kotikomacchi

నా కోతికొమ్మచ్చి-1

చిన్నప్పుడు గురించి తలచుకుంటే నాకు ముందుగా గుర్తుకువచ్చేది ‘జడలు – ప్రహసనము’
ఆ రోజులలో ఉదయము స్కూలు హడావిడి ఒక లెవల్లో వుండేది. ఉదయమే మా నాన్నగారు 5 గంటలకు పిల్లలందరిని లేపి మంచాలు పక్కలు ఎత్తివేశేవారు. మేము అంటే, అక్కా, తమ్ముడూ నేను ముఖం కడుకొని పుస్తకాలు ముందేసుకు చదవాలి. అది ఉదయపు దినచర్యలో మొట్టమొదటి కార్యక్రమము. మాకు పరుపులతో పరచివున్న మంచాలు వుండేవి కావు. మావి అన్నీ గూడా నవారు మంచాలు. రాత్రి వెయ్యటము, పొద్దునే తీయ్యటము.
అందుకే మంచాలు ఎతేసి పిల్లలను కూలేసి చదివించే సౌలభ్యం వుండేది పెద్దలకు. ఉదయము లేచిన తరువాత పుస్తకాలలో మఖము పెట్టి నిద్ర తూగుతామేమో అని గట్టిగా చదవమని నాన్న ఆజ్ఞ. ఆయనో చండశాసనుడు. బలే భయపెట్టెవారు.
సరే, చదువు ప్రక్కనపెడితే జడల ప్రహసనమేమిటంటే, అక్కకు జుట్టు మోకాళ్ళ వరకూ వుండేది. నాకు నడుము వరకూ వచ్చాక నది కాలువలా మారి, తరువాత మాయమయ్యేది.
అమ్మ ఉదయమే ముందు ఆమె తన  కాలకృత్యాలు తీర్చుకొని, పట్టు దావళి మడి కట్టుకొని, అటు పూజ, ఇటు ఉదయపు అన్నము వండటము, మాకు పాలు కలిపి ఇవ్వటమూ, మధ్యలో మాకు జడలు వెయ్యటమూ ఇలా అవధానము చేసేది.
అమ్మ మడి చాలా ఈజి మడి. మమ్ములను తాకవచ్చు జడలు వెయ్యటానికి.
ప్రతిరోజూ తలకు నూనె రాయవలసినదే. మాకు కొబ్బరి నూనె ఖర్చు ఎక్కువేనెమో ఆనాడు. నాకు గుర్తులేదు కాని, అందరికి నూనె ఒక రేంజులో రాసి బిగించి జడవేసి, నల్ల రిబ్బెన్లతో మడిచి కట్టెసేది. అవి(జడలు) ఎంత గట్టిగా కట్టబడేవంటే, మాకు తుఫాను వస్తే, ఇల్లు కూలుతుంది కాని, మా జడ మాత్రం చెక్కుచెదరదు. అసలు జడ విప్పికుండా తలను చేతో  అణచుకొని మరురోజు వెళ్ళిపోయినా జడ వేసుకోలేదని తెలిసేది కాదు. హంత బిగించిన ఆ జడను చెదపటము వాయుదేవుని తరము కాదు కదా, హరిహరాదులకు చేతనయ్యేది కాదు. ఒక్కొక్కసారి అమ్మ మమ్ములను తాకలేని స్థితి వస్తే మేము విప్పి మళ్ళీ ఆ పాయలను అలాగే అల్లితే చక్కటి జడ అయ్యేది.

లూజుగా జుత్తు వదులుకోవాలని నాకు పిచ్చ కోరుకగా వుండేది. అది తీరని కోరికే. పోనీ ఒక్క జడ, లేదా పోనిటైల్ లా జడ కట్టుకోవాలని కోరిక కూడా వుండేది. నిజంగా అలాంటివి వింత పోకడలని, విపరీతమైన బుద్దులని నానమ్మ అభిప్రాయము. నేను రహస్యంగా స్కూలో ఒక రోజు జడ విప్పి రిబెన్లు పెన కట్టి పోని వెయ్య ప్రయత్నించటము, అవి విప్పాక, అల్లిన నొక్కులతో గొగుర్లతో అష్టావక్రను తలపించటము, ఇంటికి వెళ్ళాక నాన్నమ్మ అల్లరి తో దిష్టి తీసి మళ్ళీ కిలో నూనె రాసి బిగించటము జరిగాయి.

నూనె మూఖాన కూరుతుందంటే వినేవారు కారు. ఎంత కుదిరితే అంతగా జట్టు దాచే ప్రయత్నం చేసేవారు. విప్పితే దిష్టి అని బలమైన నమ్మకముతో వుండేవారు. నాజుట్టు నడుము క్రింద ఆగటానికి నా వేషాలే కారణమని నన్ను తూర్పారపట్టేవారు పెద్దలు.  అలాంటి చాదస్తపు పెద్దల మద్య నూనె ముంతల జడలతో, జిడ్డోతూ వున్న జడలు నా చిన్నతనాన నా అందం దాచాయని నమ్మకము నాకు స్థిరపడిపోయింది. అందుకే పెళ్ళి అయిన వెంటనే జట్టు కత్తిరించి చిన్న జట్టు వుంచేసుకున్నాను. అది నా తిరుగుబాటు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s