ఇరుకు రహదార్లను మరింత ఇరుకు చేసి ప్రజల సహనాన్ని పరీక్షిస్తుంటే, ఈ హార్న్ లతో, మాములు వాళ్ళను హృద్రోగులుగా, హృదురోగులకు కైలాసం మార్గం సుగమము చేస్తున్నారు ఈ వాహన డ్రైవర్లు. ఇలాఉంటే మనమంతా జబ్బు పడటటానికి అట్టే సమయం పట్టదు!!
మానవుల వినికిడిని డెసిమల్స్ లో కొలుస్తారు. మనము మాములు గా విని భరించ గలిగే శబ్ధం 60 – 85 డెసిమర్స్.
బొంబాయి, మన హైద్రాబాదులలో ట్రాపిక్ జామైనప్పుడు 110 డెసిమల్స్ చప్పుడు చేస్తున్నారు. ఇది ఒక పాప్ సంగీతం కాన్సర్టు కన్నా ఎక్కువ.
మానవులు ఇలాంటి ధ్వనులలో వుంటే వారి వినికిడి మీదనే కాక, వారి ఒత్తిడి పెరగటం, బీపి వంటి జబ్బులు కూడా పెరుగటం జరుగుతోందని సర్వే వివరాలు చెబుతున్నాయి. సాదరణ జీవన విదానములో ఇలా రకరకాలుగా వత్తడిని చొప్పించుకొని మన ఆరోగ్యాలకు మనమే తిలోదాకాలిస్తున్నాము. ఇలాంటి వాతవరణంలో వుంటే ఎన్ని యోగాలు, మెడిటేషన్ లు మనకు సహాయం చెయ్యగలవు?
భారతదేశం లో ఈ శబ్ధ కాలష్యం గురించి చర్యలు మొదలయినాయి. Central Pollution Control Board(CPCB)” నోహార్న్ డే “ ని, ప్రజలలో అవెక్ నెస్ తెచ్చె ప్రయత్నాలను చేస్తున్నారు. చెన్నై, ఢిల్లీ, బొంబాయిలలో సంవత్సరంలో ఒక రోజు ‘నో హర్న్’ రోజుగా పాటిస్తున్నారు.
(మిగిలిన 364 రోజులు మోగిస్తున్నారు.)
ఇక్కడ్నుంచి – అక్కడికి అంటే అమెరికా వచ్చిన వారు ముందు గమనించేది నిశ్శబ్దం. చాల సార్లు మనవాళ్లకు తోచదు అంటారు.. తోచక పోవటాన్ని కారణం అక్కడ ఇక్కడలా చప్పుడు ఉండదు..( పుష్పక విమానము అని కమలహసన్ సినిమా… అందులో హీరోకు చప్పుడు లేక నిద్ర పట్టదు.)
ఉదయం లేచినప్పట్నుంచి వాహనాల రణగొణలు, అరుపులు, కేకలు లేని సంపూర్ణ నిశ్శబ్దం…
అంత ప్రశాంతతను మన వాళ్ళు తట్టుకోలేక తోచదంటారని నా అభిప్రాయం. ఎవరో నాకు తెలియదు కానీ, మా అత్త గారు వాళ్ళు చెప్పారు ఈ విషయం.
ఈ కాలుష్యం కాని, మరోటి కాని ముందు మనము కాదని, వద్దని మన వంతుగా తగ్గించాలి. అప్పుడు ప్రభుత్వ పథకమైనా, ఇంకోటైనా ఫలిస్తుంది.
చిన్న చిన్న మార్పులతో మనము ఇది చెయ్యొచ్చు. మన వంతుగా మనము హార్న్ కొట్టడం తగ్గిదామా!! దారిలో అడ్డుగా ఎవరూ లెనప్పుడు, ముందు జాగత్తలు అవీ అంటూ చప్పుళ్ళు వద్దండీ. మనము ట్రాఫికు రూల్స్ పాట్టిస్తే ఏ ఇబ్బంది రాదసలు.
ఆ రూల్స్ అన్నీ అందరూ పాటిస్తే మన జీవితం కొంతలో కొంత ప్రశాంతంగా సాగుతుంది.
మనము శబ్ద కాలుష్యానీ, వాతవరణ కాలుష్యాని, జీవిత వత్తిడిని మన పిల్లలకు బహుమతిగా ఇద్దామా మన వంతు ఆస్తి గా? లేక కాస్త ప్రశాంతమైన జీవన విధానమిద్దామా?
ఆలోచించండి!!!


