వందే కృష్ణం జగద్గురుం
కౌరవ పాండవుల మధ్య యుద్దారంభములో, అర్జునునికి ఉపదేశించిన సారము, చిలిపి కృష్ణుడు ప్రపంచానికి మొత్తము గురువుగా మారి అందించిన బోధ, ప్రతి వ్యక్తి కుల మత బేధం లేకుండా చదివి బాగు పడగల గ్రంధరాజ్యం, మేనేజుమెంటు కైనా, వ్యక్తిత్వవికాసానికైనా అత్యుత్తమమైన ప్రామాణిక గ్రంధం, జీవితాని తీర్చిదిద్దుకోవాలంటే సాధనం, సాధకులకు ప్రస్థాన త్రయములో ఒకటి, సర్వ ఉపనిషత్‌సారముగా కొలవపడి, ప్రతి హైందవుల చేతులలో వుండవలసినది గ్రంధం “భగవత్‌గీత”.
గీత గా పిలిచే ఈ 700 సంస్కృత శ్లోకాల గంధ్రం అందించే ప్రయోజనాలు అనంతము. సామాన్యులు జీవితము పండించుకోవాలన్నా, సాధకులు పరమాత్మను దర్శించాలన్నా ఈ ఒక్క ‘గీతా’సారం చాలన్నది పరమ సత్యం.
తనను నడిపించినది గీతనే అని ఐన్‌స్టీన్ వంటి వారు కూడా ఉటకించారు. గాంధీ మహాత్ములు గీత నే తన రాతను మార్చినదని పదే పదే చెప్పుకున్నారు. అలాంటి గీతాసారము నేటి మన హడావిడి జీవితాలకు ఒక చలివేంద్రం. ప్రశాంత నిచ్చి ఆదరించి, ఆలోచనలను పదునుపెట్టి, సన్మార్గములో నడిపే మిత్రుడు, గురువు. ఏ రకముగా అనుకుంటే ఆ విధముగా సహయపడే పరమాత్మ కు ప్రతినిధి ‘గీత’.
బాలలుగా వున్నప్పుడు వారికి గీతను భోదించి, సారం ఎరుకపరిస్తే ఆ బాలలకు బంగారు భవిష్యత్తు అమర్చినట్లే. ఇలాంటి అతి పెద్ద బాధ్యతను అలవోకగా చేస్తున్న వారిలో ‘బెంగుళూరు దత్తపీఠము’ వారు ఒకర. బాలబాలికలకు గీతను భోదించి, తద్వారా వారి భవిష్యత్తుకు, సనాతన ధర్మానికి వారందిస్తున్న సేవ అనంతము.
పూజ్య గణపతి సచ్చితానంద స్వామి వారి ఆశీస్సులతో , SGS Geeta Foundation వారి సహకారముతో పూర్తి గీతను ఈ పిల్లలు కంఠతా నేర్చుకొని వినిపిస్తారు. వారి ఆ శ్రద్ధ చూడవలసినదే కాని చెప్పటానికి అలవికాదు. వారు ఈ మధ్య వివిధ దేవాలయాలలో ఈ గీతా పారాయణము నిర్వహించారు కూడా. ప్రస్తుతం బెంగుళూరు లోని ‘వాగ్దేవి స్కూలు(Special Needs Kids) కు నిధులు చేకూర్చటానికి నడుము కట్టి ఈ గీతా పారాయణము భక్తుల గృహాలలో కూడా జరుపుతున్నారు.
మొన్నటి కృష్ణాష్టమికి నేను నా కృష్ణ స్వామికి వెన్నముద్దలు సమర్పించలేకపోయాను(క్యాలిఫోర్నియాలో వుండిపోయాను). స్వామి చిరుపాదాలు ముద్రించలేకపోయాను. అందుకే ఈ చిన్ని కృష్ణుడు రూపాలుగా, వారిని కోరి స్వాగతించాము. పది మంది పిల్లలు వారి తల్లితండ్రులు వచ్చి మా ఇంట గీతా పారాయణం చేశారు.
పిల్లలందరూ అలా ముకిళిత హస్తాలతో కృష్ణస్వామికి గీతా పారాయణము చేస్తుంటే ఆ నీలి నీలి వలయాల ప్రాణశక్తి మాకు సాక్షాత్కరించింది. వళ్ళాంతా గగుర్పాటు కలిగింది. అది చూడవలసినదే కాని వర్ణించరాని ఆనందము. వీరు కదా మన సనాతన ధర్మానికి కొమ్ముకాస్తున్న ప్రతినిధులు. ఈ పిల్లల తల్లితండ్రుల శ్రద్ధకు వందనము. ఈ బాలలకు సదా వాసుదేవుడు దారి చూపుతాడన్నది నిస్సందేహము. వీరు మన ధర్మానికి విజయకేతనము ఎగురవేసే ప్రతినిధులు. సర్వత్రా వీరికి విజయం తథ్యం. ఆ ఆనందము నలుగురితో పంచుకోవాలనే ప్రయత్నమే ఇది.
అట్లాంటా పరిసర ప్రాంత మిత్రులు వారి పిల్లలను ఈ కార్యక్రమానికి పంపాలన్నా, లేక వారి గృహాలకు వీరిని ఆహ్వానించాలన్నా మీరు Dr. మాధురీ గరిమెళ్ళ గారిని కాని, Dr. స్వప్నా దివాకరు గారిని కాని సంప్రదించండి.
ఽఽసర్వం శ్రీ కృష్ణార్పణమస్తుఽఽ.