ఆడపిల్ల – మగాటలు:
ఆటలకు మగా ఆడా వుంటాయా అసలు?
వుండవు కదా!
కానీ అలా కాదండోయి….
కొందరి దృష్టిలో వుంటాయి మరి.
అదేమిటో చెప్పాలంటే నేను మళ్ళీ రింగులు రింగులుగా చుట్టి నా చిన్నప్పటి రోజులకు వెళ్ళాలి…….
అప్పటిలో…
రెండు జళ్ళతో …..
జడలకు అంటిన నూనెతో నా అందము మరుగున పడిన దుఖం లో నేనుంటే, దానికి తోడు మా నాన్నమ్మ గోల ఒకటి. చాదస్తానికి బట్ట కడితే మా నానమ్మ.
పిల్లలను స్వేచ్ఛగా పెరగనియ్యాలని నా గొప్ప నమ్మకము. మా ఇంట పెద్ద గా స్త్రీ – పురుష వివక్ష ఎవ్వరూ చూపకపోయినా, ( అంటే అమ్మా, నాన్న)మా నానమ్మ మాత్రం తెగ తేడా చూపేది.
అదే నాలో ఒక గొప్ప స్త్రీవాద ఉద్యమకారిణిని పుట్టించింది. అదెవరో కాదు నేనే. ఉద్యమము ఎవరి మీదో కాదు, బూజు పట్టిన ఐడియాలపై, అదే మా నానమ్మ మీదనే!!
అది ఎలాగంటే, మా ఇంటి చుట్టూ పిల్లలందరితో కలసి మేము కుంటిబిచ్చ, నాలుగు స్తంభాలాట, గచ్చకాయలు, వామనగుంటల ఆట ఆడేవారు.
అబ్బాయిలు గోళీలు, కఱ్ఱ – బిళ్ళా, పత్తాలు ( కార్డు ముక్కలు ఒక దాని మీద ఒకటి పెట్టి దూరం నుంచి
కొట్టటం), కొతికొమ్మచ్చి ఆడేవారు.
ఆ ఆటలకు అమ్మాయిలు ఆడేవారు కాదు. ఎవ్వరూ వద్దనేవారు కాదు. కాని అమ్మాయిలు వెళ్ళేవారు కాదు ఎందుకో.
కబాడి కూడా అంతే, ఆడ పిల్లలు, మగ పిల్లలు వేరు వేరు జట్లు. ఈ ఆటలన్నీ మేము 5 తరగతి వరకే సుమా!
అలాంటి రాయని న్యాయసూత్రాలలో నేను పెద్దగ కలగచేసుకోలేదు చాలా సంవత్సరాలు. అంటే నాలుగో తరగతి వరకూ.
కాని ఒక శుభప్రభాతాన నానమ్మ
“ ఒసెవ్ కొంచం వళ్ళు వంచి పని చెయ్యండి. కాస్త మీ అమ్మకు సాయం చెయ్యండి” అంటూ ఒకటే నస.
పైపెచ్చు “అసలు శ్రోతియ కుటుంబమేమిటి? ఈ అబ్బాయి వేషాలేమిటీ?” అని తెగ హైరానాగా మాట్లాడేది.
నేను ” వాడికి( తమ్ముడు) కూడా ఆ మాట చెప్పు. అందరము కలసి చేస్తాము’ అంటే,
నన్ను ‘ఆడపిల్లలా పడుండు, మగవేషాలు వెయ్యకు’ అని కొప్పడింది కూడానూ.
ఆనాడు ఆమెకు తెలియదు, ఆమె నిద్రపోతున్న సింహాని లేపిందని. ఆ సింహం నేనేనని.
అందుకే నా ఐదో తరగతంతా నేను తిరుగబాటు ధోరణి పదర్శించాను.
గోళీలు తెగఆడి, గోళీలు గెలిచి తమ్ముడికిచ్చేదాని.
కఱ్ఱ – బిళ్ళా ఆడి కర్రను ముఖాన కొట్టుకొని దెబ్బ తగిలించుకున్నాను. ఆరోజు నాకు పెళ్ళి కాదని నానమ్మ డిసైడు అయిపోయ్యింది.
ఇక కోతికొమ్మచ్చి ఆట చెప్పనే అక్కర్లేదు. మా ఇంటి దగ్గరలో వున్న BDO ఆఫీసు మైదానపు కానుగ చెట్లలో నే ఎక్కని చెట్టు లేదు, దూకని కొమ్మ లేదు. చెట్టు చిటారు కొమ్మ మీద నుంచి దూకి క్రింద వున్న సర్కిల్ లో గెంతాలి మనలను ముట్టుకునే లోపలే.
నేను ఆటలో వున్నానంటే మగ వెదవలు భయంతో గడగడ వణుకు పుట్టించేదాని.
అలా ఆడి అందరిని ఓడించి విజయ గర్వంతో ఇంటికి వచ్చి, నానమ్మతో చెప్పి మరీ తిట్లు తిన్నా, నే మగాట్లే ఆడానని గర్వంగా తల ఎగరవేసేదాన్ని.
అసలు ఏది వద్దంటే ఆదే చెసేదాన్ని. గట్టిగా నవ్వటం, కాలు మీద కాలు వేసుకు కూర్చోవటం ఇత్యాదివి.
అసలు నానమ్మ
“ఇది తప్పే, ఆడపిల్లలు అలా చెయ్యడమేమిటి?”
అంటే పాపం! అవే మళ్ళీ మళ్ళీ ఆవిడ చూసేదాక చేసి, చూసి తిట్టాక, విజయగర్వంతో విరగపడిపోవటము.
అలా ఎడ్డం అంటే తెడ్డంలా నా వీర గాథ సాగింది.
ఈ మొత్తము ప్రహసనములో తుది విజయము సైకిలు తొక్కటము. మా వూళ్ళో ( తెలంగాణాలో)అమ్మాయిలు సైకిలు తొక్కేవారు కారు ఎందుకో.
మేమే ముందు సైకిలు నేర్చుకొని, మైదానములో తొక్కి ప్రాక్టిసు చేసుకునేవారము. ఎవ్వరూ చూడటము లేదని వూరంతా తొక్కి అందరి కళ్ళలో, నోళ్ళలో పడి ఆనందించాము.

