బాంబులా జామునుల్లా

వంటగది ఒక ప్రయోగశాల వంటిదంటారు పెద్దవాళ్ళు. అందులో ప్రయోగాలు ఫలించాయా అద్భుతమైన ఆహారము. వికటించాయా మన ప్రయోగశాలలో గాజు గొట్టాలు పగిలి మంటలు ఎగబాకినట్లుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి.ఆ వంటలు వికటించాయా మన మొహాలు నిర్మాతో తోమటము ఖాయం!

అందుకే తస్మాత్ జాగ్రత్త అవసరము.

ఉదాహరణకే చూడండి,

గమ్మున వుండలేక గుబులేసి…

గులాబు జాములు తిందామంటే నా గూబ పగిలింది. కన్ను లొట్ట పోయి అమ్మ చేతిలో సూపరు రిన్ తళతళలతో మెరిసిన నా ఈ ప్రహసనం.

ఫ్లాఫ్ బ్లాకు లోకి వెడితే:

అప్పుడు నేను 7 వతరగతిలో చదువుతున్న రోజులు.

ఆ రోజులలో అంటే ‘చదువే సర్వం’ – కాదంటే వీలులేదనే నిరంకుశ పెద్దలు, భయపడే చిన్నలు వున్న రోజులలో అన్నమాట.

వంటగదివైపు వస్తే ఎం అంటుకొని అన్నింటినీ తాకేస్తామేమో అనే చాదస్తపు నాయనమ్మల కాలంలో అన్నమాట!

ఆ రోజులు మాకు అంతగా స్వేఛ్చ లేని రోజులు. అలాంటి కేవ్ యుగపు రోజులలో కూడా మధ్యాహ్నాలు అమ్మ పడుకున్నప్పుడో, మరొకప్పుడో వంటగదిని మేము అంటే అక్కా,నేను ఆక్రమించి స్వీట్లో గట్రానో ప్రయోగాలు చేసే వాళ్ళం. ఫలిస్తే ఇంటిల్లిపాది ఆ వంటకము తినటం ఎదో వంక పెట్టి మళ్ళీ ఎప్పుడో చెయ్యమని పరిమిషను గట్రాలు వుండేవి. మాకది బంపరు ఆఫర్ లాగా వుండేది.

పండుగ బంపర్ కు పంచరైతే మాత్రం మాకు దేహశుధ్ది కార్యక్రమము కూడా సాదారణంగా జరుగుతూ వుండేది.

ఆలాంటి ఒక మధ్యాహ్నము, మాకు మహా బంపరు ఆఫరు వుందని తెలియని అమాయకత్వంతో నాకు గుల్ల గుండే,

ఎఱ్ర ఎఱ్ఱ గుండే…

తియ్య తియ్య గుండే గులాబ్ జాములు తినాలనిపించింది.

అమ్మ పడుకుంది కాబట్టి మేము చేసి, తనను ఆనందంతో ముంచెత్తాలనే ఎదో అమాయకపు వెర్రి కోరికతో అక్కకి చెప్పటం, చెసేద్దాం అని తనూ ముచ్చటపడటం టకటకా జరిగిపోయాయి.

మాకు అప్పుడు రెడిమేడ్ మిక్స్ లేదు ఇంట్లో అని అర్థమైయ్యింది.

అయ్యో.. అని దిగులుపడుతుంటే అక్క మైదాతో చెయ్యవచ్చని సముజాయించింది.

మైదాతో నో మరోకటితోనో చెయ్యకూడదని మాకు తెలియదు.

మేము ఎప్పుడూ ఇలాంటివి చేశామా?

పోనీ చెయ్యలేదని వూరుకున్నామా?

ఇవ్వనీ వూహలలో చూడటము, పెద్దోళ్ళు చేస్తే తింటం…

అక్క అమ్మకు హెల్పుగా వండేది కాబట్టి తనకు చాలా తెలుసని మా అందరి గట్టి నమ్మకము.

మైదాలో బట్టరు వేసి కలిపి ముద్దలు చేసి వేయించి పాకంలో వెయ్యాలి. ఇలా చేస్తే గులాబ్ జాములు అవుతాయట. ఇదీ అక్క చెప్పిన రెసిపీ.

మరి మెత్తగా రావాలి కదా – అంటే కొంచం నీళ్ళు ఎక్కువ పోసీ మెత్తగా కలపాలని “చెపాతి పిండి” కలిపినట్లే పలచగా కలుపు అని సలహా ఇచ్చింది.

ఇదేదో బావుంది అనుకున్నాము.

అమ్మ నిద్రలేచే టైంకు ఇవి పెట్టి ఆవిడను కుష్ చెద్దామని ఇద్దరం మైదాను దొరకపట్టాము కిచెనులో.

బటరు దొరకలేదు. డాల్డా దొరికింది.అందుకని బట్టరు బదులు డాల్డా వేశాము… ఇదీ అక్కగారి సలహానే. నేను కేవలం అసిస్టెంటును మాత్రమే అని మనవి.

నాకు ఇన్ని తెలివితేటలు లేవు. అందుకే అక్క చెప్పినట్లు చెయ్యటమే బెటరుగా కానిచ్చాను ఎప్పటిలానే.

డాల్డాను గిన్నెలో వేసి గిలక కొట్టడమైయ్యింది.

అందులో మైదా వేసి మరల, మరల గిలకకొట్టడము అయ్యింది.

తరువాత నీటితో పలచగా చెయ్యటము అయినది. 

తరువాత వాటిని గొల్ఫ్ బంతి సైజులో గుళ్ళు గుళ్ళుగా చెయ్యటమూ అంటే అలా అనిపించేలా లడ్డులు కట్టడమూ అయినది.

నీళ్ళూ, పంచదార గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి కలపుతూ…. ఈ స్వీటు తింటూ ఇంట్లో అంతా ఎంత ఎత్తేస్తారో మనలను అని కలలు కంటూ వుండి పోయాము కాసేపు.

‘ ఓకే. పాకము రెడీ’ అంది అక్క. అలా ఇంక పాకము చెయ్యటమూ కూడా అయినది.

చివరి ఘట్టము. నూనె వేడిచేసి, ఈ చేసిన గోల్ఫ్ బంతులు వేయ్యించాలి.

దాని కోసం బాండిలో నూనె పోసి వేడిచేశాము.

అక్క అంది “ఉ! సంజూ కానీయి. ఇవ్వనీ తెచ్చి నూనెలో వెయ్యి”.

నమ్మిన బంటులా వాటిని

నేను కాగు తున్న నూనెలో వెయ్యటమేమిటి….

అవి ఫటాఫటా మంటూ పట్టు మని బాంబులలా పేలటమేమిటి…. మేముద్దరమూ అరుస్తూ కిచెను లోంచి పరుగెత్తమేంటీ త్రుటిలో జరిగాయి.

ఒక నిముషములో ఎన్నో జరుగుతాయని అప్పటి వరకూ నాకు తెలియదు. 

మాకసలు ఏమయ్యిందో అర్ధం కాలేదు. అర్ధమయ్యే సరికే అంతా అయిపోయ్యింది.

కాసేపటికి ఆ చప్పుడు ఆగాక కిచెనులోకి చూచుదుము కదా…….

కురుక్షేత్రం తరువాత యుద్ధభూమిలా …

దీపావళి తరువాత మా ఇంటి గుమ్మములా….,

ఎన్నికల తరువాత పార్టీ ఆఫీసులా….

చిరంజీవి మొదట ఆట సినిమా తరువాత సినిమా హల్ లా రణరంగంలా వుంది ఆ చిన్న వంటగది.

పిండి ముద్దలు గోడలకు, తలుపులకు, అలమారలకూ, టాపుకు అతుక్కు పొయ్యాయి.

బాండి లోని నూనే స్దానభ్రంశం చెంది… పొయ్యి చుట్టూ వరద గోదారిలా పొంగి పొరలుతోంది.

బాండీ క్రింద వుండాల్సిన మంట బాండిలో వుంది. ఈ చలికాలపు భోగి మంటలా దగదగ వెలుగుతూ….

ఆ చూట్టూ వున్నవి సిమెంటు గోడలు కాబట్టి సరిపోయింది. ఇక్కడి లాంటి చెక్క ఇల్లు గనుక అయితే ఇంకేం వుంది? అంతా గుల్లయ్యేదేమో మరి.

ఈ హడవిడికి అమ్మ లేచి పరుగున వచ్చేసింది. ముందు మేము క్షేమమా అని చూసింది. (పాపం ఎంతైనా అమ్మ కదా)మాకు ముఖ్యంగా నాకు చేతుల మీద నూనె పడి బొబ్బలు. అక్కకు అవీ లేవు.

కిచెను లోకి పరుగెత్తి ముందు మంటలను ఆర్పి, తరువాత మాకిద్దరికీ మంచిగా తలంటిపోసింది. ఇంక మా ముఖాలు

సూపర్ రిన్ తళతళలే… అన్న మాట! 

ఈ ప్రయోగం మూలంగా పరీక్షించి తెలుసుకున్న విషయాలు

ఏమనగా:

1. పెద్దలు లేకుండా పిల్లలే నూనె వెయ్యించటమూ గట్రా చెయ్యకూడదు.

2. మైదా లో డాల్డా వేసి మెత్తగా వుండాలనీ నీళ్ళు పోసి బంతులు చెయ్యకూడదు.

3. నూనెలోకి వస్తువులు వేగటానికి వెసేటప్పుడు బౌలింగులా చెయ్యకూడదు.

4. కుదిరినంత దూరంగా వుండాలి. కుదిరితే తలుపులకు దగ్గరగా వుండాలి, పారిపోవటానికి.

5. ఒక బకెటు నీళ్ళు కూడా దగ్గర వుంచుకోవాలి. మంటలు వస్తే నీళ్ళు పోసేయ్యాలి.

6.చెత్త పనులు చేసినప్పుడు మనము పెద్దాళ్ళకు చిక్కకూడదు… ఏతావాతా దొరికితే మనకు దేహశుద్ది మీదు మిక్కిలి వంటగది క్లీనింగి కూడా మన మీదే పడును. అందునా మనము అసిస్టెంటులము కాబట్టి.

ఇదీ నేను ఏడవ తరగతిలో చేసిన ప్రయోగము. 

అందుకే చెప్పాను కిచను ప్రయోగశాల అని. ప్రయోగము ఫలించిందా గుర్తింపు, వికటించిందా దేహశుద్ది జరుగుతాయి.

ఓం తత్ః జాగ్రత్తా!!

Leave a comment